Home Interviews కేరళలో ప్రభుత్వ మద్దతుతోనే హత్యలు : ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబళె

కేరళలో ప్రభుత్వ మద్దతుతోనే హత్యలు : ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబళె

0
SHARE
  • – కేరళలో 1959 నుండి సిపిఎం హత్యలు చేస్తూనే ఉంది
  • – హత్యలకు ప్రభుత్వ బహిరంగ మద్దతు
  • – ముఖ్యమైన నేరస్తులను వదిలేస్తున్నారు
  • – పోలీసులు కళ్ళు మూసుకుంటున్నారు
  • – ఆర్‌.ఎస్‌.ఎస్‌. నేత దత్తాత్రేయ హోసబళె
  • – ఇండియా టుడే కు ప్రత్యేక ముఖాముఖి

రాష్ట్రంలో బలోపేతం అవుతున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. పట్ల కేరళలోని సిపియం ప్రభుత్వం భయపడుతున్నదని, అందుకే సంఘ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వారిని కాపాడుతున్నదని ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ (అఖిల భారత సహ ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబళె ‘ఇండియా టుడే’ కార్యనిర్వాహక సంపాదకుడు రాహుల్‌ కన్వల్‌కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో పేర్కొన్నారు.

ముఖాముఖి పూర్తి పాఠం

రాహుల్‌ కన్వల్‌ : కేరళలో రాజేష్‌ అనే ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తను క్రూరంగా చంపడాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌. తీవ్రంగా ఖండిస్తున్నది. ఆ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యాకాండ గురించి జాతీయ స్థాయిలో ఆ సంస్థ తీవ్రంగా స్పందిస్తున్నది. ఈ విషయమై సంస్థ ముఖ్య నాయకులు దత్తాత్రేయ హోసబళె మనతో మాట్లాడుతున్నారు.

రాహుల్‌ : ధన్యవాదాలు దత్తాత్రేయజి. రాజేష్‌ క్రూరంగా హత్యకు గురికావడం ప్రస్తుత సందర్భం. సిపియం వారే చంపినట్లు మీరు ఆరోపిస్తున్నారు. ఇది శాంతిభద్రతల అంశమని, అయితే రాష్ట్రంలో బలం పుంజుకోవడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రయత్నం చేస్తున్నదని, అటువంటి ప్రయత్నాన్ని సహజంగానే స్థానికులు వ్యతిరేకిస్తూంటారని ప్రభుత్వం పేర్కొంటున్నది. మీరేమంటారు ?

దత్తాత్రేయ : సిపియం వారు ఇటువంటి హత్యలకు పాల్పడటం ఇది మొదటి సారి కాదు. 1959 లోనే మొదటి హత్య జరిగింది. అప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయి. అయితే మొదటిసారిగా ఇప్పుడు దేశం, ముఖ్యంగా మీడియా కేరళలో ఏదో జరుగుతున్నదని గుర్తిస్తున్నది. కేరళ ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదని కాదు. కొద్ది మందిని అరెస్ట్‌ చేస్తున్నారు. అయితే ముఖ్యులను వదిలేస్తున్నారు. ప్రధాన అంశం ఏమిటంటే కేసులను నమోదు చేసే సమయంలో ముఖ్యమైన ‘కుట్ర’ అంశాన్ని చేర్చడం లేదు. ఇదంతా ‘స్థానిక శాంతిభద్రతల సమస్య’ అని తేలికచేసి చూపుతున్నారు.

ఇది నిజంగా స్థానిక శాంతిభద్రతల సమస్యే అయితే, ‘రాష్ట్రంలో విస్తరించడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నది’ అని ప్రభుత్వం అనలేకపోయేది. కేరళలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. కు సుమారు 4,000 శాఖలున్నాయి. కేరళ స్వయం సేవకులు వారి రక్తం, చెమటలను ధారపోస్తూ, కష్టపడి పనిచేయడం ద్వారా సంఘం పని అక్కడ విస్తరిస్తున్నది.

రా : రాజేష్‌ను ఎందుకు హత్య చేశారని భావిస్తున్నారు ?

దత్తా : రాజేష్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్వయంసేవక్‌. అతని మొత్తం జీవితంలో ఒక్క క్రిమినల్‌ కేసు కూడా అతనిపై లేదు. రోజూ బస్తీలో శాఖకు వెళుతున్నాడు. అతనిపై ఏదైనా నేరం ఉండి ఉంటే, శాంతి నెల కొల్పడంకోసం తమ కార్యకర్తలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోమని కొద్దిరోజుల క్రితం సిపియం వారి నుండి వచ్చిన సూచనను తిరస్కరించడు.

రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. శాఖలకు వస్తున్నారు. ఇది ఈ మధ్యన ప్రారంభమైంది కాదు. గత 40, 50 ఏళ్ళ నుండి జరుగుతున్నదే. రాష్ట్రంలో అన్ని వైపులా, మారుమూలలకు కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. వ్యాప్తి చెందుతున్నది. అలా ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు వస్తున్న అణగారిన వర్గాలలో భయం కలిగించడం, తద్వారా ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో కొత్త వారు చేరకూడదనే ఉద్దేశ్యం తోనే సిపియం వారు ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలపై హింసకు పాల్పడుతూ వారిని దారుణంగా హత్య చేస్తున్నారు.

రా : కేరళ ముఖ్యమంత్రి ఈ హత్యలను రాష్ట్రంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. వ్యాప్తి చేస్తున్న రాజకీయ హింసగా నిందిస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి విస్తరించడం కోసమే వారు ఈ విధంగా చేస్తున్నట్లు చెబుతున్నారు. వామపక్ష నాయకులంతా అదే విధంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో వ్యాప్తి చెందడం కోసం సంఘ్‌ పరివార్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మీరేమంటారు ?

దత్తా : కేరళలో సిపియం వారే హింసను విస్తరిస్తున్నారు. వారే అధికారంలో ఉన్నారు. కేరళలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. గాని, స్వయంసేవకులు గాని ఎప్పుడూ, ఏ ప్రాంతంలో కూడా అధికారంలో లేరు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రపూర్వకంగా వ్యవహరిస్తూంటే అధికారంలో ఉన్నవారు విచారణ జరిపించి ‘వాస్తవం ఇది’ అని ప్రపంచానికి ఎందుకు చూపించడం లేదు?

వాస్తవం ఏమిటంటే సిపియం గూండాలు కేవలం ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారిపైనే హింసకు పాల్పడటం లేదు. వారు ముస్లిం లీగ్‌ కార్యకర్తలను, కాంగ్రెస్‌ కార్యకర్తలను సిపిఐ కార్యకర్తలను కూడా హత్య చేశారు. సిపియం నుండి విడిపోయిన వారినీ వదలలేదు. గతంలో సిపియం బెంగాల్‌లో కూడా అధికారంలో ఉంది. అక్కడ ఇటువంటి ఆరోపణలు రాలేదే ? ఇక్కడే ఎందుకు వస్తున్నాయి ?

రా : కేరళలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. శాఖలను విస్తరించు కుంటూ, అక్కడి సమాజంలో లోతుగా పాతుకు పోతున్నది.

దత్తా : అదే వాస్తవం. అక్కడ ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రాబల్యం పెరుగుతున్నది. స్వయంసేవకులు రాజకీయ శక్తిగా కూడా ఎదుగుతున్నారు. అక్కడి హిందువులలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు మద్దతు పెరుగు తున్నది. అదే సిపియం కు భయం కలిగిస్తున్నది. సిపియం మైనారిటీల గురించి గొప్పగా చెప్పు కొంటున్నది. కాని సిపియంతో సహా కమ్యూనిస్ట్‌ పార్టీలలో ముస్లింలు, క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు? ఆ పార్టీ మద్దతుదారులలో 98 శాతంకు పైగా హిందువులే ఉన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఆ పార్టీకి మద్దతు పలకడం లేదు. అందుకే హిందువులలో తమ పార్టీకి పట్టు పోతున్నదని ఆ పార్టీ భయపడుతున్నది.

