Home Telugu Articles మతం.. ఉన్మాదం.. సమన్వయం!

మతం.. ఉన్మాదం.. సమన్వయం!

0
SHARE

డొనాల్డ్ ట్రంప్ రెండు ‘బైబిల్’ గ్రంథ ప్రతులపై ఎడమచేయి పెట్టి, కుడి చేయి అభివాదముద్రతో పైకెత్తి అమెరికా అధ్యక్షుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేశాడు. ఒక బైబిల్ ప్రతి క్రీస్తుశకం 1860లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్రహాం లింకన్ మహాశయునిదట. రెండవది ట్రంప్‌కు ఆయన తల్లి ప్రదానం చేసింది! అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం 1789 మార్చి నాలుగవ తేదీన అమలులోకి వచ్చింది. కానీ, అమెరికా పౌరులు ‘రాజ్యాంగం’ ప్రతిపై చేయి ఉంచి అధ్యక్ష పదవీ స్వీకారం చేయడం లేదు. క్రైస్తవ మత గ్రంథమైన ‘బైబిల్’పై చేయి ఉంచి సార్వభౌమ అధికార, పరిరక్షణ ప్రతిజ్ఞను చేస్తున్నారు. ‘వేదం’ మతగ్రంథం కాదు, సృష్టి విజ్ఞాన సర్వస్వం! ‘వేదం’ప్రతిపై చేయి ఉంచి రాష్టప్రతి పదవీ స్వీకార ప్రతిజ్ఞ చేసే సంప్రదాయం మన దేశంలో లేదు. మతగ్రంథాల మాటను ప్రస్తావించవలసిన పని లేదు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా చెలామణి కావడం ఆరంభం కావడంతో మత ఉన్మాదానికి, సర్వమత సమభావానికి మధ్యగల అంతరం మరోసారి అంతర్జాతీయంగా ప్రస్ఫుటవౌతోంది. మతతత్త్వానికి ప్రాధాన్యం గురించి, మత వైవిధ్యాల పరిరక్షకమైన జాతీయతత్త్వం గురించి కూడ చర్చ అనివార్యవౌతోంది. సమన్వయం తెలియని ఏక మత సమాజాలున్న దేశాల స్వభావానికీ, సమన్వయం సహజమైన సర్వమత సమభావ భారతదేశపు స్వభావానికీ మధ్యగల తేడా గురించి కూడ విజ్ఞత మరింతగా వికసించవలసి ఉంది.. ప్రపంచంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న అనేక మతాలలో ఐదారు తప్ప మిగిలిన మతాలు అనాదిగా భారతదేశంలో పుట్టడం చరిత్ర! గ్రీసు, రోము, మిశ్ర- ఈజిప్ట్- వంటి నాగరికతలకు చెందిన బహు దేవతారాధక మతాలు నశించిపోయాయి. క్రైస్తవ మతస్థులు, ఇస్లాం జిహాదీలు వాటిని ధ్వంసం చేయడం చరిత్ర! నశించిపోయిన ఆ గ్రీసు, రోము, మిశ్ర వంటి నాగరికతలకు మూలం వేల లక్షల ఏళ్ల క్రితం భారతదేశం నుంచి వ్యాపించిన సమన్వయ సంస్కారం. ఈ సమన్వయ సంస్కారం క్రమంగా నశించిపోవడం వల్లనే ‘రోము నాగరికులు’ గ్రీసు నాగరికతను ధ్వంసం చేశారు. హీబ్రూ నాగరికతను ధ్వంసం చేసి ‘హీబ్రూ’- యూదు-ల దేవాలయాలను పడగొట్టి యూదుల- ఇజ్రాయిలీల-ను పాలస్తీనా నుంచి పారద్రోలారు. ఇదంతా క్రీస్తు మత శకం పుట్టక పూర్వం జరిగిన విపరిణామ క్రమం. అంటే వైవిధ్యాలను సమన్వయం చేసుకునే సమాజ సమష్టి స్వభావం ఆ పడమటి దేశాలలో లేదు! రోము నాగరికతకు చెందిన ‘మతం’ బహుళ దేవతామూర్తులను ఆరాధించినప్పటికీ మరో మతాన్ని అంగీకరించలేదు. బహుళ దేవతారాధన భారతదేశం నుంచి వ్యాపించిన సంస్కారం, గ్రీసు ప్రజల నుంచి రోము నాగరికులకు లభించిన విజ్ఞాన వారసత్వం! రోము ‘నాగరికత’ బహుళ దేవతలను అంగీకరించినప్పటికీ బహుళ ‘మతాల’ను అంగీకరించకపోవడానికి కారణం క్రమంగా భారతీయ సంస్కార పరంపరకు దూరమైన పడమటి దేశాల వారికి సమన్వయ స్వభావం నశించిపోయి ఉండడం. అందువల్లనే గ్రీసు నాగరికతను, హీబ్రూ నాగరికతను రోము నాగరికులు ధ్వంసం చేశారు. క్రీస్తు మత శకం పుట్టక పూర్వం, పుట్టిన తరువాత కూడ ఈ ‘పడమటి దేశాల’లో ఒకదాన్ని లేదా ఒక మతాన్ని ఒక వైవిధ్యాన్ని మరొకటి లేదా మరొక మతం లేదా మరొక వైవిధ్యం ధ్వంసం చేయడమే చరిత్ర. అంతేకాని అన్ని మతాలు, అన్ని వైవిధ్యాలు సమాంతరంగా పరిఢవిల్లిన చరిత్ర పడమటి దేశాలలో లేదు! గ్రీసు, హీబ్రూ నాగరికతలను రోము ‘సామ్రాజ్యం’ వారు ధ్వంసం చేశారు, మిశ్ర నాగరికతను ధ్వంసం చేయ యత్నించారు. రోము నాగరికతను క్రైస్తవం నిర్మూలించింది. ఇది క్రీస్తుమత శకం మొదలైన తరువాతి ముచ్చట..

మిశ్ర ‘నాగరికత’ చివరిలో రోజులలో ‘హీబ్రూల’తో వారికి ఘర్షణ జరిగింది. చివరికి ‘హీబ్రూ’-యూదులు- లక్షల సంఖ్యలో ఈజిప్ట్ ప్రాంతం నుంచి పారిపోవలసి వచ్చింది! ఇలా పారిపోయిన హీబ్రూలు పాలస్తీనాకు పరిమితమయ్యారు. ఆ తరువాత ‘రోము’ దురాక్రమణకు గురి అయ్యారు. పారశీకులు క్రీస్తునకు పూర్వం ఏడవ శతాబ్దిలో ‘మిశ్ర’ నాగరికతపై ‘విజయం’ సాధించడం, గ్రీసు, రోము సామ్రాజ్యవాదులు ‘బహుదేవతామూర్తుల’ ‘మిశ్ర’మతాన్ని నిర్మూలించడం పరిణామక్రమం! క్రీస్తుశకం ఆరంభమైన తరువాత క్రైస్తవం ఐరోపాలోని ప్రాచీన ‘నాగరికతల’ను దిగమింగింది! ఏడవ శతాబ్ది చివరి నుంచి ఇస్లాం, క్రైస్తవం పరస్పరం ఘర్షణపడిన ప్రతిచోట ఏదోఒకటి మాత్రమే మిగిలింది. జయించిన మతం ఓడిన మతం వారిని భయంకరంగా, రాక్షసంగా నిర్మూలించడం చరిత్ర! ఇస్లాం, క్రైస్తవం ఒకదాని తరువాత ఒకటిగానే ఆయా దేశాలలో నెలకొన్నాయి. కాని రెండూ కలసి పరస్పర సహనంతో జీవించిన చరిత్ర లేదు. సహిష్ణుతకు ప్రాతిపదిక ‘సమన్వయం’! ఆ ‘సమన్వయం’ ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాలలో సహస్రాబ్దులుగా అడుగంటిపోయింది! ఇస్లాం, క్రైస్తవ మతాలు ఒకదాన్ని మరొకటి నిర్మూలించిన కార్యక్రమం క్రీస్తుశకం ఇరవై శతాబ్ది వరకూ కొనసాగింది, ఇరవై ఒకటవ శతాబ్దిలోకి ప్రవేశించింది కూడ! ఆసియా, ఐరోపా సంగమ ప్రాంతంలో ఉన్న ‘సైప్రస్’ దేశం క్రీస్తుశకం 1970వ దశకం నుండి కల్లోలగ్రస్తం కావడానికి, 1990 దశకం నాటికి రెండు దేశాలుగా చీలిపోవడానికి రెండు మతాల సహజీవనం అసాధ్యం కావడం కారణం. ఇస్లాం బాహుళ్య ప్రాంతం క్రైస్తవ బాహుళ్య ప్రాంతం నుంచి విడిపోయి టర్కీయ సైప్రస్‌గా ఏర్పడింది! ఐరోపాలోని ‘సెర్బియా’ నుంచి ‘కొసావో’ విడిపోవడానికి కారణం కూడ రెండు మతాల వారు కలసి జీవించలేకపోవడం! ఆఫ్రికాలోని సూడాన్ రెండుగా బద్దలవడం దశాబ్దుల మతఘర్షణల దుష్పరిణామం! ఇస్లాం బాహుళ్య సూడాన్ ప్రభుత్వం దశాబ్దులపాటు అల్పసంఖ్యాక మతాల వారిని ఊచకోత కోసింది. అధ్యక్షుడు ఉమర్ హసన్ అల్ బహీర్‌ను విచారించి శిక్షించే కార్యక్రమం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉంది! కానీ, సూడాన్ రెండుగా విడిపోయింది. క్రైస్తవ మతం, వన మతాల ప్రజాబాహుళ్యమైన దక్షిణ ప్రాంతం దక్షిణ సూడాన్‌గా ఏర్పడింది! దక్షిణ సూడాన్‌లోని వనమతాల వారిని క్రైస్తవ ‘మిషనరీ’లు నిర్మూలించడానికి యత్నిస్తోండడం నడుస్తున్న చరిత్ర.. వన మతాలవారు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతి ఆరాధన వేద సంస్కృతి. పంచభూతాలను పూజించడం ప్రకృతి ఆరాధన! ప్రపంచమంతటా ఒకప్పుడు వేద సంస్కృతి వికసించింది! ఆఫ్రికాలోని వన మతాలు వైవిధ్యమత పరిరక్షకమైన పరిపోషకమైన వేద సంస్కృతి అవశేషాలు! లక్షల ఏళ్ల విపరిణామక్రమంలో భారతీయతకు లేదా వేద సంస్కృతికి దూరమైన పడమటి జాతులు సహిష్ణుతా స్వభావాన్ని కోల్పోడం కూడ చరిత్ర! మత సమన్వయం సహిష్ణుతకు ప్రాతిపదిక!

