Home News సాద్యం కాని ‘సమసమాజం’ నిర్మాణం చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నవిచిత్రమైన మేధావులు

సాద్యం కాని ‘సమసమాజం’ నిర్మాణం చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నవిచిత్రమైన మేధావులు

0
SHARE

సోషలిజం అంటే తెలుగులో సమసమాజమని తర్జుమా చేస్తున్నారు. సమ సమాజాన్ని స్థాపిస్థామని చాలామంది అంటూ ఉన్నారు. ఆ మాట తెలిసి అంటున్నారో, తెలియక అంటున్నారో తెలియదు. మానవ సమాజం సమ సమాజంగా ఎదగడం అసాధ్యమన్న సంగతి గ్రహించకుండానే అదొక ఫ్యాషన్‌గా తరచూ వాడుతూ ఉంటే అలాంటివారిని చూస్తే జాలేస్తోంది. ఆకర్షణీయంగా కనిపించే ఈ నినాదంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీలు ప్రజల మధ్యకు వస్తున్నాయి. మరోరకంగా మభ్యపెట్టబోతున్నాయి.

మార్క్సిజం చలామణిలోకి వచ్చాక ఈ పదం ఎక్కువ వాడుకలోకి వచ్చింది. వారి ఉద్దేశం ఎలాంటిదైనా, ఎన్ని పరిమితులను ఆ పదం గర్భంలో దాగున్నాయని భావించినా అంతిమంగా దాని అర్థం అపభ్రంశమే!

వాస్తవానికి సోషలిజం ఒక రాజకీయ పారిభాషిక పదం డిక్షనరీ ప్రకారం ఆ పదానికి అర్థం ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటం. ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంతమాత్రాన సోషలిజం (సమసమాజం) ఏర్పడుతుందా? అలా ఏర్పడుతుందనుకోవడం ఉత్త అమాయకత్వం తప్ప మరొకటి కాదు. ఈ అమాయకత్వంతోనే గత శతాబ్దంన్నర కాలంగా కార్మికులను, శ్రామికులను బోల్తా కొట్టిస్తున్నారు. మేధావులు, సామాజిక శాస్తవ్రేత్తలు సైతం ఆ బుట్టలో పడిపోవడం చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి.

అంతగా ‘మాయ’ చేసిన మార్క్సిజం ఆ అమానవీయాన్ని వీడకుండా బరువుగా రోజులు దొర్లించడం దారుణాతి దారుణం. సమసమాజం ఎప్పుడూ, ఏ దశలోనూ సాధ్యం కాదు. అది మానవ డి.ఎన్.ఏలో లేదు. సాధ్యమవుతుందని ఆశ, ఆకాంక్షలో తప్ప వాస్తవం కాదు. సోవియట్ యూనియవన్ సజీవంగా ఉన్నప్పుడైనా, మావో చైనాలో విప్లవ విజయాన్ని చుంబించినప్పుడైనా, అంతకు ముందైనా ఆ తరువాతనైనా అది ఒక ఊహ.. ఉటోపియన్ ఆలోచన, మబ్బుల్లో తేలియాడే ఓ దూదిపింజలాంటి మబ్బుతునక. అదో అలాంటి నైరూప్య భావనకు కోట్లాదిమందిని బలి ఇవ్వడం, బాధల సముద్రాలను సృష్టించడం పూర్తిగా అనాగరికం, బార్బరిజంతో సమానం.

