Home News “ముస్లిం – దళిత్‌ భాయీ హై!”, మరోసారి తెరపైకి వస్తున్న జాతివ్యతిరేక వ్యూహం

“ముస్లిం – దళిత్‌ భాయీ హై!”, మరోసారి తెరపైకి వస్తున్న జాతివ్యతిరేక వ్యూహం

0
SHARE

హిందూ షెడ్యూల్డు కులాలవారితోబాటు ముస్లింలు కూడా అణగారిన వర్గాలవారేనని, ముస్లింలకు, షెడ్యూల్డు కులాలకు ఒకేవిధమైన సమస్యలున్నాయని, `మేమూ మీరూ భాయి- భాయి’ అంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఆలిండియా మజ్లిస్‌-ఎ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ పార్టీ నాయకులైన ఒవైసీ సోదరులు కొత్త పాత అందుకున్నారు. హిందువుల్లో షెడ్యూల్ కులాలను, ముస్లిములను  ఒకే గాటన కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా షెడ్యూల్డు కులాలవారిలో అయోమయం సృష్టించి వారు శతాబ్దాలుగా ముస్లింలతో ఎంతో సన్నిహితంగా వుంటున్నట్లు నమ్మించేందుకు పన్నిన వ్యూహమిది.

భాగమతి షెడ్యుల్డు కులానికి చెందిన యువతి అనీ, ఆమె కులీ కుతుబ్‌ షాను వివాహమాడిందని, ఈ క్రమంలోనే భాగ్యనగర్‌ అనే పేరు వచ్చి ఆ తర్వాత హైదరాబాద్‌ అయిందంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఒక సీనియర్‌ ప్రొఫెసరు డప్పుకొడుతూ తిరుగుతున్నాడు. షెడ్యుల్డు కులాలకు ముస్లింల మధ్య వివాహాలు సాధారణమేనని, ఇవి ఇలాగే కొనసాగాలని కూడా ఆయన ఒక వాదం చేస్తున్నాడు. ఇదంతా పచ్చి అబద్ధం. ఇదొక దుష్ప్రచారోద్యమం.

దేశవిభజన ముందునాటి వ్యూహమే మళ్ళీ అమలు :

1947కు ముందు ముస్లిం లీగు ఇలాంటి ప్రయత్నాలే చేసిందని ఓసారి గుర్తు చేసుకోవటం మంచిది. ఆనాటి ముస్లింలీగు ప్రచారానికి లొంగిపోయిన వారు తరువాత రోజుల్లో పశ్చాత్తాప పడ్డారు. పాకిస్తాన్‌ ఏర్పాటు లక్ష్యాన్ని సాధించగానే ముస్లింలీగుకు షెడ్యూల్డు కులాల హిందువులతో పని లేకుండాపోయింది. ఏరుదాటి తెప్ప తగలేసినట్లుగా  దారుల్‌ ఇస్లాం ఉద్యమమంటూ అన్నివర్గాల హిందువులను ఊచకోత కోశారు.

షెడ్యూల్డు కులాల సముద్ధరణ కోసం కృషి చేసిన ప్రముఖ నాయకుల్లో ఒకడైన జోగేంద్రనాథ్‌ మండల్‌ పాకిస్తాన్‌ (నేటి బంగ్లాదేశ్‌) ప్రభుత్వంలో చేరి తర్వాత మూడేళ్ళలోగానే రాజీనామా చేశాడు. హిందువులు, ప్రత్యేకించి ‘ముస్లింలు-దళితుల ప్రయోజనాలు ఒకటే’ననే ప్రచారాన్ని నమ్మి దారి తప్పుతున్న హిందువులు, పాకిస్తాన్‌ ప్రధానమంత్రికి  మండల్‌ వ్రాసిన లేఖను పూర్తిగా చదవాలి.

నేను ముస్లింలీగ్‌తో సహకరించి పనిచేసేందుకు పురికొల్పిన ప్రధాన ఆశయాల్లో మొదటిది బెంగాల్‌లోని ముస్లింల, అలాగే షెడ్యూల్డు కులాల ఆర్థిక ప్రయోజనాలు. ఇవి రెండు వేరువేరు కావు.

