Home Interviews ముస్లిం దేశాల్లోనే ముస్లింలకు భద్రత లేదు – సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ ఇంటర్వ్యూ 

ముస్లిం దేశాల్లోనే ముస్లింలకు భద్రత లేదు – సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ ఇంటర్వ్యూ 

0
SHARE

తన జాతీయవాద ధోరణిని ప్రదర్శించడంలో ఏమాత్రం సంకోచించని ఇస్లామిక్ పండితుడు, ప్రముఖ న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తం చేస్తుంటారు. తన బంధువు, నటుడు అయిన నసిరుద్దీన్ షా `అసహిష్ణుత’ గురించి మళ్ళీ చర్చ ప్రారంభించాలని ప్రయత్నించినప్పుడు రిజ్వాన్ అహ్మద్ స్పష్టంగా దానిని వ్యతిరేకించారు. భారత దేశాన్ని గురించి అపోహలు, విమర్శలు ప్రచారం చేయడానికి సర్వత్ర పోటీ సాగుతున్న సమయంలో రిజ్వాన్ మాత్రం హిందూ – ముస్లిం సంబంధాల గురించి సానుకూలమైన దృక్పధాన్నే వ్యక్తం చేశారు –

ప్ర. అసహిష్ణుత గురించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. నసిరుద్దీన్ షా వ్యాఖ్యలతో `అసహిష్ణుత బృందం’ మళ్ళీ బలం పుంజుకున్నారు. కొందరైతే ఏకంగా హిందూస్థాన్ కంటే పాకిస్థాన్ సురక్షితమైనదంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు?
జ. ఇతర మతాలతో కలిసి శాంతియుతంగా జీవించలేని ముస్లింల ధోరణే భారత్ లో అసహిష్ణుతకు మూల కారణం. 1947 రక్తసిక్త దేశ విభజన తరువాత భారత్ సెక్యులర్ దేశంగా ఉండాలని ఇక్కడ అందరూ నాయకులు కోరుకున్నారు. హిందువులు కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. అందువల్లనే ఇక్కడ అద్భుతమైన మతసామరస్యం వెల్లివిరిసింది. కానీ అందుకు ప్రతిఫలంగా ముస్లింలు హిందువులకు ఏమిచ్చారు? ఏమీలేదు. హిందువులు ఆధునిక చట్టాలు చేసుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ ధోరణి పుణ్యమాని ముస్లిములకు ప్రత్యేక సదుపాయాలు, హక్కులు లభించాయి. అప్పటినుంచి ముస్లింలు షాబాను కేసు కావచ్చును, కాశ్మీరీ పండిట్ లను వారి స్వస్థలం నుంచే తరిమివేయడం కావచ్చును, బంగ్లాదేశ్ కు చెందిన అక్రమ చొరబాటుదారులు కావచ్చును, ఇలా అనేక సందర్భాల్లో  తమ క్రియాశీల ప్రతిస్పందనను చూపడంలో విఫలమయ్యారు. దీనితో `సెక్యులరిజం పేరిట తమకు అన్యాయం జరుగుతోందని’ హిందువులలో అసంతృప్తి ప్రారంభమయింది. అది క్రమంగా పెరిగి హిందువులు తమ అభిప్రాయాన్ని కచ్చితంగా, గట్టిగా వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దానినే ఇప్పుడు అందరూ `అసహిష్ణుత’ అంటున్నారు.  ముస్లింల వంటి మైనారిటీ వర్గాన్ని ప్రశ్నించడం లేదా వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళని బాఃద్యులను చేయడం లేదా భారతీయులుగా తమ బాధ్యత ఎరిగి ప్రవర్తించాలని ముస్లిములకు గుర్తుచేయడం వంటివి నేడు భారత్ లో అసహిష్ణుత. ఇది బూటకపు సెక్యులరిస్ట్ లు, పిడివాద ముస్లింలు ప్రచారం చేస్తున్న ధోరణేకానీ మరొకటికాదు. ముస్లింలను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని కాఫిర్ లని ముద్ర వేస్తున్నారు. నిజానికి అసహిష్ణుత అనేది ఎక్కడ లేదు. ఇది కేవలం బూటకపు సెక్యులరిస్ట్ లు, పిడివాద ముస్లింలు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే. నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితమైనవి, అర్ధంలేనివి.

ప్ర. గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారమవుతున్న అసహిష్ణుత, అభద్రతల గురించి మీరేమంటారు?
జ. మైనారిటీల పేరుతో ముస్లిములు సంతుష్టీకరణకు, తాయిలాలకు బాగా అలవాటుపడ్డారు. ఈ తాయిలాల గురించి, సంతుష్టీకరణ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళు `అసహిష్ణుత పెరిగిపోతోంది’ అంటూ గగ్గోలు పెడతారు.

ప్ర. చాలామంది ముస్లిములు చెపుతున్నట్లుగా భారత్ లో ముస్లిములకు భద్రత లేదని ముస్లిమైన మీరు కూడా అనుకుంటున్నారా?

