Home Interviews ప్రజలు చైతన్యమవుతున్నారు: ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి

ప్రజలు చైతన్యమవుతున్నారు: ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి

0
SHARE
జాగృతి జరిపిన ముఖాముఖిలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి భాగ్యనగర్‌కు వచ్చిన సందర్భంగా వారితో జాగృతి పత్రిక ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. దేశ సమస్యలు, సంఘకార్యం గురించిన అనేక ప్రశ్నలకు వారు విశ్లేషణాత్మకంగా సమాధానమిచ్చారు.

ప్రశ్న : కశ్మీర్‌ లోయలో జాతీయవాద శక్తుల బలోపేతానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏదైనా యోజన చేసిందా?

సమాధానం : వాస్తవానికి కశ్మీర్‌ లోయలో హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. లోయలోని పరిస్థితులను అర్థం చేసుకున్న తరువాత అక్కడ సేవాభారతి ద్వారా సంఘకార్యం ప్రారంభించాము. ముఖ్యంగా అక్కడి మహిళలను మన కార్యంలో జోడించడానికి కార్యక్రమాలను ప్రారంభించాము. ఇక బాలబాలికలకై ఏకోపాధ్యాయ పాఠశాలలు (సింగిల్‌ టీచర్‌ స్కూల్స్‌) ప్రారంభించాము. దానివలన విద్యార్థులతో పాటు వారి తల్లి దండ్రులతో సత్సంబంధాలు నెరపే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏకోపాధ్యాయ పాఠశాల ప్రణాళికలో ఓంకారం, ప్రార్థన, గాయత్రి మంత్రం, భోజన మంత్రం చెపుతాము. గ్రామీణ క్షేత్రాలలోని ప్రజలు మనం చేప్పే విషయాలు శ్రద్ధగా వింటున్నారు. మన ఆలోచనలను స్వీకరిస్తున్నారు. లోయలోని కొన్ని వర్గాల ప్రజలు మనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాని వీరందరిని సంఘకార్యంలో ఏ విధంగా జోడించాలనేది ఆలోచిస్తున్నాము. కశ్మీర్‌ లోయలోని మేధావులలో తమ దేశం పట్ల సద్భావన ఉంది. నేడు లోయలో ఉన్న పరిస్థితులతో వారు ఆనందంగా లేరని వారి మాటల్లో తెలుస్తోంది.

ప్ర : పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం హిందువుల పండగలను జరుపుకోనివ్వకుండా దమన నీతి అమలు చేస్తున్నది. ఈ పరిస్థితిని అధిగమించడానికి సంఘం ఏదైనా యోజన చేసిందా?

స : బెంగాల్‌లో హిందువుల పండుగలు వచ్చినపుడు హిందువుల శక్తి ప్రదర్శన జరగాలి. ప్రభుత్వానికి హిందువుల శక్తి తెలియాలి. శ్రీరాముని పర్వదిన సందర్భంగా బెంగాల్‌లో విశేషమైన శోభాయాత్ర (ఊరేగింపు) జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా మనకు తెలిసిందేమంటే బెంగాల్‌లోని సామాన్య వ్యక్తి కూడా మనతో కలిసి నడవడానికి ఉత్సాహం చూపుతున్నాడు. ఈ ఊరేగింపులో సుమారు 25 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం దమననీతితో వ్యవహరించినా, స్థానిక వాతావరణం భయభ్రాంతులను చేస్తున్నా, హిందువులు ఇంత భారీ సంఖ్యలో ఊరేగింపులో పాల్గొనడం ఒక విశేషమే. పాలకుల వల్ల హిందువులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. హింస అనగానే నిజంగానే చాలా మంది భయానికి లోనవుతారు. హింసను ఎదుర్కోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి వస్తున్న జాడలు లేవు. పాలక వర్గం దన్నుతో చెలరేగుతున్న ఈ హింసా ప్రవృత్తి భయంకరమైనది. ఈ స్థితి హిందువులకే కాకుండా ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదమే. ప్రభుత్వం ఏ పార్టీదైనా ఉండనివ్వండి. రాజ్యాంగ విధానాలను కాదని వినాశక శక్తులకు చేయూత నివ్వడం శోచనీయం. తాత్కాలికంగా లాభం కలుగవచ్చు కాని భవిష్యత్తులో ఇది భారీ నష్టానికే దారితీస్తుంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం అటు వ్యక్తికీ ఇటు సమాజానికీ క్షేమం కాదు. సంఘానికి హిందూ సమాజ ఆంతరిక శక్తి మీద నమ్మకముంది. హిందూ సమాజాన్ని భయగ్రస్త వాతావారణం నుండి బయటకు తీసుకువచ్చినపుడు పరిస్థితులలో మార్పు రావచ్చు. ఈ విశ్వాసం సంఘానికి ఉంది.