ముస్లింలకు, షెడ్యూలు కులాలకు సమాన ఆశయాలు వున్నాయంటూ అప్పట్లో ఇదేవిధమైన ప్రచారం జరిగివుంటుందనేది స్పష్టం. హిందువుల్లో చీలిక తెచ్చేందుకు ఆనాటి శక్తులు చేసిన ప్రయత్నమిది. జిన్నా ‘ప్రత్యక్ష చర్య’ (Direct Action) పిలుపుతో చెలరేగిన ఘర్షణ జ్వాలలు దేశాన్ని చుట్టుముట్టిన రోజులవి. అయినప్పటికీ శాంతిని ఆశిస్తూ మండల్‌ ముస్లింలీగ్‌ను సమర్థించాడు. మండల్‌ ఇలా వ్రాస్తాడు.

”… కలకత్తా మారణహోమం తర్వాత 1946 అక్టోబరులో నౌఖాలీ హింసాకాండ చెలరేగింది. అక్కడ షెడ్యూల్డు కులాలవారితో సహా హిందువులను చంపారు, వందలాది మందిని ఇస్లాంమతంలోకి మార్చారు. హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేశారు, అపహరించారు. నా వర్గానికి చెందిన వారు కూడా ఆస్తులను, ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ ఘటనలు జరిగినదే తడవుగా నేను తిప్పెరహ్‌, ఫేనీలకు వెళ్లి ఘర్షణల బారినపడ్డ ప్రాంతాలను చూశాను. హిందువులు పడిన భయానకమైన కష్టాలను చూచి నేను దుఃఖోద్వేగానికి లోనైనాను. అయినప్పటికీ ముస్లింలీగ్‌తో సహకార విధానాన్ని కొనసాగించాను…”

పాకిస్తాన్‌లో హిందువులను, ముస్లింలను సమానంగా చూస్తామని జిన్నా వాగ్దానం చేశాడు. ముస్లింలీగ్‌ వంటి పార్టీలు ఎలాంటి భావజాలంతో పనిచేస్తాయో మండల్‌ ఏమాత్రం గ్రహించలేక పోయాడు. తరువాత మండల్‌ ఇంకా ఇలా వ్రాస్తాడు.

”…. నేను బెంగాల్‌ విభజనకు వ్యతిరేకినని కూడా ఈ సందర్భంగా చెప్పటం సముచితం. ఈ విషయంలో చేపట్టిన ఉద్యమంలో అన్నివైపుల నుండి ప్రతికూలతను మాత్రమేగాక చెప్పరాని దూషణను, అవమానాన్ని, అగౌరవాన్ని నేను ఎదుర్కొవలసి వచ్చింది. ఈ ఇండో- పాకిస్తాన్‌ ఉపఖండానికి చెందిన 32 కోట్లమంది హిందువులు నాకు దూరంగా తొలగిపోయి నన్ను హిందువులకు, హిందూమతానికి శత్రువుగా తూలనాడినప్పటికీ నేను మాత్రం పాకిస్తాన్‌ పట్ల నా విధేయత విషయంలో మొక్కవోని పట్టుదలతో నిలిచిన రోజులను అమిత పశ్చాత్తాపంతో స్మరించుకొంటున్నాను. నా విజ్ఞప్తికి పాకిస్తాన్‌లోని 70 లక్షల దళితులు షెడ్యూలు కులాలవారు తక్షణమే ఉత్సాహంతో ప్రతిస్పందించినందుకు నేను కృతజ్ఞుణ్ణి. వారు నాకు తమ సంపూర్ణమైన మద్దతును, సానుభూతిని, ప్రోత్సాహాన్ని ఇచ్చారు….”

అయినప్పటికీ మూడేళ్ళలోనే మండల్‌ రాజీనామా చేశాడు. ఎందుకని?

పాకిస్తాన్‌ నిర్మాణం అనే తమ లక్ష్యాన్ని సాధించడంతోనే ముస్లింలీగ్‌వారు తమ హిందూ ప్రక్షాళన కార్యానికి నడుం బిగించారు. ‘ముస్లిం- దళిత్‌ భాయి భాయి’ అనే నినాదాన్ని చెత్తబుట్టలోకి విసిరి కొట్టారు. దళితులు హిందువులే, కనుక కాఫిర్లే లేదా అవిశ్వాసులే కదా! హిందువులు – అందునా ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలవారు ఎలాంటి హింసకు, దారుణాలకు గురయ్యారో మండల్‌ గుర్తు చేస్తున్నాడు:

