Home Rashtriya Swayamsevak Sangh ప్రణబ్, భాగవత్‌లు మాట్లాడింది ఒకటే!

ప్రణబ్, భాగవత్‌లు మాట్లాడింది ఒకటే!

0
SHARE

తన వారి నుంచే తీవ్రమైన వ్యతిరేకత, విమర్శలు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా సంఘ కార్యక్రమంలో పాల్గొనడానికి నాగపూర్ వచ్చిన మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీకి అనేక అభినందనలు, ధన్యవాదాలు. ఆయన సంఘ స్థాపకులు డా. హెడ్గేవార్ నివసించిన ఇంటికి కూడా వెళ్ళి అక్కడ పర్యాటకుల పుస్తకంలో తన భావాలను స్పష్టంగా వ్రాశారు. స్మృతి మందిరానికి వెళ్ళి అక్కడ డా. హెడ్గేవార్, శ్రీ గురుజీలకు భక్తిపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత సర్వజనికోత్సవంలో తన మనసులోని మాటలను స్పష్టంగా వ్యక్తీకరించారు. ప్రణబ్, సర్ సంఘచాలక్ మోహన్ రావ్ భాగవత్ ఉపన్యాసాలు రెండూ ‘ఏకం సద్విప్రా బహుధా వదంతి’ అన్నట్లుగా ఒకే విషయాన్ని వేరువేరు మాటలలో చెప్పినట్టు ఉన్నాయి. రాజ్యాధికారం ఆధారంగా ఏర్పడిన పాశ్చాత్య ‘జాతి’కి, జీవనవిధానం ఆధారంగా ఏర్పడిన భారతీయ జాతీయ భావనకు తేడా ఉందని ప్రణబ్ స్పష్టం చేశారు. ఇక్కడ ఐదు వేల ఏళ్ల నుండి నిరాఘాటంగా, నిరంతరంగా విలసిల్లుతున్న సాంస్కృతిక జీవనాన్ని గురించి మాట్లాడారు. వసుధైవ కుటుంబకం, సర్వేభవంతు సుఖినః అనే పరంపరాగత భావాలను మరోసారి గుర్తుచేశారు. అలాగే సహిష్ణుత, వివిధత్వం, సెక్యులరిజం, రాజ్యాంగం గురించి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు.

మోహన్ రావ్ భాగవత్ ఉపన్యాసంలో కూడా ఇదే భావాలు వ్యక్తమయ్యాయి. అందులో మాటలు వేరు. అంతే. తన ఉపన్యాసంలో భాగవత్ సహిష్ణుతకు బదులు సంయమనం, సమన్వయం గురించి ప్రస్తావించారు. ఏ భారతీయుడికైనా మరొక భారతీయుడు ఎప్పుడు పరాయివాడు కాడని ఆయన అన్నారు. ఎందుకంటే అందరి పూర్వజులు ఈ భూమికి చెందినవారే. మతం, భాష, వంశం ఆధారంగా కాకుండా జీవన దృష్టి, జీవన విలువల ఆధారంగానే భారతదేశంలో జాతీయ జీవనం వికసించిందని ఇద్దరూ ప్రతిపాదించారు. అయితే ‘సంఘం సంఘమే, ప్రణబ్ జీ ప్రణబ్ జీయే’ నంటూ మోహన్ రావ్ భాగవత్ స్పష్టం చేశారు. ప్రణబ్, మోహన్ రావ్ భాగవత్‌ల ఉపన్యాసాలలో 5వేల ఏళ్ల ప్రాచీనమైన, సర్వత్ర వ్యాపించిన, వివిధత్వంతో కూడిన, విశ్వమంతటిని ఒక కుటుంబంగా పరిగణించిన విశిష్ట జీవన విధానపు గౌరవపూర్వక ప్రస్తావన ఉంది. ఇదే విశిష్ట జీవన విధానం, దృష్టి మన రాజ్యాంగంలో కూడా ప్రతిబింబించింది. అందుకనే ఈ రాజ్యాంగాన్ని మన విలువైన ఆస్తిగా పరిగణిస్తాం. ఈ జీవన దృష్టినే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ లు హిందూ జీవన దృష్టి (Hindu View of Life) అని అన్నారు.

ఖలీల్ జీబ్రాన్ వ్రాసిన ‘ఆప్కే బచ్చే’ అనే ఒక కవితలో– ‘మీ పిల్లలు మీ పిల్లలు మాత్రమే కాదు. వాళ్ళు మీకు ఆశాజ్యోతి. వాళ్ళు మీ నుండి వచ్చినవారు కాదు, మీ ద్వారా వచ్చినవారు. వాళ్ళు మీ దగ్గరే ఉంటారు. కానీ మీరు వారి యజమానులు కారు’ అంటారు. మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే అది రాజ్యాంగం వల్ల కాదు. నిజానికి మనం తరతరాలుగా ఇలా ఉన్నాము కాబట్టి మన రాజ్యాంగం ఇలా ఉంది. ఆ రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి, ఆచరించాలి. సంఘం ఎప్పుడూ ఇదే చేసింది. రెండుసార్లు నిషేధం ఎదుర్కొన్నప్పుడు సంఘం రాజ్యాంగబద్ధంగా, శాంతియుతమైన పద్ధతిలో ఉద్యమాలు చేసింది. ఇలాంటి దేశవ్యాప్త ఉద్యమాలు మరే సంస్థకానీ, పార్టీ కానీ నిర్వహించలేదు. సంఘంపై రాజ్యాంగ వ్యతిరేకి అని, అప్రజాస్వామికమైనదని, హింసను ప్రేరేపిస్తుందని ఆరోపణలు చేసే ఏ సంస్థ, ఏ పార్టీ ఇలాంటి శాంతిపూర్వక, అనుశాసనబద్ధ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించిన దాఖలాలు లేవు.

ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరు కావడం పట్ల ముందు నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేసినవారు ఆ తరువాత కూడా తమ విమర్శలను కొనసాగించారు. ఈ విమర్శలు భారత రాజకీయ, సైద్ధాంతిక రంగంపై కమ్యూనిస్టుల ప్రభావాన్ని మనకు పట్టి చూపుతాయి. వీరి ధోరణి మొదటి నుండీ అభారతీయమైనది కాబట్టి వారి ప్రతిస్పందన కూడా అలాగే ఉంది. అందులో ఉదారత్వం, సహిష్ణుత ఏ కోశానా కనిపించవు. ‘సంఘ నిజస్వరూపం ఏమిటో ప్రణబ్ వారికే అద్దం పట్టి చూపించారు’, ‘వారి వేదిక పైనే సెక్యులరిజం, నెహ్రూ గురించి మాట్లాడారు’ అంటూ వాళ్ళు ఏవేవో వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకావడం గురించి తీవ్ర విమర్శలు చేసినవారెవరూ మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.

‘మేము ఏ కొత్త విషయాన్ని అంగీకరించము’, ‘మేము ఏది చెపితే అదే సత్యం’, ‘మేమే సత్యం, మీరు ఎప్పుడు అబద్ధమే’ అనేది వీరి ధోరణి. అందుకనే జార్జ్ ఓర్వెల్ (కమ్యూనిస్టుల నిరంకుశత్వాన్ని, డాంబికత్వాన్ని బయటపెట్టిన రచయిత) తన ‘యానిమల్ ఫార్మ్’ (పశువుల కొట్టం) అనే నవలలో ‘నాలుగు కాళ్ళు మంచివి, కానీ రెండుకాళ్లు చెడ్డవి’ అనే ధోరణి వారిదని అన్నారు. కానీ ఇప్పుడు రెండు కాళ్ళ గురించి మాట్లాడటం కూడా అపరాధం అయిపోయింది. హిందూత్వం ‘ఈ భూ ప్రపంచమంతా మన కుటుంబం’ అని భావిస్తుంది. కానీ ‘నాలుగు కాళ్ళే మంచివి’ అనుకునేవారు మాత్రం ఎప్పుడు ఆ అజ్ఞానపు అంధకారంలోనే ఉండాలనుకుంటారు. వారి నకారాత్మక రాతల్లో ఎక్కడా స్వానుభవం, జ్ఞానం కనిపించవు. ఎందుకంటే సంఘానికి దగ్గరగా రావడమంటేనే వారికి మహాపరాధం. అలాంటప్పుడు సర్ సంఘచాలక్ ఏం చెప్పారన్నది తెలుసుకోవడం ఎలా సాధ్యపడుతుంది?

