Home Telugu Articles రిజర్వేషన్ పేరుతో జరిపే ‘మతక్రీడ’ మానండి..

రిజర్వేషన్ పేరుతో జరిపే ‘మతక్రీడ’ మానండి..

0
SHARE

తెలంగాణలో మత ప్రాతిపదికపై ఇస్లాం మతస్థులకు ‘ఆరక్షణ’- రిజర్వేషన్-లను కల్పించరాదని కోరుతూ భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ ఉద్యమించడం ప్రజా హృదయానికి, జనాభీష్టానికి అద్దం! ఈ ఉద్యమాన్ని అప్రజాస్వామిక పద్ధతిలో అణచివేయడానికి యత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ఠను మూటకట్టుకుంటోంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన మత రిజర్వేషన్లకు వ్యతిరేకంగ   ‘భాజపా’ యువమోర్చా కార్యకర్తలు శుక్రవారం సాగించిన ‘శాసనసభ ముట్టడి’ వల్ల ఈ సమస్యకు మరింత ప్రచారం లభించింది. అయితే, నిరసన ప్రదర్శనలను అడుగడుగునా నిర్బంధించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై తనకు విశ్వాసం లేదని చాటుకుంది. మత రిజర్వేషన్లు అమలు జరగడం సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థకు, జాతీయ సమభావానికి విరుద్ధం. ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకించే హక్కు, విమర్శించే అధికారం, మార్చుకొమ్మని సలహా ఇచ్చే సదుపాయం ప్రభుత్వేతర రాజకీయ పక్షాలకు ఉండడం ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ స్వభావం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్వభావ పరిరక్షణ గురించి పరితపించే రాజకీయ పక్షాలవారు తాము ప్రభుత్వ పక్షాలుగా మారినప్పుడు మాత్రం ఈ స్వభావానికి విఘాతం కలిగింస్తుండడం నడిచిపోతున్న వైచిత్రి! ఈ రాజ్యాంగ వైచిత్రికి శుక్రవారం తెలంగాణ శాసనసభ లోపల, బయట సంభవించిన పరిణామ క్రమం మరో నిదర్శనం. మత రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్న వాదం వినిపించిన భాజపా సభ్యులను సస్పెండ్ చేయడం, సభ నుంచి వెళ్లగొట్టడం ఈ విచిత్రం. పార్లమెంటు ఉభయసభల్లోను వివిధ సందర్భాల్లో వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు నిరసన తెలపడం, కలాపాలను అడ్డుకోవడం దశాబ్దులుగా జరుగుతున్న ప్రహసనం. ఆ సందర్భాల్లో ఏకాభిప్రాయ సాధన కోసం, ప్రతిపక్షాలను ఒప్పించడం కోసం ప్రభుత్వం యత్నిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా సభలు పదే పదే వాయిదా పడుతున్నాయి. కానీ వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం, బయటకు గెంటివేయడం ఎప్పుడో కాని జరగడం లేదు. తెలంగాణ శాసనసభలో మాత్రం భాజపా సభ్యులు నోరు విప్పడానికి వీలు లేకుండా వారిని శుక్రవారం బయటకి గెంటి వేశారు. రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. కేవలం ఒకరోజు కాకుండా ఎక్కువ రోజులు వారిని సస్పెండ్ చేయడం మరో విచిత్రం. ఇలా ప్రతిపక్షం గొంతును నొక్కే చర్యలను జనం హర్షించరు. జనం గమనించడం లేదని భావించడం తెలంగాణ ప్రభుత్వం భ్రాంతి!

హరిత హారం, ‘భగీరథ’, ‘కాకతీయ’ నీటి పథకాలతో జనంలో మంచిపేరు తెచ్చుకొంటున్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ నాయకత్వంలోని ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి పూనుకొనడం ద్వారా ఆ మంచి పేరును చెడగొట్టుకొంటోంది! మత రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇదివరకు ఇలాంటి అక్రమ రిజర్వేషన్లను కల్పించడానికి యత్నించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు నిరోధించడం చరిత్ర. ఈ చరిత్ర తెలిసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వారు తప్పిదాన్ని పునరావృత్తం చేయడానికి పూనుకొనడం అతార్కికం మాత్రమే కాదు, న్యాయ ధిక్కారం కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన మత రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేసింది. ఇప్పుడీ వ్యవహారం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కోసం వేచి ఉండడం విజ్ఞతకు, రాజ్యాంగ నిబద్ధతకు చిహ్నం కాగలదు. కానీ సుప్రీం కోర్టులో అపరిష్కృతంగా ఉన్న వ్యవహారాన్ని ప్రభుత్వపు ఉత్తరువు ద్వారా కాని చట్టం ద్వారా కాని అమలు జరపగలమని భావించడం పగటికల మాత్రమే కాగలదు! న్యాయ ధిక్కారాన్ని న్యాయస్థానాలు విచారించి శిక్షించగలవు..!

మతం వర్ణం కులం స్ర్తి పురుష వైవిధ్యం, ప్రాంతం పేరుతో పౌరుల మధ్య వివక్ష చూపించరాదన్నది రాజ్యాంగంలోని పదిహేనవ అధికరణంలోని నిర్దేశం. అందువల్ల ఇస్లాం మతస్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో కాని, విద్యాసంస్థలలో కాని రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఇతర మతస్థుల పట్ల వివక్ష చూపినట్టు కాగలదని స్పష్టం! అనుసూచిత కులాల- షెడ్యూల్డ్ కాస్ట్స్-కు, అనుసూచిత సముదాయాలు లేదా వనవాసీ ప్రజలు- షెడ్యూల్డ్ ట్రయిబ్స్-కు మాత్రమే ఇలాంటి ‘ఆరక్షణ’లు కల్పించవచ్చునని ఇదే అధికరణంలో స్పష్టం చేశారు. అందువల్ల ఎవరు ఎన్ని రాజకీయ విన్యాసాలను ప్రదర్శించినప్పటికీ మతం పేరుతో రిజర్వేషన్లను కల్పించడానికి రాజ్యాంగం ప్రకారం వీలులేదు. రాజ్యాంగ విరుద్ధమైన రాజకీయపు ఆటలను కట్టించడానికి న్యాయస్థానాలున్నాయి. అందువల్ల ‘ఏది ఏమైనా, దేశం మరోసారి ముక్కలైనా ఫరవాలేదు, మన దేశంలో కూడా పాకిస్తాన్‌లో వలే సర్వమత సమభావ సామాజిక వ్యవస్థ అంతరించిపోయి నా ఫరవాలేదు, ఇస్లాం మతస్థులు తప్ప మరొక మతస్థులు బతకడానికి వీలులేని జిహాదీ రాజ్యాంగ వ్యవస్థ మన దేశంలోనూ ఏర్పడినా ఫరవాలేదు, మేము ఇస్లాం మతస్థులకు పన్నెండు లేదా తొమ్మిది లేదా కనీసం నాలుగయిదు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతాము..’- అని ప్రతిజ్ఞలను చేస్తున్న తెలుగు రాష్ట్రాలలోని, ఇతర రాష్ట్రాలలోని రాజకీయ వేత్తలు మొదట రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని శాసనసభ సవరించలేదు. ఆ పనికి పూనుకొనవలసింది పార్లమెంటు.. అందువల్ల ‘సవరణ’ జరగడం కాని, మత రిజర్వేషన్లు అమలు జరగడం కాని అసంభవం. ఇది తెలిసినా దొడ్డిదారిన ఇస్లాం మతస్థులను వెనుకబడిన కులాల సరసన చేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం పన్నాగం పన్నింది. ఈ పన్నాగం కూడా న్యాయస్థానాల్లో ఇదివరకే- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో- మూడుసార్లు పటాపంచలైంది..

ఇస్లాం మతస్థులు ఒక జనసమూహంగా, సమష్టిగా వెనుకబడిన వారు కాదు. అంత్యంత చొరవతో ఇస్లాం జిహాదీలు మన దేశంలో శతాబ్దుల పాటు ‘మతం మార్పిడి’ చేశారు. ఫలితంగా దేశాన్ని సైతం బద్దలుకొట్టి మాతృదేవతను ఖండించి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశారు. క్రీస్తుశకం 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని కూల్చిన ఇస్లాం జిహాదీలు 1948 వరకూ ‘తెలంగాణ’ను భయంకర బీభత్సకాండకు బలి చేశారు. జిహాదీల దుశ్చర్యతో సామాన్య ముస్లింలకు సంబంధం లేదు. కానీ ఈ దుశ్చర్యల ‘సత్ ఫలితాన్ని’, లాభాన్ని ఇస్లాం మతస్థులు సమష్టిగా పొందడం చరిత్ర! ఈ చరిత్ర మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ కాలం తెలంగాణలో నడిచింది. ఈ చరిత్రకు వారసులు ‘వెనుకబడిన’ వారు కాజాలరు..

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here