Home Interviews ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం ఉన్నచోట సంఘర్షణ ఉండదు

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం ఉన్నచోట సంఘర్షణ ఉండదు

0
SHARE
ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ డా.కృష్ణగోపాల్‌తో ముఖాముఖి

‘కొందరు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని కేవలం రాజకీయపు రంగుటద్దాల్లో నుంచి మాత్రమే చూస్తున్నారు. నిజానికి సంఘాన్ని జాతీయ, సాంస్కృతిక, సామాజిక దృక్పథం నుంచే చూడాలి. అప్పుడు మాత్రమే వారికి సంఘం అర్థమౌతుంది. అయితే వీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమాజం నమ్మడం లేదు. నిజంగా నమ్మే ఉంటే అసలు సంఘం ఇంతగా ఎదగగలిగేదే కాదు. అందరినీ కలుపుకు పోవడమే సంఘం పని. అందరితో కలసిమెలసి సామంజస్య పూరితంగా పనిని కొనసాగించడమే సంఘ లక్ష్యం. సంఘ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఎలాంటి సంఘర్షణా ఉండబోదు’ అంటున్నారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ సహ సర్‌ కార్యవాహ డా.కృష్ణగోపాల్‌.

డా.కృష్ణగోపాల్‌ చాలా కాలం పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్తరప్రదేశ్‌ క్షేత్ర ప్రచారక్‌గా, ఈశాన్య భారత క్షేత్ర ప్రచారక్‌గా పనిచేశారు. అక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌ పనిని వేగవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. డా.కృష్ణగోపాల్‌ ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ (ఆల్‌ ఇండియా జాయింట్‌ జనరల్‌ సెక్రటరి) గా బాధ్యతలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తున్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా జాగృతి ప్రతినిధి కె.రాకా సుధాకరరావు ఆయనతో ముచ్చటించారు. ఆ సంభాషణ సారాంశం జాగృతి పాఠకులకు ప్రత్యేకం.

ప్ర : రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పని ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సంస్థ ఎదుగుతోంది. కానీ అదే సమయంలో సంఘాన్ని వ్యతిరేకించే శక్తులన్నీ ఒక్కటౌతున్నట్టు కనిపిస్తోంది. సంఘ ఆలోచనా విధానాన్ని కలిసికట్టుగా వ్యతిరేకిస్తున్నాయి. సమకాలీన పరిస్థితులను మీరెలా చూస్తారు ?

జ : సంఘాన్ని వ్యతిరేకించేవారు స్థూలంగా రెండు రకాలు. మొదటి రకం రాజకీయ నాయకులు. వారు సంఘాన్ని రాజకీయ కోణం నుంచి మాత్రమే చూస్తారు. సంఘం ఎదిగితే తమకు నష్టమని వారు భయపడుతూంటారు. కానీ సంఘానికి రాజకీయాలు లేవు. సంఘం రాజకీయాలు చేయదు. అయితే హిందూ వ్యతిరేకత ఆధారంగా, మైనారిటీ బుజ్జగింపు ఆధారంగా మాత్రమే రాజకీయాలు చేసే పార్టీల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకమౌతోంది. నిజానికి గత రెండు మూడు దశాబ్దాలుగా వారి పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇది సంఘ సైద్ధాంతిక విజయం. రెండో వర్గం దేశాన్ని ముక్కలు చేయాలను కుంటున్న వ్యక్తులు, సంస్థలు. కమ్యూనిస్టులు, నక్సలైట్లు మొదలైన వారు ఈ దేశాన్ని బలహీన పరచాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విచ్ఛిన్నకర శక్తులు కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాయి. ఈ రెండు వర్గాలు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎదుగుదలను చూసి గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఈ రెండు వర్గాలు కాక మిగతా హిందూ సమాజానికి సంఘం పట్ల ఎలాంటి వ్యతిరేకతా లేదు. దేశభక్తులు, యావత్తు సమాజం సంఘం వెంటే ఉన్నారు. ఇది వాస్తవం.

ప్ర : వ్యతిరేక ప్రచారం చూసి స్వయంసేవకులు నిరాశా నిస్పృహలకు లోనౌతున్నారా?

జ : స్వయంసేవకులు ఎన్నడూ నిరాశకు లోనుకారు. నిజానికి స్వయంసేవకులను నిరాశ ఎన్నడూ ఆవరించే ప్రసక్తే లేదు. స్వయంసేవకులు తమ పనిని నిరంతరం సమధికోత్సాహంతో చేసుకుంటూనే పోతున్నారు. నిజానికి నేడు వాతావరణం చాలా ఉత్సాహవంతంగా ఉంది. మొత్తం ఈశాన్య భారతంలో ఈనాడు జాతీయ భావనలు వెల్లివిరుస్తున్నాయి. తమ ఉనికికి, మనుగడకి సవాళ్లు ఎదురవుతున్న సమయంలో వారికి సంఘం బాసటగా నిలిచింది. దీంతో వారు చాలా ఆనందంగా, అత్యంత ఉత్సాహంతో ఉన్నారు. త్రిపుర కావచ్చు, అసొం కావచ్చు, మణిపూర్‌ కావచ్చు. అక్కడ ప్రజలు సంఘ ఆలోచనా విధానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు.

మరో విషయం. ఈ సకారాత్మకమైన మార్పు రాజకీయ కారణాల వల్ల రాలేదు. బిజెపి బలపడుతున్నందువల్ల ఈ మార్పు రాలేదు. హిందూ సమాజంలో సమైక్యత వల్ల వస్తోంది. ఆశ్చర్యకరంగా గత ఏడు, ఎనిమిది దశాబ్దాలుగా చేసిన కఠోరమైన ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడు అత్యంత క్లిష్టమైన, సమస్యాగ్రస్తమైన ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నా యనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ప్ర : నేడు కూడా పలు చోట్ల ఎస్‌.సి., ఎస్‌.టి.లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌ వంటి రాష్ట్రంలోనూ ఎస్‌.సి.లపై దాడులు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంసేవకులు ఎలాంటి పాత్రను పోషించాలి ?

జ : ఇలాంటి సంఘటనలను ఎట్టి పరిస్థితిలోనూ సమర్థించే ప్రశ్నే లేదు. దీన్ని సంఘం చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. నిజానికి ఇలాంటి భౌతికదాడులు భారతీయ సంస్కృతి భావధారకు పూర్తిగా భిన్నం. ఇది మన సంస్కృతి కాదు. భౌతిక దాడులను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించేది లేదు. ముఖ్యంగా బలహీనులైన ఉపేక్షిత వర్గాలపై దాడి జరగడం వాంఛనీయం కాదు. ఇలాంటి దాడులను నివారించాలి, నిరసించాలి, నియంత్రించాలి. ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి.

ప్ర : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లో ఎస్‌.సి., ఎస్‌.టి.ల సంఖ్య తక్కువగా ఉందన్న వాదన వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు?

జ : సంఘం ఏనాడూ కులాల ఆధారంగా పనిచేయలేదు. స్వయంసేవకుల కులం ఏమిటన్నది ఏనాడూ అడిగే ప్రసక్తే లేదు. మొత్తం హిందూ సమాజంపైనే సంఘం దృష్టి ఉంటుంది తప్ప ఈ వర్గం, ఆ వర్గం అంటూ విభజించే ఆలోచనను సంఘం ఏనాడూ చేయలేదు. చేయబోదు కూడా. సంఘంలో ఫలానా కులం వారు ఎక్కువగా ఉన్నారు, తక్కువగా ఉన్నారు అని ఆలోచించడం ఆర్‌ఎస్‌ఎస్‌ మౌలిక సిద్ధాంతాలకే పూర్తిగా విరుద్ధం. సంఘం కులాలు, వర్గాల ఆధారంగా ప్రజలను విడదీసి చూడదు. సంఘంలో దశాబ్దాల తరబడి కలిసి పనిచేస్తున్నా ఎవరి కులం ఏమిటో మేమేనాడూ తెలుసుకునే ప్రయత్నం చేయం. అసలు సంఘంలో కులాల ప్రసక్తే ఉండదు. కులాల ఆధారంగా ఆలోచించే వాదన పూర్తిగా నిర్హేతుకం, నిరర్థకం. సంఘం ఎలాంటి తేడాలు, వైషమ్యాలూ లేకుండా యావత్‌ హిందూ సమాజాన్ని ఆత్మీయులుగా భావిస్తూ ముందుకు సాగుతుంది. సంఘంలో ఉపేక్షిత వర్గాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు ఉన్నారు. కానీ సంఘంలో వారిని విడిగా చూడటం, వారి గురించి విడిగా ఆలోచించడం జరగదు.

ప్ర : మీరు చాలాకాలం ఈశాన్య భారతదేశంలో పనిచేశారు. ఈశాన్య భారతదేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పని వేగంగా విస్తరిస్తోంది. కానీ దాదాపు నూటికి తొంభై తొమ్మిది శాతం క్రైస్తవులున్న మిజోరాం మాటేమిటి ? అక్కడ సంఘం పని ఎలా ఉంది ?

జ : మిజోరాంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ అత్యధికులు క్రైస్తవులుగా మారిపోయారు. పరంపరాగతంగా ఉన్న ప్రాచీన మత విశ్వాసాలను పాటించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొందరు బౌద్ధులు ఉన్నారు. ఐజాల్‌ వంటి నగరాల్లో మిగతా ప్రదేశాల నుంచి వెళ్లిన వారు కొందరు ఉన్నారు. హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న కారణంగా సంఘం పని విస్తరణ కూడా తక్కువే. అయితే మిజోరాంలో సేవాభారతి ద్వారా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర సేవికా సమితి ద్వారా మహిళా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగతా సంస్థల ద్వారా పలు రకాల పనులు జరుగుతున్నాయి. జాతీయ ఆలోచనా విధానాన్ని ఆధారం చేసుకుని మిజోల మధ్య కూడా సంఘం విజయవంతంగా పని చేస్తోంది.

ప్ర : రానున్న రోజుల్లో స్వయంసేవకుల సన్నద్ధత ఎలా ఉండాలి ? రానున్న రోజుల సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి సంసిద్ధత అవసరం ?

జ : రానున్న రోజుల్లో సంఘర్షణ పెరుగుతుందన్న వాదనను నేను అంగీకరించను. అసలు సంఘర్షణ అవసరమే లేదు. సంఘర్షణ జరగకూడదు కూడా. సంఘ బలం ఎంత పెరుగు తుందో సంఘర్షణ అంత తగ్గుతూ వస్తోంది. సంఘం ప్రభావం పెరిగే కొద్దీ విచ్ఛిన్న వాద శక్తులు బలహీన పడటం ఖాయం. స్వయంసేవకులు సామరస్య పూరితంగా పనిచేయాలి. అందరినీ కలుపుకు పోవడమే సంఘం పని. అందరితో కలసిమెలసి సామంజస్య పూరితంగా పనిని కొనసాగించడమే సంఘ లక్ష్యం. సంఘ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఎలాంటి సంఘర్షణా ఉండబోదు.

ప్ర : గత నాలుగైదేళ్లుగా దేశంలో మత ఘర్షణలు తగ్గాయి. మత కల్లోలాలు తగ్గాయి. ముస్లిం సమాజం లో ఏదైనా మార్పు వస్తోందనుకుంటున్నారా ?

జ : ముస్లిం సముదాయంలోనూ ఒక వర్గం క్రమేపీ నిలబడుతోందని మా నమ్మకం. వారిలోనూ జాతీయవాదులు క్రమేపీ బలపడుతున్నారనిపిస్తోంది. వారి బలం ఏ మేరకు పెరిగితే దేశానికి ఆ మేరకు మంచిది.

ప్ర : సంఘాన్ని విమర్శించే వారికి మీరేం సమాధానం చెబుతారు ?

జ : సంఘం పని నెమ్మదిగా పెరిగేది. ఇది హడావిడిగా జరిగే పని కాదు. ఇది విలువలతో కూడిన పని. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటుంది. పటాటోపానికి ఇక్కడ స్థానం లేదు. అదే విధంగా సంఘం పని రాజకీయ కార్యం కాదు. కొందరు సంఘాన్ని రాజకీయపు రంగుటద్దాల్లోనుంచి చూస్తున్నారు. సంఘాన్ని జాతీయ, సాంస్కృతిక, సామాజిక దృక్పథం నుంచే చూడాలని నేను అలాంటి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు మాత్రమే వారు సంఘాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు. సంఘం తాలూకు విరాట్‌ రూపాన్ని వారు అవగాహన చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయం. వీరు చేస్తున్న ప్రచారాన్ని సమాజం నమ్మడం లేదు. నిజంగా నమ్మే ఉంటే అసలు సంఘం ఇంతగా ఎదగగలిగేదే కాదు. ఒక వర్గం రాజకీయ నాయకులు, మీడియా సంఘం గురించి చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అనడానికి ఇదే ఉదాహరణ. సంఘం ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరుగుతోందంటే ప్రజలు సంఘాన్ని నమ్ముతున్నట్టే కదా!

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here