జ. బెన్నహల్ సొరంగం దాటి కాశ్మీర్ లోయలోకి వెళ్ళినప్పుడే ముస్లింలకు `భద్రత’ లేమి కనిపిస్తోంది. ముస్లిములు అధికసంఖ్యాకులుగా కలిగిన ముస్లిం దేశాల్లోనే వారికి భద్రత లేదు. దురదృష్టవశాత్తు ఏ దేశాల్లోనైతే ముస్లిములు మైనారిటీలో అక్కడ వాళ్ళు తమ `మతపరమైన ఆధిక్యత’ పేరుతో వేర్పాటువాదానికి పాల్పడి, `ఇతరులు’ తమకు అన్యాయం చేస్తున్నారని రాగాలు తీస్తారు.

ప్ర. మీరు సామాజిక మాధ్యమాలలో మీరు ఇస్లాం లోని నకారాత్మక అంశాలను లేదా ఏదైనా చట్టాన్ని విమర్శించినప్పుడు అనేకమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడటంపట్ల ఏమంటారు?
జ. ఇలా కొందరు అసలు ఇస్లాం సారాంశాన్ని మరచిపోయి మాట్లాడుతుంటారు. అరేబియా వంటి అజ్ఞాన భూమిలో ఇస్లాం పుట్టింది. అక్కడి ప్రజలను సంస్కరించడానికి వచ్చింది. 1400ఏళ్లక్రితం ఇస్లాం అత్యంత సంస్కరణ రూపంలో వచ్చిందని వీళ్ళు అనుకూకుంటున్నారు. కాబట్టి ఇస్లాంలో ఇక సంస్కరణకు తావులేదని, అలా సంస్కరిస్తే అది ఇస్లామే కాకుండా పోతుందన్నది వీరి అభిప్రాయం. ఇందులో భావప్రకటన స్వాతంత్ర్యానికి అవకాశం లేదని వారనుకుంటారు. జిహాద్ గురించిన 12,13 శతాబ్దాలనాటి అర్ధాన్నే ఇప్పటికీ అన్వయించాలనుకుంటున్నారు. ముస్లింలను ఎవరైనా ప్రశ్నించినా, విమర్శించినా వారిని కాఫిర్ లని ముద్రవేస్తున్నారు.

ప్ర. తలాక్ బిల్లు అత్యవసరమని ఎన్డీయే ప్రభుత్వం అంటూంటే విపక్షాలు, కొన్ని ముస్లిం సంస్థలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మీరేమంటారు?
జ. తలాక్ పద్దతి ఇస్లాం మతంలో భాగం కాదు. అది కేవలం కొందరు ఆచరించడం వల్ల ప్రాచుర్యం పొందింది. అందుకనే అనేక ముస్లిం దేశాల్లో కూడా దానిని నిషేధించారు. 90శాతం ముస్లిం మహిళలు, చాలామంది పురుషులు ఈ తలాక్ పద్దతి సరైనది కాదని భావిస్తారు. కానీ నరేంద్ర మోదీపట్ల ముస్లింలలో వ్యతిరేకత ఎంతబలంగా పాటుకుపోయిందంటే తలాక్ పద్దతిపై మోదీ అనుసరిస్తున్న వైఖరిని వాళ్ళు ప్రశంసించలేకపోతున్నారు. బిల్లును సమర్ధిస్తే తాము మోడీని సమర్ధించినట్లవుతుందని చాలామంది మౌనంవహిస్తున్నారు.

మోదీ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని, వారిని జైళ్ళలో కుక్కుతారని ఆరోపిస్తున్నవారు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి తలక్ పద్దతి భారత్ లో ఇక ముందు ఉండదని, షరియా ప్రకారం అది చెల్లుబాటుకాదని ప్రకటించాలి. కానీ వాళ్ళు అలా చేయరు ఎందుకంటే మోదీ విఫలమయ్యారని చూపదమే వారికి ముఖ్యం.

ప్ర.  స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళకు పైగా గడుస్తున్నా ముస్లింలు ఇప్పటికీ వెనుకబడిన వర్గంగానే ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటారు?
జ. ముస్లింల వెనుకబాటుతనానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి , ముస్లిం ఉలేమా, మరొకటి విద్యావంతులైన ముస్లింలు. విద్యావంతులైన ముస్లింలు కూడా మతాధికారులతో కలిసిపోయి సంస్కరణలకు మద్దతుయివ్వడంలేదు. ఈ విద్యావంతులైన, మేధావులైన ముస్లింలు ఇతరులను ప్రధాన స్రవంతిలో కలిసే విధంగా చేసిఉంటే అప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ ఈ మేధావులు, మతాధికారులు కలిసే పనిచేస్తున్నారు. అందుకనే నా ప్రకారం ముస్లిం సంస్కరణ అంటే ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ల్యాప్ టాప్ పట్టుకోవడంకాదని నేను అంటూంటాను.

