Home News ప.పూ. సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌జీ భాగవత్‌ గారి విజయదశమి ఉపన్యాస సారాంశం

ప.పూ. సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌జీ భాగవత్‌ గారి విజయదశమి ఉపన్యాస సారాంశం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌, విజయదశమి, 2017 ,ప.పూ. సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌జీ భాగవత్‌ ఉపన్యాస సారాంశం

పవిత్ర విజయదశమి కార్యక్రమం జరుపుకునేందుకు మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. ఇది పరమపూజ్య పద్మభూషణ్‌ కుషోక్‌ బకుల రింపొచే శతజయంతి సంవత్సరం. అలాగే స్వామి వివేకానంద చారిత్రాత్మక చికాగో ఉపన్యాసపు 125 వార్షికోత్సవ సంవత్సరం, ఆయన ప్రసిద్ధ శిష్యురాలైన భగిని నివేదిత 150వ జయంతి సంవత్సరం కూడా.

హిమాలయ ప్రాంతంలోని బౌద్ధులంతా పరమపూజ్య కుషోక్‌ బకులా రింపోచేను తథాగత బుద్ధుని 16 మంది అర్హత్‌లలో ఒకరైన బకుల్‌ అర్హత్‌ అవతారమని భావిస్తారు. లఢక్‌లో ఇటీవల కాలంలో ఎంతో గౌరవాన్ని పొందిన లామాగా కూడా ఆయన గుర్తింపుపొందారు. లఢక్‌ ప్రాంతంలో విద్యావ్యాప్తి, సామాజిక సంస్కరణ, జాతీయభావ జాగృతికి రింపోచే విశేష కృషి చేశారు. 1947లో పాకిస్థాన్‌ సైన్యం కబైలీ గిరిజనులను అడ్డంపెట్టుకుని జమ్మూకాశ్మీర్‌పై దాడి చేసినప్పుడు రింపోచే తన స్ఫూర్తివంతమైన యువ అనుచరణ గణంతో నుబ్రా బ్రిగెేడ్‌ను ఏర్పరచి దురాక్రమణదారుల్ని స్కర్దు ప్రాంతం దాటి రాకుండా అడ్డుకున్నారు. జమ్మూకాశ్మీర్‌ శాసనసభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, లోక్‌సభ సభ్యునిగా రింపోచే యోగదానం చెప్పుకోదగినది. ఆయన 10 ఏళ్ళపాటు మంగోలియాలో భారత రాయబారిగా పనిచేశారు. ఆ సమయంలో మంగోలియాలో 80 ఏళ్ళ కమ్యూనిస్టు పాలన తరువాత పురాతన బౌద్ధ సంప్రదాయాన్ని పునరుద్దరించుకునేందుకు స్థానిక ప్రజానీకం చేసిన ప్రయత్నాలకు ఎంతగానో తోడ్పడ్డారు. ఈ విషయంలో ఆయనను మంగోలియా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. 2001లో రింపోచేకి మంగోలియా అత్యున్నత పౌర పురస్కారం ‘పోల్‌ స్టార్‌’ లభించింది. ఆధ్యాత్మిక సంపద, మొక్కవోని జాతీయ నిష్ట, నిస్వార్థ ప్రజాసేవకు మారుపేరుగా నిలిచిన ఆయనను దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది, గౌరవిస్తుంది. స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం ద్వారా ప్రకటించిన జాతీయ దృక్పథం, వైశ్విక మానవతా విలువలనే ఆచార్య బకుల్‌ తన వ్యక్తిగత, సామాజిక వ్యవహారం ద్వారా చూపారు.

ఈ జాతీయ దృక్పథమే మన వారసత్వం. ఈ దృక్పథాన్ని జాగృతం చేయడం కోసమే తన అమరమైన ఇతిహాసం రామాయణంలో మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిని కథానాయకుడిని చేశారు ఆదికవి వాల్మీకి. అలాగే ఇవాల్టి మన ముఖ్యఅతిధికి స్ఫూర్తిదాత అయిన భక్తి ఉద్యమానికి చెందిన, పరమపూజ్యడిగా గౌరవం పొందిన సంత్‌ రవిదాస్‌జీ మహారాజ్‌ కూడా తన మాటలు, కార్యం ద్వారా సామాన్య జనంలో ఈ జాతీయ దృక్పధాన్నే వ్యాపింపచేసారు. ఇదే జాతీయ ఆదర్శం ఆధారంగానే హిందూ సమాజాన్ని జాగృతపరచేందుకు భగిని నివేదిత కృషి చేశారు. భారత సంతతిని అజ్ఞానం, పేదరికం నుండి విముక్తం చేయడానికి ఆమె అవిశ్రాంతంగా పనిచేశారు. వారిలో స్వధర్మం, స్వదేశీ భావాలను నింపారు.

మన సమాజంలో జాతీయ భావాన్ని, విలువల్ని నింపాలంటే ముందుగా మన మేధావులు, ఆలోచనాపరులు తమ సామ్రాజ్యవాద మనస్తత్వాన్ని, ఆలోచనాధోరణిని వదిలిపెట్టాలి. సామ్రాజ్యవాద కాలం నుండి మన మనస్సులు, బుద్ధిని కప్పేసిన ఈ దోషాలవల్లనే స్వీయదూషణకు, గందరగోళానికి, అయోమయానికి గురవుతున్నాం. యూరప్‌లో పుట్టిపెరిగినప్పుటికీ భారతీయ సంస్కారాలు, శాశ్వతమైన విలువలను భగిని నివేదిత బుద్ధిపూర్వకంగా అనుసరించగలగడం మనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చే విషయం.

