Home Views ప్రాచీన రాజనీతి – గుప్తచర వ్యవస్థ (పార్ట్ – 2)

ప్రాచీన రాజనీతి – గుప్తచర వ్యవస్థ (పార్ట్ – 2)

0
SHARE

– డా।। పి. శశిరేఖ

రెండవ భాగం

కౌటిల్యుని అర్థశాస్త్రానుసారం గుప్తచర విభాగ పదవులు నిర్వహించటానికి కావలసిన అర్హతలూ, వారు నిర్వహించే విధులూ ఇలా ఉంటాయి.

సంస్థ

 1. కాపటికః  పరమర్మజ్ఞః, ప్రగల్భః ఛాత్రః కాపటికః
  ఇతరుల రహస్యాలను తెలుసుకొనగలగినవాడూ, ధైర్యంగా మాట్లాడేవాడు (ప్రగల్భః) అయిన విద్యార్థి ‘కాపటికుడు’.
 1. ఉదాస్థితుడు‘‘పవ్రజ్యా ప్రత్యవసితః ప్రజ్ఞాశౌచయుక్తః ఉదాస్థితః’’

కొంతకాలం పరివ్రాజకుడుగా దేశాటనం చేసి ఆ సన్యాసత్వాన్ని విరమించుకున్నవాడు ఉదాస్థితుడు. బుద్ధి బలమూ, సచ్ఛీలతా కల్గిఉన్న అలాంటి పరివ్రాజకుణ్ణి గూఢచారిగా నియమించాలి. ఆ సన్యాసి వేషంలోనే ఉంటూ తన శిష్యబలంతో సమాజంలోని వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలి. ఆ శిష్యులతో వ్యవసాయం, వర్తకం మొదలైనవి చేయించి ఆ ధనంతో వారు జీవించటమేగాక మరెవరైనా పరివ్రాజకులు ఇలాంటి వృత్తిలో చేరదల్చుకుంటే వారికి సహాయం చేయాలి. వీరికి రాజుగారి నుండి కూడా కావలసిన ధనం లభిస్తుంది.

 1. గృహపతి వ్యఞ్జనః‘‘కర్షకో వృత్తి క్షీణః ప్రజ్ఞా శౌచయుక్తః గృహపతికవ్యఞ్జనః’’.
  బుద్ధిబలమూ, సత్ప్రవర్తనా ఉండి, వ్యవసాయంలో నష్టపోయిన వ్యక్తిని ‘‘గృహపతిక వ్యఞ్జనుడి’’గా నియమించాలి. అనగా అతడు గృహపతిగా (గృహస్థుగా) పైకి కన్పిస్తాడు. కానీ రాజుగారికి గూఢ పురుషునిగా వ్యవహరిస్తాడు. రాజు అతనికి కావలసిన ధన సహాయం అందించి, ఉన్నచోట నుండే అతడు తన తోటివారి ద్వారా సమాచార సేకరణ చేసేట్లుగా చూడాలి.
 1. వైదేహక వ్యఞ్జనః‘‘వాణిజకో వృత్తిక్షీణః ప్రజ్ఞా శౌచయుక్తః వైదేహక వ్యఞ్జనః’’.

   వ్యాపారంలో నష్ట పోయినవాడూ, బుద్ధి పాటవమూ, సత్ప్రవర్తనా గలవాడూ వర్తకుని వేషంలోనే తన స్థానంలోనే ఉంటూ తనతోటి వారితో గూఢ పురుష కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అతనికి కావలసిన ధన సహాయం రాజుగారి నుండి లభిస్తుంది.

 1. తాపసవ్యఞ్జనః‘‘ముణ్డోజటిలో వా వృత్తికామః తాపసవ్యఞ్జనః’’.

