Home News భరతమాత సేవకే అంకితమవుదాం: ప.పూ. సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ

భరతమాత సేవకే అంకితమవుదాం: ప.పూ. సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప.పూ. సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ
విజయదశమి ఉపన్యాసం (5.10.2022)

ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ శ్రీమతి సంతోష్ యాదవ్ జీ, వేదికనలంకరించిన విదర్భ ప్రాంత మాననీయ సంఘచాలక్, నాగపూర్ మహానగర్ సంఘచాలక్, సహ సంఘచాలక్, ఇతర అధికారులు, పురప్రముఖులు, మాతలు, సోదరీమణులు, ప్రియ స్వయంసేవకులారా …

శక్తి(దేవి)ని తొమ్మిది రోజులు పూజించి ఆశ్వయుజ శుక్ల దశమినాడు, ఆ తల్లి విజయం సాధించిననాడు, ఈ విజయదశమిని జరుపుకునేందుకు మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. భౌతిక, ఆధ్యాత్మిక శక్తుల ప్రకటిత రూపమైన అమ్మవారు సకల సంకల్పాలను నెరవేర్చి విజయాన్ని చేకూరుస్తుంది. శక్తి స్వరూపిణి అయిన ఆ దేవి ప్రకటితమవడమంటే  స్వచ్చమైన, పవిత్రమైన సంకల్పాలు విజయవంతమవుతాయని, సర్వత్ర సుఖశాంతులు వర్ధిల్లుతాయని అర్ధం. నేటి ప్రధాన అతిథి శ్రీమతి సంతోష్ యాదవ్ గారి సంతోషకరమైన, గౌరవపూర్వక ఉపస్థితి ఆ శక్తిని సూచిస్తుంది.  ఉన్నతమైన గౌరీశంకర శిఖరాన్ని ఆమె రెండుసార్లు అధిరోహించారు.

సంఘ కార్యక్రమాలలో మేధాసంపన్నులు, సమున్నత కార్యాలు సాధించిన మహిళామణులను అతిథులుగా ఆహ్వానించే పద్దతి చాలా కాలంగా ఉంది. శాఖ కార్యపద్దతి అయిన `వ్యక్తినిర్మాణం’ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, రాష్ట్ర సేవిక సమితులలో వేరువేరుగా సాగుతుంది. మిగిలిన కార్యక్రమాలన్నీ స్త్రీ, పురుషులు కలిసి నిర్వహిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ఈ పరస్పర పూరకమైన దృష్టి మొదటి నుండి ఉంది. కానీ ఈ సంప్రదాయం క్రమంగా మరుగున పడి `మాతృశక్తి’ కి అనేక అవరోధాలు, పరిమితులు ఏర్పడ్డాయి. నిరంతరాయంగా సాగిన విదేశీ దాడుల మూలంగా కొన్ని అనుచిత పద్దతులకు సమ్మతి ఏర్పడి అవి స్థిరపడ్డాయి. జాతీయ పునరుజ్జీవన ప్రారంభం నుండి మన జాతీయ నాయకులు మహిళలపై విధించిన ఈ పరిమితులు, ఆంక్షలను పూర్తిగా తిరస్కరించారు. మహిళా శక్తికి `దైవత్వాన్ని’ ఆపాదించి వారిని అక్కడికే పరిమితం చేయడం ఒక ధోరణి అయితే, వారిని కేవలం ఇంటికే పరిమితం చేయడం మరొక ధోరణి. ఈ రెండింటినీ మన నాయకులు తిరస్కరించారు. దానికి బదులు అభివృద్ధి, సాధికారతల కోసం అనుసరించవలసిన విధానాలు, పద్దతులపై దృష్టి పెట్టారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు కూడా సమాన భాగం కల్పించాలని కోరుకున్నారు. అనేక ప్రయోగాలు, పరీక్షల తరువాత ఇప్పుడు `స్త్రీ వాదులు’ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా కార్యకర్తలు మహిళల స్థితిగతులపై 2017లో ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాలను ప్రభుత్వానికి అందజేశారు కూడా. అభివృద్ధి, సాధికారత అవకాశాలు, నిర్ణయాధికారంలో సమాన భాగస్వామ్యం కోరుకుంటున్నారని ఆ ఫలితాలు వెల్లడించాయి. కుటుంబ స్థాయితో మొదలుపెట్టి సంస్థాగతమైన అన్నీ స్థాయిల్లో మార్పు వచ్చినప్పుడే ఈ మాతృశక్తితో పాటు సమాజం మొత్తం సరైన దిశలో కదులుతుంది, జాతీయ జాగృతి సాధ్యపడుతుంది.