సృష్టిలో సహజంగా సమన్వయం నెలకొని ఉంది. సమన్వ యం సృష్టిగత సనాతన స్వభావం. సంఘర్షణ అపవాదం మాత్రమే! ‘సనాతనం’ అని అంటే ‘శాశ్వతం’ అని అర్థం! సృష్టిగత సమన్వయ తత్త్వం మానవ సమాజ స్థితం కావడం మన దేశంలో సహజంగా వికసించిన సంస్కారాల సమాహారం.. ఈ సంస్కార సమాహారం వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి.. అందువల్లనే హైందవ జాతీయ లేదా భారత జాతీయ ప్రస్థాన క్రమంలో అనేక మతాలు సమాంతరంగా ఒకే సమయంలో వికసించాయి. ఒక మతాన్ని లేదా ఒక వైవిధ్యాన్ని ధ్వంసం చేసి మరో మతం కాని, వైవిధ్యం కాని ప్రబలిన చరిత్ర హైందవ జాతీయ ప్రస్థానక్రమంలో ఏర్పడలేదు. వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయ తత్త్వం భరతఖండపు వౌలిక జాతీయతత్త్వం.. ఈ సమన్వయ హైందవ జాతీయ స్వభావమే ‘‘ఏకం సత్ విప్రాః బహుధావదన్తి’’- అన్న సనాతన సత్యాన్ని గ్రహించగలిగింది, సమష్టి సమాజ జీవన వ్యవహారంగా మార్చగలిగింది. అందువల్లనే ‘సర్వమత సమభావ’ వ్యవస్థ అనాదిగా ఈ జాతీయ సాంస్కృతిక భూమికపై వికసించింది, ఈ పరిమళ సంస్కారం ప్రపంచమంతటా నిండడం యుగయుగాల పరిణామక్రమం, భరత ఖండం వెలుపల ఈ సమన్వయ సంస్కారం అడుగంటడం విపరిణామ క్రమం..

హైందవ జాతి అనాదిగా శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, స్కాంద మతాలకు, ‘‘పంచభూత భాసితమైన’’ ప్రకృతి ఆరాధన మతాలకు ఆలవాలమై ఉంది. ఇవన్నీ వేదమతాలు! వేద ప్రామాణాన్ని అంగీకరించని బౌద్ధ, జైన, చార్వాక మతాలు కూడ ఈ జాతీయ సమాజంలో క్రమంగా భాగమయ్యాయి! ఈ మతాల సిద్ధాంతాలు పరస్పరం విభేదించాయి, కానీ మతాల సమన్వయం అనాదిగా మన దేశంలో జాతీయ జీవన సంస్కృతి కావడం, జీవన వ్యవహారం కావడం తిరుగులేని వాస్తవం. కేవలం శైవులు కాని, కేవలం వైష్ణవులు కాని, కేవలం శాక్తేయులు కాని, కేవలం బౌద్ధులు కాని మొత్తం దేశ జనాభాలో ఒక శాతం కంటె మించి లేరు- గతంలో కాని, వర్తమానంలో కాని.. తొంబయి శాతానికి పైగా స్వజాతీయ ప్రజలు ఈ అన్ని మతాల దేవతామూర్తులను అంగీకరించి అర్చించే ‘సనాతన’్ధర్మావలంబులు మాత్రమే! ఇదీ సమన్వయం. ‘సమన్వయం’ నిరంతర ప్రక్రియగా మారింది! స్వరూప వైవిధ్యాల సృష్టి స్వభావం అద్వితీయం. ఈ అద్వితీయ తత్త్వం సమాజ స్వభావంగా రూపొందడం సర్వమత సమన్వయం. ‘మతాలు’ స్వరూపాలు, స్వభావమైన సంస్కృతి మాత్రం ఒక్కటే! అందువల్ల అనాదిగా భారతీయులు వినిపించిన ‘ప్రార్థన’ ప్రపంచంలోని అన్ని మతాలవారు తమదిగానే భావించడానికి మన ఈ సమన్వయం దోహదం చేసింది!

‘‘ఒక పరి జగములు వెలినిడి

ఒకపరి లోపలికి గొనుచు ఉభయము తానై

సకలార్థసాక్షియగు అ

య్యకలంకుని ఆత్మభవుని అర్థిదలంతున్’’

– అన్న ఈ మహాకవి బమ్మెర పోతన ప్రార్థనను ఏ ఒక్క ఆరాధన పద్ధతి లేదా మతం పరిధిలోనైనా బంధించగలమా? ఉదాహరణలు అసంఖ్యాలు..

‘‘రజో జుషే జన్మని సత్త్వవృత్తయే

స్థితౌప్రజానాం ప్రలయే తపస్పృశే

అజాయ సర్గస్థితి నాశ హేతవే

త్రరుూ మయాయ త్రిగుణాత్మనే నమః’’

– అన్న భట్టబాణుడు అన్ని మతాల ప్రార్థనను వినిపించాడు. సృష్టికర్తగా రజోగుణాన్ని, స్థితికారకుడిగా సత్త్వగుణాన్ని, లయకర్తగా తమో గుణాన్ని ప్రస్ఫుటింపచేస్తున్న సృష్టి స్థితి లయ హేతుభూతుడైన మూడు లోకాలను నిండిన మూడుగుణాల స్వభావమైన పుట్టని వానికి నమస్కారము!-అన్నది సమన్వయ తత్త్వానికి మరో నిదర్శనం. అనాదిగా నిదర్శనాలు అసంఖ్యాలు. ఈ సమన్వయ తాత్త్విక భూమికపై నిలబడి అమెరికాలోని చికాగోలో వివేకానంద స్వామి ప్రసంగించాడు. స్వామి తమ గురించి వివరించాడని ప్రతి మతం వారూ భావించారు!

ఈ సమన్వయ స్వభావం వల్లనే హైందవ జాతి- విదేశాల నుంచి తరిమివేతకు గురి అయిన పారశీక, యూదు మతాల వారికి ఆశ్రయం ఇవ్వగలిగింది. విదేశాల నుంచి వచ్చి చేరిన క్రైస్తవం, ఇస్లాం మతాలకు సైతం శతాబ్దులుగా హైందవ జాతీయ జీవనంలో సమానత్వం లభించడానికి కారణం ఈ సమన్వయ తత్త్వమే! ‘సర్వమత సమభావం’ నిరంతరం కొత్త మతాలకు స్వాగతం చెప్పింది! హిందూ జాతీయ తత్త్వం ఇలా వైవిధ్య పరిరక్షకం, వైవిధ్య పరిపోషకం! వైవిధ్యాలను సహించని జిహాదీలు ప్రపంచంలో ‘ఇస్లాం’ మినహా మరో మతం ఉండరాదన్న లక్ష్యంతో బీభత్సకాండ జరుపుతున్నారు. ‘క్రైస్తవం’ మాత్రమే ఏకైక మతం కావాలన్న లక్ష్యంతో ‘మిషనరీ’లు మతం మార్పిడులు సాగించారు, సాగిస్తున్నారు. ఫలితంగా వైవిధ్య పరిరక్షణకు, వైవిధ్య విధ్వంసానికి మధ్య శతాబ్దులుగా మన దేశంలో సంఘర్షణ జరుగుతోంది!

భారత్‌కు వెలుపల మాత్రం రెండు వైవిధ్య విధ్వంస శక్తుల మధ్య సంఘర్షణ జరుగుతోంది. ఒకటి జిహాదీ బీభత్సం, రెండవది ‘మిషనరీ’ల స్వభావం! ట్రంప్ ద్వారా ఈ ‘మిషనరీ’ స్వభావం మరోసారి ఆవిష్కృతవౌతోంది.. అంతర్జాతీయ సమాజం ‘సమన్వయ’ ప్రవృత్తిని అలవర్చుకోనంతవరకు ఈ ‘సంఘర్షణ’ కొనసాగక మానదు.

-హెబ్బార్ నాగేశ్వర్ రావు

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here