Home Telugu Articles మారుతి మాట తీరు అద్వితీయం

మారుతి మాట తీరు అద్వితీయం

0
SHARE

మారుతి మాట తీరు నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉంది. సీతా మాతను లంకలో ఆంజనేయ స్వామి చూశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన హనుమను వానరులంతా ప్రశ్నలతో ముంచెత్తారు. లంకలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నది వారి ఆతృత. అపూర్వమైన సముద్ర లంఘనం, అనూహ్యమైన శక్తియుక్తులతో అశోక వనాన్ని నాశనం చేయడం, రావణుడికి చిక్కినట్టే చిక్కి తప్పించుకొని బైటపడటం, అందమైన లంకకు అగ్గిపెట్టడం వరకు అన్ని విషయాలను పూసగుచ్చినట్టుగా వివరించాడు. సీతమ్మతో జరిపిన సంభాషణను మాత్రం క్లుప్తంగా చెప్పాడు.

ఇక శ్రీరామచంద్రుడి దగ్గరకు వస్తూనే ‘కంటిన్ సీతను’ అంటూ ఒక్క వాక్యంలో, ఆయన ఎలాంటి సమాచారాన్ని ఆశిస్తున్నాడో దానిని తెలియపరిచాడు. ఆ తరువాత సీతామాతతో మాట్లాడిన విషయాలు పూసగుచ్చినట్లు వివరించాడు. విచారంలో ఉన్న సీతామాతకు ధైర్యం చెప్పిన సంగతి చెప్పాడు. రాముడి గురించి సీతాదేవి అడిగిన కుశలప్రశ్నల గురించి వివరించాడు. కానీ లంకలో తన సాహస కార్యాలను మాత్రం క్లుప్తంగా చెప్పాడు.

వానరులకు తన వీరోచిత కార్యాలను వివరించి వారిలో యుద్ధోత్సాహాన్ని నింపిన వాయుపుత్రుడు, రాముడికి సీతాదేవి క్షేమ సమాచారం మాత్రం తెలిపాడు.

ఏది మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తదనుగణంగా వారితో వారికి తగ్గట్టుగా మాట్లాడాలని తన వ్యవహార శైలితో ఆంజనేయ స్వామి చెప్పకనే చెప్పాడు.