రా : దీనిని రాజకీయ సమస్యగా మీరు అంగీకరిస్తున్నారా ?

దత్తా : ఇది వారి ఆలోచన. మేము సామాజిక, సాంస్క తిక కార్యక్రమాలలో పనిచేస్తున్నాము.

రా : సిపియం కార్యకర్తలను మీరు చంపడం గురించి ఏమిటి ? ఒక సిపియం నాయకుడి కథనం ప్రకారం కమ్యూనిస్టులను చూసి 1957లో కాంగ్రెస్‌ భయపడితే, 2017లో బిజెపి భయపడుతున్నది. సిపియం అధికారంలో ఉన్న రాష్ట్రం కేరళ ఒక్కటే కావడంతో ఇక్కడ బలోపేతం కావడానికి బిజెపి, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. వారి లెక్కల ప్రకారం 3 వేల మంది సిపియం కార్యకర్తలు వికలాంగులైతే, 10 వేల మంది ఇళ్లపై దాడులు జరిగాయి. కలహగఢ్‌లో 8 సంవత్సరాల బాలుడిని, 68 సంవత్సరాల వయస్సు గల సరోజనమ్మను చంపారని అంటున్నారు. వారు ఆర్‌.ఎస్‌.ఎస్‌. పై చేస్తున్న ఆరోపణలు ఇవి.

దత్తా : నేను కూడా గణాంకాలు ఇవ్వగలను. ఇది నంబర్ల ఆట కాదు. వారు ఇళ్లపై ఎలా పెట్రోలు పోసి దగ్ధం చేశారో, మహిళలను ఎంత దారుణంగా చంపారో చెప్పగలను. ఎన్నికల సమయంలో జాతీయ రాజధానిలో విలేకరుల సమావేశం జరిపిన సదానందం మాస్టర్‌ రెండు కాళ్ళను నరికారు. తాజా ఉదాహరణలో రాజేష్‌ చేతులు నరికారు. ఇదంతా దారుణమైన క్రూరత్వం.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కేవలం ఒక్క సిపియం మాత్రమే ఇతర అన్ని సంస్థల పట్ల ఎందుకు శత్రుత్వం పెంచుకొంటున్నది ? రాజ్యాంగం ప్రకారం ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు సంస్థను విస్తరించుకొనే సర్వ హక్కులు ఉన్నాయి. అదే మేం చేస్తున్నాము. ప్రజా స్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయడమే సిపియం సంస్కతి. వారు మరెవ్వరిని సహకార సంఘాన్ని నమోదు చేసుకోనివ్వరు. పాఠశాల నడపనివ్వరు.

రా : ‘ఇది స్థానిక శాంతిభద్రతల అంశం కాదు, సిపియం కుట్ర’ అనడానికి మీ వద్ద ఎటువంటి సాక్ష్యం ఉన్నది ?

దత్తా : ప్రస్తుత ముఖ్యమంత్రికి కూడా అటువంటి అనేక కేసులతో సంబంధం ఉంది. స్వయంగా ఆయన పైనే అనేక కేసులు ఉన్నాయి.

రా : ముఖ్యమంత్రి స్వయంగానా ?

దత్తా : అవును. ఆయన పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనపై చాల కేసులు నమోదయ్యాయి. ఇతర పార్టీ నాయకులపై కూడా చాలా కేసులున్నాయి.

రా : ప్రస్తుతం వరుసగా జరుగుతున్న హత్యలకు ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ వ్యూహాత్మక మద్దతు ఉన్నదని అంటున్నారా దత్తాత్రేయజి ?