రాష్ట్రం కృత్రిమమైనది కాదు. సంస్కృతి, ప్రజల ఆధారంగా ఏర్పడిన మన రాష్ట్రభావన అధికారం మూలంగా కలిగిన జాతి-రాష్ట్ర భావన కంటే పూర్తి భిన్నమైనది, ప్రత్యేకమైనది. అనేక భాషలు, ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాలు, ఆచారాలు మొదలైనవి ఉన్నప్పటికీ వీటన్నింటినీ ఒకటిగా బంధించి ఉంచుతున్న సూత్రమే మన సంస్కృతి. సర్వమానవాళిని ఒకే కుటుంబంగా గుర్తించి, పరిగణించే శాశ్వత విలువలే ఈ సంస్కృతికి మూలం. ప్రాచీన కాలం నుండి మనం పొందిన సామూహిక విలువలు, అనుభవాల సారమే మన జాతీయవాద దృక్పధం. అవే విలువలు, భావనలు మన వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక జీవనంలో ప్రతిఫలిస్తాయి. అప్పుడే ‘రాష్ట్రం’ అనేది నిజమైన స్వరూపంలో ఏర్పడుతుంది. ప్రపంచపు గుర్తుంపు పొందుతుంది. అటువంటి జాతే ప్రపంచ జీవనంలో ఆశించిన పాత్రను పోషించి ప్రయోజనకరమైన యోగదానాన్ని అందించగలుగుతుంది.

మెల్లగానైనా, నిశ్చితంగా మనం ప్రస్తుతం అటువంటి శాశ్వత సత్యాన్ని కొంతవరకైనా అనుభూతి చెందగలుగుతున్నామనే చెప్పాలి. మన చొరప మూలంగా యోగశాస్త్రానికి అమోదం, గుర్తింపు లభిస్తున్నాయి. అలాగే ప్రాచీన వారసత్వ సంపదగా మనం గర్వించే పర్యావరణం పట్ల మన దృష్టి కూడా ప్రపంచపు గుర్తింపు పొందుతోంది. పశ్చిమాన పాకిస్థాన్‌, ఉత్తరాన చైనా కార్యకలాపాల విషయంలో భారత్‌ దృఢవైఖరి డోక్లామ్‌ వంటి సరిహద్దు సంఘటనల్లోనూ, అంతర్జాతీయ దౌత్యంలోనూ బయటపడింది. మన శక్తిని మరోసారి తెలుసుకోవడానికి అలాగే ప్రపంచం దృష్టిలో భారత్‌కు ఒక పటిష్టమైన స్థానాన్ని సంపాదించేందుకు ఇవి ఉపయోగపడ్డాయి. అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయాలు మన మేధోశక్తికి గుర్తుగా నిలుస్తున్నాయి. అంతర్గత భద్రత విషయంలో పరిస్థితి క్రమంగా మెరుగువుతోంది. మౌలిక సదుపాయాల రంగంలో ముఖ్యంగా ఉపరితల రవాణా సదుపాయాలు అరుణాచల్‌ప్రదేశ్‌ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. మహిళల గౌరవాన్ని, ప్రగతిని సాధించడానికి ‘బేటీ బచావ్‌ బేటీ పఢావ్‌’ వంటి పథకాలు అమలవుతున్నాయి. స్వచ్ఛఅభియాన్‌ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో బాధ్యతాయుత ధోరణి పెంపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవస్థాపరమైన అనేక సంస్కరణలు తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నం జరుగుతోంది. కొన్ని రంగాల్లో వస్తున్న మార్పులు సామాన్య ప్రజానీకంలో విశ్వాసాన్ని నింపుతున్నాయి. దానితో పాటు ఆశలు, ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మార్పులు, సంభవిస్తున్న పరిణామాలతో పాటు, మరింత సకారాత్మక మార్పు సాధించడం ఎలాగన్న విషయంలో సమాజంలో సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఉదాహరణకు తీవ్రవాదుల చొరబాట్లు అడ్డుకోవడం, సరిహద్దు అవతల నుండి కాల్పులకు సమాధానమివ్వడంలో చూపిన దృఢవైఖరి పట్ల సర్వత్రా ప్రశంస వ్యక్తమవుతోంది. భద్రతా దళాలకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు తగిన స్వేచ్ఛ లభిస్తోంది. వేర్పాటువాదుల ఆర్థిక వనరులకు గండికొట్టడం, వారికి దేశవిద్రోహకశక్తులతో ఉన్న సంబంధాలను బయటపెట్టడం ద్వారా వారి దుష్ప్రచారం, కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకోవడం జరిగింది. ఇలాంటి వ్యూహంవల్ల సకారాత్మక ఫలితాలు అప్పుడే కనిపిస్తున్నాయి.

అయితే ఈ అభివృద్ధి ఫలాలు జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని, ముఖ్యంగా జమ్మూ, లఢక్‌ ప్రాంతాలను కలుపుకుని, సాధారణ ప్రజానీకానికి అందేట్లుగా చర్యలు చేపట్టాలి. ఎలాంటి వివక్ష లేని స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన ద్వారా అది సాధ్యమవుతుంది. రాష్ట్రంలో శరణార్థుల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. భారత రాజ్యంలో భాగంగా ఉండాలని, హిందువులుగానే జీవించాలని భావించినందుకు కొన్ని దశాబ్దాలుగా కొన్ని తరాలవారు శరణార్థుల జీవితమే గడుపుతున్నారు.

