Home Telugu Articles మరోసారి ఖలిస్థాన్ కుట్ర

మరోసారి ఖలిస్థాన్ కుట్ర

0
SHARE

పంజాబ్‌ను మరోసారి రక్తపాతంతో, విధ్వంసంతో అతలాకుతలం చేయాలని సిక్కు రాడికల్‌ ముఠాలు కుట్రలు ఆరంభించాయి. ఈ కుట్రలకు పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఐఎస్‌ఐ అండగా నిలుస్తున్నాయి. ఈ నవంబర్‌ 17 ఆదివారం అమృత్‌సర్‌లోని రాజాసాని గ్రామంలో నిరంకారీ భవన్‌ మీద జరిగిన గ్రెనేడ్‌ దాడితో ఎన్నో వాస్తవాలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. పైగా అల్‌ఖైదా అనుబంధ అన్సార్‌ ఘాజవత్‌ అల్‌హింద్‌ కమాండర్‌ జకీర్‌ ముసా, అతడి ముఠాకు చెందిన ఐదు లేదా ఆరుగురు అనుచరులు నిఘా వర్గాల కళ్లలో పడిన మరునాడే నిరంకారీ భవన్‌ మీద గ్రెనేడ్‌ దాడి జరగడం విశేషం. ముసా చండీగఢ్‌లో ఇంజనీరింగ్‌ విద్యార్థి. ఈ ముఠా ఫిరోజ్‌పూర్‌ ప్రాంతంలో ఉందని, ఢిల్లీ వెళ్లే ప్రయత్నంలో ఉందని నిఘా వర్గాలు చెబున్నాయి. దీనితో రాష్ట్రంలో నిఘా పెంచారు. ఆ కట్టుదిట్టమైన భద్రత నడుమనే ఈ గ్రెనేడ్‌ దాడి జరిగింది.