దత్తా : రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంది. చాల సందర్భాలలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సిపియం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ హత్యల సంఖ్య పెరుగుతున్నది. దీనిని ఏమనుకోవాలి ? దీనికి వారి వ్యూహాత్మక మద్దతు ఉంది. ఇది వ్యూహాత్మక మద్దతు కాదు, ‘బహిరంగ మద్దతు’ అని నేనంటాను. ఎందుకంటే సంఘటనలు జరిగినప్పుడు ఆ స్థలంలో ఉన్న పోలీసులు కళ్ళు మూసుకొంటున్నారు.

రా : అంటే దత్తాత్రేయజి ఆర్‌.ఎస్‌.ఎస్‌. అభిప్రాయం ప్రకారం కేరళ ప్రభుత్వ బహిరంగ మద్దతుతోనే ఆ రాష్ట్రంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా ?

దత్తా : అవును. తప్పని సరిగా అదే జరుగుతున్నది.

రా : పినరాయి విజయన్‌ను ఇంటర్వ్యూ చేసి నప్పుడు ‘ఈ హింస ఆగిపోవాలంటే ప్రధాని మోది, ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లి ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను నియం త్రించాలి’ అన్నారు. ‘అయితే వారినే ఆర్‌.ఎస్‌.ఎస్‌. నియంత్రిస్తోంది, కనుక వారు ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను అదుపు చేయలేరు’ అని కూడా అన్నారు.

దత్తా : సంఘటనలు జరిగిన ప్రతిసారి కొందరు ప్రముఖ వ్యక్తుల చొరవతో శాంతి సమావేశాలు జరిగినప్పుడు తమ కార్యకర్తలను అదుపు చేయలేమని సిపియం నాయకులే చెబుతున్నారు. ఒక పర్యాయం జస్టిస్‌ కష్ణయ్యర్‌ శాంతి చర్చలు జరిపారు. కొంతకాలం తర్వాత అవే సంఘటనలు పునరావతం అయ్యాయి. మా కార్యకర్తలను అదుపు చేయలేమని సిపియం పార్టీ చెప్పడమే సమస్య.

రా : సిపియం కార్యకర్తలను ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారు వెంటాడి చంపుతున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు.

దత్తా : అదే నిజమయితే ఇన్నాళ్లు ఈ విషయాన్ని వారు ఎందుకు ప్రస్తావించలేదు ? ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఈ విషయాలను ఇప్పుడే ప్రస్తావించడం లేదు. గత ఫిబ్రవరిలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శన జరిపాము. ఇంతకుముందు కూడా సాహిత్యం ప్రచురించాము. నిరసన ప్రదర్శనలు జరిపాము. కేరళలో కూడా నిరసనలు జరిపాము. కానీ ఎప్పుడూ సిపియం మాపై ఆరోపణలు చేయలేదు. కానీ మేము ఈ విషయాన్ని విస్తతంగా ప్రస్తావిస్తూ సత్యం చెబుతూండడంతో ఇప్పుడు మాపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. వారి ఈ ప్రయత్నం కేవలం విమర్శల నుండి తప్పించుకోవడానికే.

రా : సిపియం కార్యకర్తలకు ముఖ్యమంత్రి విజయన్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అబద్దాలు వ్యాప్తి చేయడంలో, హింసకు పాల్పడటంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో కార్యకర్తలకు శిక్షణ ఇస్తుంటారని ఆయన అంటున్నారు.

దత్తా : కేరళలోని సిపియం హంతకుల పార్టీ. నేరస్తుల పార్టీ. వారు చెప్పేది సత్యం కాదు. సత్యం ఏమిటనేది అక్కడకు ఎవరైనా వెళ్లి చూడవచ్చు. గ్రామం తరువాత గ్రామంలో, జిల్లా తరువాత జిల్లాలో చూడవచ్చు. ఇప్పటి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, అంతకు ముందు ముఖ్యమంత్రి కూడా తమ కార్యకర్తల తప్పు లేదని సమర్ధించుకున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా తమ పార్టీ కార్యకర్తలు హత్యలకు పాల్పడుతున్నారని ఒప్పుకోలేరు. అందుకే ఆర్‌.ఎస్‌.ఎస్‌. పై విమర్శలు చేస్తున్నారు.