భారతీయ పౌరులైనప్పటికీ వారికి విద్య, ప్రజాస్వామ్య హక్కులు ఏవీ లేవు. ఇదంతా జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రపు ప్రత్యేక నిబంధనల వల్ల జరుగుతోంది. ఆ నిబంధనలు వారికి ప్రాధమిక హక్కుల్ని కూడా నిరాకరిస్తున్నాయి. అలాగే 1947లో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుండి వచ్చిన శరణార్థులు, 1990లో కాశ్మీర్‌ లోయ నుండి తరిమివేయబడిన వారి సమస్య ఇంకా అలాగే ఉంది. వీరంతా సుఖవంతమైన, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు, సమాన ప్రజాస్వామ్య హక్కుల్ని అనుభవిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తగిన పరిస్థితులు మనం ఏర్పరచాలి. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయాలి. పాత నిబంధనలను మార్చాలి. అప్పుడు మాత్రమే జమ్మూకాశ్మీర్‌ వాసులు మిగిలిన భారత్‌లో ఏకమవుతారు, దేశప్రగతిలో సమాన భాగస్వామ్యాన్ని, సహకారాన్ని అందించగలుగుతారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా ఈ ప్రక్రియలో ప్రదాన పాత్ర పోషించాలి. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్రవాదుల చొరబాట్లను, నిరంతరంగా సరిహద్దు అవతల నుండి సాగుతున్న కాల్పులను ధైర్యంగా ఎదుర్కొని నిలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు దేశ విద్రోహక శక్తులతో నేరుగా పోరాడుతున్నారు. వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా, గందరగోళంగా మారుతున్నాయి. ప్రభుత్వం, పాలనాయంత్రాంగంతోపాటు వివిధ సంస్థలు కూడా వీరికి సహాయం అందించాలి. ఈ దిశలో స్వయంసేవకులు తమ వంతు ప్రయత్నాన్ని అప్పుడే ప్రారంభించారు. ఇలా ప్రభుత్వం, సమాజం సమిష్టిగా ప్రయత్నిస్తే మెరుగైన సహాయం వారికి అందుతుంది. కాశ్మీర్‌ లోయతోపాటు, లఢక్‌లోని మారుమూల ప్రాంతాలలో కూడా విద్య, ఆరోగ్యం, ఉపాధికల్పన, జాతీయవిలువల వ్యాప్తి వంటి రంగాల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చాలా సంవత్సరాలుగా సాగుతున్న దుష్ప్రచారానికి ఫలితమైన వేర్పాటువాదం, అసంతృప్తిని నిరోధించాలంటే సకారాత్మక చర్యల ద్వారా సమాజం సహజమైన శ్రద్ధ, అభిమానాన్ని కనబరచాలి. దేశవిద్రోహక శక్తులకు వ్యతిరేకంగా మొత్తం సమాజం దృఢంగా, నిశ్చయంగా నిలబడినప్పుచే ఈ సమస్య పరిష్కారమవుతుంది. బెంగాల్‌, కేరళల్లో పరిస్థితి అందరికీ తెలిసినదే. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ రంగు పులుముకున్న పాలనాయంత్రాంగం జాతి వ్యతిరేక కార్యకలాపాలపట్ల ఉదాసీన వైఖరి అవలంబించడమేకాక, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశవిద్రోహక శక్తులకు వత్తాసు పలుకుతున్నాయి. ఈ శక్తులకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వానికి చేరుతోంది. కాబట్టి ఈ కార్యకలాపాల్ని అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలి. భాష, ప్రాంతం, వర్గం, మతం మొదలైనవాటి ఆధారంగా స్థానికులలో అసంతృప్తి, వేర్పాటువాదం, హింస, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు దేశవిద్రోహకశక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల అవిధేయతను పెంచడానికి ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

సరిహద్దుల గుండా సాగుతున్న అక్రమ రవాణా, ముఖ్యంగా గోవుల అక్రమరవాణా చాలా పెద్ద సమస్యగా మారుతోంది. దేశం ఇప్పటికే బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల సమస్యతో సతమతమవుతోంది, దీనితోపాటు హింస, దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అరోపణలతో మయన్మార్‌ నుండి తరిమివేయబడిన రోహింగ్యాలు కూడా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. దేశ భద్రత, సమైక్యతలను దృష్టిలో పెట్టుకుని వీరి గురించి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ఈ దిశలోనే ఆలోచిస్తోంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సంపూర్ణ సమాజపు సహాయ, సహకారాలు లేకుండా విజయం సాధ్యపడదు. అన్ని ప్రాంతాలలోని సజ్జనశక్తి ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడాలి. మొత్తం సమాజాన్ని ఏకత్రితం చేసి, ధైర్యం నింపాలి.

మన సరిహద్దులను పరిరక్షించే బాధ్యత వహిస్తున్న సైనికబలగాలు, పారామిలటరీ దళాలు, పోలీసులు తమ కర్తవ్యాన్ని సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. అయితే వీరికి తగిన వనరులు సమకూర్చడం, అంతర్గత సమాచార వినిమయ వ్యవస్థను మెరుగుపరచడం, గూఢచారి ఏజెన్సీలతో సమన్వయం, వారి కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకోవడం వంటి చర్యలను మరింత వేగవంతం చేయాలి. ప్రభుత్వం ఈ బలగాలతో నేరుగా మాట్లాడాలి. సైనిక బలగాలు, వారి కుటుంబాల పట్ల సమాజంలో కూడా మరింత సద్భావన, గౌరవం పెరగాలి. జాతీయ ప్రయోజనాలు, విలువలకు తగిన, ప్రజల ఆశలు, ఆంకాక్షలను నెరవేర్చే విధంగా సరైన విధానాలతోపాటు ప్రతి రంగంలోమన జాతి గౌరవాన్ని ఇనుమడింపచేసేట్లుగా వ్యవస్థీకృత, విలువలతో కూడిన సమాజం నిర్మాణం కావాలి. అలాగే పరిపాలనా యంత్రాంగం కూడా ఈ విధానాలను సొంతం చేసుకుని వాటిని సమర్థవంతంగా అమలుపరచాలి.

ఆర్థికరంగంలో కూడా ఇలాంటి మార్పే అవసరం. అవినీతిని అరికట్టడం, త్వరితగతిన ఆర్థిక ప్రగతి సాధించడం కోసం ప్రభుత్వం కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. అట్టడుగున ఉన్న వారి కోసం జన్‌ధన్‌, ముద్రా, గ్యాస్‌ సబ్సిడీ, వ్యవసాయ బీమా మొదలైన పథకాలు అమలు చేసింది. అయినా దేశంలోని ప్రజల వైవిధ్యభరితమైన అవసరాలు, పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన రంగాలన్నింటి ఆవశ్యకతలను దృష్టిలోపెట్టుకుని భారీ, మధ్యతరహా, చిన్న పరిశ్రమల, రిటైల్‌ వ్యాపారులు, వ్యవసాయదారులు, కూలీల ప్రయోజనాలను కాపాడగలిగే సమీకృత, సంపూర్ణ విధానం అవసరం. ప్రస్తుతపు ప్రపంచ విధానాలు, ప్రమాణాలను, అవి ఎంత లోపభూయిష్టమైనవి, కృత్రిమమైనవి, సంపద అనే ఎండమావిని సృష్టించేవి, నైతికతను దెబ్బతీసేవి, పర్యావరణం, ఉపాధి, స్వయంసమృద్ధిని నాశనం చేసేవి అయినప్పటికీ, వాటిని అనుసరించాల్సిరావడం కొంతవరకు అర్థం చేసుకోవచ్చును. అయితే ఈ విధానాలు, ప్రమాణాలను సమీక్షించుకుని, ఏ దేశానికి తగినట్లుగా ఆ దేశం ప్రత్యేక అభివృద్ధి నమూనాలను రూపొందించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్న విషయం. మన నీతీ ఆయోగ్‌ మరియు రాష్ట్రాల ఆర్థిక సలహాదారులంతా తమ పురాతన ఆర్థిక ‘వాదాలను’ వదిలిపెట్టి ప్రస్తుతపు ఆర్థిక అనుభవాలను, జాతి ప్రయోజనాలతో సమన్వయం చేసుకోగలగాలి. ఈ ప్రక్రియలో జాతీయ ఆదర్శాలు, సంప్రదాయాలు, అవసరాలు, వనరులన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలు కూడా తమ నిత్యావసర వస్తువుల దగ్గర నుండి ప్రతి కొనుగోలులో స్వదేశీ వస్తువులు, ఉత్పత్తులకే ప్రాధాన్యతనివ్వడం అలవరుచుకోవాలి.

ప్రభుత్వ విధానాలు, పథకాలన్నీ సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే. అవి ప్రజలలో కష్టపడే తత్వాన్ని పెంపొందించగలగాలి. ఈ పథకాలన్నీ పరిపాలనా వ్యవస్థ ద్వారా అట్టడుగు స్థాయివరకూ చేరుతున్నాయా లేదా అని, వాటి ప్రభావం ఎంతమేర ఉన్నదనే విషయాల్ని అంచనా వేసేందుకు అన్నివైపుల నుంచీ యదార్థమైన సమాచారం సేకరించుకోగలిగిన వ్యవస్థ కూడా అవసరం. సరైన మార్పును తెచ్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం, చొరప ప్రభుత్వానికి ఉన్నాయనే విశ్వాసం, సరైన వ్యక్తుల్ని సరైన స్థానాల్లో నియమించగలుగుతోందనే భావం అందరిలో కలుగుతున్నాయి. చాలా ఏళ్ళ తరువాత ఇటువంటి అవకాశం, అదృష్టం లభించింది కాబట్టి ఇంతకు ముందు పేర్కొన్న విషయాలన్నింటిలో జాగ్రత్తవహించగలగాలి.

