Home Telugu Articles ‘సెక్యులర్’ పదాన్ని దేశ వ్యతిరేక శక్తులకు లాభసాటిగా మార్చిన రాజకీయాలు

‘సెక్యులర్’ పదాన్ని దేశ వ్యతిరేక శక్తులకు లాభసాటిగా మార్చిన రాజకీయాలు

0
SHARE

సెక్యులరిజం పుట్టుక, దాని పూర్వరంగం కథ అంతా చెప్పి ఓ ఐదో క్లాసు విద్యార్థిని ‘దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది?’ అని అడగండి.

‘మతం చేసే పాపిష్టి పనులను రాజు సమర్థించకూడదు. రాజు చేసే పాపాలను మతం సహించకూడదు. తమ మతం మాత్రమే గొప్పదనీ, దానిని అంగీకరించనివాళ్లను బతికుండగానే తగలబెడతామనీ, తమ మతంలోకి మారకపోతే చంపేస్తామనీ చెప్పే తప్పుడు మతాలను రాజ్యంలో ఉండనివ్వకూడదు. జన జీవితం మీద వాటి నీడకూడా పడనివ్వకూడదు’ అని తనకు నచ్చిన భాషలో చెబుతాడు.

పెంపకం, శిక్షణ సరిగా ఉన్న చిన్న పిల్లలకు కూడా ఇట్టే స్ఫురించే ఈ కామన్‌సెన్సు పాయింటు స్వతంత్రం అనబడేది వచ్చాక మన కర్మ కొద్దీ దాపురించిన రాజకీయ మహనేతల బుర్రకెక్కలేదు. వారి వంకర బుద్ధికి తగ్గట్టే వారి ఆలోచనలూ, వారు వేసిన అడుగులూ వంకరటింకరగా సాగాయి.

ఇక్కడో సంగతి గుర్తుంచుకోవాలి. మోసాలు, కుట్రలు చేసి హిందూ దేశాన్ని ఇంగ్లీషువాళ్లు దుర్మార్గంగా ఆక్రమించాక ఇంగ్లీషు విద్యావిధానం క్రిస్టియన్‌ మిషనరీ స్కూళ్లు, కాలేజీల ద్వారా దేశవ్యాప్తమైంది. దానివల్ల ఒక మేలు ఏమిటంటే పాశ్చాత్య విజ్ఞానం, ఆధునిక పాశ్చాత్య దృక్పథం మన విద్యావంతులకు అబ్బి, వారి ఆలోచనాధోరణిని బాగా ప్రభావితం చేశాయి. పాశ్చాత్య నాగరికత నుంచి ఎన్నో భావనలను అలవరచుకున్న భారత విద్యాధిక వర్గాలను ‘సెక్యులరిజం’ ఆకట్టుకోలేక పోయింది. విదేశీ పాలన నుంచి విముక్తమయ్యాక స్వరాజ్యం రూపురేఖలు ఎలా ఉండాలన్న దానిపై ఆ కాలపు బుద్ధిజీవుల్లో సాగిన ఖండన మండనల్లోనూ సెక్యులరిజం ఊసు, ఊపు ఎక్కడా కానరావు.

దానికి కారణమేమిటంటే.. పరమత సహనమనేది అనాదిగా భారతీయుల రక్తంలో రక్తం. ప్రాణంలో ప్రాణం. ఒక మతాన్ని అందలమెక్కించి పూజించి వేరొక మతాన్ని వేధించి వేటాడటమనేది మనకు తెలియవచ్చిన పదివేల సంవత్సరాల హిందూదేశ చరిత్రలో ఎన్నడూ లేదు. రాజులు ఏ మతానికి చెందినవారైనా, మధ్యలో ఇష్టపడి ఏ మతానికి మారినా, తమకు విరుద్ధమైన ఇతర మతాలను ఎన్నడూ నిరాదరించలేదు. బలవంతపు మతమార్పిడులను ఈ దేశంలో ఏ ప్రభువూ ఏ కాలంలోనూ ప్రోత్సహించలేదు. అనుమతించలేదు.