వారు చెప్పేదే నిజమైతే సిపియం అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో ఇతరులపై ఎందుకని దాడులు జరగడం లేదు ? ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు మాత్రమే గాక ఇతర పార్టీల కార్యకర్తలు కూడా రాష్ట్రంలో దాడులకు ఎందుకు గురవుతున్నారు ? అదే నా ప్రశ్న.

రా : దత్తాత్రేయజి ! మీ దష్టిలో పరిష్కారం ఏమిటి ? ఈ హత్యల విష సంస్కతి నుండి కేరళను కాపాడటం ఎట్లా ?

దత్తా : వారే అందుకు చొరవ తీసుకోవాలి. వారు ఇంతకాలం తాము మానవ హక్కులు, దళితుల హక్కులు, మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నా మంటూ గొంతెత్తి అరుస్తున్న మాటలు నిజం అయితే వారే శాంతి పక్రియను ప్రారంభించాలి. ఎందుకంటే వారే అధికారంలో ఉన్నారు. పైగా గత చరిత్రను చూస్తే శాంతి చర్చలలో కుదిరిన అవగాహనకు సిపియం కార్యకర్తలు ఎప్పుడూ కట్టుబడి ఉండలేదు.

ముందుగా సిపియం తమ కార్యకర్తలను అదుపు చేసుకోవాలి. నేరస్తులు, గూండాలు వారి కార్య కర్తలుగా ఉండటం గతంలో పలు సంఘటనలలో రుజువైంది. రౌడీ షీటర్లుగా ఉన్నవారు పార్టీ కార్యకర్తలుగా చేరారు.

రా : అదే విధంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు సిపియం కార్యకర్తలపై దాడులు చేసిన సంఘటన లున్నాయి ? ప్రస్తుత వరుస సంఘటనలలో అది కూడా యదార్ధం కదా.

దత్తా : కొన్ని ప్రతీకార చర్యలుంటాయి. ఇప్పటివరకు 287 మంది ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలను వారు చంపారు. గడచిన గత 13 నెలల్లో 13 మంది ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలను చంపారు. కాబట్టి పోలీసులు తగు చర్య తీసుకోని పక్షంలో, ఇటువంటి చర్యలకు ప్రభుత్వం వ్యూహాత్మక మద్దతు ఇస్తున్నప్పుడు, ఎటువంటి మద్దతు లేని మా కార్యకర్తలు కొన్ని ప్రతీకార చర్యలకు పాల్పడి ఉండవచ్చు. అటువంటి సంఘటనలలో పాల్గొన్న చాలామంది ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. వారిలో చాలామంది కార్యకర్తలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

రా : అవన్నీ స్థానికంగా, క్రింది స్థాయిలో జరుగుతున్న ప్రతీకార చర్యలు అంటారా ?

దత్తా : అవును. అటువంటి ప్రతీకార చర్యలు సహజం. మానవ నైజం. అయితే మేం వాటిని సమర్ధించలేదు. ఆ కార్యకర్తలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

రా : అంటే హింసకు మీరు మద్దతు ఇవ్వరు అని మీరు అంటున్నారు.

దత్తా : అవును. సరిగ్గా అదే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. మేము నక్సలైట్ల హింసను వ్యతిరేకిస్తున్నాం. జిహాది ఉగ్రవాదుల హింసను వ్యతిరేకిస్తున్నాం. మార్క్సిస్టుల ఈ విధమైన హింసను కూడా మేం వ్యతిరేకిస్తున్నాం.

