Home News మోషన్‌ సెన్సర్లు, రాడార్లు, నైట్‌ విజన్‌ కెమెరాలతో పటిష్ఠ నిఘా

మోషన్‌ సెన్సర్లు, రాడార్లు, నైట్‌ విజన్‌ కెమెరాలతో పటిష్ఠ నిఘా

0
SHARE
  • జమ్ములో ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు మొదలు..
  • రెండు చోట్ల 5 కిలోమీటర్ల మేర ఏర్పాటు..
  • పార్లమెంటులో కేంద్రం వెల్లడి..
  • మోషన్‌ సెన్సర్లు, రాడార్లు, నైట్‌ విజన్‌ కెమెరాలతో పటిష్ఠ నిఘా

అంతర్జాతీయ సరిహద్దు కంచెను దాటి దాయాది దేశం పాకిస్థాన్‌ నుంచి మనదేశంలోకి చొరబడే ఉగ్రవాదులు, చొరబాటుదారుల పనిపట్టే లేజర్‌ గోడ నిర్మించే ప్రయత్నంలో మన ప్రభుత్వం ముందడుగు వేసింది. మోషన్‌ సెన్సర్లు, రాడార్లు, రాత్రిపూట సైతం చూడగలిగే నైట్‌ విజన్‌ పరిజ్ఞానంతో కూడిన ఈ గోడ నిర్మాణానికి సంబంధించి పైలట్‌ ప్రాజెక్టును ఇప్పటికే జమ్ము లోని రెండు సెక్టార్లలో 5 కిలోమీటర్ల మేర చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. అక్కడ సఫలమైతే సరిహద్దు పొడవునా దీన్ని అమలు చేస్తామన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ల నడుమ 3000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పొడవునా చాలాచోట్ల ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కంచె ఉంది. దాంతోపాటే లేజర్‌ కంచెతో సరిహద్దును పటిష్ఠం చేస్తున్నారు. రూ.20 వేల కోట్లతో ‘కాంప్రహెన్సివ్‌ ఇంటిగ్రేటెడ్‌ బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఐబీఎంఎస్‌)’ పేరుతో చేపట్టిన ఈ కంచె పనితీరును అక్టోబరులో పరీక్షించనున్నట్టు హోం శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీకి చెందిన రక్షణ రంగ ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సంస్థ క్రాన్‌ సిస్టమ్స్‌ ఈ లేజర్‌ గోడ నిర్మాణంలో సాయం అందిస్తోంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఆ సంస్థ అభివృద్ధి చేసిన కవచ్‌ (కేవీఎక్స్‌) సిరీస్‌ లేజర్‌ గోడలను ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. కంటికి కనిపించని పరారుణ తరంగ కిరణాలను ప్రసరింపజేసే పరిజ్ఞానాన్ని, రాడార్‌, సోనార్‌, లేజర్‌ టెక్నాలజీలను ఇందులో వినియోగించారు. క్రాన్‌ సిస్టమ్స్‌తోపాటు దేశంలోని ఐఐటీలకు చెందిన ప్రతిభావంతుల సూచనలను.. ఇజ్రాయెల్‌కు చెందిన వైమానిక దళ నిపుణుడు టామీ కాట్జెనెల్లెన్‌బోగెన్‌ సాయాన్ని కూడా తీసుకుంటున్నారు.

చొరబడితే అప్రమత్తం

 భారత సరిహద్దుల దిశగా వచ్చే చొరబాటుదారులను 3 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే థెర్మల్‌ ఇమేజర్లు ఈ కాంప్రహెన్సివ్‌ ఇంటిగ్రేటెడ్‌ బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ (సీఐబీఎంఎస్‌)లో ఉన్నాయి.

రాత్రివేళల్లో ఎవరైనా చొరబడితే.. ఇన్‌ఫ్రారెడ్‌ ఇంట్రూడర్‌ అలారమ్‌ బీఎస్‌ఎఫ్‌ జవాన్లను అప్రమత్తం చేస్తుంది.

మనిషికి జంతువుకు మధ్య తేడాలను కూడా ఈ వ్యవస్థ గుర్తించగలదు.

కిలోమీటరు పరిధిలో చొరబాట్లను పసిగట్టడానికి ఐదు కేవీఎక్స్‌ సిరీస్‌ లేజర్‌ కంచెలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కంచెలు పనిచేయాలంటే 24 గంటల విద్యుత్‌ సరఫరా ఉండాలి.

ఒకవేళ కరెంటు పోతే.. యూపీఎస్‌ (అన్‌ఇంటరెప్టెడ్‌ పవర్‌ సప్లై) సాయంతో మరో 8 నుంచి 12 గంటలపాటు రక్షణనిస్తాయి. ఈలోగా కరెంటు సరఫరా పునరుద్ధరించాల్సిందే.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)