సోవియట్లలోనైనా, కమ్యూన్లలోనైనా అందరూ సమానులని భావించలేదు. అక్కడ అనేక నిచ్చెనమెట్లు దర్శనమిస్తాయి. దానికి కారణం ఆయా వ్యక్తుల శక్తి సామర్థ్యాలు, జ్ఞాన బలిమి, అవగాహన శక్తి, నైపుణ్యం, కౌశలం ఇట్లా అనేక అంశాల ఆధారంగానే మేనేజర్, సహాయక మేనేజర్, కమ్యూన్ నాయకుడు, సభ్యుడు ఇలా అనేక విభాగాలుంటాయి. ఈ నిచ్చెన మెట్ల వ్యవహారం కమ్యూనిస్టు పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో, కార్యాలయాల్లో, నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా హోదాల ఆధారంగానే వారికి సౌకర్యాలు, మర్యాదలు – మన్ననలు అందుతాయి. తిరిగి అవన్నీ ఆ వ్యక్తి ప్రవర్తనపై పరావర్తనం చెందుతాయి. అంటే అందరి ప్రవర్తన ఒకటి కాదు. ఒకే రీతిలో ఉండదు. సమాన సౌకర్యాలు అందవు, ఒకే తరహాలో పరిస్థితులను ఆస్వాదించలేదు. ఇదంతా సహజసిద్ధమైన అంశం. మానవుని డిఎన్‌ఎ నిర్మాణంలో అంతర్లీనంగా నిగూఢంగా నిక్షిప్తమైన అంశమిది. దీన్ని పట్టించుకోకుండా సోషలిజం, సమసమాజం అంటే అది పూర్తి డొల్లదనంగాక ఏమవుతుంది? గురివింద గింజ పైకి ఎర్రగా కనిపిస్తుంది. అడుగున కారునలుపు ఉంటుంది. అలాగే మార్క్సిస్టు భావనలో సోషలిజం సంగతి కూడ.

దూరపుకొండలు నునుపు అన్న సామెత మాదిరి ఎక్కడో యూరప్‌లో తలెత్తిన భావజాలాన్ని భారతదేశంలోనూ మక్కిమక్కిగా అమలు జరుపుతామని, సోషలిజం నెలకొల్పుతామని, సమసమాజం నిర్మిస్తామని వీరంగం వేయడం ఎంతటి హాస్యాస్పద విషయమో కొంత లోతుగా పరికిస్తే అర్థమవుతుంది.

మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచయుద్ధం అనంతరం పాశ్చాత్య దేశాల్లో జరిగిన పరిణామాలు అతలాకుతలం చేయగా ఆవేశంతో మార్క్సిజం దారిలో వెలుగురేఖ కనిపిస్తుందేమోనన్న ఆశతో కొందరు, నైరాశ్యంతో కొందరు వేసిన అడుగు ప్రపంచానికంతటికీ ప్రామాణికమని భావించి వ్యూహాలు పన్నడం ఎత్తులు పైఎత్తులు వేయడం అదే శాస్ర్తియమని దబాయించడం దగా తప్ప మరొకటి కాదు.

సోషలిజం సాధ్యం కాదని కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ప్రకటించకముందే అమెరికాలో ‘‘న్యూహార్మొనీ’’ నిరూపించింది. సోషలిజం కోసం తీవ్రంగా తపనపడి చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. మానవుడిలోని అనేకానేక సంక్లిష్టతలు, ఆకాంక్షలు, కోర్కెలు, వాటిని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగించడం తదితర అంశాలతో ఆ ప్రయోగం కుప్పకూలింది. అది ప్రపంచానికి తెలిసిందే. మేధావులు, సామాజిక శాస్తవ్రేత్తలు, ఆర్థికవేత్తలు ఎంతో నిష్టతో, అంకితభావంతో కృషి చేసినా అది బూడిదలో పోసిన పన్నీరయింది. ఈ అనుభవం కళ్లముందు కనిపిస్తున్నా ఆ పరాభవాన్ని అధిగమిస్తామన్న వెర్రి ఆశతో రంగంలోకి దిగడంతో మిగిలింది హళ్లికి హళ్లి.. సున్నకు సున్నా మాత్రమే.