నిరంకారీ శాఖ భవనంలో సాష్టాంగ్‌ ఉత్సవం కోసం సమావేశమైన వారి మీద మోటారు బైకు మీద వచ్చిన ఇద్దరు గ్రెనేడ్‌ విసిరారు. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. ఇరవై మంది వరకు గాయపడ్డారు. ముసుగులు ధరించిన ఆ దుండగులు కాపలాదారుని రివాల్వర్‌తో బెదిరించి భవన్‌లోని ప్రార్థనా స్థలంలోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాడి తీరును బట్టి, సీసీ టీవీ కెమేరాలలో దొరికిన సమాచారాన్ని బట్టి ఇందులో ఉగ్రవాద కోణాన్ని నిరాకరించలేమని పంజాబ్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ వెంటనే చెప్పారు. నిజానికి ఖలిస్తాన్‌ అనుకూల రాడికల్‌ ముఠాలకు, పాక్‌ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాద ముఠాలకు మధ్య సంబంధం ఉందని ఎప్పుడో రుజువైంది. ముసా ఉనికి తెలిసిపోవడంతో ఆ బంధం రాక్షస చర్యల రూపంలో బయటపడుతోంది. ఖలిస్తాన్‌ ఉద్యమానికి పాకిస్తాన్‌తో పాటు బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నాయి. ఎక్కువ మంది ఖలిస్తాన్‌ అనుకూలురు అక్కడే తల దాచుకుంటున్నారు.
మొత్తంగా పరిశీలిస్తే ఖలిస్తాన్‌ అనుకూలురు పంజాబ్‌లో మళ్లీ అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నాలు ఆరంభించారని అర్థమవుతుంది. ఈ దఫా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల అండ కూడా ఉంది. ఇందులో ప్రధానం వినిపిస్తున్న పేరు- గోపాల్‌సింగ్‌ చావ్లా. ఇతడు పాకిస్తాన్‌లో ఉంటున్న ఖలిస్తాన్‌ అనుకూల ఉగ్రవాది. నిఘావర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇతడు లష్కర్‌ ఏ తాయిబా అధినేత హఫీజ్‌ సయిద్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇందుకు సంబంధించి నిఘావర్గాలు ఒక ఫొటోను బయటపెట్టాయి. గోపాల్‌సింగ్‌ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని అల్లర్లకు ఊపిరి పోయాలని పథకం వేస్తున్నాడు. వాటిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెడతాడు. ఆ మాధ్యమాల ద్వారానే యువకులను తన ఉద్యమంలో చేర్చుకునే పని కూడా చేస్తున్నాడు. ఇదే పనిని కశ్మీర్‌కు చెందిన ముసా పంజాబ్‌లో ఉండి చేస్తున్నాడు. ముసా నిఘా వర్గాల కళ్లల్లో పడిన సంగతి తెలిశాక పంజాబ్‌లో చదువుకుంటున్న వందలాది మంది కశ్మీరీ విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కాగా, పంజాబ్‌లో మరోసారి హింసాకాండను సృష్టించాలన్న కుట్ర గురించి నిఘావర్గాలకు చాలా ముందు నుంచే తెలుసు. నవంబర్‌ 17 నాటి గ్రెనేడ్‌ దాడికి కొద్దిరోజుల ముందు ఈ అలజడి గురించిన సమాచారం ప్రభుత్వానికి చేరింది కూడా. సిక్కు ఉగ్రవాదులు లష్కర్‌ ఏ తాయిబా, హిజ్బుల్‌ ముజాహుదీన్‌, జైష్‌ ఏ మహమ్మద్‌ సంస్థలలో ఒకదానితో షరీకై కుట్రలకు పన్నుతున్నారన్న సమాచారం ఉంది. ఖలిస్తాన్‌ అనుకూల రాడికల్‌ ముఠాల సభ్యులు కశ్మీర్‌లో ఉగ్రవాదులను కలసి ఖలిస్తాన్‌ ఉద్యమానికి ఊతం ఇవ్వవలసిందిగా కోరిన సంగతి కూడా బయటపడింది. ఆ తరువాత పరిణామమే గడచిన రెండేళ్లుగా సాగుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌, శివసేన వంటి హిందూ సంస్థల నేతల హత్యలు.
1980 దశకంలోకి మళ్లీ పంజాబ్‌ను తీసుకువెళ్లాలన్న ప్రయత్నంలో భాగమే ఇదంతా. మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరి ప్రయత్నాలు ముమ్మరమైనాయి. ఒక ఆప్‌ ఎంపీ కూడా ఇలాంటి శక్తులకు తన వంతు సాయం చేస్తున్నట్టు బయటపడింది. దీనికి తోడు కొన్ని అంతర్జాతీయ పరిణామాలు, అక్కడ నుంచి అందుతున్న మద్దతు కూడా మరోసారి ఖలిస్తాన్‌ నినాదం అందుకోవడానికీి, ఆ పేరుతో హింసాకాండను జరపడానికీ దోహదం చేస్తున్నది. ఇలాంటి అలజడి కోసం ఎదురుచూస్తున్న అసాంఘిక శక్తులకు, దేశ వ్యతిరేక శక్తులకు ఒక్కసారిగా ఊతం వచ్చింది.
దేశద్రోహ, సంఘ వ్యతిరేక చర్యలకు ప్రజాస్వామిక పంథాను ఉపయోగించుకోవడం ఇప్పుడు దేశంలో కొత్త వ్యూహం. పంజాబ్‌లో కూడా అలాగే మొదలయింది. బర్గరీ మోర్చా ఉద్యమం అలాంటిదే. ఇది సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహెబాను అవమానించినవారిని అరెస్టు చేయాలన్న నినాదంతో మొదలయింది. త్వరలోనే పెడతోవ పట్టింది. దీనికి విదేశ ఉగ్రవాద సంస్థల నుంచి, వాటికి మద్దతు పలికే వ్యక్తుల నుంచి నిధులు రావడం మొదలయింది. దీనికి కాంగ్రెస్‌ మద్దతు ఉంది. హక్కుల ఉద్యమం పేరుతో వేర్పాటువాదానికి దోహదం చేస్తున్న మరొక ఉద్యమ సంస్థ -బహుజన క్రాంతి మోర్చా. ఇది ఆర్య, మూలవాసీ వాదాన్ని ముందుకు తెచ్చి వేర్పాటువాదానికి ఆజ్యం పోస్తున్నది. బ్రాహ్మణులు ఆర్యులనీ, దళితులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు మూలవాసులని వాదిస్తున్నది. ఆర్యులను దేశం నుంచి పంపివేయాలని ప్రచారం చేస్తున్నది.
అమృత్‌సర్‌లోని రాజాసానిలో పేలిన గ్రెనేడ్‌ ముగ్గురిని చంపింది. కానీ దేశ విభజన నాటి సంఘటనలను గుర్తు చేసుకొనక తప్పని పరిస్థితిని కల్పించింది. నిజానికి ఖలిస్తాన్‌ సమస్య మూలాలు, కశ్మీర్‌ వేర్పాటువాద సమస్య బీజాలు దేశ విభజన పుణ్యమే. ఆరున్నర దశాబ్దాలు గడచిపోతున్నా అవి వేధిస్తూనే ఉన్నాయి. ఇకనైనా కేంద్రంలో ఉన్న జాతీయవాద ప్రభుత్వం ఈ బెడదను పూర్తిగా నిర్మూలించడం అత్యసవరం.

ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలకు రక్షణ ఇవ్వండి!
రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ మీద మరోసారి పంజా విసరాలని సిక్కు రాడికల్‌ ముఠాలు ప్రయత్నాలు ప్రారంభించాయా? నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వస్తుంది. పంజాబ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల దగ్గర, వారి యోగా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయవలసిందని, ఈ పని పదిహేను రోజులలో పూర్తి చేయడం మంచిదని నిఘావర్గాలు అధికారులకు సలహా ఇచ్చాయి. పంజాబ్‌లో మరోసారి ఉగ్రవాద చర్యల అలికిడి వినిపిస్తున్న నేపథ్యంలో నవంబర్‌ 16న నిఘా సంస్థలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయని వార్తలు వచ్చాయి. పైగా సిక్కు రాడికల్‌ ముఠాలు, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలు కలసి వారి మీద విరుచుకుపడాలని ఉవ్విళ్లూరుతున్నాయని కూడా నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరిక విన్న తరువాత దేశంలో ఉన్న స్వయంసేవకులకు మోగా (పంజాబ్‌) దురంతం (జూన్‌ 25, 1989) గుర్తుకు రాక మానదు. అక్కడి నెహ్రూ పార్కులో శాఖా కార్యక్రమంలో ఉన్న 26 మంది స్వయంసేవకులను మోటారు బైక్‌ల మీద వచ్చిన ఖలిస్తాన్‌ దుండగలు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.

గడచిన రెండేళ్లలో పంజాబ్‌ నేల మీద ఏడుగురు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు, ఇతర హిందూ సంఘాల నాయకులు హత్యకు గురి కావడం ఆ రాడికల్‌ ముఠాల కొత్త హత్యాకాండ పథకంలో భాగమేనని తెలుస్తున్నది. ప్రస్తుతం పాటియాలా, భటిండా, గురుదాస్‌పూర్‌, పఠాన్‌కోట్‌లలో ఇలాంటి ఘాతుకాలు చోటు చేసుకునే అవకాశం చాలా ఉందని కూడా నిఘావర్గాలు చెప్పాయి. ఈ నవంబర్‌లోనే ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు ఇతర హిందూ సంస్థల సమావేశాలు, ప్రదర్శనలు, ఊరేగింపులను లక్ష్యంగా చేసుకోవడమే ఈ ముఠాలు ధ్యేయం. పంజాబ్‌ ప్రాంతంలో దాదాపు 900 ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు ఉన్నట్టు పోలీసు వర్గాల అంచనా.
ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల హత్యల కేసులను కొద్దికాలం క్రితం జాతీయ దర్యాప్తు సంఘం (ఎన్‌ఐఏ)కు అప్పగించారు. ఈ హత్యలలో హర్దీప్‌సింగ్‌ నిజ్జార్‌ ప్రమేయం గురించి ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఖలిస్తాన్‌ ఉగ్రవాద ముఠాలకు అనుకూలుడైన నిజ్జార్‌ కెనడాలో ఉంటాడు. ఇతడిని కెనడా పోలీసులు ఈ ఏప్రిల్‌లో అదుపులోకి తీసుకుని ఎలాంటి కేసూ నమోదు చేయకుండా 24 గంటలలోనే వదిలిపెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుల హత్యలు, అందులో నిజ్జార్‌ పాత్ర గురించి రాయల్‌ కెనేడియన్‌ మౌంటీర్‌ పోలీస్‌ సంస్థతో ఎన్‌ఐఏ సంప్రతించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు రవీందర్‌ గొసైన్‌ను ఆ మధ్య లూధియానాలో హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి 15 మంది నిదితులను పట్టుకున్నారు. ఒకవేళ ఈ హత్యలో నిజ్జార్‌ పాత్ర ఉందంటే తరువాత ఇతని పేరు కూడా చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్‌ నిఘా వ్యవస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ)తో, ఆ సంస్థ మద్దతు ఉన్న ముస్లిం ఉగ్రవాద సంస్థలతో కలసి పనిచేయాలని సిక్కు రాడికల్‌ ముఠాలు కొద్దికాలంగా ప్రయత్నం చేస్తున్నాయని రాయల్‌ కెనేడియన్‌ పోలీసు సంస్థ, మన నిఘావర్గాల ఏకాభిప్రాయం. ఉగ్రసంస్థలకు నిధులు చేరే దారులు, వాటిని ఛేదించే పద్ధతుల గురించి కెనేడియన్‌ పోలీసులకు మన ఎన్‌ఐఏ ఢిల్లీలో తర్ఫీదు ఇచ్చినప్పుడు ఆ రెండు సంస్థలు అలాంటి ఏకాభిప్రాయానికి రాక తప్పలేదు. నిజ్జార్‌ మీద 2015 నుంచి కెనడా పోలీసుల నిఘా ఉంది. హిందూ నేతల హత్యకు ఇతడు పన్నిన కుట్ర బయటపడడంతో హత్య కుట్ర ఆరోపణలతో కేసు కూడా నమోదయింది. 41 ఏళ్ల నిజ్జార్‌ చర్యలలో భారత్‌ మీద దాడులు చేయడం కూడా ఉంది. ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తాడని కూడా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

జాగృతి సౌజన్యంతో.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here