Home News గురుకులాల్లో స్వేరోల కార్యకలాపాలపై దర్యాప్తుకు ఆదేశాలు

గురుకులాల్లో స్వేరోల కార్యకలాపాలపై దర్యాప్తుకు ఆదేశాలు

0
SHARE

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో స్వేరోల కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ అధ్యక్షులు ప్రియాంక్ కానుంగో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో స్వేరోల పేరిట ప్రయివేట్ వ్యక్తుల పెత్తనంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన ‘స్వేరోస్’ అనే ప్రయివేట్ సంస్థ ఆధ్వర్యంలో టెండర్ల విషయంలో అక్రమాలే కాకుండా అక్కడ విద్యనభ్యసిస్తున్న పిల్లలపై అన్యమత భవనాలు బలవంతంగా రుద్దుతున్న విషయం కూడా చాలా కాలంగా కూడా ప్రచారంలో ఉంది. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠ‌శాల‌లు, క‌ళశాలలు న‌డుస్తున్నాయి. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికి వ‌ర్గాల‌కు చెందిన అనేక విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. అయితే ఈ పాఠ‌శాల‌ల‌కు కార్య‌ద‌ర్శిగా ఐ.పి.ఎస్ అధికారి ప్ర‌వీణ్‌కుమార్ గ‌త 7సంవ‌త్స‌రాలుగా కొన‌సాగుతుండటం,  గురుకులాల కార్య‌ద‌ర్శిగా ఉంటూనే ప్రైవేటుగా స్వేరొస్ అనే ఒక సంస్థ‌ను ఏర్పాటు చేయడం, గురుకులాల అంతర్గత విషయాల్లో స్వేరోలు కలుగజేసుకుంటుండటం, పాఠశాలల్లో జాతీయగీతం స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన ‘స్వేరో గీతం’ పిల్లలతో ఆలాపన చేయడం వంటి విషయాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది.
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చేసిన ఫిర్యాదుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఫిర్యాదులో పేర్కొన్న అభియోగాలు చాలా తీవ్రమైనవి అని, అవి రాజ్యాగంలోని 25, 28(3) అధికారణాలతో పాటు జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ల ఉల్లంఘ‌న‌ క్రిందకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో కమిషన్ పేర్కొంది.
రాష్ట్రం ప్రభుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకులాల్లో స్వేరోల కార్యకలాపాలపై విచారణ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, స్వేరో గ్రూపులకు ఉన్న సంబంధం గురించి వివరిస్తూ కూడా 10 రోజుల‌లో తమకు నివేదిక స‌మ‌ర్పించాల‌ని కమిషన్ ఆదేశించింది.

Source : Nijam Today