”సిల్హట్‌ జిల్లాలోని హబీబ్‌ఘర్‌కు చెందిన అమాయకులైన హిందువుల మీద, ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలమీద పోలీసులు, సైనికులు జరిపిన దాష్టీకాలను వివరించాల్సిన అవసరముంది. పోలీసులు, స్థానిక ముస్లింలు అమాయకులైన స్త్రీ పురుషులను పాశవికంగా చిత్ర హింసలు పెట్టటం, కొందరు స్త్రీలపై అత్యాచారం చేయటం, వారి ఇళ్ళపై దాడులు చేయటం, ఆస్తులను లూటీ చేయటం చేశారు. ఆ ప్రాంతంలో మిలిటరీ పికెట్లను పెట్టారు. మిలిటరీ వారు హిందువులను పీడించి వారి ఇళ్ళలోని వస్తు సామగ్రిని బలవంతంగా లాక్కొని పోవటం మాత్రమే కాదు, తమ పశువాంఛలను తీర్చుకునేందుకు హిందూస్త్రీలను రాత్రివేళ శిబిరాలకు బలవంతంగా రప్పించుకున్నారు కూడాను.

లూటీ చేసేవారికి అధికారుల అండదండలు:

హిందువుల దుకాణాలను, ఇళ్ళను దహనం చేయటం, లూటీ చేయటం, హిందువులను కనిపించిన వారిని కనిపించినట్లు చంపివేయటం వంటి అకృత్యాలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో అడ్డుఅదుపు లేకుండా సాగాయి. పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలోనే దహనాలు, లూటీలు జరిపినట్లు కొందరు ముస్లింల నుంచి కూడా నాకు సాక్ష్యాలు లభించాయి. హిందువులకు చెందిన నగల దుకాణాలను పోలీసు అధికారుల సమక్షంలోనే లూటీ చేశారు. ఆ అధికారులు లూటీని అడ్డుకోకపోవటమేగాక దోపిడిదారులకు సలహాలిస్తూ, ఎటువెళ్ళాలో దిశానిర్దేశం చేస్తూ సాయం చేశారు… నేను స్వయంగా చూచినది, ప్రత్యక్ష సాక్షుల నుంచి తెలుసుకున్న విషయాలు  దిగ్భ్రాంతి కలిగించేవిగాను, హృదయ విదారకంగాను ఉన్నాయి. నేడు తూర్పుబెంగాల్‌ పరిస్థితి ఏమిటి? దేశ విభజన జరిగిన నాటి నుంచి దాదాపుగా యాభై లక్షల మంది హిందువులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు.

తూర్పుపాకిస్తాన్‌ సంగతి ప్రక్కనబెట్టి పశ్చిమ పాకిస్తాన్‌ విషయం, విశేషించి సింధ్‌ విషయం చూద్దాం. దేశవిభజన తర్వాత పశ్చిమ పంజాబ్‌లో సుమారుగా ఒక లక్షలమంది షెడ్యూల్డు కులాల వుండేవారు. వీరిలో అధిక సంఖ్యాకులను ఇస్లాంలోకి మతం మార్చారనేది గమనించాలి. షరియత్‌ ఏలుబడిలోని ఆ దేశంలో ముస్లింలు మాత్రమే పాలకులు కాగా హిందువులు తదితర మైనారిటీలు తమ రక్షణ కోసం ఖరీదు చెల్లించవలసిన జిమ్మీలు… ఈ విషయాలన్నీ ఇతరులకన్నా మీకే బాగా తెలుసు…”

ఈ లేఖ పూర్తిపాఠం తథాగత రాయ్‌ రచించిన “My People Uprooted” లో కూడా ఉంది.

హిందూసమాజం గతంలో ఎన్నో దాడులను ఎదుర్కొంది. ఏ సమాజంలోనైనా వున్నట్లే మనకూ మనవంతు బలహీనతనలు వున్నాయి. ఈ బలహీనతలను అధిగమించడానికి సమాజం ఎన్నో సందర్భాలలో సంస్కరణాత్మక చర్యలు చేపట్టింది. ఆ దిశగా మనం సానుకూల ప్రయత్నాలను కొనసాగిస్తూ వుండాల్సిందే. అదే సమయంలో వర్గాల మధ్య పరస్పర విద్వేషాన్ని వ్యాప్తి జేస్తూ సమాజంలో చీలికలు తెచ్చేందుకు లేదా ఒక వర్గం మీద మరో వర్గాన్ని ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తూ తద్వారా తమ స్వార్థప్రయోజనాలను సాధించుకునేందుకు ప్రయత్నించే జాతి వ్యతిరేక శక్తులపట్ల మనం అప్ర మత్తంగా వుండాలి.

మనమంతా ఒకే శక్తిగా లేచి నిలిచి ఈ దుష్ట వ్యూహాలను భగ్నం చేయాలి.

-ఆయూష్‌

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here