Home Telugu Articles మావోయిస్టులను వ్యతిరేకించే మావో ముఠాలు

మావోయిస్టులను వ్యతిరేకించే మావో ముఠాలు

0
SHARE

ఝార్ఖండ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. మందుపాతర పేల్చి ఆరుగురు ఝార్ఖండ్ జాగ్వార్ జవాన్లను ఇటీవల పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. ఉభ య తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న గ్రేహౌండ్స్ మాదిరి ఝార్ఖండ్‌లో ‘జాగ్వార్స్’ దళం పనిచేస్తోంది. గడ్వా జిల్లా చింజో ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా మావోలు అదునుచూసి మందుపాతర పేల్చి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. విచిత్రమేమిటంటే ఈ రాష్ట్రంలో మావోయిస్టులను వ్యతిరేకించే ఇతర మావోలే ఉండడం. మూడు ప్రధాన గ్రూపులతోపాటు మరెన్నో మావోల ముఠాలు అక్కడ పనిచేస్తున్నాయి. ఝార్ఖండ్ అభివృద్ధిని కాంక్షించే వారూ కనిపిస్తారు. ఆ రకంగా ఒకరి గోత్రాలను మరొకరు తరుచూ బయటపెట్టుకుంటున్నారు. ఒకరినొకరు హత్య చేసుకుంటున్నారు. ఆధిపత్య పోరుతో రగిలిపోతున్నారు. అందులో భాగంగా భద్రతా బలగాలను మట్టుబెడుతున్నారు. మరో విడ్డూరం ఏమిటంటే మావోయిస్టుల్లో ‘కులం’ బలమైన పాత్రను పోషిస్తోంది. ‘పన్నులు’ వసూలు చేయడంపై గల ప్రేమ ప్రజల బాగోగులపై వారికి ఉండదు.

మావోల ముఠాలు తిరుగుబాటుదారుల (రెబెల్స్)ను అణచివేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తాయి. ఆ రకంగా మూడు ప్రధాన గ్రూపులు టిపిసి, జెపిసి, పిఎల్‌ఎఫ్‌ఐతోపాటు మరో 12 ముఠాలు ముమ్మరంగా తిరుగుతున్నాయి. లతేహార్, ఛత్ర, పాలాము, గడ్వా జిల్లాల్లో తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీరి వ్యవహారం ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదు.

కుందన్ పాహన్

ఝార్ఖండ్‌లో దాదాపు దశాబ్దం పాటు హల్‌చల్ సృష్టించి మావోయిస్టుల్లోనూ వీరప్పన్ ఉన్నాడని తలపించిన- కుందన్ పాహన్ కొంతకాలం క్రితం అక్కడి పోలీసుల ముందు రాంచీలో లొంగిపోయాడు. లొంగిపోయిన అనంతరం ఆయన చెప్పిన మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. పార్టీలో పాత పద్ధతులు, సిద్ధాంతాలు లుప్తమయ్యాయి. పార్టీ నాయకుల పిల్లలు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులను పార్టీ డబ్బుతో చదువుతున్నారు. సాధారణ కార్యకర్తల ఖర్చుకోసం ఇచ్చే ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తనను పార్టీ నాయకత్వం హతమార్చడానికి ప్రయత్నించిందని, అనేక రకాల ఇబ్బందులకు గురిచేశారని కుందన్ వాపోయాడు. ప్రజల కోసం పనులు చేయకుండా, ‘లెవీ’ వసూళ్లుచేస్తూ, స్వార్థం కోసం నిధులు ఉపయోగించుకుంటున్నారని విమర్శించాడు.