జాతీయ జాగృతిని ఇప్పుడు సాధారణ ప్రజానీకం కూడా అనుభూతి చెందుతున్నారు. మన ప్రియతమ దేశమైన భారత్ అన్ని రంగాలలో చెప్పుకోదగిన ప్రగతిని సాధించి, అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకోవడం మనందరికీ ఆనందాన్ని కలిగించే విషయం. స్వావలంబన సాధించడానికి అవసరమైన విధానాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రపంచ దేశాల్లో భారత్ హోదా, ప్రాధాన్యత పెరిగాయి. రక్షణ రంగంలో పూర్తి స్వావలంబన సాధించే విధంగా సాగుతున్నాము. కరోనా మహమ్మారితో పోరు తరువాత దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుని అంతకు ముందున్న పటిష్టమైన స్థితికి చేరుకుంటున్నది. `కర్తవ్య పథ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్ధిక, సాంకేతిక, సాంస్కృతిక పునాదులపై ఆధునిక భారతపు విజయయాత్ర గురించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం మీరు కూడా వినేఉంటారు. ప్రభుత్వపు ఈ స్పష్టమైన దృష్టి అభినందనీయమైనది. అయితే మనమంతా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఈ దిశగా అడుగులు వేయాలి. `ఆత్మ నిర్భరత’ మార్గంలో ముందుకు వెళ్లాలంటే జాతిగా మన మౌలిక విలువలు, ఆలోచనలను అర్ధంచేసుకోవాలి. మన ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, ప్రజలు ఈ విలువలను పూర్తిగా అర్ధంచేసుకుని ఆచరించడం చాలా అవసరం. వివిధ సందర్భాలలో పరస్పర విశ్వాసం, సమన్వయమే ప్రధానమవుతాయి. ఆలోచనలో స్పష్టత, లక్ష్యం పట్ల ఏకాభిప్రాయం, నిష్ట, సంస్కరణకు సిద్ధంగా ఉండడం, పొరపాట్లు జరగకుండా ముందుజాగ్రత్త వహించడం వంటివి చాలా అవసరం. ప్రభుత్వం, పాలనయంత్రాంగం, వివిధ రాజకీయ పార్టీలు, సమాజంలోని వివిధ వర్గాలు భేదాలను పక్కకు పెట్టి కర్తవ్య నిర్వహణ కోసం కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, రాజకీయ నాయకులు తమ బాధ్యతలు నిర్వర్తించినట్లే సమాజంలో అందరూ తమతమ బాధ్యతలు నెరవేర్చాలి.

జాతీయ పునరుజ్జీవన ప్రక్రియ సఫలం కావాలంటే అవరోధాలను దాటగలగాలి. ఆ అవరోధాలలో మొదటిది, గతంలో చిక్కుకుపోవడం. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి జ్ఞానం పెరుగుతుంటుంది, మారుతుంటుంది. కాలప్రవాహంలో కొన్ని విషయాలు మారుతాయి, కొన్ని పూర్తిగా లుప్తమైపోతాయి. కొత్త పరిస్థితులు, సందర్భాలు ఏర్పడతాయి. అందువల్ల సంప్రదాయం, వర్తమానం మధ్య సమన్వయం, సంతులనం అవసరమవుతుంది. పాతబడిపోయిన, కాలబాహ్యమైన పద్దతులను వదిలిపెట్టాలి. వర్తమాన పరిస్థితులకు అనుకూలమైన, సరిపోయిన కొత్త పద్దతులను రూపొందించుకోవాలి. అదేసమయంలో మన అస్తిత్వాన్ని, సంస్కృతిని, జీవన విలువలను తెలియజేసే శాశ్వత విలువలను కాపాడుకోవాలి. అవి కనుమరుగు కాకుండా వాటిని నిరంతరం ఆచరించాలి.

ఇక రెండవ రకం అవరోధాన్ని ఈ దేశపు సమైక్యత, అభివృద్ధులను నాశనం చేయాలనుకునే శక్తులు సృష్టిస్తాయి. తప్పుడు ప్రచారం ద్వారా అసత్య భావాలను వ్యాప్తిచేయడం, హింసను ప్రేరేపించడం, భయోత్పాతాలు సృష్టించడం, ఘర్షణ, సామాజిక అశాంతిని ప్రోత్సహించడం వంటివి ఈ శక్తులు అనుసరించే వ్యూహాలు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. హక్కులు, ప్రయోజనాల పేరిట సమాజంలోని వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం, శతృత్వాన్ని కలిగించడం ఈ శక్తుల పని. భాష, మతం, ప్రాంతం, అనే తేడా లేకుండా ఇలాంటి శక్తులను ధైర్యంగా ఎదుర్కొని నిరసన తెలుపడమో, తిప్పికొట్టడమో చేయాలి. అటువంటి శక్తులను మట్టికరిపించడానికి ప్రభుత్వం, పాలనాయంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలకు మనం సహకారం అందించాలి. సమాజం ఈ విధంగా బలమైన, సక్రియమైన సహకారాన్ని అందించినప్పుడే భద్రత, సమైక్యత సాధ్యపడతాయి.