రాజు శైవుడైనా, వైష్ణవుడైనా, శాక్తేయుడైనా, బౌద్ధుడైనా, జైనుడైనా రాజ్యంలో పరిపాలన, న్యాయ విధానం అన్ని మతాలకూ శిరోధార్యమైన ధర్మశాస్త్రాల ప్రకారం, సంప్రదాయబద్ధంగా నడిచేవి. రాజు వ్యక్తిగతంగా ఏ మతాన్ని అనుసరించినా, రాజ్యానికి అది అధికారిక మతం కాదు. రాజ్యానికి సంబంధించినంతవరకూ దాని ఎక్కువా లేదు. అన్యమతాలకు తక్కువా లేదు. వేల సంవత్సరాల కిందటే అశోకుడు, హర్షుడు వంటి చక్రవర్తులు వెలువరించిన శాసనాలు ఇదే విషయం స్పష్టం చేస్తాయి. క్రీ.శ.6-10 శతాబ్దాల నాటి ఎల్లోరా గుహల అద్భుత శిల్ప సంపదనే చూడండి. 17 హైందవ గుహలు, 12 బౌద్ధ గుహలు, 5 జైన గుహలు చరణాద్రి కొండలలో అపురూప శిల్పాలతో పక్కపక్కనే ఉండి భారతదేశానికి ఆదినుంచి గర్వకారణమైన మత సామరస్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి.

మతాన్ని వ్యాప్తి చేయటానికి రాజ్యాధికారాన్ని (స్టేట్‌ పవర్‌ని) విచ్చలవిడిగా దుర్వినియోగం చేయటం, గిట్టని మతాన్ని అనుసరించే వారిని సామూహికంగా చంపెయ్యటం, బతికుండగానే తగులబెట్టటం, వారి జనావాసాలను నాశనం చెయ్యటం లాంటి దారుణాలు భారతదేశంలో ఇస్లామిక్‌ దండయాత్రలకు పూర్వం ఏనాడూ లేవు. మతాన్ని, రాజ్య పాలనను వేరు వేరుగా చూడటమే మన జాతి లక్షణం. మధ్యయుగాల్లో క్రైస్తవమూ రాజరికమూ కుమ్మక్కయి ఐరోపా దేశాల్లో సాగించిన దురాగతాల వంటివి భారతదేశ మౌలిక తత్వానికి విరుద్ధమైనవి. కాబట్టి మతాన్ని, రాజ్యవ్యవస్థను వేరువేరుగా చూడాలన్న పాఠాన్ని పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవలసిన ఖర్మ భారతీయులకు పట్టలేదు.

దాదాపు ఏడు శతాబ్దాల పాటు ఇస్లామిక్‌ టెర్రరిజాన్ని భారతదేశం భయానకంగా అనుభవించింది. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్‌ మొదలుకొని 18వ శతాబ్దంలో నాదిర్షా, అబ్దాలీల వరకూ ఇస్లామిక్‌ వరుస దండయాత్రల్లో వేలాది ప్రాచీన హిందూ దేవాలయాలు నేలమట్టమయ్యాయి. లక్షలమంది హిందువుల ప్రాణాలు, మానాలు, సంపదలు నాశనమయ్యాయి. 12వ శతాబ్దంలో మహ్మద్‌ ఘోరీ మొదలుకొని 17వ శతాబ్దంలో ఔరంగజేబు దాకా దేశాన్ని చెరపట్టిన ప్రతి మహమ్మదీయ రాజు ఒక మహా హంతకుడే. రాజ్యాధికార మంతటినీ ఇస్లాంలోకి మతాంతరీకరణ లకు, హిందువుల మెడమీద కత్తిపెట్టి బలవంతపు మతమార్పిడులకు అడ్డుగోలుగా దుర్వినియోగం చేసినవాడే. మతం మారని హిందువులపట్ల దారుణ దుర్వివక్ష చూపి, దుర్మార్గపు ఆంక్షలతో అవమానించి, నానావిధాల కాల్చుకుతిన్న వాడే. క్రైస్తవం చేతిలో ఐరోపా దేశాలు పడిన బాధల కంటే, అనుభవించిన రాజ్య బీభత్సం కంటే వెయ్యిరెట్లు ఎక్కువే ఇస్లామిక్‌ దురాక్రమణ దారుల మూలంగా భారతదేశం అనుభవించింది.

ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదుల వరస దాడుల నుంచి ఎట్టకేలకు కాస్త తెప్పరిల్లామో లేదో ఇంకో విదేశీ మతమైన క్రైస్తవం దాడులు మొదలయ్యాయి. 16వ శతాబ్దంలో గోవాలో, ఇతర ప్రాంతాల్లో అధికారం చేజిక్కించుకున్న క్రైస్తవులు తమ మతాన్ని వ్యాపింపజేయటానికి, దానిలో చేరేందుకు నిరాకరించిన హిందువులను చిత్రహింసలు పెట్టి చిత్రవధ చేసేందుకు ఎన్నెన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారన్నది రక్తసిక్త ఘోర చరిత్ర. కాలం అనుకూలించి ఉంటే అవే ఘాతుకాలను పోనుపోను దేశమంతటా ఒడిగట్టి మత బీభత్సంలో తమ యూరప్‌ రికార్డులను బహుశా ఇండియాలో జయప్రదంగా బద్దలు కొట్టగలిగేవారే. వారి ఖర్మ కొద్దీ, మన అదృష్టం కొద్దీ అదే సమయాన ఐరోపాలో సంస్కరణ వాదం ప్రబలి, క్రైస్తవ మతోన్మాదం మీద, రాజకీయ వ్యవస్థను అది భ్రష్టుపట్టించిన దుర్విధానం మీద ప్రజలు ఆగ్రహించి, మత రాజకీయాలను అంతమొందించారు. క్రైస్తవ మతం ఉక్కు కౌగిలినుంచి రాజకీయ వ్యవస్థ బయటపడటంతో ఇండియాను ఆక్రమించిన ఆంగ్లేయులు రాజకీయ వ్యవహారాల్లో ఆ మతానికి కాస్త దూరం జరిగారు. భారతదేశ మూలాలను వేటు వేసే పాపిష్టి వ్యూహంలో భాగంగా మిషనరీ స్కూళ్లను, కాలేజీలను ప్రోత్సహించి, మతాంతరీకరణలకు యథాశక్తి ఊతం ఇచ్చినా పరిపాలనలో క్రైస్తవానికి పొలిటికల్‌ ఏజంట్లుగా కాక స్వతంత్రంగా వ్యవహరించారు. కాబట్టి ఘోరీలు, ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొగలాయిల హయంలో ఇస్లామిక్‌ టెర్రర్‌ వలె బ్రిటిష్‌ హయాంలో క్రిస్టియన్‌ టెర్రర్‌ భారతదేశాన్ని బాధించలేదు. అయితేనేమి? మిషనరీ స్కూళ్లు, మిషనరీ హాస్పిటళ్ల ద్వారా హిందువులను లోబరచుకొని, రకరకాలుగా ప్రలోభ పెట్టి, విద్యావంతుల మెదళ్లలోకి పథకం ప్రకారం హిందూమతం, హిందూ సంస్కృతి, ప్రాచీన ఉజ్జ్వల చరిత్రల మీద ద్వేషాన్ని ఎక్కించి; క్రైస్తవ మూఢత్వాన్ని చొప్పించారు. క్రైస్తవ మతవర్గాలు ఇంగ్లీషు వాళ్ల ఏలుబడిలో దేశానికి చేసిన హాని సామాన్యమైనది కాదు.

యూరప్‌లో క్రైస్తవం లాగా ఇండియాలో రాజ్యాధికారాన్ని తన ఆధిపత్య కాలంలో దుర్వినియోగపరచిందీ, మహా బీభత్సాలను సృష్టించి చివరికి దేశాన్ని ముక్కలు చేసింది ఇస్లాం! అన్ని విషానుభవాల తరువాతైనా మనం గుణపాఠం నేర్వాలి కదా? మళ్లీ అటువంటి ఘోర దురాగతాలకు ఆస్కారం లేకుండా గట్టి కట్టడి చేయవద్దా? భారతదేశం మొత్తాన్ని ఇస్లామీకరించి దారుల్‌ ఇస్లాంగా మార్చడం ధ్యేయమైన ఇస్లాంనూ, ఇండియాను క్రైస్తవీకరించాలని కంకణం కట్టుకున్న క్రైస్తవాన్ని కాస్త కంట్రోలు చేసి, భారతదేశం భారతదేశంగా మిగిలేందుకూ, దానికి ప్రాణమైన సనాతన ధర్మం, ఆ ధర్మానికి ప్రతిరూపమైన హిందూమతం బంధనాలు తెంచుకొని స్వరాజ్యంలో వర్ధిల్లేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవద్దా? వాస్తవంగా జరిగిందేమిటి?

