Home Telugu Articles పాక్ పైశాచికం

పాక్ పైశాచికం

0
SHARE

పాకిస్తాన్ దౌష్ట్యం పరాకాష్టకు చేరుకుంది. శత్రు సైనికుడు సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ పట్టుబడితే వారి పట్ల ఎలా వ్యవహరించాలో అన్న నైతికతను పాతరపెట్టింది. అన్ని నియమాలను ఉల్లంఘించి.. భారత భూభాగంలోకి దాదాపు 250 మీటర్ల మేర చొచ్చుకుని వచ్చి విచక్షణ లేకుండా కాల్పులు జరిపి ఇద్దరు సైనికులను హతమార్చింది. అంతటితో పాక్ సైన్యం కసి తీరలేదు. ఇద్దరు సైనికుల మృతదేహాలను తమ వెంట తీసుకుని వెళ్లి అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలు చేసి, శరీరాలను గుర్తించేందుకు వీల్లేనంతగా ఛిద్రం చేసింది. తలలు తెగనరికి దారుణంగా వ్యవహరించింది. జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో సోమవారం జరిగిన ఈ ఘటన యావద్దేశాన్ని కలచివేసింది. కేంద్ర ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. భారత సైన్యం తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతోంది. ప్రతీకారం తీర్చుకోవలసిందేనని నిర్ణయం తీసుకుంది. ఏ క్షణంలోనైనా మెరుపుదాడులకు దిగే అవకాశాలున్నట్లు సైనిక వర్గాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ మాత్రం తమకు ఎలాంటి పాపం తెలియదని, మరణించిన సైనికుల పట్ల నియమాలను ఎంతమాత్రం ఉల్లంఘించలేదని మొసలి కన్నీరు కారుస్తోంది. ‘జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లోని కృష్ణా ఘాటిలో పాకిస్తాన్ సరిహద్దు కార్యాచరణ బృందం (బిఏటి) చొరబడింది. రెండు భారత రక్షణ ప్రాంతాలపై రాకెట్లు, మోర్టార్ బాంబులతో దాడులు చేసింది. పెట్రోల్ పార్టీలోని ఇద్దరు అధికారులు ఈ దాడిలో మరణించారు. వీరి శరీరాలను పాక్ సైన్యం ఛిద్రం చేసింది. తలలు నరికింది’ అని భారత సరిహద్దు భద్రతాదళం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉధంపూర్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎలాంటి కవ్వింపు లేకుండానే పాకిస్తాన్ సైన్యం పెద్ద ఎత్తున కాల్పులు ప్రారంభించింది. మర తుపాకులు, రాకెట్లు, మోర్టార్లు, ఇతర పెద్ద ఆయుధాలతో కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాకిస్తాన్ సైన్యం మరో వైపు నుండి తమ సైనికులను భారత భూభాగంలోకి పంపించి రెండు పార్వార్డ్ పోస్టుల మధ్య గస్తీ తిరుగుతున్న భారత సైనికులపై దాడి చేసినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలోతెలిపింది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన బార్డర్ టీం భారత భూగంలోకి వచ్చి చేసిన దాడిలో ఇద్దరు సైనికులు మరణించగా ఒకరు గాయపడ్డారని తెలిపింది. పాకిస్తాన్ బార్డర్ టీం ఇద్దరు భారత సైనికుల శరీరాలను నాశనం చేసింది, ఇద్దరు సైనికుల తలలను నరికి తీసుకుపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం చేసిన ఈ తుచ్ఛమైన చర్యకు ప్రతీకారంగా సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటామని సైన్యం ప్రకటించింది. అమరులైన ఇద్దరు సైనికుల్లో 22సిఖ్ ఇన్‌ఫాంట్రీకి చెందిన నరుూబ్ సుబేదార్ పరమ్‌జిత్ సింగ్, బిఎస్‌ఎఫ్ 200వ బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్‌సాగర్ ఉన్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను రాజిందర్‌సింగ్ గా గుర్తించారు. ఇతణ్ణి చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పాకిస్తాన్‌కు చెందిన

647ముజాహిద్ బెటాలియన్ ఈ ఆపరేషన్‌లో పాల్గొందని బిఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. రెండు రోజుల కోసారి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎక్కడో ఒకచోట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే.

పాక్ కిరాతక చర్యకు గుణపాఠం నేర్పించేందుకు రెండో మెరుపు దాడికి భారత సైన్యం సిద్ధమవుతోంది. ఇద్దరు సైనికులను హత్య చేసి వారి దేహాలను నాశనం చేయటంపై బుద్ది చెపుతామని భారత సైన్యం ఉత్తర కమాండ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా ఉన్నతస్థాయి సమీక్ష సమీక్ష జరిగింది. రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతోపాటు త్రివిధ దళాల అధిపతులతో ఈ అంశం గురించి చర్చించారు. పాకిస్తాన్‌కు బుద్ది చెప్పేందుకు వీలున్నంత త్వరగా మెరుపుదాడి లాంటిది నిర్వహించి పగ తీర్చుకోవాలని భారత సైన్యానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి. త్రివిధ దళాధిపతులు కూడా పాక్ చర్యపై ప్రధానితో సమీక్షలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరినట్లు సమాచారం. అనంతరం మోదీ ఆదేశం మేరకు భారత సైన్యం ముఖ్యంగా ఉత్తర కమాండ్ అతి త్వరలోనే కార్యాచరణలోకి దిగుతుందని అంచనా. పాక్ ఉగ్రవాదులు యురీ సైనిక శిబిరంపై దాడి చేసి పద్ధెనిమిది మంది సైనికులను హత్య చేసినందుకు ప్రతిగా బిహార్, దోగ్రా రెజిమెంట్‌కు చెందిన కమాండోలు ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుపోయి ఇద్దరు పాకిస్తాన్ సైనికులతోపాటు దాదాపు యాభై మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను హతమార్చి, వారి క్యాంపులను పేల్చివేయం తెలిసిందే. పాకిస్తాన్ తాజా దుశ్చర్య అనంతరం భారత్ ఈసారి పెద్దఎత్తున స్పందించే అవకాశాలున్నాయని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

దెబ్బకు దెబ్బ తీస్తాం

పాకిస్తాన్ దుశ్చర్యపై రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ తీవ్రంగా స్పందించారు. పాక్ ఏ విధంగా వ్యవహరించిందో, అంతే స్థాయిలో దెబ్బకు దెబ్బ తీస్తామని, అమరుల త్యాగాలను ఎట్టి పరిస్థితిలోనూ వృథా పోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ పైశాచికత్వానికి ఇది పరాకాష్ట అని ఆయన అన్నారు. భారత సైన్యంపై దేశానికి సంపూర్ణ విశ్వాసం ఉందని, సైన్యం తగిన రీతిలో నిర్ణయం తీసుంటుందన్నారు. ఈ ఘటనపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. సరిహద్దుల్లో మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు, వివిధ రాజకీయ పార్టీలు పాక్ చర్యను ఖండించాయి.