సమాజపు భాగస్వామ్యం లేకుండా ఏ మంచి మార్పు, సంస్కరణ సాధ్యంకాదు, ఫలవంతంకాదు. ప్రపంచమంతటా ఎక్కడైనా ఇది నిజం. ఎంత గొప్ప వ్యవస్థనైనా ప్రజలు సిద్ధంగాలేకపోతే లేదా అంగీకరించకపోతే అమలు చేయడం సాధ్యం కాదు.

ప్రపంచంలో ఎక్కడైనా స్థిరమైన, దీర్ఘకాలం నిలబడిన మార్పు, లేదా సంస్కరణ సామాజిక జాగృతి ద్వారానే సాధ్యపడింది. ఆ తరువాత మాత్రమే వ్యవస్థాపరమైన, పాలనాపరమైన మార్పులు వచ్చాయి. మాతృభాషలోనే విద్య అనేది చాలా మంచి, సహేతుకమైన విధానం. నూతన విద్యా విధానం (NEP) లో  ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది. కానీ తమ పిల్లలకు మాతృభాషలోనే విద్యాబోధనను తల్లిదండ్రులు అంగీకరిస్తారా? లేక మంచి ఉపాధి మార్గం, ఆర్ధిక ప్రయోజనాల పేరున (వీటికి విద్య కంటే స్వయంచాలకత్వం, సృజనాత్మకత, ధైర్యంవంటి గుణాలు అవసరం) అర్ధం లేని పోటీని ప్రోత్సహిస్తారా? అనేది ప్రశ్న. ప్రభుత్వం మాతృభాషా విధానాన్ని అమలు చేయాలని కోరే ముందు అసలు మనం కనీసం మన మాతృభాషలోనైనా సంతకం చేస్తున్నామా? మన ఇళ్లపై పెట్టుకుంటున్న పేర్లు మాతృభాషలోనే ఉంటున్నాయా? ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు పంచే ఆహ్వానపత్రాలు మన భాషలో ఉంటున్నాయా? అని చూసుకోవాలి. నూతన విద్యావిధానం వల్ల విద్యార్థులలో సాంస్కృతిక విలువలు, నైతికత, దేశభక్తి పెరగాలన్నది ఆకాంక్ష. కానీ తమ పిల్లలను పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు పంపుతున్న తల్లిదండ్రులకు విద్య పరమ లక్ష్యం ఏమిటన్న విషయంలో అవగాహన ఉన్నదా? కేవలం నాలుగు గోడలమధ్యనే(క్లాస్ రూమ్) విద్యాబోధన పూర్తికాదు. `సంస్కారయుతమైన’ కుటుంబ వాతావరణం, అది కలిగించడంలో తల్లిదండ్రుల బాధ్యత, సామాజిక ప్రవర్తనను, క్రమశిక్షణను తీర్చిదిద్దే పండుగలు, ప్రముఖుల, నాయకుల వ్యవహారశైలి మొదలైనవి కూడా చాలా ముఖ్యం. వీటి గురించి మనం ఎంత శ్రద్ధవహిస్తున్నాం? ఇవి లేకుండా కేవలం పాఠశాల ద్వారా లభించే విద్య వల్ల ప్రయోజనం ఉండదు.

వైద్య రంగంలో కూడా ప్రభుత్వం మనకు అందుబాటులో ఉన్న అన్ని వైద్య విధానాలను ఒకచోట చేర్చి, ప్రజలకు చవకైనా వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని సంఘం కోరుతోంది. యోగా, ఇతర వ్యాయామ పద్దతులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం తన పాత్రను కొనసాగించాలి. వీటివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయన్నది చెపుతున్న నిపుణులు చాలమందే ఉన్నారు.  కానీ ప్రజలు తమ పాత పద్దతులు, అలవాట్లను వదిలిపెట్టకపోతే ఎలాంటి విధానాన్ని, వ్యవస్థను ప్రవేశపెట్టినా ప్రయోజనం ఏమిటి?

మన రాజ్యాంగంలో రాజకీయ, ఆర్ధిక సమానత్వానికి దారులు పడ్డాయి. కానీ సామాజిక సమానత్వం లేకుండా నిజమైన, శాశ్వతమైన మార్పు సాధ్యం కాదని డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ మనను హెచ్చరించారు. దానితో ఆ తరువాత ఈ లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని నిబంధనలు అమలుచేశారు. నిజానికి సామాజిక అసమానతకు మూలం మన మనసుల్లో, ఆలోచనల్లో, అలవాట్లలో ఉంది. అందరికీ దేవాలయ ప్రవేశం, నీరు పట్టుకునే ప్రదేశం, ఒకే శ్మశానం వంటివి సాధ్యపడనంతవరకు సామాజిక సమానత్వం కలగానే మిగిలిపోతుంది.

