Home Rashtriya Swayamsevak Sangh ప్రజాస్వామ్య ధోరణికి ప్రతీక ప్రణబ్ ముఖర్జీ

ప్రజాస్వామ్య ధోరణికి ప్రతీక ప్రణబ్ ముఖర్జీ

0
SHARE

డా. మన్మోహన్ వైద్య,

సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

భారత మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ మరణంతో జాతీయ రాజకీయ వినీలాకాశం నుంచి ఒక దేదీప్యమానమైన నక్షత్రం కనుమరుగయింది. రాజకీయ రంగానికి ఎంతో నష్టం వాటిల్లింది. తమ రాజకీయ సిద్ధాంతం పట్ల నిబద్ధత, నిష్ట కలిగి ఉన్నప్పటికీ రాజకీయ ప్రత్యర్ధుల పట్ల సద్భావనతో వ్యవహరించడం అనే ధోరణి క్రమంగా పోతోంది. మన దేశంలో వివిధ సిద్ధాంతాలకు చెందినవారు చర్చలు, సద్విమర్శల ద్వారా విభేదాలను తొలగించుకునే పద్దతి ప్రాచీన భారతంలో ఉండేది. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ కూడా వివిధ ఆలోచనాధోరణులకు వేదికగా ఉండేది. కానీ ప్రస్తుతం కనిపించే రాజకీయ అసహనం, సైద్ధాంతిక ద్వేషం అనేవి వామపక్ష ఆలోచనాధోరణి వల్ల వచ్చినవే. వామపక్ష సిద్ధాంతాన్ని విశ్వసించనివారికి మరొక సిద్ధాంతాన్ని అనుసరించే స్వేచ్ఛ లేకపోవడమేకాదు, కనీసం జీవించి ఉండే అర్హత కూడా లేదని ధోరణితో వామపక్షవాదులు ప్రవర్తించడం ప్రపంచమంతటా, చరిత్రలో కనిపిస్తుంది.
సంఘ కార్యక్రమంలో పాల్గొనడానికి సమ్మతి తెలియజేసిన వెంటనే స్వర్గీయ ప్రణబ్ దా పై విమర్శలు కురిపించారు. ఆయన సంఘ కార్యక్రమానికి రాకుండా చూసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎలాంటి ప్రయత్నాలు చేశారంటే ఏకంగా ఆయన కుమార్తె ద్వారానే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన చేయించారు. నిజానికి ప్రణబ్ దా జ్యేష్ట, అనుభవజ్ఞుడైన, రాజనీతిజ్ఞుడు. సంఘలో చేరడానికి కాకుండా తన ఆలోచనలు, అభిప్రాయాలను స్వయంసేవకులతో, ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ఆ కార్యక్రమానికి హాజరుకావాలనుకున్నారు. ఆయన కొత్తవారికి తన ఆలోచనలను(కాంగ్రెస్ కు చెందినవే అనుకోండి) తెలియజెప్పడానికి వెళుతున్నారని ఆయన హితైషులు, ఆయన గురించి తెలిసినవారికి నమ్మకం ఉండి ఉండాలి. కానీ వారికి ఆయనపై అలాంటి నమ్మకం కాంగ్రెస్ వారిలో ఏమాత్రం కనిపించలేదు.
సంఘ నాలుగవ సర్ సంఘచాలక్ శ్రీ రజ్జూ భయ్యా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందినవారు. ఆయనకు లాల్ బహదూర్ శాస్త్రితో సన్నిహిత సంబంధం ఉండేది. శాస్త్రిగారు ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పుడు ఒకసారి సర్ సంఘచాలక్ శ్రీ గురూజీతో నగర ప్రముఖుల తేనీరు సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొనవలసిందిగా రజ్జూ భయ్యా శాస్త్రిజీ ని కూడా ఆహ్వానించారు. అందుకు శాస్త్రిజీ `నాకు రావాలనే ఉందికానీ రాలేను. ఎందుకంటే నేను అక్కడికి వస్తే కాంగ్రెస్ లో నా గురించి రకరకాలుగా అనుకుంటారు’ అని సమాధానం చెప్పారు. అప్పుడు రజ్జూభయ్యా `శాస్త్రిజీ మీలాంటివారి గురించి కూడా అలా అనుకుంటారా?’ అని ప్రశ్నించారు. వెంటనే శాస్త్రిగారు `మీకు తెలియదు రాజకీయాల్లో ఏం జరుగుతుందో’ అని అన్నారు. `మా దగ్గర మాత్రం అలా ఉండదు. ఎవరైనా స్వయంసేవక్ నన్ను మీతోపాటు చేస్తే `రజ్జూ భయ్యా శాస్త్రిజీకి సంఘాన్ని గురించి చెపుతున్నారు’ అని మాత్రమే అనుకుంటాడు అని రజ్జూ భయ్యా సమాధానమిచ్చారు.
సంఘలో ఇలాగే ఉంటుంది. నాయకుడి పట్ల ఇలాంటి నమ్మకమే ఉండాలి. మనం నమ్మిన సిద్ధాంతంపట్ల దృఢమైన నిష్టను కలిగి ఉంటూనే ఇతరుల ఆలోచనను అర్ధం చేసుకోవాలనే భావాత్మక వాతావరణమే ప్రజాస్వామ్యానికి ఆధారం.
జాతీయ దృష్టితో రాజకీయాల్లో పాల్గొంటున్నవారి సంఖ్య ఇప్పుడు చాలా తక్కువ. నేడు అనేకమంది కేవలం రాజకీయనాయకులు కనిపిస్తారు. జాతీయ రాజకీయాల (దేశమే ముందు అనే దృష్టి) కంటే పార్టీ రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఎక్కువయ్యాయి. అన్నీ నాయకత్వ లక్షణాలు ఒకే కుటుంబానికి చెందినవారిలో తరతరాలుగా వస్తాయన్నది నాకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే, అర్ధంకాని విషయం. పైగా విచిత్రమైన విషయం ఏమిటంటే వీళ్ళే ప్రజాస్వామ్యాన్ని కాపాడతామంటూ ప్రతిజ్ఞలు చేస్తారు. అత్యంత `ఘన’ చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీకి ఇప్పుడు దిశా దర్శనం కరువైంది. పైగా అనుభవం ఏమాత్రం లేని వ్యక్తిలో వాళ్ళు అనేక `సద్గుణాలను’ చూస్తున్నారు. ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అందువల్లనే పార్టీలకు అతీతంగా ఆలోచించి దేశ ప్రయోజనాల కోసం రాజకీయాలను ఉపయోగించే ధోరణి వస్తోంది. ప్రణబ్ దా అలాంటి నేత. ఇలాంటి సమయంలో ఆయన వెళిపోవడం నిజంగా లోటు. ఆయన దేశ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా పొరుగు దేశాల తీరుతెన్నుల గురించి ఇతర పార్టీలు, మేధావుల అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. ఈ ధోరణి సరైన ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజకీయాలకు చాలా అవసరం. అందుకనే ఆయన సంఘ కార్యక్రమానికి వచ్చారు. దేశ హితం కోసం పనిచేస్తున్న, నిరంతరం వృద్ధి చెందుతున్న, దేశం మొత్తంలో వ్యాపించిన అతి పెద్ద సంస్థను దగ్గరగా చూడటం, అర్ధం చేసుకోవడం కోసం ఇలాంటి ధోరణి అవసరం. ఈ విషయం కొందరికి ఎప్పటికీ అర్ధం కాదు.
శ్రీ. కె. ఏం. మున్షీ నెహ్రూ మంత్రివర్గంలో ఉండేవారు. ఆయన దేశ హితాన్ని చేకూర్చే రాజకీయాలను కోరుకున్నారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న సంఘ్ నిర్ణయాన్ని అర్ధం చేసుకునేందుకు, ప్రశంసించేందుకు కూడా అలాంటి దృష్టి అవసరం. ఆయన తన `pilgrimage to Freedom’ అనే పుస్తకంలో సంఘ్ గురించి ఇలా వ్రాసారు –
నేను ఒకసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమానికి వెళ్ళాను. మా కాంగ్రెస్ వారికి ఆ సంస్థను `పూర్తి అంతరానిది’గా చూడటం అలవాటు. కానీ ఆ సంస్థ సభ్యుల్లో కనిపించిన క్రమశిక్షణ, పట్టుదల, నిస్వార్ధ భావన నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సంస్థకు ఆర్ధికమైన మద్దతు, బలం లేవు. జాతీయ గుర్తింపు, పేరు కలిగిన నాయకుడు కూడా లేడు. అయినా  ఆ సంస్థ భావాత్మక బంధం ఆధారంగా అద్భుతంగా పనిచేస్తోంది.
నేను ఆర్ ఎస్ ఎస్ లో గురూజీ గా పిలిచే ఏం.ఎస్ గోళ్వాల్కర్ ను కలిశాను. రాజకీయ లక్ష్యాలు, పద్దతుల గురించి మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన త్యాగమయ జీవనం, ఆర్ ఎస్ ఎస్ ను ఒక అద్భుత సంస్థగా తీర్చిదిద్దడంలో ఆయన నైపుణ్యం, అదే సమయంలో ఇంతటి శక్తివంతమైన సంస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకునే సంయమనాలను ప్రశంసించకుండా ఉండలేకపోయాను. (Pilgrimage to Freedom, పి. 86, K.M. Munshi).
(I attended a rally of the Rashtriya Swayamsevak Sangh which we, Congressmen, had looked upon as an ‘unseeable’ pariah. I was struck by the discipline, determination and the spirit of selflessness which characterises its members. It had no financial backing behind it and no leaders of all-India fame to give it a status, and yet it functioned efficiently on an emotional bond.
I met M. S. Golwalkar, the Guruji of the RSS. Whatever our differences in political aims and methods, I could not help admiring the dedicated life he lived, his great power of organisation and his skill in building up the RSS, at the same time resisting the temptation to throw it into the vortex of politics.(Pilgrimage to Freedom, P.86 by K.M.Munshi)  )

డా. ప్రణబ్ దా చనిపోయిన తరువాత ఒక మరాఠీ వ్యాసంలో రచయిత ఇలా వ్రాసారు – “ప్రణబ్ దా అవసరం కాంగ్రెస్ కు ఎప్పుడు అత్యధికంగా ఉందో అప్పుడే ఆయన పార్టీ నుంచి దూరమై సంఘ్ కు దగ్గరయ్యారు.’ రచయిత సంఘ కార్యక్రమానికి ఆయన హాజరుకావడాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా వ్రాసారు. కానీ రచయిత అవగాహనరాహిత్యం పట్ల జాలి కలుగుతుంది. ప్రణబ్ దా కాంగ్రెస్ నుంచి దూరంగా ఎక్కడికి పోయారు? ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీయే జాతీయ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేసే రాజకీయాల నుంచి, ప్రణబ్ దా ఆలోచనల నుంచి దూరంగా పోయింది. అది కాంగ్రెస్ వేసిన తప్పటడుగు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంతో బలహీనపడింది. ఇలాంటి ధోరణిని కొనసాగిస్తే మరింత దిగజారిపోతుంది.  డా. మున్షీ, ప్రణబ్ దా ల సమన్వయ దృష్టిని అవలంబించాలా, లేక వామపక్షాల నుంచి అరువు తెచ్చుకున్న అసహన, అసహిష్ణుతాపూర్వక ధోరణిని కొనసాగించాలా అన్నది ఆ పార్టీ నిర్ణయించుకోవాలి.
ప్రణబ్ దా ను అర్ధం చేసుకోవడంలో ఆయన విమర్శకులు విఫలం కావడానికి కారణం ప్రత్యర్ధుల సిద్ధాంతం గురించి, వారి అభిప్రాయాల గురించి చర్చ జరిపే ధోరణి, సంసిద్ధత వారిలో లేకపోవడమే. సింహం ఏనుగుల్ని సైతం వేటాడుతుంది. కానీ నక్క కనీసం అలాంటి ఊహ కూడా చేయలేదు. ఈ ధోరణి క్రింది కధ ద్వారా మరింత బాగా అర్ధమవుతుంది –
ఒకసారి ఒక సింహం ఏ జంతువు దొరకకపోయేటప్పటికి ఒక నక్క పిల్లని పట్టి తెచ్చింది. కానీ సివంగికి మాతృత్వభావన పొంగి ఆ నక్క పిల్లను చంపి తినడానికి నిరాకరించింది. దానితో ఆ నక్క పిల్లను తమ పిల్లలతోపాటు పెంచిపెద్ద చేయాలని ఆ రెండు సింహాలు నిర్ణయించుకున్నాయి. ఒకసారి ఆ సింహం పిల్లలు, ఈ నక్క పిల్ల అడవిలో ఆడుకుంటున్నప్పుడు ఒక ఏనుగు వాటికి ఎదురుపడింది. సహజ గుణంతో సింహం పిల్లలు ఆ ఏనుగు మీదకు దూకబోయాయి. కానీ అంత ఏనుగును చూసి భయపడిపోయిన నక్క పిల్ల వాటిని కూడా వారించింది. తరువాత జరిగినదంతా తల్లికి చెప్పిన సింహం పిల్లలు ధైర్యం లేదంటూ నక్క పిల్లను ఆటపట్టించాయి. అప్పుడే నిజాన్ని గ్రహించిన సివంగి నక్క పిల్లకు దాని నిజ స్వరూపాన్ని గురించి చెప్పి వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఎందుకంటే తన పిల్లలు పెరిగి పెద్ద అయితే అప్పుడు నక్క ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఆ నక్క పిల్లను సివంగి ఇలా ఓదార్చింది –
శూరోసి కృతవిద్యోసి దార్శనియోసి పుత్రకా
యస్మిన్ కులే త్వముత్పన్నహ గజస్తత్ర న హన్యతే ||
భావం: నువ్వు ధైర్యస్థుడివి, తెలివైనవాడివి, అందమైనవాడివి. కానీ నువ్వు ఏ కుటుంబానికి చెందావో అది ఏనుగును చంపలేదు. (అంటే నువ్వు ఏనుగును చంపలేవు)
ఒక వ్యక్తి ఎంతగా మారాలని ప్రయత్నించినా అతని సహజమైన బలం, బలహీనతలు ఎప్పుడోఒకప్పుడు బయటపడక తప్పదు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ తన ఆలోచనా ధోరణిని, అనుసరిస్తున్న విలువల గురించి పునస్సమీక్షించుకోవాలి. మున్షీ, ప్రణబ్ దా అనుసరించిన సమన్వయపూర్వక విధానాన్ని అనుసరించాలా లేక రాజకీయ అస్పృశ్యతను పాటించే కమ్యూనిస్ట్ పద్దతులను పాటించాలా అన్నది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి.
డా. రాజేంద్ర ప్రసాద్, మున్షీ, డా. రాధాకృష్ణన్, శ్రీ పురుషోత్తందాస్ టాండన్, ప్రణబ్ జీ వంటివారు సమైక్య ధోరణిని అవలంబించారు. కానీ మతపరమైన, కులపరమైన, స్వార్ధప్రయోజనాలతో కూడిన రాజకీయాలకు అలవాటుపడినవారికి ఈ విలువలు అర్ధం కావు. ప్రణబ్ జి అనుసరించిన విలువలను భావితరాలకు అందించడమే ఆయనకు అసలైన నివాళి. అలాంటి విలువలను పాటించేవారి సంఖ్య మరింత పెరగాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here