స్వాతంత్య్ర పోరాటకాలంలో తన రాతల్లోగాని, ఉపన్యాసాల్లోగాని ‘సెక్యులరిజం’ ఊసే ఎత్తని జవహర్‌లాల్‌ నెహ్రూ స్వతంత్రం వచ్చాక సెక్యులరిజం మతానికి మహా ప్రవక్తగా మారాడు. పాశ్చాత్య రాజకీయ పరిభాష నుంచి తనకు ఫాషనబుల్‌గా కనిపించిన సెక్యులరిజం పదాన్నయితే కొట్టేశాడు. పాశ్చాత్య దేశాల్లో ఆ పదాన్ని ఏ ఉద్దేశంతో వాడారో దానికి మాత్రం జెల్లకొట్టాడు. అర్థం మొత్తం మార్చేశాడు. సంకుచితం, మహామూర్ఖం అయిన (Closed creed) క్రైస్తవం మీద హేతువాదుల, మానవతావాదుల తిరుగుబాటుకు ప్రతీక, బహుళత్వానికి సంకేతం అయిన పాశ్చాత్య సెక్యులరిజాన్ని అతి తెలివిగా, భ్రష్టు పట్టించాడు. ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం లాంటి Closed creed పిడివాదాలకు దాన్ని రక్షా కవచాన్ని చేసి, బహుళత్వానికి పెట్టింది పేరయిన ఉదార హిందూ మతాన్ని కుళ్లు కొద్దీ కుళ్లబొడిచాడు. మోసపూరిత వాగాడంబరంలో ‘సెక్యులరిజం’ పదాన్ని దేశీయ సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని, జాతి ఉజ్జ్వల వారసత్వాన్ని ద్వేషించే ప్రతి పగవాడికీ వాటమైన, లాభసాటి అయిన రాజకీయ పంచాక్షరిగా మార్చివేశాడు. విఖ్యాత గ్రంథకర్త సీతారామ్‌ గోయల్‌ చెప్పినట్టు-

The first Prime Minister of independent India became the leader of a Muslim-Christian-Communist Combine. Now everything which Hindus held sacred could be questioned, ridiculed, despised and insulted. At the same time the darkest dogmas of Islam and Christianity were not only placed beyond the pale of discussion but also invested with divinity any one who asked any inconvenient questions about them invited the attention of laws which were made more and more punitive.

(Pseudo-Secularism, Sitaram Goel, P.7)

(స్వతంత్ర భారత తొలి ప్రధాని ముస్లిం- క్రిస్టియన్‌-కమ్యూనిస్టు కూటమికి నాయకుడయ్యాడు. హిందువులు పవిత్రంగా తలిచే దేన్నయినా ఇప్పుడు ప్రశ్నించవచ్చు; గేలిచేయవచ్చు; ఏవగించుకోవచ్చు; అవమానించవచ్చు! అదే సమయంలో ఇస్లాం, క్రైస్తవాలకు సంబంధించిన మహామూఢ సిద్ధాంతాలను చర్చకు అతీతమైనట్టు చూపెట్టటమే కాదు. వాటికి దివ్యత్వాన్ని ఆపాదించారు. వాటి గురించి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసేవారి మీద చట్టాలు దృష్టి పెడతాయి. ఆ చట్టాల్లో శిక్షలను పోనుపోను తీవ్రం చేశారు.)

– ఎం.వి.ఆర్‌.శాస్త్రి

(జాగృతి సౌజన్యం తో)

(ఈ వ్యాసం మొదట 29 జూలై 2019 నాడు ప్రచురించబడింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here