Home News దేశ వ్యాప్తంగా PFI కార్యాల‌యాల‌పై NIA సోదాలు… 100మందికి పైగా అరెస్ట్‌

దేశ వ్యాప్తంగా PFI కార్యాల‌యాల‌పై NIA సోదాలు… 100మందికి పైగా అరెస్ట్‌

0
SHARE

ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కు చెందిన కార్యాల‌యాల‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం భారీ సోదాలు చేప‌ట్టింది. హైద‌రాబాద్‌తో స‌హా దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న PFI కార్యాల‌యాల‌పై సోదాలు నిర్వ‌హించి ఇప్ప‌టి వ‌ర‌కు 100కు పైగా PFI స‌భ్యుల‌ను అరెస్టు చేశారు.

తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 మందికి పైగా సభ్యులను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తాజాగా ఆ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనంలోకి తీసుకుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉంది. గురువారం ఉదయం చాంద్రాయణ గుట్ట చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్ హార్డ్ డిస్కులు, పెన్-డ్రైవులు, ఇతర ఎలక్ట్రానిక్ డేటా స్టోరేజ్ పరికరాలతో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

పాపులర్ ఫ్రంట్ సభ్యుల ఇళ్లలో తనిఖీలు:

తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఓవైపు ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోగా మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కి చెందిన అధికారులతో కలిసి దేశవ్యాప్తంగా సంస్థ సభ్యుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 106 చోట్ల దర్యాప్తు సంస్థ దాడులు చేసినట్లు సమాచారం. రాజస్థాన్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 4, ఢిల్లీలో 3, మహారాష్ట్రలో 20, ఉత్తరప్రదేశ్‌లో 8, తమిళనాడులో 10, అస్సాంలో 9, కేరళలో 22, కర్ణాటకలో 20, ఆంధ్రప్రదేశ్‌లో 5 మందిని అరెస్టు చేశారు.

ఆదివారం కూడా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌లోని వివిధ జిల్లాల్లో ఎన్‌ఐఏ దాడులు చేసింది. ఆ సమయంలో పీఎఫ్‌ఐ సభ్యులను విచారణకు తరలించారు. హింసను ప్రేరేపించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు సంస్థ దాడుల నిర్వ‌హించింది. నిజామాబాద్, జ‌గిత్యాల‌, కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని 38 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు 23 బృందాలు సోదాలు చేశారు.