Home News అంతరించిపోతున్న నదుల్ని కాపాడుకుందాం : సద్గురు జగ్గీ వాసుదేవ్‌

అంతరించిపోతున్న నదుల్ని కాపాడుకుందాం : సద్గురు జగ్గీ వాసుదేవ్‌

0
SHARE

దేశంలోని నదులు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, మన జీవ నదులు రుతువుల్లో మాత్రమే పారే నదులై పోతున్నాయని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక చిన్న నదులు ఇప్పటికే అంతరించిపోయాయని, ఈ పరిస్థితుల్లో అందరం కలసి నదుల సంరక్షణకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 1న ప్రారంభమైన ‘నదుల రక్షణ–భారత సంరక్షణ’ యాత్ర బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని సెర్టన్‌ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గీ వాసుదేవ్‌ మాట్లాడుతూ.. వరదలూ, కరువులూ ఎక్కువైపోతున్నాయని, అందువల్ల భారత జీవధారలను కాపాడుకోవాల్సి ఉందన్నారు.

వర్షాకాలంలో నదులు వరదల్లో చిక్కుకుంటున్నాయని, వర్షకాలం వెళ్లిపోయాక ఎండిపోతున్నాయని చెప్పారు. మరో 15 ఏళ్లలో దేశంలోని 25 శాతం భూమి ఎడారిగా మారబోతోందని, మనకు కావాల్సిన నీటిలో సగమే దొరుకుతుందని అన్నారు. బెంగళూరులో 40 ఏళ్ల క్రితం పది నుంచి 15 అడుగుల లోతులో నీరు లభించేదని, ఇప్పుడు వేల అడుగులు తవ్వితేనే నీరు లభ్యమవుతోం దని చెప్పారు. మన జీవితం నదులపై ఆధారపడి ఉందనే విషయం మరువకూడదని, నదులు లేకపోతే అనేక సమస్యలు చుట్టుముడతాయని చెప్పారు. గంగా, కృష్ణ, నర్మద, కావేరీ నదులు అంతరించిపోతున్నాయని, మనం ఇప్పుడు నదుల సంరక్షణకు కదలకపోతే భవిష్యత్తు తరాలకు నీటి కోసం ఘర్షణలు, కరువులు అందించిన వారమవుతామన్నారు.

వాతావరణ మార్పులతో కరువులు, వరదలు

మనకు 65 శాతం నీరు నదుల ద్వారానే లభ్యమవుతోందని, దేశంలో మూడింట రెండు వంతుల నగరాలు ఇప్పటికే నీటి కరువుతో సతమతమవుతున్నాయని వాసు దేవ్‌ చెప్పారు. నీరు లేకపోవడంతో ఒక బిందె నీటి కోసం పదిరెట్ల డబ్బు వెచ్చిస్తున్నా మన్నారు. సగటున ఏటా ప్రతి వ్యక్తికీ 11 లక్షల లీటర్ల నీరు అవసరమని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే 25 నుంచి 50 ఏళ్లలో మరిన్ని వరదలు, కరువు రాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులతో దేశంలో పదేళ్లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. జనాభా నియంత్రణ ఉండాలని, గతంలో 30 కోట్లు ఉన్న దేశ జనాభా ఇప్పుడు 130 కోట్లకు చేరుకున్న విషయం మరువకూడదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పచ్చదనం బాగుందన్నారు. రైతులను సంప్రదాయ సాగు నుంచి శాస్త్రీయ సాగు వైపు మళ్లించాలన్నారు. నదుల అంశం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినదని, అందరూ అనుకుని ముందుకు వెళ్తేనే నదుల సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.

నేడు ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమం

కోయంబత్తూరులో ప్రారంభమైన ర్యాలీ ఫర్‌ రివర్స్‌ యాత్ర పలు రాష్ట్రాల మీదుగా 4 వేల కి.మీ.లు సాగిందన్నారు. యాత్రకు విద్యార్థులు, ప్రజలు, రైతులు బ్రహ్మరథం పట్టారన్నారు. సెప్టెంబర్‌ 14న గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. గవర్నర్‌ నరసింహన్, మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ యాత్ర అక్టోబర్‌ 2 వరకు కొనసాగుతుందని జగ్గీ వాసుదేవ్‌ చెప్పారు.

(సాక్షి సౌజన్యం తో)