 స్థిరమైన వృత్తి కావాలనుకునే బోడితల సన్యాసినిగానీ, జడల సన్యాసినిగానీ ‘‘తాపసవ్యఞ్జన’’ గూఢ పురుషునిగా నియమించాలి. అతడు సన్యాసివేషంలోనే నగర సమీపంలో ఉండి, అందరికి కన్పించేట్లు నెలకో, రెండునెలలకో ఒక పిడికెడు పచ్చగడ్డిగాని, లేదా పచ్చికూర తింటుండాలి. రహస్యంగా మాత్రం యథేచ్చగా భుజించవచ్చు. పైన చెప్పిన వైదేహకవ్యఞ్జను’ని అనుచరులు వచ్చి ఇతడు గొప్ప సిద్ధుడనీ, భూత, భవిష్యత్తులు చెప్పగలవాడనీ ప్రచారం చేయాలి. ఈ విధంగా ఉంటూ నగరానికి వచ్చే పోయేవాళ్ల విషయాలు కనిపెట్టి ద్రోహులు, అపరాధులు ఉంటే వారిని గురించి తెలియజేస్తుండాలి.

ఇంతవరకు చెప్పిన ఐదుగురి పేర్లలోనూ ‘వ్యఞ్జన’ అనే పదం ఉంది. అనగా కపటరూపం ధరించిన వాళ్లు అని అర్థం. పైన చెప్పిన ఐదుగురు నిజానికి ఆయా వృత్తుల్లో లేనప్పటికీ అలా కన్పిస్తారు కాబట్టి వారిని ఆ పేర్లతోనే వ్యవహరిస్తారు.

ఈ ఐదుగుర్నీ రాజుగారు (ప్రభుత్వం) ధనాన్నీ, సత్కారాన్ని అందించి ఆదరించాలి. అలా రాజు ఆదరణ పొందే  వీరు రాజోద్యోగుల ప్రవర్తనను కనిపెట్టి రాజుగారికి తెలియజేయాలి.

‘‘పూజితాశ్చార్థమానాభ్యాం రాజ్ఞా రాజోపజీవినామ్‌
జానీయుః శౌచమిత్యేతాః పఞ్చ సంస్థాః ప్రకీర్తితాః’’
(
కౌటిలీయార్థశాస్త్రం 1-11 చివరి శ్లోకం)

సంచార గూఢ పురుష భాగం – సంచార గూఢచారి విభాగ కార్యకలాపం (Network) అతి విస్తృతమైంది. కౌటిలీయార్థశాస్త్ర ప్రకారం ‘గూఢచారి’ లేని సందర్భం లేదన్పిస్తుంది.

అంతేకాకుండా అన్ని రకాల వ్యక్తులనూ ఏదోవిధంగా రాజకార్యం నిర్వహించేందుకు నియమించేవారు. ఆర్థికంగా, మానసికంగా బలహీనులైన వారికీ, వితంతువులకీ, అనాథ స్త్రీలకీ కూడా ఈ గుప్తచర విభాగంలో పని లభించేది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సత్త్రీ –   ‘‘యే చాస్య సమ్బన్ధినో- వశ్య భర్తవ్యాస్తే లక్షణ మఙ్గవిద్యాం జమ్భక విద్యాం మాయా గత మాశ్రమ ధర్మం నిమిత్త మన్తర చక్ర మిత్యధీయానాః సత్రిణః సంసర్గ విద్యాం వా’’.

ఎవరైతే రాజునకు బంధువులై ఉండి, మరో ఆధారం లేని కారణంగా రాజును ఆశ్రయించి అతని పోషణలోనే ఉంటారో అట్టివారిని ‘సత్త్రి’ గూఢచారులుగా నియమించాలి. అయితే వీరికి సాముద్రిక శాస్త్రం, అంగవిద్య, వశీకరణ విద్య, ఇంద్రజాలం, ధర్మశాస్త్రం, శకునశాస్త్రం ఇత్యాది విద్యల్లో దేనితోనైనా పరిచయం ఉండి ఉండాలి. వీరిని రాజు అలాంటి విద్యలచేతనే సమాచారం రాబట్టటానికి నియమిస్తాడు.

తీక్ష్ణః – ‘‘యే జనపదే శూరా స్త్యక్తాత్మానో హస్తినం వ్యాలం వా ధ్రవ్యహేతోః ప్రతియోధయేయుస్తే తీక్ష్ణాః

జనపదం (రాష్ట్రం)లో ఉండే ప్రాణాలకు తెగించిన శూరులు, ధనం కోసం ఏనుగునైనా, మదపుటేనుగునైనా ఎదుర్కొనే వాళ్లు ‘తీక్ష్ణులు’. వీళ్లు ధనం కోసం ఎంత సాహసానికైనా సిద్ధపడతారు. వీళ్లని రాజు తగిన విధంగా ఉపయోగించుకోవాలి.

రసదః –  ‘‘యే బన్ధుషు నిః స్నేహాః క్రూరాశ్చాలసాశ్చతే రసదాః’’

బంధువులపట్ల స్నేహభావం లేనివారూ, క్రూర స్వభావులూ, మందకొడిగా ఉండేవారు ‘రసదు’ డనే గూఢచారి పదవికి తగినవారు.‘రసదు’డనగా ‘విషం’ ఇచ్చేవాడు. ద్రోహులను, శత్రు రాజ్యానికి సంబంధించిన వాళ్లను రహస్యంగా రూపుమాపటానికి ఈ గూఢచారిని నియమిస్తారు. స్నేహభావం ఉన్నవాడు ఇలాంటి పనిని చేపట్టలేడు కాబట్టి పై లక్షణాలున్నవాడే వీనికి తగినవాడు.

‘‘పరివ్రాజికా వృత్తికామా, దరిద్రా, విధవా, ప్రగల్భా, బ్రాహ్మణీ, అన్తపురే కృత సత్కారా మహామంత్ర కులాన్యధి గచ్ఛేత్‌’’ ‘‘ఏతయా ముణ్డా వృషల్యః వ్యాఖ్యాతాః’’

 వృత్తి (ఉద్యోగం) కావాలనుకునే సన్యాసిని , నిర్ధనురాలైన స్త్రీ, విధవ, ధైర్యంగా సమయానుకూలంగా మాట్లాడే స్త్రీ, అంతఃపురంలో గౌరవించబడే బ్రాహ్మణ స్త్రీ – వీరిని ప్రధానోద్యోగుల గృహాలకు వెళ్లి వారి సమాచారం సేకరించేందుకు నియమించాలి. అలాగే బోడితల సన్యాసినినీ, శూద్ర స్త్రీని గూడా గూఢచారి విభాగంలో నియమించవచ్చు.

ఈ ‌విధంగా ఆర్థిక, మానసిక పరిస్థితి బాగులేని వారిని గూడా వారికి తగిన విధుల్లో నియమించి ‘అనాథ’ అనే పదం లేకుండా చేసాడు ఆచార్య కౌటిల్యుడు.

వీరుగాక ‘అపసర్ప’ అనే గూఢచారులను గురించి ‘కంటక శోధనమనే’ అధికరణంలో ఉంది.

ఇక వీరందరి విధులను గురించి వివరంగా చెప్పాలంటే ఒక ఉద్గ్రంథమౌతుంది. అమాత్యుల నియామకంలోనూ, సమాహర్తకు (కలెక్టర్‌కు) నగరానికి సంబంధించిన విషయాలు అందించడంలోనూ ఈ గుప్తచరుల పాత్ర ఎంతో ఉంది. స్వదేశంలో ఉన్న తీవ్రవాదుల్ని అణచివేయటం, అసంతృప్తితో ఉన్న ప్రజల మనస్సుల్లో సద్భావం కల్గించటం వీరి కర్తవ్యం. విదేశాల్లో ఉండి అక్కడ ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లని తమకనుకూలంగా మార్చటం ఉభయ వేతనులైన గూఢచారుల పని. వారు రాజ్యంలో ప్రధానోద్యోగుల్ని అన్ని వేళలా కనిపెట్టి ఉండాలి.

స్వదేశంలో ఎవరిని కనిపెట్టి ఉండాలో, విదేశంలో ఎలా ‘ఉన్నతోద్యోగుల్ని’ తమ కనుకూలంగా మార్చుకోవాలో అర్థశాస్త్రంలో వివరంగా ఉంది.‘‘సంస్థ గుప్తచరులకు సంచార గుప్తచరుల నుండి సమాచారం అందుతుంది. ఇది ఒక శృంఖలాబద్ధంలా (chain) ఉంటుంది.

అర్థశాస్త్రంలో ప్రధానోద్యోగుల్ని మహామాత్రులనీ, తీర్థులనీ వ్యవహరించటం కన్పిస్తుంది. ఈ ‘తీర్థ’  మాఘకావ్యంలో కూడా అదే అర్థంలో ప్రయుక్తమైంది.