లోపభూయిష్టమైనదని తేలినప్పటికీ ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్ని అంచనా వేసేందుకు స్థూల జాతీయోత్పత్తి ప్రమాణాన్నే ఉపయోగిస్తున్నాం. ప్రతి చేతికి పని, గౌరవప్రదమైన జీవనాన్ని గడపగలిగే వేతనం ఇవ్వగలిగే ఉపాధి అవకాశాలు కావాలి. ఈ ప్రమాణాలతోచూస్తే చిన్న, మధ్యతరహా, చేనేత పరిశ్రమలు, రిటైల్‌, స్వయంఉపాధి వ్యాపారులు, సహకార రంగం, వ్యవసాయ సంబంధిత రంగం ప్రజలకు ఎంతో మేలు చేశాయని చెప్పవచ్చును. ఈ రంగాలే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య, ఆర్థిక సంక్షోభాల నుండి మనల్ని కాపాడాయి. మన దేశంలో కుటుంబ వ్యవస్థ ఇంకా పటిష్టంగా ఉంది. మహిళలు ఇంటి వద్దనే చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబ ఆదాయానికి తమ వంతు సహాయం అందజేస్తున్నారు. దీనినే పరోక్ష ఆర్థిక వ్యవస్థ అంటున్నారు. ఇందులో అవినీతి కూడా చాలా తక్కువ. ఈ రంగాల ద్వారా కోట్లాది మందికి ఉపాధి లభిస్తోంది. సమాజంలో చిట్టచివరన నిలిచే వారిలో ఎక్కువమంది ఈ రంగాలకు చెందినవారే. కొన్ని ఆర్థిక సంస్కరణలు, వ్యవస్థ ప్రక్షాళన చేపట్టినప్పుడు స్వల్ప ఒడుదుడుకులు, అస్థిరత వంటివి సర్వసాధారణం. కానీ ఈ అనియత, పరోక్ష రంగాలను దృష్టిలో పెట్టుకుని వాటిపై తక్కువ ఒత్తిడి పడేవిధంగా, వాటికి బలం చేకూరే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మన సంప్రదాయ విలువల మూలంగా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత భావన రావడానికి ముందునుంచే పెద్ద పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు, ఉత్పత్తుల నాణ్యతను పెంచేందుకు, నిపుణతలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్ని ఒకే దిశలో సాగేట్లుగా సమన్వయపరచడం అవసరం. ఉత్పత్తి వికేంద్రీకరణ, వినియోగవాదాన్ని అరికట్టడం, ఉపాధి అవకాశాల పెంపు, వనరుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజలను సరైన మార్గంలో తీసుకువెళ్ళడండంవంటి ఆర్థిక దృక్పధం అలవడనిదే వైశ్విక స్థాయిలో సంతులన, సుస్థిర, క్రియాశీల ఆర్థిక వ్యవస్థ, దేశీయస్థాయిలో అంత్యోదయ నమూనా అమలు వంటివి సాధ్యం కాదు. భవిష్యత్తును తీర్చుదిద్దుకోవడంలో ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. షెడ్యూల్‌ కులాలు, తెగలు, గిరిజన జాతులు మొదలైనవాటికి ప్రయోజనం కలిగించడం కోసం అనేక కేంద్ర, రాష్ట్ర పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ఫలాలు ఈ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికీ అందాలి. ఈ విషయంలో ప్రభుత్వం, పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు ప్రభుత్వ ఏజెన్సీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు సమాజం నుండి కూడా సహకారం కూడా అవసరం.

మన దేశంలో పరిశ్రమలు, వ్యాపారం, వ్యవసాయ రంగాలను పోటీ రంగాలుగా కాకుండా పరస్పర ఆధారితమైనవిగా పరిగణిస్తాం. ఇక్కడ వ్యవసాయం అతిపెద్ద రంగం. తన కుటుంబానికేకాక, దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతు నేడు కష్టాల్లో ఉన్నాడు. వరదలు, కరువుకాటకాలు, ఎగుమతి-దిగుమతి విధానం, గిట్టుబాటుధర లభించకపోవడం, అప్పుల భారం, ఎందువల్లనైనా పంట పోతే సర్వం కోల్పోయే పరిస్థితివల్ల రైతు విసిగివేసారిపోయాడు. అటు నగరాల్లో విద్యావంతులైన నిరుద్యోగులుగా గడపడమో, లేక ఇటు ఎలాంటి ప్రాధమిక సదుపాయాలు కూడా లేని గ్రామాల్లో విద్యాగంధం కూడా లేకుండా వ్యవసాయ కూలీలుగా బతుకు వెళ్ళదీయడమో చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే భావన యువతరంలో వచ్చింది. దీనివల్ల గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది. రెండూ అభివృద్ధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నగరాల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించి పంట బీమా, భూసారపరీక్షలు, వ్యవసాయోత్పత్తుల ఇ-మార్కెటింగ్‌ వంటివి కొన్ని మంచి కార్యక్రమాలే. అయితే ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట ఋణ మాఫీ వంటి చర్యలు రైతుల కష్టాలను తొలగించే దిశగా ప్రభుత్వాల చిత్తశుద్ధిని చూపుతున్నా, అవి తాత్కాలికమైన చర్యలు మాత్రమే. అవి సమస్యకు శాశ్వత పరిష్కారం కావు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, సంప్రదాయ కాలుష్యరహిత పద్ధతులను కలిపి ఉపయోగించడం ఎలాగో రైతులకు తెలియజేస్తే అప్పుడు వాళ్ళు తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేయగలుగుతారు, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టే ముందు దానివల్ల భూసారం, పర్యావరణం, మానవుల ఆరోగ్యంపై దుష్ప్రభావం ఏదీ పడదని నిర్ధారించుకోవాలి. రైతుకు తన ఖర్చు పోగా కొద్దిపాటి లాభం కూడా లభించే విధంగా గిట్టుబాటుధర ఉండాలి. అప్పుడే అతను కుటుంబాన్ని పోషించుకోవడంతోపాటు రాబోయే కాలంలో వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడిని కూడా పొందగలుగుతాడు. గిట్టుబాటు ధరను చెల్లించి ప్రభుత్వమే రైతుల నుండి పంటను కొనుగోలు చేయాలి. సేంద్రియ వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి. మన ఆహారాన్ని, నీటిని, భూమిని కలుషితం చేస్తున్న, రైతులకు ఆర్థిక భారంగా మారిన రసాయన వ్యవసాయ పద్ధతులకు క్రమంగా స్వస్తి చెప్పాలి.

