Home News లాక్-డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన తెలంగాణ గురుకుల సొసైటీపై చర్యలకు జాతీయ కమిషన్ సిఫార్సు

లాక్-డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన తెలంగాణ గురుకుల సొసైటీపై చర్యలకు జాతీయ కమిషన్ సిఫార్సు

0
SHARE

తెలంగాణ లో గురుకుల విద్యాలయాల సొసైటీ మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. గురుకుల విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినులను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ సమీపంలోని మొయినాబాదులో గల ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ కమిషన్ కు సమాచారం అందించింది. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆనంద్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజీలో 300 పైగా విద్యార్థినులు నిబంధన లకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. దీని మీద వివరణ కోరుతూ కమిషన్ ఛైర్ పర్సన్ ప్రియాంక్ కానుంగో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేశారు. కోవిడ్ సందర్భంగా విద్యాలయాలు మూసివేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను స్పష్టముగా ఉల్లంఘించినట్లు కమిషన్ స్పష్టం చేసింది.

కమిషన్ జారీ చేసిన నోటీసులోని ముఖ్యాంశాలు: 

1. ఆజాద్ కాలేజీ వివరాలు, మేనేజ్మెంట్ ఎవరు, ట్రస్టీలు ఎవరు, ఆ కాలేజీ విధివిధానాలు ఏమిటి?
2. ఆజాద్ కాలేజీలో రహస్యంగా ఉంచిన విద్యార్థుల వయసు, ప్రాంతం మొదలైన వివరాలు
3. ఆజాద్ కాలేజీలో రహస్యముగా ఉంచిన విద్యార్థుల ను ఏ ప్రాతిపదికన అక్కడ చేర్చుకోవడం జరిగింది..?
4. విద్యార్థులను కాలేజీలో రహస్యంగా ఉంచిన వ్యక్తులు ఎవరు, విద్యార్థులను  ఆ వ్యక్తులు ఏ రకంగా తరలించారు.?
5. ఆజాద్ కళాశాలలో ఉండేందుకు విద్యార్థులకు ఎలాంటి ఫీజులైనా కాలేజీకి చెల్లిస్తున్నారా? ఒకవేళ చెల్లించకపోతే వారికి నిధులు ఏ సంస్థ నుండి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు?
6. రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ని ఉంచడానికి విద్యా సంస్థలకు, హాస్టళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు ఏమిటి?
7. ఈ అంశంలో కోవిడ్ నియమ నిబంధనలకు  విరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తులు, బాధ్యులు ఎవరు? వారి వివరాలు ఏమిటి!

పైన కోరిన వివరాలు అన్ని 10 రోజులలోగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. నోటీసుకు కాపీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కు కూడా పంపారు. దీనితో పాటు ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయాల్సిందిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కి ఆదేశాలు జారీచేశారు. ఆజాద్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు పరిశీలించమని అఖిల భారతీయ సాంకేతిక విద్యామండలికి కమిషన్ సూచించింది.

Source : Nijam Today