రా : ఇంతకుముందు కన్నూర్‌లో జరిగిన హింస ఇప్పుడు త్రివేండ్రంకు వ్యాప్తి చెందినట్లు కనబడు తున్నది. మీ అభిప్రాయం ప్రకారం ఎందుకు మొదట్లో అటువంటి హత్యలు కన్నూర్‌లో జరిగాయి ? ఇప్పుడు త్రివేండ్రంకు వ్యాప్తి చెందుతున్నాయి ?

దత్తా : అదే మేము కూడా ఆలోచిస్తున్నాము. కుట్ర పూర్వకంగా, వ్యూహాత్మకంగా కన్నూరు పరిస్థితులను నెమ్మదిగా త్రివేండ్రంకు వ్యాప్తి చేస్తున్నట్లు భావిస్తున్నాము. మరొక కారణం కూడా ఉంది. అరెస్ట్‌ అయిన కొందరు సిపియం కార్యకర్తలు కోర్ట్‌ నుండి బెయిల్‌ పొందిన వారు కన్నూర్‌ జిల్లాలో ప్రవేశించరాదని కోర్టు షరతు విధించింది. వారు ఇప్పుడు త్రివేండ్రంకు విస్తరించారు. పైగా హత్యలు, దాడులు చేయడంలో శిక్షణ పొందిన వారు ఇప్పుడు త్రివేండ్రం కేంద్రంగా, ఇంకా చెప్పాలంటే త్రివేండ్రం శివార్లు కేంద్రంగా పనిచేస్తున్నారు. అందుకే ఈ హత్యల పరంపర త్రివేండ్రంకు వ్యాప్తి చెందుతున్నది. మరోవంక వారు ఇతర శక్తులతో కుమ్మక్కు కావడం కూడా త్రివేండ్రంలో జరుగుతోంది.

రా : జాతీయ స్థాయిలో మీరు చేపట్టిన ప్రచారం వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతుందా ? బయటి వారికి ఇది సంఘపరివార్‌ విస్తత ఎత్తుగడలో భాగంగా కనిపిస్తున్నది.

దత్తా : ఎందుకని ప్రతిసారి ఇదంతా సంఘ్‌ పరివార్‌ వ్యూహం అని అంటున్నారు ? సిపియం వ్యూహం అని ఒక్కసారి కూడా అనరే ?

రా : అదికాదు. బయటి వ్యక్తులు చూస్తున్నది కేరళ నుండి సిపియంను తొలగించడం కోసం ఇది విస్తతమైన రాజకీయ వ్యూహమని. సిపియం కూడా అట్లాగే భావిస్తున్నది. బిజెపి పాతుకుపోవడానికి సంఘపరివార్‌ వాతావరణం సష్టిస్తున్నది అని.

దత్తా : సంఘం ఇటువంటి పనులు చేయదు. వ్యక్తులను కలుపుకొంటూ తనపని తాను చేసుకు పోతుంది. బిజెపికి బలం పుంజుకొని, అధికారంలోకి రావడానికి తన సొంత రాజకీయ, ఎన్నికల వ్యూహం ఉంటుంది. సిపియంను కేరళ నుండి తొలగించ డానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఏం చేయనవసరం లేదు. ప్రజలే చేస్తారు. గత రెండు మూడు సార్లుగా సిపియం అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ అన్ని అభివద్ధి అంశాలు తిరోగమనం పడుతున్నాయి.

రా : కేరళలోని కొన్ని ప్రాంతాలలో వ్యాప్తి చెందుతున్న తీవ్రవాద ధోరణులను మీరు ఏ విధంగా చూస్తున్నారు ? మనదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్‌, సిరియాలలో చేరిన ఐయస్‌ఐయస్‌ యువకులలో అత్యధికులు కేరళ నుండి వస్తున్నవారే. ఇది ఎలా జరుగుతున్నదని మీరు భావిస్తున్నారు ? ఇది ఎంత ప్రమాదకరమని అనుకొంటున్నారు ? ఇటువంటి ప్రభావాన్ని ఎట్లా అదుపు చేయాలనుకొంటున్నారు?