మనం తక్కువ పెట్టుబడితో, సేంద్రియ తరహా వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడగానే ఈ దేశంలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులని, వారికి ఎలాంటి నీటిపారుదల సదుపాయాలు అందుబాటులో లేవనే విషయం సహజంగానే ప్రస్తావనకు వస్తుంది. అలాంటి రైతులకు గోఆధారిత వ్యవసాయమే మార్గం. దీనివల్ల కాలుష్యరహితమైన, తక్కువ పెట్టుబడి అవసరమయ్యే పద్ధతులను అవలంబించగలుగుతారు. అందుకనే స్వయంసేవకులు, వివిధ పంథాలకు చెందిన సాధుసంతులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు గోసంరక్షణ కోసం ప్రయత్నిస్తున్నాయి. మన సంస్కృతిలో గోవుకు గౌరవపూర్వకమైన స్థానం ఉంది. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో గో సంరక్షణ కూడా ఉంది. వివిధ కాలాల్లో వేరువేరు పార్టీలకు చెందిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు గోవధ నిషేధ చట్టాలు అమలయ్యాయి. దేశీయ ఆవు పాలలోనే ఎ-2 పౌష్టిక విలువలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితమైనంది. ఆవు పేడ, గో మూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని కూడా తేలింది. అలాగే ఆవు పేడ, మూత్రం ద్వారా సహజ సిద్ధమైన ఎరువు, చీడ నాశన పదార్థాలను తయారు చేయవచ్చును. వీటివల్ల భూసారంపైన, ఇతరత్రా ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు సాగుతున్నాయి కూడా. అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా బంగ్లాదేశ్‌ సరిహద్దుగా కలిగిన రాష్ట్రాల్లో గోవుల అక్రమరవాణా పెద్ద సమస్య. ఇలాంటి పరిస్థితిలో గో సంరక్షణ, గో సంవర్థన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ కార్యకలాపాలన్నీ రాజ్యాంగ పరిధిలో, చట్టబద్ధమైన పద్ధతిలోనే సాగుతాయి. ఇటీవల హింస, అకృత్యాలకు సంబంధించిన సంఘటనలను పరిశీలిస్తే ఆ కార్యకర్తలుగానీ, వారి కార్యకలాపాలకుగానీ ఈ హింసతో, అకృత్యాలతో సంబంధంలేదని తేలింది. అంతేకాదు అందుకు విరుద్ధంగా గోసంరక్షణ కోసం శాంతియుత మార్గాల్లో కృషి చేస్తున్న అనేకమందిపై దాడులు జరిగాయని, చాలామంది హత్యకు గురయ్యారని స్పష్టమైంది. కానీ ఈ విషయాన్ని ఎక్కడా, ఎవరూ మాట్లాడరు, ప్రస్తావించరు. కనుక గోసంరక్షణ, గో సంరక్షకులను హింసాత్మక ధోరణి, మతతత్వ భావాలతో ముడిపెట్టడమంటే యథార్ధాలను పట్టించుకోకపోవడమే. చాలామంది ముస్లిములు కూడా గోసంరక్షణ, గోసంవర్థన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గోశాలలను నిర్వహిస్తున్నారు. గో సంరక్షణ గురించి సాగుతున్న దుష్ప్రచారంవల్ల వివిధ మత వర్గాల మధ్య వైషమ్యాలు కూడా కలుగుతున్నాయని కొందరు నాకు చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో సదుద్దేశ్యంతో, సద్బావంతో గోసంరక్షణ కార్యంలో నిమగ్నమైనవారు ఎవరూ ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారి సదుద్దేశ్యపూర్వకమైన మాటలకుగానీ, సుప్రీంకోర్టు వ్యాఖ్యలకుగానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేరస్థులు, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడేవారు మాత్రమే వీటికి భయపడాలి. స్వార్థ ప్రయోజనాలు కలిగిన కొందరు ఈ మాటలకు దుర్వ్యాఖ్య చేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, పాలనాయంత్రాంగం ఇలాంటి దుర్వ్యాఖ్యలకు దూరంగా ఉండి నేరస్థులను శిక్షిస్తూనే అమాయకులను ఇబ్బందిపెట్టకుండా వ్యవహరించాలి. చట్టబద్ధమైన, నైతికమైన గోసంరక్షణ కార్యం ప్రజాప్రయోజనం కోసం సాగుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతమవుతుంది కూడా. అదే నేటి పరిస్థితులకు సరైన సమాధానమవుతుంది కూడా.

వ్యవసాయానికి సరైన నీటిపారుదల వ్యవస్థ తప్పనిసరి. ప్రతి ఏటా మనకు లభించే నీటిని సక్రమంగా ఉపయోగించుకునేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయమైన నిర్వహణ విధానాన్ని గురించి మనం ఆలోచించాలి. విషపదార్థాలు లేని వ్యవసాయం, నీటి నిర్వహణలలో ప్రభుత్వం ఇప్పటికే జలసంరక్షణ, నదుల పరిశుభ్రత, చెట్లు నాటడం వంటి చెప్పుకోదగిన కార్యక్రమాలు చేపట్టింది. జలసంరక్షణ విషయంలో ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు అనేకం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. నీటిని చెట్లు, అరణ్యాలతో ముడిపెడుతూ ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ వంటి కార్యక్రమాలు, ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ప్రజలకు ఆ అడవులను రక్షించే బాధ్యత అప్పగించడం జరుగుతోంది. ఇది సకారాత్మకమైన పరిణామం. ఈ కార్యక్రమాలన్నీ ఒక సుసంపన్న వ్యవసాయ, పర్యావరణ నమూనాగా రూపొందుతాయని ఆశిద్దాం.

