Home News కామారెడ్డి లో గణేశ్‌ నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలు, ప్రజల నిరసన, ఎస్పీని తొలగించాలని డిమాండు

కామారెడ్డి లో గణేశ్‌ నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలు, ప్రజల నిరసన, ఎస్పీని తొలగించాలని డిమాండు

0
SHARE
  • పోలీసుల ఆంక్షలను నిరసిస్తూ ఆందోళన
  • శోభాయాత్రను నిరుత్సాహ యాత్రగా మార్చారని ఆవేదన
  • జిల్లాకేంద్రంలో ర్యాలీ, రాస్తారోకో, మానవహారం
  • కలెక్టర్‌, ఎస్పీని సస్పెండ్‌ చేయాలని డిమాండు
  • కామారెడ్డి బందుకు పిలుపు

గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రపై పోలీసుల ఆంక్షను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఉత్సవ సమితితో పాటు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ నుంచి ర్యాలీగా తరిలారు. అనంతరం జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో గంటన్నర పాటు రాస్తారోకో చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శోభాయాత్రను విఫలం చేసిన పాలనాధికారి సత్యనారాయణ, ఎస్పీ శ్వేతను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. కలెక్టర్‌, ఎస్పీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. దీంతో నలువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్‌ డౌన్‌డౌన్‌, ఎస్పీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఎస్పీ శ్వేత అత్యుత్సాహం ప్రదర్శించి ఆయా మండపాల నిర్వాహకులపై పోలీసులను ఉసిగొల్పి యాత్రను విఫలం చేశారని ఆరోపించారు. 60 ఏళ్ల చరిత్రలో మొదటిసారి శోభాయాత్రను నిరుత్సాహ యాత్రగా మార్చారని విమర్శించారు. ఆయా మండపాల సభ్యులపై పోలీసుల తీరు సక్రమంగా లేదన్నారు. దౌర్జన్య పూరితంగా మెడలు పట్టి ముందుకు తోసేశారన్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని లాఠీలతో కొట్టారన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండు చేశారు. సీఐ శ్రీధర్‌కుమార్‌ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసులు తన చరవాణిలో ఆందోళన చేస్తున్న వారి దృశ్యాలను చిత్రీకరించారు. దీంతో పోలీసుల వైఖరిని ఖండిస్తూ మరింత ఆందోళన చేశారు. గంటన్నర పాటు రాస్తారోకో, గంటపాటు ట్రాఫిక్‌ ఇక్కట్లతో కష్టాలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఘనంగా శోభాయాత్ర నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఎస్పీ యాత్రపై దౌర్జన్యం ప్రదర్శించారన్నారు. పోలీసులను పెట్టి మండపాల సభ్యులపై జులుం ప్రదర్శించారన్నారు. బుధవారం తలపెట్టిన కామారెడ్డి బందును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్సవ కమిటీ ప్రతినిధి, భాజపా తెలంగాణ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ డా.మురళీధర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కలెక్టర్‌, ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. శాంతియుతంగా శోభాయాత్ర చేపడితే పోలీసులు అతిగా ప్రవర్తించారన్నారు. కమిటీ ప్రతినిధి, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతె కృష్ణాగౌడ్‌, సిద్ధిరాములు మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఈ సారి శోభాయాత్ర విఫలానికి పోలీసులు బాధ్యత వహించాలన్నారు. పూజలు చేయాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ఆందోళనలో ఆయా పక్షాల కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్‌, కుంబాల రవి, అర్కల ప్రభాకర్‌, నర్సింలు, బట్టు మోహన్‌, రాంమోహన్‌, కృష్ణమోహన్‌, ప్రతినిధులు పుల్లూరి సతీష్‌, మామిండ్ల అంజయ్య, చాట్ల రాజేశ్వర్‌, తేలు శ్రీను, చింతల రమేష్‌, రంజిత్‌మోహన్‌, పిప్పిరి వెంకటి, పండ్లరాజు, నవీన్‌ పటేల్‌తో పాటు ఆయా మండపాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఐక్యత చాటాలి.. పోలీసు చర్యలను తిప్పి కొట్టాలి

60 ఏళ్ల చరిత్రలో కళతప్పిన శోభాయాత్ర
పోలీసు శాంతి కమిటీ సమావేశాలకు వెళ్లం
మేమే కమిటీ ఏర్పాటు చేసుకుంటాం
గణేశ్‌ ఉత్సవ సమితి నిర్ణయం

ప్రతి ఒక్కరు ఐక్యత చాటాలి. పోలీసు చర్యలను తిప్పికొట్టాలి. 60 ఏళ్ల చరిత్రలో ఈ సారి శోభాయాత్ర కళ తప్పింది. పోలీసుల దౌర్జన్యంతో మండపాల నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. ఎస్పీ శ్వేత అత్యుత్సాహం ప్రదర్శించారు’ అని ఆయా పక్షాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్పీని సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలో గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల నిర్వాహకులకు ఎదురైన అనుభవాలను ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించారు. శోభాయాత్ర రథాన్ని ముందుకు జరపాలని పోలీసులు జులుం ప్రదర్శించారన్నారు. కొందరిని ఠాణాల్లో ఉంచారన్నారు. శాంతియుతంగా నిర్వహించే యాత్రపై పోలీసుల ఆంక్షలు సరికాదన్నారు. దీన్ని ముక్తకంఠంతో ఖండించాలన్నారు. పోలీసులు ప్రదర్శించిన తీరుపై పలువురు మండపాల నిర్వాహకులు కంటతడి పెట్టారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ కామారెడ్డిలో మరోమారు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వేలాది మందితో ర్యాలీ నిర్వహించాలన్నారు. దీనికి పురోహితుడు అది సాధ్యపడదన్నారు. ఏటా ఒకే సారి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తారన్నారు. అనంతరం ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఎస్పీని సస్పెండ్‌ చేసే వరకు ఆందోళన చేపడతామన్నారు. జిల్లా పాలనాధికారి వైఖరిని తప్పు పట్టారు. శోభాయాత్రకు రాకుండా పోలీసులపై మొత్తం భారం మోపారన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు కైలాస్‌ శ్రీనివాస్‌, నిట్టు వేణుగోపాల్‌, కృష్ణాగౌడ్‌ మాట్లాడుతూ.. పోలీసుల చర్యలను తిప్పికొట్టాలన్నారు. కమిటీ ప్రతినిధులు పుల్లూరి సతీష్‌, సిద్ధిరాములు, మామిండ్ల అంజయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా శాంతికమిటీ సమావేశాలకు ఆయా మండపాల నిర్వాహకులు వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఏటా మండపాల నిర్వాహకులు, ఆయా పక్షాల ప్రతినిధులతో కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రానున్న దుర్గా మండపాల విషయంలో ఇలాగే వ్యవహరించాలన్నారు. ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పోలీసులకు చెబుతామన్నారు. పోలీసుల కనుసైగల్లో శోభాయాత్ర నిర్వహణకు ఇకనుంచి స్వస్తి పలకాలన్నారు. శాంతియుతంగా, సమష్టిగా కలిసి అన్ని మండపాల నిర్వాహకులు ముందుకె’ళ్లాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు తేలు శ్రీను, చింతల రమేష్‌, పంపరి శ్రీనివాస్‌, చాట్లరాజేశ్వర్‌, ముప్పారపు ఆనంద్‌, కుంబాల రవి, జూలూరి సుధాకర్‌, అర్కల ప్రభాకర్‌, రాంమోహన్‌, బట్టు మోహన్‌, పండ్లరాజు, పిప్పిరి వెంకటి, నరేష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి బంద్‌ విజయవంతం
  • పోలీసుల ఆంక్షలను నిరసిస్తూ ఆందోళన
  • జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
  • ఎస్పీని సస్పెండ్‌ చేయాలని డిమాండు