రాజకీయపార్టీలన్నీ ముస్లింలను ఉపయోగించుకుని `రైట్ వింగ్’ను విమర్శిస్తున్నాయి. భారత్ లో ముస్లింలకు, ఇస్లాం కు భద్రత లేదని పదేపదే చెప్పడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా ముస్లింలలో భయాన్ని, ఆందోళనను కలిగించడానికి ప్రయత్నించాయితప్ప వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తేవాలని చూడలేదు.

ప్ర. భారత్ మాతాకి జై, వందేమాతరం అని అనడం భారతీయ ముస్లింలకు కష్టమని అంటూ ఉంటారు. ముస్లిం నాయకులు, సంస్థలు తాము అలా అనమని బహిరంగంగానే చెపుతుంటారు.
జ. భారత్ అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదు. అది ఒక సంప్రదాయానికి, సిద్ధాంతానికి నెలవు. సత్యయుగం నుంచి ఇప్పటివరకు నాగరకత, సంస్కృతి, సంప్రదాయం, భాషలు, పూర్వజులు మొదలైనవి అన్నీ  కలిపితే భారత్ అవుతుంది.

భారత్ మాతాకి జై, వందేమాతరం అని అంటే తాము భారతీయతను అంగీకరించినట్లవుతుందని ముస్లిం మేధావులు, మతాధికారులు అనుకుంటుంటారు. కానీ అలా చేయకుండా వాళ్ళు అరబ్ సిద్ధాంతానికి, ఏ జాతీయతకు కట్టుబడని ఉమ్మాగా (ఒక వర్గంగా) ఉండాలన్న ధోరణికి కట్టుబడినట్లవుతోంది.

ప్ర. మోదీ ప్రభుత్వం ముస్లిం వ్యతిరేకి అని అనేకమంది ఆరోపిస్తుంటారు. ఇందులో ఎంత నిజం ఉందనుకుంటున్నారు?
జ. ముస్లిం సంతుష్టీకరణకు పాల్పడని, ప్రత్యేక సదుపాయాలు కల్పించని ఎవరినైనా ఇలాగే ముస్లిం వ్యతిరేకి అని ముద్ర వేస్తారు.

ప్ర. అయోధ్యలో రామ మందిరం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జ. రామ మందిరం గురించి నా తోటి ముస్లిం సోదరులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. `రాముడు ఎక్కడ పుట్టాడు’ అంటూ అనవసరమైన వాదోపవాదాలకు దిగకూడదని వారిని కోరుతున్నాను. బాబ్రీ కట్టడం కింద మందిరం ఉండేదని పురావస్తు సాక్ష్యాధారాలు ఎప్పుడైతే లభ్యమయ్యాయో అప్పుడే ముస్లింలు బేషరతుగా ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించి ఉండాల్సింది.

ప్ర. ఆర్ ఎస్ ఎస్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జ. ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడు వచ్చింది? 1906లో ముస్లిం లీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది; 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు; 1917 ఖిలాఫత్ ఉద్యమం; 1919-1924 మోప్లా మొదలైన మతకలహాలు; 1925లో ఆర్ ఎస్ ఎస్ స్థాపన.

1947 నుంచి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆర్ ఎస్ ఎస్ ప్రజలను ఆదుకుంది. అలా ఆదుకునేప్పుడు హిందువులెవారు, ముస్లిములెవారు అని చూడలేదు. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ముస్లింలు, ఆర్ ఎస్ ఎస్ కలిసి రాజకీయ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ కాంగ్రెస్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి మతకలహాలు పెరిగిపోయాయి. ఆర్ ఎస్ ఎస్, ముస్లింల మధ్య దూరం పెరిగింది. కానీ ఎప్పుడైతే ముస్లింలు ఆర్ ఎస్ ఎస్ ను అర్ధం చేసుకుంటారో అప్పుడు బూటకపు సెక్యులరిజం మాయమవుతుంది. గత 70ఏళ్లుగా దీనిని ఆధారం చేసుకునే అనేక రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. అందుకనే అవి ఎప్పుడు ఆర్ ఎస్ ఎస్, ముస్లింల మధ్య అగాధాన్ని సృష్టించడానికి, కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటాయి.

ప్ర. భారత్ లో హిందూ – ముస్లిం సామరస్యతకు మార్గం ఏమిటి?
జ. గత నాలుగేళ్ల కాలంలో హిందువులు, ముస్లింల మధ్య పొరపొచ్చాలకు కారణం ముస్లిం మతాధికారులు, బూటకపు సెక్యులర్ పార్టీలు, ముస్లిం మేధావులు, హిందువులలో కొందరు పిడివాదులు. గోరక్ష అంశం మూలంగా కొందరు చనిపోవడం జాతీయవాద ముస్లింలలోనేకాక ప్రపంచవ్యాప్తంగా ఆందోళన, సందేహాలను కలిగించింది. ఈ విషయంలో బిజెపి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి ఉండాల్సింది.