Home News సరిహద్దు ప్రాంతాల్లో ప్రధాని ఆకస్మిక పర్యటన

సరిహద్దు ప్రాంతాల్లో ప్రధాని ఆకస్మిక పర్యటన

0
SHARE

భారత, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం లేహ్ ప్రాంతానికి చేరుకున్న ప్రధాని అక్కడ నుంచి సరిహద్దుకు వెళ్లారు. సరిహద్దులో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) దళాలతో పాటు సైనికాధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దులో పరిస్థితులు, చైనా సైనికాధికారులతో చర్చల గురించి ప్రధాని మోదీ తెలుసుకున్నారు.

దేశ రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ ప్రాంతంలో పర్యటించవలసి ఉండగా ఏకంగా ప్రధాని అక్కడకి రావడం మీడియాతో సహా అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. రక్షణ మంత్రి పర్యటన రద్దయింది.

ప్రధాన సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం ఎం నరవనే కూడా ప్రధాని మోదీతోపాటు ఉన్నారు. 14వ బెటాలియన్ కు చెందిన అధికారులు ప్రధానికి పూర్తి వివరాలు అందించారు. జూన్ 6, జూన్ 22, జూన్ 30ల్లో మూడు విడతలుగా సాగిన చర్చల్లో చైనా సైనికాధికారులు అంగీకరించిన విషయాలను ఎంతవరకు అమలు చేస్తారన్నది తాము పరిశీలిస్తున్నామని భారత సైనికాధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన సరిహద్దు అవతల ఉన్నవారికి బలమైన సందేశాన్నే పంపుతుందని వారంటున్నారు.

త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ కూడా లేహ్ కు చేరుకున్నారు. ఆయన కూడా సైనికాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు.