Home Telugu Articles మరణశయ్యపై కమ్యూనిజం

మరణశయ్యపై కమ్యూనిజం

0
SHARE

డిసెంబర్‌ 25 జీసస్‌ క్రీస్తు జయంతి. పాశ్చాత్య ప్రపంచమంతటికీ మహాపర్వదినం. మన దేశంలోని మార్క్సిస్టులకు కూడా డిసెంబర్‌ 25 యాదృచ్ఛికంగా చాలా ముఖ్యమైన దినం. ఎందుకంటే ఇదే రోజున భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. (అయితే ఈ విషయమై ఏకాభిప్రాయం లేదు). మన దేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ ముఖ్య లక్షణమేమిటంటే విదేశీ స్ఫూర్తితో ఆవిర్భవించి, విదేశీ ప్రభావాల ఆలంబనతో ప్రస్థానం సాగించడం.

లభ్యమవుతున్న రికార్డుల ప్రకారం సోవియట్‌ యూనియన్‌ నాయకుల నిర్దేశకత్వంలో 1925లో కాన్పూర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటయింది. సంస్థాపకులలో పలువురు భారతీయులు కారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారత కమ్యూనిస్టులు బ్రిటిష్‌ వలసపాలకుల యుద్ధ ప్రయత్నాలకు పూర్తి మద్దతునిచ్చారు. తమను సంప్రదించకుండా భారత్‌ను కూడా యుద్ధంలోకి లాగినందుకు నిరసనగా మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీలు బ్రిటన్‌ను వ్యతిరేకించారు.

ఆసేతు హిమాచలమూ యావత్‌ భారతీయులు తక్షణమే దేశం నుంచి వెళ్ళిపొండని వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండగా మన కమ్యూనిస్టులు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ‘ప్రజా యుద్ధం’గా పరిగణిస్తూ బ్రిటిష్‌ పాలకులకు మద్దతునిచ్చారు. మన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్‌ పాలకుల తరఫున గూఢచర్యం నెరపారు. గాంధీజీ, సుభాస్‌ చంద్రబోస్ మొదలైన నాయకులను నానా దుర్భాలాడారు. భారత్‌ ఒక జాతి కాదని, వివిధ జాతుల సమూహమనేది కమ్యూనిస్టుల వైఖరి. తమ వైఖరికి అనుగుణంగా వారు మత ప్రాతిపదికన దేశ విభజనకు మద్దతు తెలిపారు. యుద్ధకాలంలోనూ, ఆ తరువాత పాకిస్థాన్‌ ఏర్పాటుకై కంకణం కట్టుకున్న జిన్నాను సమర్థించారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం బూటకమని, కార్మికులు, కర్షకులపై తమ నియంత్రణను కొసాగించుకొనేందుకు బూర్జువా వర్గాలు చేస్తున్న రాజకీయ వాదన మాత్రమేనని కమ్యూనిస్టులు అనేవారు. ఆనాటి పార్టీ ప్రధాన కార్యదర్శి రణదివె పిలుపు మేరకు తమకు ప్రాబల్యమున్న ఆంధ్ర, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, బిహార్, చోటా నాగపూర్‌, మలబార్‌ మొదలైన ప్రాంతాల్లో కమ్యూనిస్టులు కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారత రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు ప్రారంభించారు. అయితే ప్రజలు స్వతంత్ర భారత ప్రభుత్వానికి బాసటగా నిలబడ్డారు.

స్వాతంత్ర్యానంతరం భారత కమ్యూనిస్టు పార్టీ విధానాలు, కార్యకలాపాలపై సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రభావం బలీయంగా వుండేది. వివిధ వాణిజ్య ఒడంబడికల మాటున సోవియట్‌ యూనియన్‌ నుంచి ఈ ఆర్థిక సహాయమందేది. తద్వారా భారత రాజకీయ రంగంలో తమ విదేశాంగ విధానానికి అనుకూలతలను సృష్టించుకొనేందుకు సోవియట్‌ యూనియన్ ప్రయత్నించేది. మార్షల్‌ స్టాలిన్‌ మరణానంతరం సోవియట్ కమ్యూనిస్టు పార్టీ, మహా శక్తిమంతమైన చైనీస్‌ మార్క్సిస్టు నాయకుడు మావోల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న అనంతరం మన దేశంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో అంతర్గతంగా చీలికలు నెలకొన్నాయి..

భారతదేశంలోని సామాజిక–రాజకీయ పరిస్థితులను వాస్తవికంగా అర్థం చేసుకోవడంలో ఆ రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇక 21వ శతాబ్దం వచ్చేసరికి ఆ మార్క్సిస్టులు రాష్ట్ర స్థాయిలో అధికారాన్ని కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న సీపీఎం ఒకసారి ఓడిపోయిన తరువాత మళ్ళా అధికారంలోకి రాలేకపోయింది. కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఫ్రంట్ అధికారంలో తీవ్ర అవినీతికి పాల్పడి ప్రజల విశ్వసనీయతను పూర్తిగా కోల్పోవడంతో మార్క్సిస్టులు తిరిగి అధికారానికి రావడం సాధ్యమయింది. ఒక్క త్రిపురలో మాత్రమే మార్క్సిస్టుల ప్రాబల్యం కొనసాగుతోంది. ఇంకా న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఇంగ్లీష్ మీడియాలో మటుకే కమ్యూనిస్టులకు మద్దతు లభిస్తుంది.

బెంగాల్‌, కేరళ, త్రిపురలలో మినహా ఇతర రాష్ట్రాలలో చాలావరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చాలా వరకు నామమాత్ర ఉనికిని మాత్రమే కలిగివున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అక్కడి ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమ రాజకీయ పలుకుబడిని అతి కష్టం మీద నిలుపుకుంటున్నాయి. గతంలో భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్దేశించిన శ్రీపాద్‌ అమృత్‌ డాంగే, బిటి రణదివే లాంటి నాయకులు వచ్చిన మహారాష్ట్రలో ఇప్పుడు చెప్పుకోదగ్గ కమ్యూనిస్టు నాయకులే లేరు. ఆంధ్ర, బిహార్‌ మొదలైన రాష్ట్రాలలో కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రాభవం అడుగంటింది.

భారతీయ కమ్యూనిస్టులు ఇప్పుడు చాలా కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా మార్క్సిస్టు ఉద్యమం క్యూబా, ఉత్తర కొరియా, తూర్పు ఆసియాలోని వియత్నాం, లావోస్‌లకు మాత్రమే పరిమితమయింది. ఇండో–చైనా ప్రాంతంలో అంతకంతకూ పెరిగిపోతున్న చైనా ఆధిపత్యం వియత్నాం, లావోస్‌లను తీవ్రంగా కలవరపెడుతున్నది. విశాల ప్రపంచానికి తనను తాను కమ్యూనిస్టు దేశంగా చెప్పుకొంటున్న చైనా అంతర్గతంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకొంటోంది. క్యూబా సైతం తన కమ్యూనిస్టు గతాన్ని క్రమంగా త్యజిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఇప్పుడు మరణశయ్యపై ఉన్నది. రష్యా అంతటా చర్చ్‌లలో క్రిస్మస్‌ వేడుకలు జరుగుతున్నాయి. మతం, పెట్టుబడిదారీ విధానం గురించి మార్క్స్‌ జోస్యాలు తప్పని రుజువయింది.

బల్బీర్‌ పుంజ్‌

బీజేపీ సీనియర్‌ నాయకులు

(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో)