Home News రామప్పకు వారసత్వ హోదా భారతీయులందరికీ గర్వకారణం

రామప్పకు వారసత్వ హోదా భారతీయులందరికీ గర్వకారణం

0
SHARE

పిన్నింటి బాలాజీ రావు

కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌ లో నిర్వహిస్తున్న యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. రామప్పకు వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తద్వారా రామప్ప పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్త గుర్తింపుకు నోచుకుంటుంది.

ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కో కు నామినేట్ చేసింది.
1. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం
2.నీటితో తేలియాడే ఇటుకలతో పురాన్ని నిర్మించడం
3.ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం.

విశిష్టమైన వారసత్వాన్ని కలిగి ఉన్న కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలిచిన రామప్ప దేవాలయం యొక్క చరిత్ర ను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
రామప్ప దేవాలయము….ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది పూర్వ వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ప్రస్తుతము రామప్ప ములుగు జిల్లాలో ఉంది. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కలదు. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటలకు అధారంగా ఉన్నది. పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.

కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.

ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి.

దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది.

రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.
ఇంతటి విశిష్ట చరిత్ర కలిగిన రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ హోదా ఇవ్వడం తెలంగాణ వారికే కాకుండా భారతీయులందరికీ ఆనందదాయకం.

ఏప్రిల్ 18 – అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం)