Home Ayodhya అయోధ్య రామమందిరం శక్తిశాలి, భవ్య భారత్ కు పునాదిగా నిలుస్తుంది – డా. సురేంద్ర జైన్

అయోధ్య రామమందిరం శక్తిశాలి, భవ్య భారత్ కు పునాదిగా నిలుస్తుంది – డా. సురేంద్ర జైన్

0
SHARE

పత్రికా ప్రకటన

అయోధ్య రామమందిర భూమిపూజ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంఘటనగా నిలిచిపోతుందని విశ్వహిందూ పరిషత్ కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి డా. సురేంద్ర జైన్ అన్నారు. ఈ జాతీయ వైభవాన్ని ఇంకెవరూ మసకబార్చలేరని ఆయన అన్నారు. న్యూడిల్లీలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో శ్రీ రాముని జన్మస్థలంలో విదేశీ దురాక్రమణదారుడైన బాబర్ నిర్మించిన బానిస చిహ్నాన్ని చెరిపివేయడానికి హిందూ సమాజం 492 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసింది.

ఈ పోరాటంలోని అనేక దశల్లో లక్షలాదిమంది రామభక్తులు బలిదానం చేశారు. 1984నాటి నుండి సాగిన మలిదశ పోరులో 3 లక్షల గ్రామాల నుంచి కోటి 60 లక్షలకు పైగా రామభక్తులు పాల్గొన్నారు. 2019 నవంబర్ 9న దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు ఇచ్చేనాటి వరకు ఆ ఉద్యమం సాగింది. నభూతోనభవిష్యతి అనదగిన ఈ అద్భుతమైన సాంస్కృతిక పోరాటం మూలంగా ఈ జాతి గౌరవానికి, అస్తిత్వానికి భంగకరంగా నిలచిన బాబర్ కట్టడం పోయి, జాతీయపురుషుడు భగవాన్ శ్రీరామచంద్రుని అద్భుత మందిరానికి మార్గం సుగమమయ్యింది.

రామజన్మభూమి ఉద్యమం `అవమానం, అగౌరవాల నుంచి ఆత్మవిశ్వాసం, గౌరవ’ భావాల వైపుగా ఈ దేశపు ప్రయాణాన్ని సూచిస్తుందని డా. సురేంద్ర జైన్ అన్నారు. వెయ్యి సంవత్సరాలపాటు విదేశీ దురాక్రమణలు, దాడులను మనం ఎదిరించి నిలబడ్డామని, అయితే ఇప్పుడు విఘటన, విభజన,  బూటకపు సెక్యులర్ రాజకీయాలు ఈ దేశపు ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక ఏకత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాయని అన్నారు. సమాజాన్ని చీల్చడానికి, హిందువులలో అపారమైన ఆత్మన్యూనతాభావాన్ని, అపరాధభావాన్ని నింపడానికి  ప్రయత్నాలు జరిగాయి. రామమందిర మహోద్యమం విఘటన శక్తుల ఈ ప్రయత్నాలన్నింటిని వమ్ముచేసింది. హిందువులంతా కుల, జాతి, భాష, ప్రాంత విభేదాలకు అతీతంగా ఒక్కటిగా నిలిచారు. అపూర్వమైన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో హిందువులంతా `గర్వసే కహో హామ్ హిందూ హై’ అని నినదిస్తున్నారు. ఈ జాతీయభావం, విశ్వాసం మూలంగా విభజన రాజకీయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న దేశ ప్రజానీకం అన్ని రంగాల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని సాధించడానికి ముందుకురుకుతున్నారు. దానితో ప్రపంచ పటలంపై భారత్ `సూపర్ పవర్’గా ఆవిర్భవించనుంది.

ఏ దేశ ప్రజానీకానికైనా స్వాభిమానం, జాతీయభావం చాలా అవసరం. కానీ విభజన, సంతుష్టీకరణ రాజకీయాల మూలంగా భారత్ లో  ఈ జాతీయభావన మసకబారింది, జాతీయ అస్తిత్వంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. కానీ ఇకమీదట ఇప్పుడు భారత జాతీయత విషయాన్ని ఏ విదేశీ దురాక్రమణదారుడితో కలిపి మాట్లాడే అవకాశం ఉండదు. ఈ దేశపు మహాపురుషులు, మహనీయ స్త్రీమూర్తుల జీవితాలే ఆ జాతీయభావానికి స్ఫూర్తి, ప్రేరణగా నిలుస్తాయి. భగవాన్ శ్రీ రాముడికంటే స్ఫూర్తివంతమైన, ప్రేరణదాయకమైన వ్యక్తిత్వం ఏముంటుంది? ఈ దేశ రాజ్యాంగం కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తోంది.

ఈ అద్భుతమైన మార్పు మరింత వేగం పుంజుకుంటోందని విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి అన్నారు. శ్రీరామమందిరంపై కలశ స్థాపన జరిగే సమయానికి విఘటన శక్తులు పూర్తిగా చీకటిలో కలిసిపోయి, తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని, స్వాభిమాన, స్వావలంబన భారతం ఉదయిస్తుందని ఆయన అన్నారు.

– వినోద్ బన్సాల్, జాతీయ అధికార ప్రతినిధి, విశ్వహిందూ పరిషత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here