Home News పద్మశ్రీ టి.వి నారాయణ అస్తమయం

పద్మశ్రీ టి.వి నారాయణ అస్తమయం

0
SHARE

ప్రముఖ కవి, రచయిత, సామాజిక వేత్త, రాజకీయ వేత్త, జాతీయవాది పద్మశ్రీ టి.వి నారాయణ(97) గారు జనవరి 11, మంగళవారం ఉదయం కేర్ ఆస్ప‌త్రిలో తుది శ్వాస విడిచారు. స్వర్గీయ శ్రీ టి.వి నారాయణ గారు సామాజిక సమరసత వేదిక తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు డా.వంశ తిలక్ గారి తండ్రి గారు.

టి.వి నారాయ‌ణ గారు 1925 వ సంవత్సరంలో జూలై 26న జన్మించారు. మాజీ మంత్రి సదాలక్ష్మి గారు వీరి సతీమణి. నారాయ‌ణ గారు తన రచనలతో, బోధనలతో ఎందరో వ్యక్తులను ప్రభావితం చేసిన మహనీయుడు. రెండు తెలుగు రాష్ట్రాలలో విద్య, సామాజిక రంగాలల్లో సుపరిచితుడైన వ్య‌క్తి. తెలంగాణ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. పాఠశాల అద్యాపకుడుగా జీవితం ఆరంభించి, ఆ త‌ర్వాత జిల్లా విద్యాధికారిగా పనిచేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడి స్థాయికి ఎదిగారు.  1978లో హైదరాబాద్ కేంద్రంగా సేవాభారతి తొలిగా ఏర్పడినపుడు వీరు తొలి అధ్యక్షులు. (శ్రీ బండారు దత్తాత్రేయ కార్యదర్శి) 1978లో జరిగిన సంఘశిక్షావర్గ సర్వాధికారిగా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ నిర్వహణలో తూర్పుగోదావ‌రి జిల్లా వై. రామవరం మండలంలో ఉన్న వెదురునగరంలోని గిరిజన వికాసకేంద్రం ఉన్నత పాఠశాలను దర్శించి ఉపాధ్యాయులను, విద్యార్థులనూ ఉత్సాహపరిచారు.

వీరు ఆర్యసమాజ విద్వాంసులైన శ్రీ సోమదేవశాస్త్రిగారి వద్ద అధ్యయనం సాగించారు. అనేక విద్యాసంస్థలకు అధ్యక్షులుగాను, ఇతర కీలకబాధ్యతలలోనూ ఉండి వాటి అభివృద్ధికై ఎంతోకృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా పనిచేశారు. కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు వీరికి గౌరవ డాక్టరేట్ అందజేసి సన్మానించాయి.

శ్రీ టి వి నారాయణ గారు 20 వరకూ పుస్తకాలు రచించారు. జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం (కవితా సంపుటి), శ్రుతిసౌరభం, అమర వాక్సుధా స్రవంతి (ఉపనిషత్తులపై వ్యాస సంపుటి) వీరి ర‌చ‌న‌ల్లో ప్ర‌ముఖ‌మైన‌వి.

నిజాం కళాశాలలో బి.ఎ. గణిత శాస్త్రము చదివిన వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో ఎం.ఎ. పట్టా పొందారు. వీరు నిత్య విద్యార్థిగా వుంటూ తన 71వ ఏట కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు. వీరు అనేక సామామజిక కార్యక్రమాల్లో పాల్గొని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బంధు సేవామండలి స్థాపించారు.

వీరి సేవ‌ల‌కు గాను భారత రాష్ట్రపతి చేతులమీదుగా “వేద పండిత్” పురస్కారాన్ని ఆందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి “ధర్మరత్న” పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి “దళిత రత్న” పురస్కారాన్ని పొందారు. వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వము వీరిని 2016 లో “పద్మశ్రీ” పురస్కారముతో గౌరవించింది.

ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. వారిజీవితం సమాసేవలో ధన్యమైన జీవన‌మ‌ని వారికి శతశత నమస్సులు తెలుపుతున్న‌ట్టు శ్రీ వ‌డ్డి విజ‌య‌సారథి గారు పేర్కొన్నారు.

టి.వి నారాయ‌ణ గారు స్వ‌ర్గ‌స్థుల‌య్యార‌నే వార్త ఎంతో దుఃఖం, బాధను క‌ల్గించింద‌ని ఆర్‌.ఎస్.ఎస్ అఖిల భార‌త కార్య‌కారిణి స‌ద‌స్యులు శ్రీ భాగ‌య్య అన్నారు. టి.వి నారాయ‌ణ గారు ఆత్మీయతతో ద్వేశానికి తావు లేకుండా హిందుసమాజ సంఘటనకు, సామాజిక సమతకు అహరహము కృషి చేసిన మహనీయుల‌ని పేర్కొన్నారు. వేద పండితులు, ఉత్తమ ఉపాధ్యాయులు, నిజాయితీగా జీవించిన వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి అండగా నిలిచార‌ని పేర్కొన్నారు. వారి మృతి పట్ల సంతాపం తెలుపుతూ, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాన‌ని శ్రీ భాగ‌య్య పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here