జాతీయ పునరుజ్జీవనంలో ప్రభుత్వ, పరిపాలనా చర్యలకంటే సామాజిక ప్రయత్నమే అధిక ప్రాధాన్యతవహిస్తుంది. ఈ దృష్టా విద్యా వ్యవస్థ చాలా ముఖ్యమైనది. సామ్రాజ్యవాద పాలనలో విదేశీ పాలకులు మన విద్యావ్యవస్థలో అత్యంత వినాశకరమైన మార్పులు చేశారు. భారతీయ సామాజిక మానసంలో ఆత్మన్యూనతా భావాన్ని నింపడమే ఆ మార్పుల ప్రధాన లక్ష్యం. మన విద్యావ్యవస్థ ఈ దుష్ప్రభావాల నుండి బయటపడాలి. మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో నివసించేవారికి కూడా విద్య అందుబాటులో ఉండేట్లుగా నూతన విద్యావిధానాన్ని రూపొందించుకోవాలి. పాఠ్యాంశాలు కూడా అన్నిరకాల ‘వాదాల’ను వదిలించుకుని, జాతీయత, జాతీయ గౌరవాన్ని ప్రతిబింబించే, పెంపొందించే విధంగా ఉండాలి. సత్యాన్వేషణకు ఆధారం కావాలి. ఈ విద్య ప్రతి విద్యార్థిలో వినయం, సహానుభూతి, వివేకం, బాధ్యతలతోపాటు జ్ఞానసముపార్జన, పట్టుదల, నైపుణ్యం, కష్టపడే తత్వాలను పెంపొందించే విధంగా ఉండాలి. ఉపాధ్యాయులు, శిష్యుల మధ్య సత్సంబంధం ఉండాలి. ఉపాధ్యాయులు స్వయంగా విద్యార్థులకు ఆదర్శంగా నిలవగలగాలి. విద్యాసంస్థలలో అందుకు తగిన వాతావరణం ఉండాలి. సరైన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, సాధనాలు కలిగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. విద్యా సంస్థల వ్యాపారీకరణను అడ్డుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాలల్లో కనీస ప్రమాణాలను, నాణ్యతను అందుకోవాలి. సమాజంలో అనేక ప్రయోగాలు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన జీవనం గడిపే అవకాశం కల్పించాలి. ఈ విషయాలను పదేపదే చెప్పడానికి కారణం ఏమిటంటే సాధ్యమైనంత త్వరగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. అందుకు అవసరమైన విద్యా విధానం గురించి ఈ దేశం చాలాకాలంగా ప్రతీక్షిస్తోంది.

అయితే పాఠశాలలు మాత్రమే విషయ గ్రహణానికి అవకాశం కలిగించే ప్రదేశాలా? మన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఇతర పెద్దలు, ఇరుగుపొరుగుల ప్రవర్తన, మాటల నుండి నిజాయితీ, సత్ప్రవర్తన వంటివి నేర్చుకోలేమా? మన ఇళ్ళలో, సమాజంలో జరిగే పండుగలు, ఉత్సవాలు, ఉద్యమాలు మన మనస్సుల్ని, మన ఆలోచనల్ని తీర్చిదిద్దవా? మీడియా ముఖ్యంగా ఇంటర్‌నెట్‌ మీడియా మన ఆలోచనలు, చర్యల్ని ప్రభావితం చేయడం లేదా? బ్లూ వేల్‌ ఆటే ఇందుకు చక్కని ఉదాహరణ. పిల్లల్ని ఈ విషవలయం నుండి తప్పించడానికి కుటుంబం, సమాజం, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి.

ఇటీవల ప్రతి చిన్నవిషయానికి వీధులకెక్కి ప్రజానీకం హింసకు పాల్పడుతున్నారు. తమ బాధ్యతల్ని, రాజ్యాంగాన్ని, చట్టాల్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని సమాజ వ్యతిరేక శక్తులు, నేరస్థులు, దేశవ్యతిరేక శక్తులు సమాజంలో వేర్పాటువాదాన్ని, అశాంతిని రెచ్చగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇదంతా సమాజంలో నైతిక విలువల క్షీణత, బాధ్యతారాహిత్యం, సామాజిక వర్గాలలో అసంతృప్తి లేదా దాని చుట్టూ అల్లుకున్న స్వార్థరాజకీయాల వల్లనే జరుగుతోందని మనకు తెలుస్తుంది.

నవతరంలో వ్యక్తిగత, సామాజిక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే, విలువలను నింపే పని కుటుంబం, సమాజంలో జరగాలి. సమాజంలోఉన్న విభేదాలు, అసంతృప్తి, సంఘర్షణలను ఆసరాగా చేసుకుని వర్థిల్లుతున్న స్వార్థరాజకీయాలవల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విభేదాలకు కారణం శోషణ, అసమానతలు, సహానుభూతి కొరవడటం వంటి లోపాలు. సమాజంలో సమరసత భావన లోపించడంవల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి. సహానుభూతి, సమరసతలను నిర్మాణం చేసేందుకు స్వయంసేవకలు, వివిధ సంస్థలు, వ్యక్తులు నిరంతరంగా కృషి చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలను సాధించాలంటే మొత్తం సమాజం కురీతులను, పద్ధతులను వదిలిపెట్టి మానవత్వ ధోరణిని మరింత పెంపొందించుకోవాలి. అటువంటి ధోరణితో మనమంతా మన ప్రవర్తనను, జీవితాలను సరిదిద్దుకోవాలి.