గణేశ్‌ శోభాయాత్రపై పోలీసుల ఆంక్షను నిరసిస్తూ బుధవారం జిల్లాకేంద్రంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. జిల్లాకేంద్రంలో బందు నిర్వహించారు. దీంతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమాహాళ్లు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ఉత్సవ సమితితో పాటు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కార్యక్రమాలు కొనగాయి. సుభాష్‌రోడ్డులో ధర్నా చేపట్టారు. సుభాష్‌రోడ్డు, స్టేషన్‌రోడ్డు, రైల్వేకమాన్‌, నిజాంసాగర్‌చౌరస్తా, కొత్తబస్టాండు వరకు ర్యాలీ సాగింది. తిరిగి అక్కడి నుంచి నేరుగా సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శోభాయాత్రను విఫలం చేసిన ఎస్పీ శ్వేతను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించి యాత్రను విఫలం చేశారని ఆరోపించారు. శోభాయాత్ర విషయంలో పోలీసుల ఆంక్షలేమిటిని ప్రశ్నించారు. 60 ఏళ్ల కామారెడ్డి చరిత్రలో మొదటి సారి శోభయాత్రను నిరుత్సాహ యాత్రగా మార్చారని విమర్శించారు. పోలీసుల చర్యలతో జిల్లాకేంద్రమంతా ఒక్కటైందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండు చేశారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, మురళీధర్‌గౌడ్‌, నిట్టు వేణుగోపాల్‌, మోతె కృష్ణాగౌడ్‌, చీలప్రభాకర్‌, రంజిత్‌మోహన్‌ మాట్లాడారు. ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. ప్రజలంతా ఐక్యత చాటి బందును విజయవంతం చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు జరిగే కార్యక్రమాలకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఆందోళనలో ఆయా పక్షాల కౌన్సిలర్లు ముప్పారŒపు ఆనంద్‌, కుంబాల రవి, అర్కల ప్రభాకర్‌, నర్సింలు, బట్టు మోహన్‌, రాంమోహన్‌, కృష్ణమోహన్‌, కైలాస్‌ లక్ష్మణ్‌, ప్రతినిధులు పుల్లూరి సతీష్‌, మామిండ్ల అంజయ్య, చాట్ల రాజేశ్వర్‌, నీలం చిన్నరాజులు, తేలు శ్రీను, చింతల రమేశ్‌, పిప్పిరి వెంకటి, పండ్లరాజు, మామిండ్ల రమేష్‌, చంద్రశేఖర్‌, మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, నవీన్‌ పటేల్‌, నరేష్‌ తో పాటు ఆయా మండపాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుపైనే వంటావార్పు

జిల్లాకేంద్రంలో సుభాష్‌చౌక్‌ రోడ్డులో వంటావార్పు నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తిలక్‌రోడ్డు, డెయిలీమార్కెట్‌, కసాబ్‌గల్లీ తదితర ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచాయి.

గణేశ్‌ విగ్రహం పునః ప్రతిష్ఠాపనపై చర్చ

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేశ్‌ విగ్రహం పునః ప్రతిష్ఠాపన చేసి తిరిగి భారీ ర్యాలీ తీయాలనే మండపాల నిర్వాహకుల ఒత్తిడి మేరకు సుదీర్ఘంగా చర్చించారు. పురోహితులతో చర్చించారు. ఏటా ఒకే సారి విగ్రహం ప్రతిష్ఠించడం సంప్రదాయమని పురోహితులు చెప్పారు. దీంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు.

దుర్గా మండపాల విషయంలో…

ఈ సారి చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా దుర్గామండపాల నిర్వహణపై త్వరలోనే ఉత్సవ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పోలీసులు నిర్వహించే శాంతి కమిటీకి ఎవరూ వెళ్లిద్దని తీర్మానించింది.

(ఈనాడు సౌజన్యం తో)