Home News మతం పేరిట చెంచులను భయభ్రాంతులకు గురిచేసిన చర్చి పాస్టర్లపై ఫిర్యాదు

మతం పేరిట చెంచులను భయభ్రాంతులకు గురిచేసిన చర్చి పాస్టర్లపై ఫిర్యాదు

0
SHARE

తమ గ్రామంలో క్రైస్తవ ప్రచారం సాగించేందుకు అంగీకరించని కారణంతో చెంచులను భయబ్రాంతులకు గురిచేసి, బెదిరించిన పాస్టర్లపై ఫిర్యాదు  దాఖలైంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బలిజేపల్లిగూడెం గ్రామంలోని చెంచు కాలనీ వాసులందరూ హిందూ సంప్రదాయాలు పాటిస్తూ జీవిస్తున్నారు. ఇటీవల కొందరు చర్చి పాస్టర్లు క్రైస్తవ మతమార్పిడి చేసేందుకు చెంచు కాలనీకి రావడంతో అక్క‌డి చెంచు తెగ‌కు చెందిన గిరిజ‌నులు పాస్టర్లను త‌మ సంప్రదాయ పద్దతిలో ఆహ్వానించి, కుంకుమ బొట్టు పెట్టి, మరో సారి తమ సంస్కృతీ సాంప్రదాయాలను హరించే ఇలాంటి పనులు చేసేందుకు రావద్దు అని సున్నితంగా హెచ్చరించి పంపివేశారు. ఈ ఘటన జులై 28న జరగ్గా, ఆ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పాస్ట‌ర్ల‌కు స‌రైన బుద్ధి చెప్పిన చెంచు తెగ గిరిజనుల తీరు పట్ల దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ దీనిపై హ‌ర్షం వ్య‌క్తం చేసింది. అయితే ఈ ఘ‌ట‌నను జీర్ణించుకోలేని కొందరు పాస్టర్లు ఆగస్టు 4వ తేదీన విజయవాడ, తూర్పుగోదావరి పరిసర ప్రాంతాల నుండి పెద్దఎత్తున అదే కాలనీకి రావడం, చెంచులకు బెదిరింపులు జారీ చేయడం, ఎవరి అనుమతి లేకుండా అక్కడి వారికి క్రైస్తవ గీతాలు పాడి వినిపించడం వంటి చర్యలకు పాల్పడ్డారు.  ఈ చర్యలతో పాటు “యేసును నమ్ముకున్నాం లేదంటే ఇక్కడ ఎవరూ మిగలరు” అంటూ చేసిన తీవ్ర హెచ్చరిక తాలూకు వీడియోను సీజీటీఐ మినిస్ట్రీస్ అనే క్రైస్తవ సంస్థ తమ యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.

అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా మతమార్పిడికి ప్రయత్నించిన ఈ ఘ‌ట‌న‌పై ఎస్సీ, ఎస్టీ రైట్స్ ఫోరమ్ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అధ్యక్షునికి ఫిర్యాదు చేసింది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను హరించడానికి ప్రయత్నిస్తూ, వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్న పాస్టర్లపై కఠిన చర్యల ఆదేశించాల్సిందిగా కోరింది.

అంతర్జాతీయ జాషువా ప్రాజెక్ట్’ కుట్రలో భాగం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ‌ వేదిక 

ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ‌ వేదిక తీవ్ర స్థాయిలో మండిప‌డింది. తూర్పుగోదావరి జిల్లా రావుల‌పాలెంలోని సీజీటీఐ మినిస్ట్రీస్ అనే క్రైస్త‌వ సంస్థ‌కు చెందిన పాస్ట‌ర్ విజ‌య్‌, విజ‌య‌వాడ‌కు చెందిన‌ ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రేషన్ అనే సంస్థ కు చెందిన పీటర్ పుట్టాతో పాటు మరికొంత మంది పాస్ట‌ర్ల నేతృత్వంతో ఈ మ‌త‌మార్పిడి కుట్ర జ‌రిగింద‌ని, పాస్ట‌ర్ల దుశ్చ‌ర్య‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికిముక్కు సుబ్బయ్య తెలిపారు. త‌మ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించుకునే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించింద‌ని, ఆ హక్కులను కాలరాస్తే ఎదిరించి నిలిచిన అక్కడి చెంచులకు ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ‌ వేదిక అభినందిస్తోంద‌ని అన్నారు. ‘జాషువా ప్రాజెక్ట్’ పేరిట భారతదేశంలో వెనుకబడిన తెగలు, వర్గాలను లక్ష్యంగా చేసుకుని వారిని మతం మార్చేందుకు చేస్తున్న అంతర్జాతీయ స్థాయిలో జ‌రుగున్న కుట్ర‌లో ఇది కూడా ఒక భాగ‌మే అని అన్నారు.

ఈ విష‌యంపై స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడం గ‌మ‌నార్హం అని, అమాయ‌క‌పు గిరిజ‌న ప్ర‌జ‌ల‌ను చంపేస్తామంటూ భ‌యబ్రాంతుల‌కు గురిచేస్తూ, బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుబ్బయ్య డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేవిధంగా విద్వేష‌పూరిత‌మైన ప్ర‌సంగాలు చేస్తూ శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగించే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అలాగే పాస్ట‌ర్ల ఆగ‌డాల‌కు గుర‌వుతున్న అమాయ‌క‌పు చెంచు ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు.

Source : NIJAM TODAY 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here