దత్తా : ఈ పరిణామానికి, కుమ్మక్కు కు మధ్య సంబంధం ఉన్నదని భావించ వలసి వస్తున్నది. ఐఎస్‌ఐఎస్‌లో చేరుతున్న వారిలో అత్యధికులు కన్నూర్‌ జిల్లాకు చెందిన వారే కావడం వాస్తవం. కొద్ది సంవత్సరాల క్రితం ఎన్‌ఐఎ దక్షిణాదిన ఉగ్రవాదుల గురించి దర్యాప్తు చేస్తున్న సమయంలో కేరళలోని పార్టీ గ్రామం కణ్హమనాల లోపల ఐదుగురు ఉగ్రవాదులను కనుగొన్నారు. ఆ గ్రామంలో సిపియం వారు గాక మరెవ్వరు ప్రవేశించడానికి వీలు లేదు.

ఎన్‌ఐఎ ఆ గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ఐదుగురు జిహాది ఉగ్రవాదులను కనుగొన్నారు. అందుకే ఏదో ఒక స్థాయిలో రాడికలైజేషన్‌ చేయడంలో సిపియం క్యాడర్‌ ప్రణాళికాబద్దంగా వ్యూహాత్మకంగానో, మరోవిధంగానో జిహాదీలతో చేతులు కలుపుతున్నారు.

రా : ఇది చాల తీవ్రమైన ఆరోపణ అని, ఇది ఏ విధంగా తమకు ఉపయోగపడుతుందని సిపియం అనవచ్చు. తమ యువకులను ఎందుకని రాడికలైజేషన్‌ చేస్తాం ? అనీ అనవచ్చు.

దత్తా : మీరు వారిని ఇంటర్వ్యూ చేశారా ?

రా : మేము చేయబోతున్నాం.

దత్తా : వారిని చెప్పనివ్వండి. నేను సమాధానం చెబుతాను. ఎందుకంటే సిపియం గ్రామంలో ఐదుగురు ఉగ్రవాదులను ఎన్‌ఐఎ అరెస్ట్‌ చేయడం వాస్తవం. జిహాది ఉగ్రవాదులు అక్కడ శాంతి కోసం ఉన్నవారు కాదు కదా.

రా : చివరి ప్రశ్న. హింస పరంపరను తిప్పి కొట్టడానికి, ఇస్లాం రాడికలైజేషన్‌ను అడ్డుకోవడానికి ఏం చేయాలి ?

దత్తా : సిపియం నిజంగా ఆ విధంగా చేయాలి అనుకొంటే వారు ముందుకు రావాలి. అయితే నా సందేహాలు నాకున్నాయి. ఎందుకంటే కమ్యూ నిస్టులకు ఇటువంటి అంశాల పట్ల నమ్మకం లేదు. ఏ విధంగానయినా అధికారంలోకి రావాలని, ఏ విధంగానయినా అధికారంలో కొనసాగాలని కమ్యూనిస్టులు కోరుకుంటారు. చరిత్ర అదే చెబుతుంది. క్రమంగా వారి గురించి ప్రజలు తెలుసుకుంటారు. వారిని అదుపు చేస్తారు.

ఇప్పుడు నెమ్మదిగా దేశంలోని ఇతర ప్రాంత ప్రజలు ఉగ్రవాదం ప్రభావం గురించి, రాడికలైజేషన్‌ గురించి అర్ధం చేసుకొంటున్నారు. కేరళ ప్రజలు కూడా అర్ధం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అయితే సరైన విధంగా అవగాహన కలిగించడం; కేంద్రప్రభుత్వం, మరికొన్ని వర్గాల నుండి తగు చర్యలు తీసుకోవడం కూడా అవసరం. ఎటువంటి ఉగ్రవాద చర్య, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యనైనా వాటిని ప్రజలకు తెలియచెప్పాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రయత్నం చేస్తున్నది. అదే మా వ్యూహం. అది పనిచేస్తుంది.

(జాగృతి సౌజన్యం తో)