‘‘కృత్వా కృత్యవిదస్తీర్థై రంతః ప్రణధయః పదమ్‌,
విదాం కుర్వన్తు మహతస్తలం విద్విషదమ్భసః’’. (మాఘకావ్యం 2-111)

‘త్యవిద్‌’ అనగా రాజుపట్ల అభిమానంలేని వ్యక్తిని ఎలా వశం చేసుకోవాలో తెల్సినవాడు. అలాంటి గూఢచారులు ప్రధానోద్యోగుల అంతఃపురాల్లో అడుగు పెట్టి అతిగంభీరమైన వారి మనస్సులను తెల్సుకోవాలి. ఈ విషయాన్ని శ్లేష మూలకంగా ఇలా చెప్పాడు కవి ‘‘ఏ విధంగానైతే సోపానాల ద్వారా తీర్థ (పుష్కరిణి) జలాలలోనికి వెళ్లి జలపు అగాధాన్ని తెల్సుకుంటారో అలాగే ప్రధానోద్యోగుల ద్వారా వారి అంతఃపురాల్లో చేరి శత్రురాజుల అంతరంగ రహస్యాలు తెలుసుకోవాలి.’’

తీర్థులు అనే ఈ  ప్రధానోద్యోగులు పదునెనిమిది అని చెప్పారు. వారు 1. మంత్రి 2. పురోహితుడు

 1. సేనాపతి 4. యువరాజు, 5. ప్రధాన ద్వారపాలకుడు 6. అంతఃపుర పాలకుడు 7. ప్రశాస్త (director) 8. సమాహర్త (collector) 9. సన్నిధాత (director of stores) 10. ప్రదేష్ట (Magistrate) 11. నాయకుడు (commandant)
 2. పౌరవ్యావహారికుడు (city mayor) 13. కర్మాగారాధ్యక్షుడు 14. మంత్రి పరిషదధ్యక్షుడు, 15. సేనాధ్యక్షుడు
 3. దుర్గాధ్యక్షుడు, 17. సరిహద్దు రక్షకుడు 18. అటవీ రక్షకుడు.

          సంచార గూఢ పురుషులకు రాజుపట్ల గల భక్తి విశ్వాసాలను, వారికి గల దేశ, వేష, శిల్ప, భాషా జ్ఞానాన్ని బట్టి అనగా వారు ఏ ప్రదేశానికి చెందినవారో, ఏయే భాషలు వచ్చునో మొదలైన వాటిననుసరించి వారిని పైన చెప్పిన పదునెనిమిది ప్రధానోద్యోగుల సమాచారం తెల్సుకునేందుకు నియమించాలి. ఆ గుప్త పురుషులు తమ ఉనికి బయటపడకుండా నడుచుకోవాలి.

‘‘తాన్‌ ‌రాజా స్వవిషమే మన్త్రి పురోహిత సేనాపతి యువరాజదౌవారికాన్తర్వంశిక ప్రశాస్తృ సమాహర్తృ సంవిధాతృ ప్రదేష్టృ పౌరవ్యావహారిక కర్మాన్తిక మన్త్రిపరిషదధ్యక్ష దణ్డ దుర్గాన్తపాలాటవికేషు శ్రద్ధేయ దేశ వేష శిల్ప భాషాభి జనాపదేశాన్‌ ‌భక్తితః సామర్థ్యాచ్చాపసర్పయేత్‌’’.   (‌కౌటిలీయార్థశాస్త్రం 1-12)

ఇక వీరు సమాచారాన్ని ఒకరి ద్వారా ఒకరు శృంఖలాబద్ధంగా పంపిస్తారు. రహస్య సమాచారాన్ని ప్రాణాలకు తెగించిన ‘తీక్ష్ణ’ గూఢచారలు ‘సత్రి’ గూఢచారులకు అందిస్తారు. ఆ గూఢచారులు సంస్థ గుప్తచరులకు అందిస్తారు. అది ఎలాగంటే ‘తీక్ష్ణులు’ తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పైన చెప్పిన ప్రధానోద్యోగుల అంతఃపురాల్లో ఛత్ర, భృఙ్గార (water jar) వింజామరము మొదలైనవి అందించే సేవకులుగా ఉండి వారి బాహ్య ప్రవర్తనకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. (ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నదీ, ఎక్కడికి వెళ్తున్నదీ మొదలైన సమాచారం)

‘‘తేషాం బాహ్యంచారం ఛత్ర భృఙ్గార వ్యజన పాదుకాసన యాన వాహన్నోప గ్రాహిణః తీక్ష్ణా విద్యుః. తం సత్రిణః సంస్థాస్వర్పయేయుః’’, (కౌటలీయార్థశాస్త్రం 1-12).

(ఛత్ర భృఙ్గారవ్యజన పాదుకాసన యానవాహన ఉపగ్రాహిణః = గొడుగు పట్టేవాడు, నీటిపాత్ర (కొమ్ముపాత్ర) నందించేవాడు, విసనకర్రతో విసిరేవాడు, పాదుకలు తెచ్చి ఇచ్చేవాడు. ఆసనం అమర్చేవాడు, యానం (రథాదులు), వాహనం (అశ్వాదులు) సిద్ధం చేసేవారు. అంతఃపుర రహస్యాలు సేకరించి చేరవేయటం గూర్చి ఈ క్రింది వర్ణన చెప్తుంది.

‘‘సూద – ఆరాలిక – స్నాపక – సంవాహక – ఆస్తరక – కల్పక – ప్రసాధక – ఉదక పరిచారకా – రసదాః – కుబ్జ – వామన – కిరాత – మూక – బధిర – జడ – అన్ధచ్ఛద్మానః – నటనర్తక – గాయన – వాదక – వాగ్జీవన – కుశీలవాః  – స్త్రియశ్చ ఆభ్యన్తరం చారం విద్యుః. తం భిక్షుక్యః సంస్థాస్వర్పయేయుః’’.

‘రసదు’లనే గుప్తచరులు వంటవాళ్లుగా, భక్ష్యాలు (పిండివంటలు) తయారుచేసేవారిగా, సంవాహకులుగా

(ఒళ్లుపట్టేవారిగా), ప్రక్కలు అమర్చేవారుగా, మంగలివారుగా, అలంకరించేవారుగా, నీళ్ళు అందించేవారుగా ఉంటూ (అతి సన్నిహితంగా ఉంటూ) మహామాత్రుల మందిరాల్లోని రహస్య సమాచారాన్ని తెల్సుకోవాలి. నటులు, నర్తకీమణులు, గాయకులు, వాద్యాలు వాయించేవాళ్లు, కథలూ, కబుర్లు చెప్పి జీవించేవాళ్లు, వీథి పాటలు పాడేవాళ్లు, స్త్రీలు ఈ మహామంత్రుల భవనాల్లో ఉండి గూనివాళ్లుగాను, పొట్టివాళ్లుగాను, కిరాతులుగాను, మూగవాళ్లుగాను, చెవిటి వాళ్లుగాను, అమాయకులుగాను, గ్రుడ్డివాళ్లుగానూ నటిస్తూ వారి సమాచారం సేకరించాలి. ఈ విధంగా వీరూ, రసదులూ తాము సేకరించిన విషయాల్ని భిక్షకులకు అందజేయాలి. భిక్షకులు ఆ సమాచారాన్ని ‘సంస్థ గుప్త చరులకు’ అందించాలి,

సంజ్ఞా లిపి (code language) ను గూర్చిన ప్రస్తావన కూడా అర్థశాస్త్రంలో లభిస్తుంది. అంతేగాక గుప్తచర వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉండేదంటే ఒక ‘సంస్థ’ చేపట్టిన కార్యం మరో సంస్థకి తెలిసేది కాదు.

‘‘సంస్థానా మన్తే వాసినః సంజ్ఞా లిపిభిః చార సంచారం కుర్యుః,
నచాన్యోన్యం సంస్థాస్తేవా విద్యుః’’ (కౌటిలీయార్థశాస్త్రం 1-12)

సంస్థలలో పనిచేసేవాళ్లు సంకేత భాష ద్వారా రహస్య వృత్తాంతాన్ని పంపాలి. అలా పనిచేసేవారు కూడా ఒకరికొకరు తెలియకూడదు. అలాగే ‘సంస్థ’ కూడా రహస్యంగానే ఉండాలి. ఒక సంస్థ గురించి మరొక సంస్థకు తెలియగూడదు.

అత్యవసర పరిస్థితిలో రహస్య వృత్తాంతం పంపడానికీ, లేదా పైన చెప్పిన గుప్తచరులే బయట పడటానికీ ఉపాయాలున్నాయి అవి.

‘‘భిక్షుకీ ప్రతిషేధే ద్వాస్థ పరమ్పరా మాతా పితృ
వ్యఞ్జనాః శిల్పకారికాః కుశీలవాః దాస్యో వా గీత పాఠ్య వాద్య
భాడ్ణ గూఢ లేఖ్య సంజ్ఞాభిర్వా చారం నిర్హరేయుః. దీర్ఘ రోగో
న్మాదాగ్ని రస విసర్గేణ వా గూఢ నిర్గమనమ్‌’’.  (‌కౌటిలీయార్థశాస్త్రం 1-12)

(రసదాదుల నుండి రహస్య వృత్తాంతం తీసుకోవడానికి వచ్చే) భిక్షకులను లోపలికి రానీయని పక్షంలో ద్వారపాలకుల పరంపర చేతగాని, వాళ్ల తల్లిదండ్రులుగా నటించేవాళ్లుగానీ, శిల్పకారిక (కళలు నేర్చిన) స్త్రీలుగానీ, పాటగాండ్రు గానీ, దాసీలుగానీ పాటల ద్వారా, పద్యాలద్వారా, భాండాల్లో, వాద్యాల్లో లేఖల్ని దాచి, లేదా సంకేతాల ద్వారా ఏదో ఒక విధంగా సమాచారాన్ని బయటకు పంపించాలి. ఈ ఉపాయాలేవీ పనిచేయని పక్షంలో దీర్ఘరోగం ఉన్నట్టు నటించి (చికిత్స అనే నెపంతో) బయటపడడం, పిచ్చివాళ్లుగా నటించిగానీ, అగ్ని ప్రమాదాన్ని కల్పించిగానీ, విష ప్రయోగం వల్లగానీ భయోత్పాతాలను సృష్టించి బయటకు వచ్చి సమాచారం రాజుగారికి అందజేయాలి.

ఇవన్నీ వివరించిన కౌటిల్యుడు ఇలాంటి వాళ్లు రాజుగారి చుట్టూ కూడా ఉండవచ్చునని ఊహించలేకపోలేదు. అందుచేతనే ‘మన్త్రాధికారః’ అనే అధ్యాయంలో మంత్రాలోచన సమయంలో ఎవరూ చివరికి శుక శారికాదులు కూడా ఉండరాదని ఆదేశిస్తాడు.

‘‘తదుద్దేశః సంవృతః కథానామ్‌ ‌నిః స్రావీ, పక్షిభిరపి
 అనాలోక్యఃస్యాత్‌’’.  (‌కౌటిలీయార్థశాస్త్రం 1-15-2)

కౌటిల్యుని అర్థశాస్త్రంలో మొదటి అధికరణంలోని గూఢ పురుష ప్రణిధి (Appointment of secret agents) అనే అధ్యాయంలో గుప్తచర వ్యవస్థ యొక్క సంక్షిప్తరూపం ఇలా ఉంది.

‘‘గృహీత పుత్రదారాంశ్చ కుర్యాదుభయ వేతనాన్‌,
తాంశ్చారి ప్రహితాన్‌ ‌విద్యాత్‌ ‌తేషాం శౌచం చ తద్విదైః.
ఏవం శత్రౌ చ మిత్రేచ మధ్యమే చావపేచ్చరాన్‌,
ఉదాసీనే చ తేషాం చ తీర్థేష్వష్టాదశస్వపి.
అన్తర్గృహచరాస్తేషాం కుబ్జ వామన షణ్డకాః,
శిల్పవృత్యః స్త్రియో మూకాశ్చిత్రాశ్చ మ్లేచ్ఛజాతయః
దుర్గేషు వణిజః సంస్థా దుర్గాన్తే సిద్ధతాపసాః,
కర్షకోదాస్థితా రాష్ట్రే రాష్ట్రాన్తే వ్రజవాసినః
వనే వనచరాః కార్యాః శ్రమణాటవికాదయః
పరప్రవృత్తి జ్ఞానార్థా శీఘ్రశ్చార పరమ్పరాః
పరస్య చైతే బోద్ధవ్యా సాదృశై రేవ తాదృశాః,
చార సఞ్చారిణః సంస్థా గూఢాశ్చాగూఢ సంశ్రితాః’’                (కౌటిలీయార్థశాస్త్రం 1.12.19-24)

