Home News అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నాంపల్లి న్యాయస్థానం తుదితీర్పు

అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నాంపల్లి న్యాయస్థానం తుదితీర్పు

0
SHARE

మజ్లిస్‌ శాసన సభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్‌ పహిల్వాన్‌ సహా పది మంది నిందితులను నాంపల్లి 7వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు గురువారం నిర్దోషులుగా ప్రకటించింది. మరో నలుగురు నిందితులకు పదేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించింది.ఆరేళ్ల విచారణ తర్వాత న్యాయమూర్తి టి.శ్రీనివాసరావు తుదితీర్పును వెల్లడించారు.

ఏప్రిల్‌ 30, 2011న హైదరాబాద్‌ పాతబస్తీలోని కేశవగిరి బార్కాస్‌-బాలాపూర్‌ రహదారిపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై అతని ప్రత్యర్థి మహ్మద్‌ పహిల్వాన్‌ సహా కుటుంబ సభ్యులు క్రికెట్‌బ్యాట్లు, మారణాయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అంగరక్షకుడు, అనుచరులు ప్రతిదాడికి దిగడంతో అక్బరుద్దీన్‌ను తుపాకితో కాల్చారు. 3 తూటాలు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. అక్బరుద్దీన్‌ అంగరక్షుడు తుపాకితో కాల్చడంతో మహ్మద్‌ఇబ్రహీం బిన్‌ యూనుస్‌ యాఫై(25) మృతి చెందాడు. పోలీసులు 15 మందిని నిందితులుగా గుర్తించారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌ఠాణా నుంచి విచారణను సీసీఎస్‌కు అప్పగించారు. విచారణ అనంతరం హసన్‌బిన్‌ ఓమర్‌ యాఫై(ఎ-2), అబ్దుల్‌ బిన్‌ యూనుస్‌ యాఫై(ఏ-3),అవద్‌ బిన్‌ యూనుస్‌ యాఫై(ఏ-5), మహ్మద్‌ బిన్‌ సాలే వాహ్‌(ఏ-12)లకు 10 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.

ప్రధాన నిందితుడు మహ్మద్‌ బిన్‌ ఓమర్‌ అలియాస్‌ మహ్మద్‌ పహిల్వాన్‌, యూనుస్‌ బిన్‌ ఓమర్‌ యాఫై, ఈసా బిన్‌ యూనుస్‌ యాఫై, యాహియా బిన్‌ యూనుస్‌ యాఫై, ఫైజల్‌ బిన్‌ అహ్మద్‌ యాఫై, ఫజల్‌ బిన్‌ అహ్మద్‌ యాఫై, బహదూర్‌ ఆలీఖాన్‌, అసిఫ్‌ బిన్‌ యూనుస్‌ యాఫై, సైఫ్‌ బిన్‌ హుస్సేన్‌ యాఫై, మహ్మద్‌ అమీరుద్దీన్‌లను నిర్దోషులుగా ప్రకటించించారు. సంఘటనా స్థలంలో తీసిన వీడియో ఆధారంగా, నిందితులకు న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. ప్రధాన నిందితుడిని నిర్దోషిగా ప్రకటించడంతో తీర్పుప్రతి అందిన అనంతరం అప్పీల్‌కు వెళ్లాలని హైదరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. నిందితుల్లో ఒకరు ఇద్దరు మినహా అందరూ ఆరేళ్లుగా చర్లపల్లి కారాగారంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.

(ఈనాడు సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here