ప్ర : బంగ్లా సరిహద్దు గ్రామాల్లో హిందువులు అల్ప సంఖ్యాకులుగా ఉన్నారు. సరిహద్దు గ్రామాల్లోని పోలీస్‌ స్టేషన్లపై దాడులు జరిగాయి. హిందువులు సరిహద్దు గ్రామాల నుండి వెళ్ళిపోతున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి ?

స : దేశ సరిహద్దు గ్రామాల నుండి హిందువులు పలాయనం కావడం దేశ భద్రతకు ప్రమాదమే. దేశ సరిహద్దులలో నివసించే హిందువులు మరో గత్యంతరం లేక తమ ఇళ్ళు వాకిలి వదులుకొని వెళ్ళి పోతుండవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో ఇపుడున్న ప్రభుత్వం మారే వరకు సరిహద్దు గ్రామాలలోని ప్రజలు అక్కడే నిలదొక్కుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకొనే స్థితిలో లేము.

ప్ర : కేరళలో కమ్యూనిస్టులు సంఘ స్వయంసేవ కులను, భాజపా కార్యకర్తలను, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలను నేరుగా హత మారుస్తున్నారు. కానీ సంఘం, భాజపాలు కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య విధానాలలో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విధానం వలన సమస్యకు పరిష్కారం లభించగలదా ?

స : సమస్యకు పరిష్కారం లభించగలదని నాకు నమ్మకముంది. ఈ విధానంలోనే ఫలితం వస్తుంది. న్యాయవిరుద్ధంగా పని చేస్తున్న వారికి అధికార వర్గాల వారి తోడ్పాడు ఉండటం శోచనీయం. ప్రభుత్వం ఇలా చేస్తున్నా ప్రజలు మాత్రం ప్రభుత్వానికి మద్దతివ్వడం లేదు. కేరళలో జరుగుతున్న హింసాత్మక ఘటనల వల్ల హిందువులలో నిరాశా వాతావరణం కనిపిస్తోంది. కాని భాజపా ఒకవైపు, సంఘం మరోవైపు ప్రజాస్వామ్యయుతంగా నిరసన ప్రదర్శలు చేయడం వలన ప్రజలలో మనపట్ల అభిమానం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఇపుడు అధికారంలో ఉన్నవారు ఎంతటి అసహనం కలవారంటే.. వారు వారి పార్టీనుండి వెళ్ళిపోయిన కార్యకర్తలను సైతం హతమారుస్తున్నారు. ఈ చర్యలన్నీ వారిలో ఉన్న నిరాశా, నిస్పృహలను తెలియజేస్తున్నాయి. వారి పార్టీవారు వీరి విధానాలు నచ్చక పార్టీని వీడిపోతుంటే వీరికి కోపం, అసహనం పెరుగుతోంది. ఆ కోపంలో పాశవిక చర్యలకు పాల్పడుతున్నారు. వారి బాధలు సహించలేని కొందరు సంఘ ఆలోచనలకు, సంఘ కార్యక్రమాలకు ఆకర్షితులై సంఘంలో చేరుతున్నారు. కాబట్టి ఇది సహనం వహించాల్సిన సమయం. ఇప్పుడు సమాజం మనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉంది. అనేకమంది ప్రజలు కమ్యూనిస్టుల బాధలకు గురై ఉన్నారు. వారందరు తగు సమయం కొరకు వేచి ఉన్నారు. వారందరూ మనతో వస్తారన్న విశ్వాసం సంఘానికి ఉంది.

ప్ర : ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటువాదుల ప్రభావం క్రమంగా తగ్గుతోంది. జాతీయ శక్తుల బలం పెరుగుతోంది. దీని వెనుక సంఘ ప్రభావమేమైనా ఉందా?

స : ఈశాన్య రాష్ట్రాలలో గత 30, 40 సంవత్సరాలుగా సంఘం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ మార్పు వచ్చిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా వనవాసులు, వనవాసులు కాని వారి మధ్య గొడవలు ఎక్కువగా ఉండేవి. వీరి మధ్య దూరం తగ్గించడానికి సంఘం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. దాని ఫలితమే నేటి వాతావరణం. అక్కడి పిల్లల కోసం ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రారంభించాము. విద్యాలయాల ద్వారా పిల్లలతో పాటు తల్లి దండ్రులూ మన కార్యానికి దగ్గరయ్యారు. విద్యాభారతి ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాలలో సుమారు 650 పాఠశాలలు నడుస్తున్నాయి. ఇవేకాక సేవాభారతి ద్వారా సేవా కార్యక్రమాలు (సర్వీస్‌ యాక్టివిటీస్‌) నడుస్తున్నాయి. వీటి ద్వారా సంఘం ప్రజలకు మరింత చేరువయింది. ఇక మహిళలకు స్వయం ఉపాధి పథకాలు, యువకులకు ఉపాధిహామీ శిక్షణ కార్యక్రమాలు మొదలైన సేవా కార్యక్రమాల వల్ల మార్పు వచ్చింది. హిందూ శక్తి సంఘటిత మైంది. దాని ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాం. కేంద్రప్రభుత్వం తీసుకొంటున్న చర్యల వల్ల నేడు అక్కడి వేర్పాటువాదులకు నిధులు అందడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వారి కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. అయినా మనం జాగృతంగానే ఉండాలి. అవకాశం వస్తే ఈ వేర్పాటు శక్తులు మరోమారు తలెత్తుతాయి. అవి తలెత్తకుండా సేవా కార్యక్రమాలు, ధర్మజాగరణ, ఏకోపాధ్యాయ పాఠశాలలు, పొదుపు సంఘాలు, మహిళల స్వయం ఉపాధి ఇలా అన్ని రంగాలలో ముందుకెళితే ఈశాన్య రాష్ట్రాలలో వచ్చిన మార్పును ఇంకా దృఢతరం చేయవచ్చు.

ప్ర : గ్రేటర్‌ నాగాలాండ్‌, గ్రేటర్‌ బంగ్లాదేశ్‌ ఉద్యమాలు నడిచాయి. వాటిపట్ల సంఘ దృష్టికోణం ఏమిటి ?

స : గ్రేటర్‌ నాగాలాండ్‌ ఉద్యమం ఒక సమస్య. బంగ్లాదేశ్‌ సమస్య మరొకటి. బంగ్లాదేశ్‌ నుండి అస్సాంకు వలస వచ్చిన వారి వల్ల సమస్యలు మరికొన్ని. అస్సాంలో తెగల మధ్య గొడవలున్నాయి. వీటన్నింటిని అధిగమించడానికి సంఘం పలు కార్యక్రమాలు చేపట్టింది. కళ్యాణాశ్రమం ద్వారా, ఏకోపాధ్యాయ పాఠశాలలు, ధర్మజాగరణ, విశ్వహిందూ పరిషత్‌ ద్వారా పలురకాల పనుల యోజన జరిగింది. ఈ విధంగా అస్సాంలో సమరసత సాధించగలిగాము. సంఘం అనుకున్నది సాధించింది. ఇదే విధంగా గ్రేటర్‌ నాగాలాండ్‌లో గూడా ప్రజలందరి మధ్య సమరసత సాధించగలమనే నమ్మకం మాకుంది. కాకపోతే నాగాలాండ్‌లో సమయం ఎక్కువ పట్టవచ్చు. ఎందుకంటే నాగాలాండ్‌లో పలు రకాల వర్గాలున్నాయి. నాగాలలో కూడా భిన్నత్వం ఉందని తెలియవస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌ నాగాలాండ్‌ ఉద్యమం పలుచ బడింది. గ్రేటర్‌ నాగాలాండ్‌ ఉద్యమానికి ప్రోత్సాహ మిస్తున్న శక్తులను అడ్డుకోవలసిన అవసరం ఉంది. కేంద్రం ఈ దిశలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలియవస్తోంది. గ్రేటర్‌ నాగాలాండ్‌ ఉద్యమం బయటి శక్తుల చేతులలోకి వెళ్ళకుండా చూడవలసిన బాధ్యత కేంద్రానిదే.

ప్ర : హిందూ సమాజంలో సమరసత సాధించ డానికి సంఘం పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో విజయం సాధించింది. కాని మరోవైపు దళితుల పేరుచెప్పి సంఘ వ్యతిరే శక్తులు సమాజాన్ని విడగొట్టడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో సంఘం ఆలోచన ఏమిటి?

స : ఈ విషయంలో సంఘం చేస్తున్న పని సరిపోదు. మరెంతో పని చేయాల్సి ఉంది. ఇపుడు చేపడుతున్న కార్యక్రమాల వల్ల కొంత మాత్రమే ఫలితమొస్తుంది. ఎందుకంటే విరోధి శక్తులు సమాజంలోని అన్ని వర్గాల మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం సక్రియంగా ఉండాలి. మేము భావాత్మకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాము. వివిధ వర్గాల ప్రజల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం మొదలైంది. ఇపుడు సేవా కార్యక్రమాల వల్ల కొంత ఫలితం లభిస్తోంది. కాని సంఘం పనిలో వేగం పెరగాలి.

ప్ర : తెలుగు రాష్ట్రాలలో కూడా మేధావులనుకొనే రచయితలు సమాజంలో విభజనలు తేవడానికి తమ రచనల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వీరికి భారత్‌ విరోధుల సహాయమందుతుందేమో? మీరేమంటారు ?

స : సామాన్యంగా ప్రజలు సంకుచిత ఆలోచలనకు తొందరగా ఆకర్షితులౌతారు. విశాలమైన భావాలకు అంత తొందరగా ఆకర్షితులు కారు. ఇది సహజం. దీనిని అవకాశంగా తీసుకొని కొందరు వ్యక్తులు సమాజాన్ని విడగొట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివారి కుతంత్రాలను ఎంత వీలైతే అంత తొందరగా ప్రజలకు తెలిసేలా చేయాలి. ఏవైనా చర్చలు జరిగినపుడు అవి సైద్ధాంతిక ఆధారంగా జరగాలి. సమాజం విడిపోతే లాభమా? కలిసుంటే లాభమా? దీనిపై చర్చ జరగాలి. ఇప్పుడిప్పుడే మేధావులు సంఘ ఆలోచనల వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్ర : రోహింగ్యా ముస్లిముల పట్ల సంఘ ఆలోచన ఏమిటి ?

స : రోహింగ్యా ముస్లిముల పట్ల సంఘానికి స్పష్టమైన అవగాహన ఉంది. వీరి గత చరిత్రను ఆధారం చేసుకొని మనం మాట్లాడాలి. వీళ్ళను మయన్మార్‌ దేశం వెళ్ళగొడుతోంది. అది నిజం. రోహింగ్యా ముస్లిముల విషయం మానవతా దృక్కోణంతో ఆలోచించే విషయం కాదు. మనం మరో విషయం గమనించాలి. మయన్మార్‌ నుంచి వచ్చిన ముస్లిములు నేరుగా జమ్ము-కశ్మీర్‌ వెళ్లి అక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నారు. మరికొందరు హైదరాబాద్‌ వచ్చి నివసిస్తున్నారు. దీని వెనుక ఏదో ఒక బలమైన ఆలోచన ఉండి ఉండవచ్చు. రోహింగ్యాలపై అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి వారు దేశం వదిలి పారిపోయి వస్తున్నారని ఆలోచిస్తే పొరపాటే అవుతుంది. ఈ మధ్య హిందువులు మానవత్వం నేర్చుకోవటం గురించి చాలామంది ఉపన్యాసాలు ఇస్తున్నారు. హిందువులకు మానవత్వం గురించి నేర్పించవలసిన అవసరం లేదు. దేశ రక్షణను పణంగా పెట్టి, రోహింగ్యా ముస్లింల పట్ల మానవీయత చూపెట్టవలసిన అవసరం లేదు. రోహింగ్యా ముస్లిములు ముందు ముందు భారత్‌లో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే వారనుటలో ఏమాత్రం సందేహం లేదు. ఇది వారి గత చరిత్ర చెబుతోంది. కేవలం వాళ్లు నిర్వాసితులు కాబట్టి వారికి ఆశ్రయం ఇవ్వాలనడం సబబు కాదు. దేశహితాన్ని పణంగా పెట్టి మన దేశం ఈ పని చేయనవసరం లేదు. ఇలా ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారికి దేశ సరిహద్దులలోనే తాత్కాలిక నివాసాలు ఏర్పరచి, కూడు గుడ్డ అందించవచ్చు. కొంత కాలమైన తర్వాత వారిని వారి దేశానికి పంపించే కార్యక్రమం చేపట్టాలి. అంతేకాని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి, భారత పౌరులకు లభించే సౌకర్యాలు కల్పించాలనే దానిని సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం దృఢంగా ఉండి రోహింగ్యాల విషయం దేశ భద్రత దృష్ట్యా ఆలోచించి వీలైనంత త్వరగా పంపించే ఏర్పాట్లు చేయాలి.

ప్ర : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలు పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి. నోట్ల రద్దు సమయంలో ప్రజలందరు ప్రభుత్వ పక్షాన నిలబడ్డారు. కాని కొందరు మేధావులు ఈ రెండు చర్యలు దేశ ఆర్థిక స్థితిని వెనక్కి నెట్టాయని అంటున్నారు. వాస్తవం ఏమిటి ?

స : ప్రభుత్వం అత్యంత ప్రామాణికతతో ఆర్థిక రంగంలో ఈ చర్యలు తీసుకొంది. అయితే ఈ నిర్ణయం బహుశా తక్కువ సమయంలో తీసుకోవలసి వచ్చిందేమో? అయినా ప్రజలు ఈ మార్పును ఓపికతో శాంతియుతంగా స్వాగతించారు. బహుశా రాబోయే రోజులలో దీని మంచి ఫలితాలు ప్రజలకు అందవచ్చు అని సంఘం భావిస్తోంది. ఈ విషయంలో ప్రజలు అభినందనీయులు. విపక్షాలు కూడా ఈ విషయాలను రాజకీయంగా చూడకుండా ఆర్థిక దృష్టితో విశ్లేషించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. అమలులో ఏమైనా సమస్యలుంటే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విషయంలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వవచ్చు. ఇక జిఎస్‌టి విషయంలో కూడా ఆచరణలో వస్తున్న ఇబ్బందులను వ్యాపారస్తులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ప్రభుత్వం కూడా బెట్టుకు పోకుండా ఆచరణీయ సవరణలను ఆమోదిస్తూ సహకరిస్తున్నది. జిఎస్‌టి వల్ల చిన్న వ్యాపారులకు ఇబ్బందులు ఉండవచ్చు కాని పెద్ద వ్యాపారులకైతే ఇబ్బందులు లేవు. చిన్న వ్యాపారులకు వస్తున్న ఇబ్బందులను పరిష్కరించడంలో సమయం మించిపోయిందేమీ లేదు. క్రమంగా జిఎస్‌టి లోపాలు లేకుండా రూపొందవచ్చు.

ప్ర : ఈ రోజుల్లో జీవన విధానం వేగంగా మారిపోతున్నది. యువకులు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై పోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో వీరిని సంఘంతో జోడించడానికి సంఘం ఏదైనా విశేష యోజన చేస్తోందా ?

స : ఇలాంటి పరిస్థితులు అన్ని వేళలా వస్తాయి. ‘ఇపుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంతకు ముందు లేవు’ అంటే నేను ఒప్పుకోను. ఇలాంటి సమయాలలో మనకు అనుకూలమైన మార్గాన్ని మనం వెలికి తీయాలి. యువత ఆధునికత వైపు, తమ భవిష్యత్తు వైపు మొగ్గు చూపుతున్నారని మీరు అన్నారు. నాకు మరొక దృశ్యం కూడా కనిపిస్తోంది. మంచి మంచి విషయాలను ఆహ్వానించే యువత కూడా లభిస్తోంది. ఆర్ట్‌ ఆఫ్‌ లీవింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ ద్వారా పనిలో ఉన్న యువత కావచ్చు, ఇషా ఫౌండేషన్‌ జగ్గీ వాసుదేవ్‌ ద్వారా పనిలో ఉన్న యువత కావచ్చు. ఈ విధంగా కొందరు మహానుభావులు తమ వ్యక్తిగత జీవనం కన్న సమాజ హితమైన జీవనానికే ప్రాముఖ్యమిస్తున్నారు. ఇలాంటి వారు యువతకు ఆదర్శమౌతున్నారు. వీరి వెనక యువత అండగా నిలబడుతోంది. సంఘకార్యం వైపు కూడా నేడు యువకులు పెద్ద ఎత్తున ఆకర్షితులౌతున్నారు. సంఘ వెబ్‌సైట్‌ లోని ‘జాయిన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’ అనే లింక్‌ ద్వారా అనేకమంది యువత సంఘంలోకి రావడానికి వారి వివరాలను పంపుతున్నారు. గత 7, 8 సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే ప్రతి నెల సరాసరి 4000 మంది యువకులు సంఘంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సంఘం కూడా ఈ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వచ్చిన యువతను సంఘంతో ఏ విధంగా జోడించాలనే విషయంపై శ్రద్ధ పెట్టాలి. యువత నేడుకూడా అదే ఊపులో, అదే దేశభక్తితో ఉన్నారు. ఐటి ఉద్యోగులను సంఘకార్యంలో ఎలా అనుసంధానం చేయాలి అన్న విషయం కూడా యోజన జరుగుతోంది. ‘యూత్‌ ఫర్‌ సేవ’ ప్రారంభమైంది. ధార్మిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో కూడా యువత పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. యువత ముఖ్యంగా సేవా రంగంలో చక్కగా పని చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల యువత స్పందన బాగుంది.

ప్ర : డోక్లాం విషయంలో చైనా చర్య వలన మన దేశ ప్రజలలో చైతన్యం పెరిగింది. చైనా ఆక్రమణ స్వభావాన్ని మన దేశం విజయవంతంగా ఎదుర్కొంది. చైనాకు వ్యతిరేకంగా మన ప్రజలను మరింత చైతన్యవంతులను చేసే చర్యలేమైనా సంఘం తీసుకొంటున్నదా ?

స : భారత్‌ విషయంలో ఈశ్వర శక్తి పని చేస్తుందేమోనని అపుడపుడు అనుకోవలసి వస్తోంది. ఎందుకంటే భారత ప్రజలలో చైతన్యం పెంచటానికి చైనా అపుడపుడు ఇలా చేస్తుంటుందేమో! మనదేశం విషయంలో ఏదో ఒక గొడవ లేవనెత్తి ప్రజలు చైతన్యమయ్యేటట్లు చేస్తున్నది. చైనా దలైలామా ప్రవేశం గురించి గొడవ చేస్తోంది. మానస సరోవర్‌ యాత్రను అడ్డుకుంటోంది. చైనా చర్యల వలన మన ప్రజలలో మరింత జాగరూకత పెరుగుతోంది. చైనా వస్తువుల బహిష్కరణ ఒక అద్భుతకార్యం. దీని వెనుక స్వదేశీ ఉద్యమ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. డోక్లాం వివాదానికి ముందు వ్యాపారస్తులు లాభాల కోసం చైనా వస్తువులు అమ్మేవారు. ప్రజలు కొనేవారు. కాని డోక్లాం వివాదం తర్వాత పిల్లలు కూడా ఇవి చైనా వస్తువులైతే వద్దంటున్నారు. వ్యాపారులు కూడా చైనా వస్తువులు అమ్మడానికి విముఖత చూపిస్తున్నారు. కొంత చైనా వలన, కొంత మన వలన మన ప్రజలలో జాగరూకత, చైతన్యం పెరిగింది. చైనావి చాలా పెద్ద పెద్ద యోజన లున్నాయి. అది మన దేశంలోని పరిశ్రమలు మూత పడేలా యోజనలు చేస్తున్నది. మన సరిహద్దులు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండేలా చూస్తున్నది. చైనా పట్ల ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా సహకరించ డానికి మన ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ప్రజలను సంసిద్ధం చేయవలసిన ప్రత్యేక అవసరం లేదని నేను భావిస్తాను.

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here