ఝార్ఖండ్ అభివృద్ధి (వికాస్) మావోయిస్టుల వల్ల జరగదని, అందులో ఉన్న సాయుధ గెరిల్లాలు, ఇతర కార్యకర్తలు ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల అభివృద్ధికోసం పాటుపడాలని పిలుపునిచ్చాడు. కుందన్ పాహన్ మావోయిస్టుల్లో క్రియాశీలకంగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు తెలిస్తే మావోయిస్టు సానుభూతిపరులు సైతం ఆశ్చర్యచకితులవుతారు. ఝార్ఖండ్‌లో నేరప్రవృత్తిగల అసాంఘిక కార్యక్రమాల్లో నిండామునిగిన రాజాపీటర్ అనే కరడుకట్టిన నేరస్తునితో జట్టుకట్టి ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన రూ.5 కోట్ల నగదును, కిలో బంగారాన్ని దోచాడు. ఆరోజుల్లో ఇది పెద్ద సంచలనం సృష్టించింది. ఝార్ఖండ్‌లో ఓ ఆటవిక పరిస్థితిని సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వీరు తాము ఆడింది ఆట, పాడింది పాటగా చాలా ఏళ్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మావోయిస్టుల ముసుగులో భయంకరమైన హత్యలు, దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఆధిపత్యం చెలాయించడమే ప్రధాన లక్షణంగా వీరు పనిచేశారు. బ్రిటిషు పాలనను ఎదిరించిన బిర్సాముండా వంశం నుంచి కుందన్ పాహన్ వచ్చాడని స్థానికులు అంటారు. బిర్సాముండాను ఝార్ఖండ్‌లో భగవంతునితో సమానంగా ఆదివాసీలు ఆరాధిస్తారు. అందుకే చాలామంది ‘భగవాన్ బిర్సాముండా’ అని సంబోధిస్తారు. ఆదివాసీల హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం ఆంగ్లేయులపై తిరుగుబాటుచేసి ధైర్యసాహసాలు ప్రదర్శించి చరిత్రలో నిలిచిన బిర్సాముండా కార్యకలాపాలకు కుందన్ పాహన్ కార్యక్రమాలు పూర్తిగా భిన్నం.

నేరస్థులతో కుమ్మక్కు

తుపాకీ బలంతో అమాయకులను బెదిరించి పావులుగా వాడుకోవడంలో వీరు ఆరితేరారు. లేవీ వసూలు చేయడం, ఏమాత్రమైన సంకోచిస్తే ఫర్మానా జారీచేయడం, ప్రాణహాని తలపెట్టడం, పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కెళ్ళి అవసరమైతే వారిని చంపి కుందన్ తన ముఠాను బలోపేతం చేసుకున్నాడని అక్కడి ప్రజలే చెబుతారు. మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగించడం అతని బలహీనత. ఓ మహిళతో జరిపిన రాసలీలలు బహిర్గతం కావడంతో ఇతని వ్యవహారాలు వీధినపడ్డాయి. మాజీ మంత్రి రమేష్‌సింగ్ ముండాని, బ్యాంక్ లూటీ దర్యాప్తుచేస్తున్న డిఎస్‌పిని, ఇంటిలిజెన్స్ అధికారి ఇందీవర్‌ను, ఎంపీ సునీల్ మహతోను ఈ ముఠానే భయంకరంగా హత్యచేసింది. ఈ హత్యలు 2004-2009 మధ్యలో జరిగాయి. ఈ హత్యలకు, దోపిడీలకు, అనేకమంది నేరస్తుల సహకారం సైతం తీసుకున్నారని తెలుస్తోంది. అపహరణలు, పెద్దమొత్తంలో డబ్బు దండుకోవడం, లూటీలకు పాల్పడటం, ఎదురుతిరిగితే హత్యలుచేయడం ఇదే కార్యక్రమంగా చాలాకాలం కొనసాగింది. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌లో ఉన్నప్పుడు, పీపుల్స్‌వార్‌తో విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించాక ఇదే ధోరణి ఝార్ఖండ్‌లో కొనసాగింది, కొనసాగుతోంది. బీడీ ఆకులు కొనుగోలుచేసే కాంట్రాక్టర్లు, నిర్మాణ రంగంలోని గుత్తేదారులు, పారిశ్రామికవేత్తల నుంచి పెద్దమొత్తంలో ఇప్పటికీ మావోయిస్టుల పేర డబ్బు వసూలవుతోంది. సంవత్సరానికి కేవలం బస్తర్ ప్రాంతంలోనే వేల కోట్ల రూపాయలు వసూలుచేస్తున్నారని, అలా వసూలైన ధనం ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం ఖర్చుచేస్తున్నారని మావోయిస్టుల పత్రాల ద్వారా తెలుస్తోంది.

కుందన్ పహాన్‌తో పనిచేసి తమ తమ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన శ్యామ్ పహాన్, అజయ్ యాదవ్, జానుముండా, దామోదర్ యాదవ్ తదితర మావోయిస్టు నాయకులు సైతం అనంతరం పోలీసుల ముందు లొంగిపోయారు. కొందరు ఇంకా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

సరండా అడవుల్లో మావోయిస్టుల అనుమతి లేనిదే ఆకు సైతం కదిలేది కాదని చెప్పుకునేవారు. అంతటి క్రూరత్వంతో వీరు వ్యవహరించారు. అయితే చాలామంది లొంగిపోవడం, కొందరు ఎన్‌కౌంటర్లలో మరణించడం, మరికొందరు అరెస్టు కావడం జరిగింది. ఝార్ఖండ్ ప్రభుత్వం లొంగిపోయే నక్సలైట్ల కోసం ప్రకటించిన ప్యాకేజీ పట్ల ఆకర్షితులైన వారూ ఉన్నారు. దాంతో ఇప్పుడు పరిస్థితి కొంతలోకొంత మెరుగ్గా ఉంది. అలాగని పూర్తిగా మావోయిస్టుల హింస సమసిపోలేదు.

కోటి నజరానా

తెలంగాణకు చెందిన సుధాకర్ అనే సెంట్రల్ కమిటీ సభ్యుడు ఝార్ఖండ్‌లో క్రియాశీలంగా ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. బిహార్‌కు చెందిన అరవింద్ అనే మావోయిస్టు నాయకుడు బుడాపహాడ్ ప్రాంతంలో మకాం వేసి కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాడని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. బిహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఇతని తలపై కోటి రూపాయల రివార్డును ప్రకటించాయి. అరవింద్ భార్య, ఇద్దరు పిల్లలు బిహార్‌లో ఉంటున్నారు. వారి పిల్లలు ఇంజినీరింగ్ చదువులు పూర్తిచేశారు. పార్టీ నిధులు ఇందుకోసం ఖర్చుచేశాడన్న ఆరోపణలున్నాయి. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎప్పుడూ దాదాపు 40 మంది సాయుధ మావోయిస్టుల మధ్య ఉంటాడని తెలుస్తోంది. ఝార్ఖండ్ అడవుల్లో పోలీసులు గాలింపు చేపడితే సమాచారం తెలుసుకుని పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి మాయమవుతాడని, పోలీసుల హడావుడి తగ్గగానే తిరిగి ఝార్ఖండ్‌కు చేరుకుంటాడని వినికిడి.

రత్నగర్భ

రత్నగర్భ లాంటి ఝార్ఖండ్ నేల సారవంతమైనది. భూగర్భంలో అనేక ఖనిజాలున్నాయి. విలువైన రాళ్లు, రతనాలు ఇప్పటికీ లభ్యమవుతూ ఉంటాయి. ఈ సంపదను వెలికితీసేందుకు ప్రయత్నాలు, పరిశోధనలు గత 24 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈ సంపదపై, ప్రజలపై పెత్తనం, అజమాయిషీ కోసం పోటీ పెరిగింది. మావోయిస్టులకైతే ఇదే ‘గని’గా మారింది. అందుకే అనేక వ్యూహాలు పన్నుతూ తమ ప్రాబల్యాన్ని ఎంతోకొంత కాపాడుకోవడానికి పడరానిపాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే ఆరుగురు ఝార్ఖండ్ జాగ్వార్స్‌ను మందుపాతర పేల్చి హతమార్చారు. ఆ రకంగా తాము ఇంకా బలంగానే ఉన్నామని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నానికి ఫలితం శూన్యమని అనంతర పరిణామాలే ఘోషిస్తున్నాయి.

-వుప్పల నరసింహం 99857 81799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here