పాలనా వ్యవస్థ ద్వారా తీసుకురావాలనుకుంటున్న మార్పులు స్థిరంగా, వేగవంతంగా సాగాలంటే వాటిలో మన సామాజిక ప్రయోజనం, వ్యవహారం ప్రతిబింబించాలి. అలా జరగనప్పుడు మార్పు ఆగిపోతుంది లేదా కోరిన ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి వ్యక్తుల ఆలోచనలు తీర్చిదిద్దడం అత్యవసరం. అలాగే వినియోగవాదం, శోషణను తొలగించాలంటే అందుకు దారితీస్తున్న ఆలోచనా ధోరణిని మన జీవితాలు, సమాజం నుండి తొలగించాలి.

అధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో ఆర్ధిక, అభివృద్ధి విధానాలు ఉపాధి కల్పన లక్ష్యంగా ఉండాలని కోరుకోవడం సహజం. అయితే ఉపాధి అంటే కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదనే ఆలోచన సమాజంలో వ్యాపించాలి, స్థిరపడాలి. ఏ పనీ తక్కువది కాదు, నీచమైనది కాదు. ఆర్ధిక, మేధో రంగాల్లో పనుల తోపాటు, కూలీ పని కూడా సమానమైనదే, గౌరవనీయమైనదే. ఈ విషయాన్ని గుర్తించి మనం వ్యవహరించాలి. స్వావలంబనను, ఉపాధి కల్పనను పెంచే పనులను ప్రోత్సహించాలి. ప్రతి జిల్లాలో వికేంద్రీకృత ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించడం, సొంత జిల్లాల్లోనే ఉపాధి అవకాశాలు లభించేవిధంగా చూడటం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటివి ప్రభుత్వం చేయాలని ఆశిస్తారు. అయితే సమాజంలో అంతర్గతంగా ఉన్న వ్యవస్థా నైపుణ్యం, శక్తి సేవా రంగంలో అద్భుతాలను సాధించగలదని కరోనా మహమ్మారి కాలంలో కార్యకర్తలు గుర్తించారు. ఆర్ధిక రంగంలో పనిచేస్తున్న కొన్ని సంస్థలు, చిన్నతరహా పరిశ్రమలు, కొందరు సంపన్నులు, వృత్తివిద్యా నిపుణులు, శిక్షకులు, స్థానిక స్వయంసేవకులు స్వదేశీ జాగరణ్ మంచ్ తో కలిసి 275 జిల్లాల్లో ఉపాధి కల్పన ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇది ఇప్పుడే ప్రారంభమయింది కాబట్టి ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల అనేకమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.

వివిధ కార్యక్రమాలలో, రంగాల్లో సమాజపు పాత్ర గురించి మాట్లాడుతున్నామంటే ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యతా లేదని చెపుతున్నట్లు కాదు. కేవలం జాతీయాభివృద్ధిలో ప్రజల పాత్ర కూడా చాలా ముఖ్యమైనదని గుర్తుచేయడం మాత్రమే. మన దేశ జనాభా చాలా ఎక్కువ. అది యదార్ధమైన విషయం. నేడు జనాభా గురించి రెండు రకాలుగా అంచనా వేస్తున్నారు. జనాభా పెరిగితే ఎక్కువ వనరులు అవసరమవుతాయి. అందువల్ల జనాభా భారం అవుతుంది. కాబట్టి జనాభా నియంత్రణను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచిస్తున్నారు. జనాభా విషయంలో మరో దృష్టికోణం ఉంది. దాని ప్రకారం జనాభాను ఆస్తిగా, బలంగా పరిగణిస్తారు. ఎక్కువమందికి తగిన శిక్షణనిచ్చి వారి శక్తిసామర్ధ్యాలను ఉపయోగించుకోవాలి. ప్రపంచ జనాభా చిత్రాన్ని గమనిస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి.  కాకుండా కేవలం మన దేశ జనాభాని మాత్రమే చూస్తే మన ఆలోచనలు మరోలా ఉంటాయి. ఇటీవలవరకు జనాభా నియంత్రణ విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తోంది. జాతీయ ప్రయోజనాలు, మన ఆలోచనలే జనాభా విధానాన్ని ప్రభావితం చేస్తాయి, నిర్ణయిస్తాయి. నేడు మనది యువ దేశం. ఇక్కడ నుంచి 50 ఏళ్ల తరువాత నేటి యువతే వృద్ధులవుతారు. అప్పటికి ఎంత యువ జనాభా ఉండాలనే అంచనా మనకు ఉండాలి. ప్రజలు దేశం కోసం పనిచేయడంతోపాటు కుటుంబ, సమాజ పరంపరను కొనసాగిస్తారు.