విదేశాలకు పంపే గూఢచారుల భార్యాపుత్రుల బాధ్యతను స్వీకరించాలి. ఈ గూఢచారులకు స్వదేశంలోనూ, విదేశంలోనూ వేతనం లభిస్తుంది. అందుచేత వీరు ఉభయ వేతనులు. శత్రురాజులు కూడా ఇలాంటి ఉభయ వేతనుల్ని నియమించి ఉంటారనే విషయం తెలుసుకుని విజిగీషువు అయిన రాజు అలాంటి వారిని కనిపెట్టి ఉండే ఏర్పాటు చేయాలి.

ఈ విధంగా గూఢచారుల్ని శత్రురాజు, మిత్రరాజు, మధ్యముడు (రెండు రాజ్యాలకు మధ్యవర్తిగా వ్యవహరించే బలవంతుడైన రాజు), ఉదాసీనుడు (రెండు రాజ్యాలకు బైట ఉన్నవాడు) అయిన రాజుల దేశాల్లో కూడా వారి మహామాత్రుల రహస్య వృత్తాంతం తెలుసుకునేందుకు నియమించాలి.

ఇంతకుముందు చెప్పినట్లుగా గూనివాళ్లనీ, పొట్టి వాళ్లనీ, షండులనూ, వివిధ శిల్పాల్లో (చేతిపనుల్లో) నేర్పు గల స్త్రీలను, మూగవారిని, మ్లేచ్ఛులను ఆయా రాజుల ప్రధానోద్యోగుల అంతఃపురాల్లో నియమించాలి.

కోట లోపల వర్తకులనూ (ఇంతకుముందు చెప్పిన వైదేహక వ్యంజనులను) కోట వెలుపల తాపసులనూ, రాష్ట్రంలో కర్షకులనూ, రాష్ట్రం సరిహద్దులో గోపాలురనూ సంస్థ గూఢ పురుషులుగా నియమించాలి.

వనంలో సంచరించే జైన సంన్యాసులను, ఆటవికులను వనచరులైన గూఢచారులుగా నియమించాలి. శత్రురాజుల ప్రవృత్తిని ఆలస్యం లేకుండా తెల్సుకొని అందించే గూఢచారి పరంపరను (Team) నియమించాలి.

పైకి సాధారణ వ్యక్తులుగా కన్పించే విదేశీ గూఢచారుల్ని అలాగే కన్పించే స్వదేశీ గూఢచారుల ద్వారా తెలుసుకోవాలి.

ఈ వివరాలేగాక ఇంకా కార్తాంతికవ్యంజన, మౌహూర్తిక వ్యంజన ఇత్యాది గుప్తచరులు కూడా ఉన్నారు.

ఈ ‌విధంగా దేశరక్షణకై గుప్తచర వ్యవస్థ ఎంత అవసరమో ప్రాచీన రాజనీతిజ్ఞులు గ్రహించి, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఆ విషయాలు గ్రంథస్థం చేశారు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో తాను రాజు కోసం ఈ గ్రంథాన్ని వ్రాశానని చెప్పాడు.

‘‘సర్వశాస్త్రాణ్యనుక్రమ్య ప్రయోగముపలభ్య చ
కౌటిల్యేన నరేంద్రార్థే శాసనస్య విధిః కృతః’’

అందుచేత ప్రజారంజకమైన ప్రభుత్వం కావాలంటే ఇలాంటి ప్రాచీన గ్రంథాల పరిచయం అత్యంతావశ్యకం.

– రచయిత  సంస్కృత విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయములో అధ్యాపకురాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here