మార్క్సిజం వెలుగులో విజయవంతమైందని భావించిన రష్యా విప్లవ అనంతరం న్యూహార్మొనీ ఫలితమే పునరావృతమైంది. చైనాలో, తూర్పు యూరప్ దేశాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీనికిగల కారణమేమిటని ఎవరూ ప్రశ్నించుకున్న పాపాన పోవడం లేదు. పైగా అది మార్క్సిజం తప్పుకాదు. లోపం కాదు. నికార్సయిన శాస్ర్తియమైన సిద్ధాంతమది, అది విఫలమయ్యే సమస్యే లేదు. దాని అమలులో జరిగిన పొరపాటువల్లనే అలా జరిగిందని చాలామంది తమ భుజాలను తామే తట్టుకుని, చరచుకుని తాము చైతన్యవంతులమని చాటుకుంటున్నారు. ఇంత వితండవాదం, మూర్ఖపు వైఖరిగలవారు తాము శాస్ర్తియ ఆలోచనలుగల వారమంటే వింతగా ఉంటుంది, విచిత్రంగా ధ్వనిస్తుంది.

ఇంత డొల్లదనం, అమాయకత్వం, ఆశాస్ర్తియం, అవగాహన లోపం, మానవజీవితాన్ని అర్థం చేసుకోలేనితనాన్ని గుర్తించకుండానే 21వ శతాబ్దంలో ఉత్పత్తి సంబంధాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్న వేళ, యంత్రశక్తి అన్ని రంగాల్లోకి అనూహ్యంగా పెరిగిన వేళ, కృత్రిమ మేథ మానవ సమాజాన్ని కొత్త మలుపు తిప్పుతున్న సందర్భంలో మార్క్సిజం పేర అదే పాత పాట పాడటంలో ఏమాత్రం పసలేదు. ముఖ్యంగా మావోయిస్టుల మనసులను ఆ ఇజం పూర్తిగా మలినం చేసేసింది. వివేకం, విచక్షణ, ప్రేమ, కరుణలాంటి మానవీయ అంశాలను పాతాళానికి తొక్కిపెట్టి మారణాయుధాలతో రాజ్యాధికారం సాధించి సమసమాజం నిర్మిస్తామని మందుపాతరలు పేలుస్తూ ప్రకటించడం పూర్తిగా అమాయకత్వం తప్ప మరొకటి కాదు. ఇందులో భాగంగా ఏఓబి ప్రాంతంలో ఇన్‌ఫార్మర్ల పేర 16మంది ఆదివాసీలను అంతమొందించడం, ఇలాంటి చర్యలకు తరచూ పాల్పడటం దేన్ని సూచిస్తోంది?

రుజువు చేసినప్పటికీ, మావోయిస్టులకన్నా ఎక్కువ కసితో, అంకితభావంతో పనిచేసినా ఫలితం లేదన్న సంగతి కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోకుండా అటువైపు చూడ్డానికి ఇష్టపడక, బుద్ధి, ఇంద్రియాలనన్నింటినీ సుషుప్తావస్థలోకి నెట్టి సాయుధ పోరాటం చేస్తామని ఆదివాసులను, అమాయక ప్రజలను ఆహూతి ఇవ్వడం అనాగరికం, అమానవీయం. ఈ లక్షణాలను వైఖరిని కొందరు మేధావులు శ్లాఘించడం, మద్దతునివ్వడం చూస్తే వారి మేధోసంపదపై అనుమానాలు కలుగుతాయి.

మార్క్సిజంపై మమకారంగలవారైనా, మరెవరైనా సమసమాజం అన్న పదం వాడి సమాజంలో అశాస్ర్తియతను, గందరగోళాన్ని వ్యాపింపజేయడం సబబుకాదు. పౌరులు సాధికారత సాధించే అవకాశముందిగాని, సమసమాజాన్ని స్థాపించే అవకాశం మరో రెండువేల సంవత్సరాల అనంతరమైనా సాధ్యపడదు. ఈ వౌలికాంశాన్ని లోతుగా పరిశీలించి సాధికారత దిశగా అడుగులు వేయడంలోనే అర్థముంది. ఆయుధంతో సాధికారతను ఎప్పుడూ సాధించలేదు. తెలుగునేలపై గల రాజకీయ పార్టీలు, కొత్తగా ఆవిర్భవించబోయే పార్టీలు ఈ కీలకాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాయని ఆశిద్దాం.

-వుప్పల నరసింహం 9985781799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here