ఒక కుటుంబంలో పిల్లల సంఖ్య ఎంత ఉంటుందన్నది తల్లి ఆరోగ్యం, విద్యావకాశాలు, ఆర్ధిక స్థితిగతులు, వ్యక్తిగత ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. అలాగే కుటుంబ అవసరాలను బట్టి కూడా మారుతుంటుంది. జనాభా పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

కనుక మొత్తంగా చెప్పాలంటే ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని జనాభా విధానాన్ని రూపొందించుకోవాలి. ఆ విధానం అందరికీ వర్తించేదై ఉండాలి. ఆ విధానాన్ని తూచతప్పక పాటించాలనే సంసిద్ధతను, ఆలోచనను కలిగించడానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. అప్పుడు మాత్రమే జనాభా నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఫలితాన్నిస్తాయి.

వివిధ వర్గాల ప్రతినిధులతో సంప్రదించిన తరువాత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఒక జనాభా విధానాన్ని రూపొందించింది. 2.1 స్థూల జనన రేటు (TFR) సాధించాలన్నది ఆ విధానపు ప్రధాన లక్ష్యం. ప్రతి ఐదేళ్ళకు ఒకసారి NFHS సంస్థ నివేదికను ప్రచురిస్తుంది. అలాగే 2022లో సంస్థ ఒక నివేదికను వెలువరించింది. దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ కృషి, సామాజిక అవగాహన వల్ల జనన రేటు లక్షిత 2.1 కంటే మరింత తగ్గి 2.0కు పడిపోయిందని తేలింది. జనాభా నియంత్రణ, ప్రజా అవగాహనతో పాటు ఇప్పుడు మరో రెండు విషయాలపై దృష్టి సారించవలసి ఉంది. అతిచిన్న కుటుంబాల మూలంగా చిన్న పిల్లల మనోవికాసంపై ప్రభావం పడటమేకాక కుటుంబాలలో అభద్రత, సామాజిక ఉద్రిక్తతలు, ఒంటరితనం వంటి సమస్యలు వస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు భావిస్తున్నారు. ఈ సమస్యలు మన సమాజానికి మూలమైన `కుటుంబ వ్యవస్థ’ కే సవాలుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జనాభా సంతులనం దెబ్బతినడం అనే మరొక సమస్య కూడా ఎదురవుతోంది. సరిగా ఇదే సమస్య 75 సంవత్సరాల క్రితం మనం ఎదుర్కొన్నాం. 21వ శతాబ్దంలో కొత్తగా అస్తిత్వంలోకి వచ్చిన తూర్పు తిమొర్, దక్షిణ సూడాన్, కొసావోలు జనాభా సంతులనం దెబ్బతినడం వల్ల ఇండోనేషియా, సూడాన్, సెర్బియాల నుండి ఏర్పడినవే. జనాభా అసంతులనం ఏర్పడ్డంవల్ల భౌగోళిక సరిహద్దులు కూడా మారిపోతాయి. వివిధ సమూహాలలో జనాభా పెరుగుదల రేటు వేరువేరుగా ఉండడం, బలవంతపు మతమార్పిడులు, చొరబాటులు వంటివి ఈ అసంతులనానికి ప్రధాన కారణాలు. వీటిని సరిచేయాలి. జనాభా నియంత్రణ, మతపరమైన జనసంఖ్యలో సంతులనం వంటివి చాలా ముఖ్యమైన విషయాలు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.

ప్రజాస్వామ్యంలో ప్రజల సహకారానికి ఉండే విలువ సుప్రసిద్ధం. నియమపాలన, అంగీకారంతో పాటు లక్ష్య ప్రాప్తి ఈ సహకారం వల్లనే సాధ్యపడుతుంది. త్వరిత లాభాన్ని చేకూర్చే నియమాలు , వ్యక్తిగత లాభాన్ని అందించేవి ఏమిటన్నది విడిగా ఎవరికీ చెప్పనక్కరలేదు. కానీ దేశానికి సంబంధించిన విషయాలలో లేదా బలహీనవర్గాలకు సంబంధించిన విషయాలలో ప్రతి ఒక్కరూ తమ స్వప్రయోజనాలను వదలాలి. అందుకోసం సమాజం తన స్వాభిమానాన్ని నిరంతరం నిలుపుకోవాలి.

ఈ స్వాభిమానమే మనల్ని కలిపి ఉంచుతుంది. ఎందుకంటే మన పూర్వజులు అనుభవించిన సత్యమిదే. “ఇప్పటివరకు ఏదైతే జరిగిందో ఇక ముందు ఏదైతే జరగబోతోందో అంతా ఇందులోంచే జరుగుతుంది” (సర్వం యద్భూతం యచ్ఛ భవ్యం) అనేది సనాతన, సర్వకాలీన సత్యం. వ్యక్తిగతమైన ప్రత్యేకతల్ని నిలపుకుంటూనే వివిధత్వాన్ని గౌరవించడం భారత్ ప్రపంచానికి ఇచ్చే పాఠం. అందరూ ఒకటే కనుక అందరూ కలిసి పని చేయాలి. మన ఆచార పద్ధతులలో తేడాలు మనల్ని వేరు చెయ్యవు. సత్యం,కరుణ, అంతరంగ, బాహ్య శౌచం, ముక్తి అనే ఈ నాలుగు సూత్రాలు అన్ని పంథాలవారికి ఒకటే.  వివిధత్వాన్ని కాపాడుతూనే వాటి వికాసానికి తోడ్పడుతుంది, వాటిని కలిపి ఉంచుతుంది. దీన్నే మనం ధర్మం అంటాం. దీని మీద ఆధారపడిన మన సంస్కృతి మనల్ని ఏకం చేసి ప్రపంచాన్ని కుటుంబంగా చూసే స్ఫూర్తిని అందిస్తుంది. ప్రపంచానికి సాంస్కృతిక సామరస్యం, నమ్మకం , శాంతియుత వాతావరణాన్ని అందిస్తుంది. `వసుధైవ కుటుంబకం’, `విశ్వం భవత్యేకంనీడమ్’ అనే భావనలు మనకు స్ఫూర్తినందిస్తాయి.

మన జాతి జీవనం అనాదిగా ఇదే లక్ష్యంతో, ఇదే పద్ధతిలో సాగుతూ వచ్చింది. కాల గమనంలో పద్ధతి , మార్గం, విధం మారాయికానీ మూలాలు, లక్ష్యాలు,గమ్యం అలాగే ఉన్నాయి. ఈ యాత్రలో ప్రగతి ఎందరో కర్మయోగుల ధైర్యం, త్యాగం, కృషితో పాటు జ్ఞానుల కఠోర తపస్సు వలనే సాధ్యమైంది. మన జీవితాలలో వారిని అనుసరించడం చాలా ముఖ్యమని భావించాలి. వాళ్ళు మనకు గర్వకారణం. మన ఈ పూర్వీకులు మన ఏకతకు మరొక ఆధారం.

వాళ్ళు మన మాతృభూమి గురించి విజయగీతికలు ఆలపించారు. వాళ్ళు అనాదిగా వివిధత్వాన్ని గౌరవిస్తూ కలిసి పని చేసే గుణాన్ని మనకి అలవాటు చేశారు. బాహ్యమైన ఆనందాలకు పరిమితమవకుండా ఆత్మసాక్షాత్కారానికి, ఆత్మజ్ఞానం కోసం మేధోమధనం చేశారు. ప్రపంచం మొత్తాన్ని తమ కుటుంబంగా భావించి జ్ఞానాన్ని, శాస్త్రాన్ని, సంస్కృతిని, వ్యవహారాన్ని అందించారు. ఇదంతా మన మాతృభూమి భారత్ వల్లనే సాధ్యమైంది. అనాదిగా జీవనదులతో , ప్రకృతి వైభవంతో , మలయ మారుతాలతో , సహజ సరిహద్దులతో భారతమాత మనల్ని పోషించి, రక్షించి నిలబెట్టింది. మన అఖండ మాతృభూమి పట్ల అపరిమిత భక్తి, శ్రద్ధా మన జాతీయతకు మూలం.

అనాదిగా భౌగోళిక, భాష, మత, వ్యావహారిక, సామాజిక, రాజకీయ పద్ధతులలో తేడాలున్నప్పటికీ ఒక సమాజంగా, సంస్కృతిగా, రాష్ట్రంగా మన జీవన విధానం అప్రతిహతంగా సాగుతూ వచ్చింది. ఇందులో సకల వైవిధ్యానికీ స్థానం, గౌరవం, రక్షణ, ప్రగతి ఉంది. సంకుచితత్వం, అతివాదం, దూకుడుతనం, స్వార్థం వంటివి తప్ప ఇంకేవీ వదులుకోవాల్సిన అవసరం లేదు. సత్యం,కరుణ,అంతరంగ, బాహ్య శౌచం, నియమిత సాధన మొదలైనవాటికంటే ఇక్కడ ఏది తప్పనిసరి కాదు. భారత్ పట్ల భక్తి , మన పూర్వజుల స్ఫూర్తి, మన గొప్ప సంస్కృతి – ఈ మూడే మన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఆ దారిలో మనం ప్రేమ సౌభ్రాతృత్వంతో సాగాలి. ఇదే మన స్వాభిమానం , రాష్ట్ర ధర్మం.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ ఉద్దేశంతో సమాజానికి పిలుపునిస్తుంది. ఈనాడు సమాజం ఈ పిలుపును అందుకునేందుకు సిద్ధంగా ఉందని సంఘం భావిస్తోంది. సంఘానికి వ్యతిరేకంగా అజ్ఞానంతో , భయంతో, స్వార్థంతో, ఉద్దేశపూర్వకంగా చేసిన అసత్యప్రచారం ఈనాడు నిలబడదు. దీనికి కారణం సంఘం భౌగోళికంగా , సామాజికంగా వ్యాపించడం. అంటే సంఘ శక్తి పెరగడం. ప్రపంచంలో వినిపించాల్సిన ఒక విచిత్రమైన సత్యమిది. సత్యానికి కూడా శక్తి కావాలి. ప్రపంచంలో అసూరీ శక్తులు కూడా ఉన్నాయి. వాటి నుండి తమను, ఇతరులను కాపాడేందుకు సజ్జనశక్తికి సామూహిక బలం అవసరం. పైన చెప్పిన రాష్ట్ర భావనను వ్యాపింప చేసేందుకు, సమాజం మొత్తాన్ని ఒక సామూహిక శక్తిగా నిలబెట్టేందుకు సంఘం పని చేస్తుంది. పైన చెప్పిన ఆలోచనే హిందూ రాష్ట్రపు కల్పన, అదే నిజం కూడాను. అందువల్లనే ఇది హిందూ సంఘటనా కార్యం.  ఎవరిని వ్యతిరేకించకుండా, ఈ భావనను అంగీకరించే వారందరినీ సంఘం కలుపుతుంది. అంటే హిందూధర్మం, సంస్కృతి , సమాజ రక్షణ, హిందూరాష్ట్ర సర్వాంగీణ ఉన్నతి కోసం కలుపుతుందన్నమాట.

సంఘపట్ల అనుకూలత, ప్రేమ, విశ్వాసం పెరిగినప్పుడు `హిందూరాష్ట్ర’ భావన కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. చాలా మంది హిందూ రాష్ట్ర భావనను అంగీకరించినా `హిందూ’ అనే పదాన్ని వ్యతిరేకించి వేరే పదాలు వాడేందుకు మొగ్గుచూపుతున్నారు. మాకు దీనితో ఎటువంటి ఇబ్బంది లేదు. భావ స్పష్టత కోసం మాత్రమే హిందూ అనే పదాన్ని ఉపయోగిస్తాం.

హిందువులు సంఘటితం కావడంవల్ల లేదా మావల్ల(ఆర్ ఎస్ ఎస్) హాని ఉందని మైనారిటీలుగా పిలుస్తున్న కొందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎటువంటి హానీ గతంలో జరగలేదు, ఇక ముందు జరగదు. ఇది హిందువుల లేదా  సంఘ పద్ధతి కాదని చరిత్ర సాక్ష్యం చెప్తోంది. అన్యాయం,శతృత్వం, అరాచకం, దౌర్జన్యం, ద్వేషం నుంచి  స్వీయరక్షణ, స్వబంధు రక్షణ అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం అవుతుంది. ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదు. సంఘం సౌభ్రాతృత్వం, శాంతి, సౌభాగ్యాల కోసం నిలబడాలని దృఢంగా సంకల్పించుకుంది.

ఇటువంటి కొన్ని అనుమానలతో మైనారిటీలుగా చెప్పబడే సమూహాల నుంచి కొందరు పెద్దమనుషులు మమ్మల్ని కలిశారు. సంఘ అధికారులతో చర్చలు జరిపారు. ఇక ముందు కూడా జరుపుతారు. భరతవర్షం పురాతనమైన రాష్ట్రం, ఒకే రాష్ట్రం. ఈ ఆచారాన్ని నిలబెట్టేందుకు మనం మన ప్రత్యేకతల్ని పాటిస్తూనే, పరస్పరం ప్రేమ , గౌరవం, శాంతితో జీవించాలి, దేశ సేవకు పాటుపడాలి. సుఖ దుఃఖాలలో కలిసి ఉండాలి, దేశాన్ని అర్ధం చేసుకోవాలి, గౌరవించాలి, దేశం కోసం జీవించాలి. ఇదే జాతీయ ఏకతకు, సామరస్యానికి సంఘ ఆలోచన. ఇంతకుమించి సంఘానికి ఎటువంటి ఉద్దేశం, స్వార్థ ప్రయోజనం లేవు.

  ఈ మధ్య ఉదయపూర్ లో, అలాగే మరికొన్నిచోట్ల భయానకమైన ఘటనలు జరిగాయి.  సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చాలామంది ఆగ్రహం చెందారు, బాధపడ్డారు. ఇటువంటివి మరలా జరగకుండా జాగ్రత్తవహించాలి. ఒక వర్గం మొత్తం వీటికి కారణమని భావించడం సరియైనది కాదు. ఉదయపూర్ ఘటన తరవాత ముస్లిం సామాజిక వర్గం నుంచే కొందరు ప్రముఖులు దానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. ఈ ప్రతిస్పందన ఆ వర్గంలో ఒక చిన్న సమూహం నుంచి కాక మొత్తం ముస్లిం సమాజం నుంచి రావాలి. అలా స్పందించడం వారి స్వభావం కావాలి. తప్పుచేసినవాడు హిందువు అయినప్పటికీ హిందూ సమాజం సహజంగా తమ నిరసనని,  తీవ్ర ప్రతిస్పందనని తెలుపుతుంది.