ఇటీవల కొన్ని సంవత్సరాలుగా కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, సమాజంలో పరస్పర విశ్వాసం కొరవడటంవంటి ఆందోళన కరమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇవి మన కుటుంబాలలో, సమాజంలో నైతిక విలువల పతనానికి గుర్తు. కనుక కుటుంబ, సామాజిక స్థాయిలో నైతిక విలువను పెంపొందించే కార్యాన్ని వేగవంతం చేయాలి. మనమంతా మన వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక ప్రవర్తను సమీక్షించుకుని తగిన మార్పులు చేసుకోవాలి. ఒక స్వతంత్ర దేశపు పౌరజీవనంలో ఈ జాతీయ విలువలు ప్రతిఫలిస్తాయి. ఈ విషయంలో భగిని నివేదిత ఇలా అన్నారు –

”సమాజమే కుటుంబానికి బలం. ఇల్లే పౌరజీవనానికి మూలం. పౌరజీవనవిదానమే జాతీయతకు ఆధారం. ఈ నాలుగు అంశాలు మనలో, మన సనాతన ధర్మంలో ఉన్నాయి. అయితే ఈ స్పృహ మనలో నిద్రాణమైపోయింది. మనం మళ్ళీ మనలోని ‘సంపద’ను గుర్తించాలి.”

కాబట్టి బారతీయ విలువల ఆధారంగా విధానాల రూపకల్పన, వాటిని పరిపాలనా వ్యవస్థ నిజాయితీగా, పారదర్శకంగా, లోపాలులేకుండా అమలుచేయడం ఎంతముఖ్యమో సమాజం క్రమశిక్షణతో, వ్యవస్థీకృతంగా ముందుకు సాగడం కూడా అంతే ముఖ్యం. శాశ్వత. చిరంతన భారత్‌ ఆధునిక యుగపు అవసరాలకు తగినట్లుగా మళ్ళీ తనకు తాను అవతారమెత్తుతోంది. వివిధ రంగాల్లో మేధావులు, ఆలోచనాపరులు దీనిని గుర్తించి ఆహ్వానిస్తున్నారు. మొత్తం సమాజం కూడా అందుకు సిద్ధం కావాలి.

1925 నుండి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ఈ దిశగానే కృషి చేస్తోంది. 93వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సంఘ మన రాష్ట్రం అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన కలిగిన, మాతృభూమిపట్ల శ్రద్ధ, నిష్ట, త్యాగభావన కలిగి, ఈ దేశంలోని ప్రతిఒక్కరిపట్ల అభిమానం, ప్రేమ కలిగిన, మన పూర్వీకులు చూపిన ధైర్యం, త్యాగభావాలు పునాదిగా, ఈ దేశపు పరమవైభవస్థితిని సాధించడమే తమ ఏకైక ఆశయం, ఆకాంక్షగా కలిగిన కార్యకర్తల గణాన్ని తయారుచేయడానికే పనిచేస్తోంది. ఈ కార్యం నిరంతరం పెరుగుతోంది. సంఘ స్వయంసేవకులు జాతీయ జీవనంలోని ప్రతి రంగంలో పని చేస్తున్నారు. తమ కార్యశైలి, సంస్కారాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. అనేక అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న స్వయంసేవకులు వెనుకబడిన వర్గాల ఉన్నతికోసం 1 లక్ష 70వేల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయత్నాల మూలంగా రూపుదిద్దుకునే వ్యవస్థీకృత, ఆదర్శ సమాజం వల్ల విభేదాలు, అహంకారపూరిత ధోరణి, జడత్వం, స్వార్థ వంటి దుర్గుణాలు మాయమవుతాయి. ఇది సమాజాన్ని ఏకీకృతం చేయడానికి ఒక ప్రత్యేకమైన, అపురూపమైన కార్యపద్ధతి. ఈ ప్రక్రియలో మీరంతా పాలుపంచుకోవాలి. మన వారసత్వ విలువలపై ఆధారపడి రూపొందిన విధానాలు, వాటి సక్రమమైన అమలు, అందుకు సజ్జనశక్తి సహకారం అనే ఈ నాలుగు అంశాల ఆధారంగానే భారత్‌ మరోసారి సర్వోన్నతమైన విశ్వగురుస్థానాన్ని అధిరోహిస్తుంది. అందుకు తగిన వాతావరణం సర్వత్రా కనిపిస్తోంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన కర్తవ్యం.

కోటికోటి భుజాలున్న తల్లి అద్భుత రూపం నిలవాలి

లక్షలాది నయనాలు ప్రకాశించాలి

జగజనని జయకారాలు మిన్నుముట్టాలి

హిందుభూమి కణకణమందూ శక్తి జాగృతమవ్వాలి

భూనభోంతరాళాలయందూ తిరిగి హిందూ జయకారం వినిపించాలి

జగజనని జయకారాలు మిన్నుముట్టాలి.

(కోటికోటి హాథోవాలీ మా కా అద్భుత్‌ అకార్‌ ఉఠే

లాఖ్‌ విశ్వనయన్‌ విస్పుర్‌ ఉఠే

జగజననీ కా జయకార్‌ ఉఠే

హిందుభూమికా కణ్‌కణ్‌ హో అబ్‌ శక్తీ కా అవతార్‌ ఉఠే

జల్‌థల్‌ సే అంబర్‌ సే ఫిర్‌ హిందూ కీ జయ్‌ జయకార్‌ ఉఠే

జగజననీ కా జయకార్‌ ఉఠే)

భారత్‌ మాతాకీ జయ్‌

నాగపూర్ లో జరిగిన ఆర్ ఎస్ ఎస్ విజయదశమి ఉత్సవం దృశ్యాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here