కొన్ని నెలలక్రితం నేను ఒక క్రైస్తవ దంపతులను కలిశాను. వాళ్ళు సంఘాన్ని గురించి అనేక ప్రశ్నలు అడిగారు. ఆ తరువాత సంఘాన్ని దగ్గరగా చూశారు. సంఘం క్రైస్తవులకు వ్యతిరేకం అంటే ఇప్పుడు వాళ్ళే ఒప్పుకోరు. అంతేకాదు అలా ఆరోపించే తోటి క్రైస్తవులను మూడు ప్రశ్నలు అడుగుతుంటారు –1. మీరు స్వయంగా చూసి ఈ అభిప్రాయం ఏర్పరచుకున్నారా? 2. మీరు సంఘానికి చెందిన ఏ ప్రముఖ కార్యకర్తనైనా కలిసి మాట్లాడారా? 3. మీరు సంఘ సాహిత్యం ఏదైనా చదివారా?– ఈ ప్రశ్నలకు ఎప్పుడు అవతలివారినుంచి లేదనే సమాధానమే వస్తుంది. ఈ క్రైస్తవ దంపతులకు ఉన్న ఇలాంటి విశాల దృష్టి, సహనం ఈ సంఘ వ్యతిరేకులకు ఎక్కడిది?

సర్ సంఘచాలక్ ఒకసారి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తని కలిసినప్పుడు ఆయన ‘హిందూ’ అనే పదం బదులుగా ‘భారతీయ’ అనే పదం ఉపయోగిస్తే బాగుంటుందికదా అని సలహా ఇచ్చారు. అప్పుడు శ్రీ మోహన్ రావ్ భాగవత్ ‘మా దృష్టిలో ఈ రెండు పదాల మధ్య పెద్ద తేడా లేదు. కానీ భారత్ అంటే ఎక్కువగా భౌగోళికమైన అర్థమే వస్తుంది. హిందూ అంటే పూర్తిగా గుణాత్మకమైనది. అందుకనే పాకిస్తాన్‌లో పుట్టిన తారేక్ ఫతే కూడా తనను తాను హిందువునని చెప్పుకోవచ్చును. అలా చెప్పుకుంటున్నారు కూడా. అందుకని మీరు భారతీయ అనండి, మేము హిందూ అంటాము. మరికొందరు ఇండిక్ అంటున్నారు. ఎవరు ఏమన్నా మన భావం మాత్రం ఒక్కటే.’ అన్నారు.

కానీ ఈ దృష్టిని పిడివాద, ఫాసిస్ట్ కమ్యూనిస్టులు అంగీకరించరు. టాలరెన్స్, సెక్యులర్, నెహ్రూ, మార్క్స్ మొదలైన మాటల్ని ఉపయోగిస్తూ హిందూత్వాన్ని దూషించని వారికి వీళ్ళ ప్రపంచంలో స్థానం లేదు. కనీసం జీవించే అధికారం కూడా లేదు. అందుకనే కమ్యూనిస్టుల స్వర్గమని భావించే కేరళలో 1965 మార్చ్ నుండి 2017 మే వరకు 233మంది సంఘ కార్యకర్తలను కమ్యూనిస్టులు హత్య చేశారు. హతులలో 60శాతం మంది ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలో ఉండి ఆ తరువాత సంఘ కార్యకర్తలుగా మారినవారే. హిందూ రాష్ట్రపు సర్వవ్యాపకమైన సాంస్కృతిక భావనను మీరు ఎన్నిసార్లు వివరించి చెప్పినా కమ్యూనిస్టులు, వారి సహచరులు దానిని విఘటన, విభజన, సంకుచిత వాదమనే కొట్టిపారేస్తారు. అందుకే సమయం, సందర్భం లేకుండా వ్యాఖ్యలు చేస్తుంటారు, వ్యాసాలు రాస్తుంటారు. వాళ్ళు ఎంత ఒప్పుకోకపోయినా సంఘంలో అనేకమంది ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారన్నది, వాళ్ళు సుశిక్షితులైన కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్నది నిజం. హిందువులమైనందుకు మాకు మతమార్పిడి పట్ల విశ్వాసం లేదు. అందుకనే ఆ ముస్లిం, క్రైస్తవ స్వయంసేవకులు కార్యకర్తలుగా పనిచేస్తున్నా వారివారి ఆరాధనా పద్దతిని వదులుకోవలసిన అవసరం రాలేదు. 1998లో విదర్భ ప్రాంత శిబిరం జరిగింది. అది రంజాన్ మాసం కావడంతో కొద్దిమంది స్వయంసేవకులు రోజా(ఉపవాసం) పాటించేవారు ఉన్నారని తెలిసింది. అలాంటి వారి సంఖ్య విడిగా తీసుకున్నారు. కానీ రంజాన్ మాసం కాకపోతే అలా రోజా పాటించేవారు ఉన్నారని ఎప్పటికీ తెలిసేది కాదు.

ఈ ‘ఉదార, సెక్యులర్’ నాయకుల వ్యాఖ్యలు చూస్తే వీళ్ళ ధోరణి ఎంత అప్రజాస్వామిక, సంకుచిత, పిడివాద, మతఛాందస, క్షుద్రమైనదో, పరంపరాగత భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకమైనదో వెంటనే అర్థమవుతుంది. ప్రణబ్ సంఘ కార్యక్రమానికి హాజరుకావడం, దానిపై వీరు విమర్శలు చేయడంతో మరోసారి వారి నిజ స్వరూపాలు బయటపడ్డాయి. సంఘ నిజస్వరూపాన్ని దానికే అద్దం పట్టి ప్రణబ్ జీ చూపించారని వాళ్ళు అంటున్నారు. కానీ అలాంటి అవసరం ఏది లేదని వారికి తెలియదు. ఎందుకంటే ప్రతిసంవత్సరం జరిగే చింతన్ సమావేశాలు, ప్రతినిధి సభ సమావేశాల్లో సంఘం ఆత్మావలోకనం చేసుకుంటుంది. అవసరమైన మార్పులు కూడా చేసుకుంటుంది. ఇటీవల పూనాలో అలాంటి చింతన్ బైఠక్‌లు జరిగాయి. కానీ ప్రగతిశీలురమని, ఉదారవాదులమని చెప్పుకునే సంకుచితవాదులు, అసహనశీలురు అయిన వామపక్ష, సెక్యులర్ వాదులంతా తమ నిజస్వరూపాలను అద్దంలో ఎప్పుడు చూసుకుంటారు? అలా ఎప్పుడైనా చూసుకుంటే వాళ్ళు తాము వేసుకున్న ఈ ప్రగతిశీల, సెక్యులర్ ముసుగు అనేక చోట్ల చిరిగిపోయిందని, ఆ చిరుగుల్లో నుండి తమ మతతత్వ, సంకుచిత, పిడివాద, అసహనశీల నిజస్వరూపం అందరికీ స్పష్టంగా కనిపిస్తోందని గ్రహించేవారు. వారి నిజస్వరూపం ప్రజలు బాగా తెలుసుకున్నారు కాబట్టే అన్ని విధాలుగా తిరస్కరించారు, తిరస్కరిస్తున్నారు.

డా. మన్మోహన్ వైద్య
సహ సర్ కార్యవాహ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here