కారణాలు ఎంత తీవ్రమైనవైనప్పటికీ నిరసనలు న్యాయ, రాజ్యాంగ పరిధులలోనే జరగాలి. మన సమాజం ఐక్యం కావాలి, విచ్ఛిన్నం కాకూడదు. మాట, వ్యవహారంలో పరస్పర సహకారభావన ఉండాలి.  వివేకంతో, విచక్షణతో మాట్లాడాలి. మేము ప్రత్యేకంగా కనపడుతాం కాబట్టి  మేము వేరు, మాకు విభజన కావాలి, మేము ఈ దేశంలో ఉండం, ఈ జీవన విధానం, ఆలోచనలు, అస్తిత్వాన్ని అంగీకరించం అనే ధోరణివల్ల `సోదరులు విడిపోయారు, దేశం ముక్కలయ్యింది, శ్రద్ధా కేంద్రాలు ధ్వంసమయ్యాయి’. ఈ విషపూరిత విభజన వల్ల ఎవరూ సంతోషంగా లేరు. మనం భారతీయులం, భారతీయ పూర్వజులకు , సంస్కృతికి వారసులం, మనం ఒకే సమాజం, జాతి అనే భావనే మన ఏకైక రక్షణ కవచం, మంత్రం.

మనం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. దేశ పునరుత్థానం కోసం మనల్ని భారత మాతకు అంకితం చేసుకొమ్మని స్వామి వివేకానంద పిలుపునిచ్చారు. మొదటి స్వాతంత్ర్యదినంనాడు యోగి అరవిందులు భారతీయులందరికి సందేశన్నిచ్చారు. అది వారి జన్మ దినం కూడా. ఆ సందేశంలో వారి ఐదు ఆకాంక్షలను ఆయన వెలుబుచ్చారు. మొదటిది, భారత స్వాతంత్ర్యం, అఖండత. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా సంస్థానాలన్నింటి విలీనం వారు కోరుకున్నారు.  కానీ విభజన మూలంగా హిందూ ముస్లిం ఐక్యత బదులు రాజకీయ విభజన ఏర్పడి అది భారత్ ఏకత్వాన్ని, ప్రగతిని, శాంతిని సాధించేందుకు అడ్డు తగులుతుందని వారు ఆందోళన చెందారు. కాబట్టి ఎలాగైనా విభజన పరిసమాప్తం కావాలని, అఖండ భారత్ తిరిగి ఏర్పడాలని కోరుకున్నారు. ఆసియా దేశాల స్వాతంత్ర్యం,  ప్రపంచ సమైక్యత, భారత ఆధ్యాత్మిక చైతన్యం అనే బహుమతి ప్రపంచానికి అందడం, మానవుని ఉన్నత అధ్యాత్మిక ప్రగతి వంటి తన కలలను నెరవేర్చడంలో భారత్ ది ముఖ్య పాత్ర అని వారికి తెలుసు.

అందుకని వారు సేవ అనే ఒక పద్ధతిని, కార్యాచరణ మార్గాన్ని చూపారు :

దేశ చరిత్రలో కొన్నిసార్లు ఒక పని, లక్ష్యం కోసం ఇతరమైనవి, అవి  ఎంత ఉన్నతమైనవైనా, త్యజించాలి. అటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మన మాతృభూమి సేవ కన్నా ఏది ముఖ్యం కాదు. అన్ని అటు వైపే సాగాలి. చదువుకుంటే దేశం కోసం చదువుకోవాలి. శరీరాన్ని, మనస్సుని, ఆత్మని దేశ సేవ కోసం తయారుచేయాలి. జీవితాన్ని దేశం కోసం గడపాలి.  విదేశాలకు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించి తెచ్చి దేశ సేవ చేయాలి. అందుకోసం వెళ్ళాలి. దేశం సుభిక్షమయ్యేట్టు పని చెయ్యాలి. దేశం సుఖపడేట్టు కష్టపడు. అన్ని విషయాలు ఈ ఒక్క సలహాలోనే ఉన్నాయి”.

ఈ సందేశం ఈనాటికీ మనకి ఆచరణీయం –

గావ్ గావ్ మే సజ్జన్ శక్తి | రోమ్ రోమ్ మే భారత్ భక్తి |
యహీ విజయ్ కా మహా మంత్ర హై | దశో దిశా సే కరే ప్రయాణ్||
జై జై మేరా దేశ్ మహాన్ ||
|| భారత్ మాతాకీ జై ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here