Home News ఉగ్రవాద కరెన్సీ మార్గాలపై ఎన్‌ఐఏ నిఘా

ఉగ్రవాద కరెన్సీ మార్గాలపై ఎన్‌ఐఏ నిఘా

0
SHARE

ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, ఆ సంస్థలకు వస్తున్న విరాళాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. మూలాలపై గురిపెట్టినప్పుడే ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్న ఎన్‌ఐఏ.. ఉగ్రవాదసంస్థలకు విరాళాలు వచ్చే మార్గాలపై నిఘా పెట్టింది. అలాగే ఉగ్రవాదులుగా మారినవారి కుటుంబ స్థితిగతులపై కూడా ఎన్‌ఐఏ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

ఉగ్రవాదంపై నిఘా, దర్యాప్తు, కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు 2008లో కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేసింది.

దేశ భద్రతకు భంగం కలిగించే శక్తులు, విధ్వంసాలకు పాల్పడే వారి మార్గాలు, విధ్యంసాలకు ఉపయోగించే టెక్నాలజీ, ఆయుధాలు, యాంటీ హైజాకింగ్, నకిలీ నోట్ల తయారీ, చలామణి, ఉగ్రవాద చర్యలకు విరాళాల సేకరణ.. వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించడమే ప్రధానధ్యేయంగా ఎన్‌ఐఏ పనిచేస్తున్నది.

నిఘా కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్‌ఏడబ్ల్యూ), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌ఓ) వంటి సంస్థల సహాయం తీసుకుంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు కీలకం కావడంతో వాటిపై ఎన్‌ఐఏ ప్రత్యేక దృష్టి సారించింది.

ఏయే మార్గాల ద్వారా డబ్బు అందుతున్నది, విరాళాలు అందించే సంస్థలు, ఆయుధాలు ఎక్కడి నుంచి సమీకరించుకుంటున్నారు.. వంటి అంశాలపై ఎన్‌ఐఏ గురిపెట్టింది.

ఇందుకు సమాచారాన్ని సేకరించేందుకు ఇన్విస్టిగేషన్ డేటా మైనింగ్ (ఐడీఎం), అత్యాధునిక టెలీకమ్యూనికేషన్ సిస్టంను వినియోగించుకుంటున్నారు.

అంతర్జాతీయ నిఘా సంస్థలతోపాటు దేశంతో సంబంధం ఉండి ఇతర దేశాల్లో పట్టుబడుతున్న ఉగ్రవాదుల సమాచారం సేకరిస్తున్నారు. విదేశాల్లో ముద్రించి దేశంలోకి చేరవేస్తున్న నకిలీకరెన్సీపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది. నకిలీనోట్లను ఎక్కడ ముద్రిస్తున్నారు, ఎలా దేశంలోకి చేరవేస్తున్నారు, ఎవరు చలామణి చేస్తున్నారనే సమాచారం సేకరిస్తున్నారు. ఉగ్రవాద సానుభూతిపరులు కొందరు డబ్బు సేకరించి అందజేస్తున్నారన్న విషయం దృష్టికి రావడంతో ఉగ్రవాద కేసుల్లో అరెస్టయిన కుటుంబాలపై ఎన్‌ఐఏ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

(నమస్తే తెలంగాణ సౌజన్యం తో)