Home Telugu Articles అమ్మకు ప్రతిరూపం శారదామాత

అమ్మకు ప్రతిరూపం శారదామాత

0
SHARE

– లతాకమలం

డిసెంబ‌ర్ 22 శార‌దామాత జ‌యంతి..

భారతదేశంలోని గొప్ప గురువుల గురించి చెప్పుకొనేటప్పుడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రస్థావన ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తుంది. వీరందరి గురించి చెప్పుకునే ముందు శారదామాత గురించి కూడా ప్రస్థావించా ల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ ప్రస్థావన అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యులకు తల్లిలా భాసించిన శారదాదేవి మాతృమూర్తి అన్న మాటకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.

శారదామాత 1853లో బెంగాల్లోని మారుమూల ప్రాంతమైన జయరాంబాటి అనే కుగ్రామంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు కడు పేదవారు. కానీ తమ ఇంట ఒక అసాధారణమైన మనిషి జన్మించబోతోందని తెలిపేందుకు, వారికి అనేక దర్శనాలు కలిగేవట. తల్లికి ఇంటిపనుల్లో సాయపడటం, పొలానికి వెళ్లి తండ్రికి ఆహారాన్ని అందించడం ఇలా ఆమె జీవితం సాగిపోయేది. కానీ ధ్యానమన్నా, పూజలన్నా ఆమెకు అపారమైన ఆసక్తి ఉండేది.  ఒక ఎనిమిది మంది యువతులు ఎప్పుడూ తనకు కనిపించేవారని చెప్పేవారు శారద. ఇలా ఆమె బాల్యం బయటకు సర్వసాధారణంగానే కనిపించినా లోపల మాత్రం ఆమె సాధకురాలే.

శారదాదేవి ఐదవ ఏట కాళికాదేవి మంది రంలో పూజారిగా పనిచేసే గదాధర ఛటోపాధ్యాయ కిచ్చి (రామకృష్ణ పరమహంస అసలుపేరు) పెండ్లిచేశారు. అప్పటికి శారదాదేవి వయసు ఐదేళ, రామకృష్ణులకు 23ఏళ్లు. శారదాదేవికి 18 ఏళ్ల వయసు రాగానే రామకృష్ణునితో కలిసి ఉండేందుకు దక్షిణేశ్వరానికి చేరుకున్నారు. ఆమెను చూసిన వెంటనే రామకృష్ణులు ‘నన్ను ఈ ఐహిక ప్రపంచం లోకి దింపడానికే వచ్చావా?’ అని అడిగారట. దానికి శారదాదేవి చిరునవ్వుతో ‘లేదు! నేను మీ లక్ష్యసాధనలో సాయం చేసేందుకే వచ్చాను’ అని బదులిచ్చారట. అన్నట్లుగానే శారదాదేవి, రామ కృష్ణుని కంటికిరెప్పలా చూసుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో ఆయన సాధనలకు ఏ అడ్డు లేకుండా జాగ్రత్తపడేవారు. భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం వారిది! రామకృష్ణుని తన ఆధ్యాత్మిక పురోగతికి సాయపడే గురువుగా శారదాదేవి తలిస్తే, ఆమెను సాక్షాత్తూ ఆ కాళీమాతగా భావించేవారు రామకృష్ణులు. అలా భావించి ఆమెను షోడశోపచారాలతో పూజించిన సందర్భాలూ      ఉన్నాయి.

శారదాదేవి ఒక పక్క భర్త అవసరాలను కనిపెట్టుకుంటూనే, ఆయన కోసం వచ్చే శిష్యుల కోసం వండిపెడుతూ ఉండేవారు. ఇలా వారి నందరూ రామకృష్ణుని పరమహంసగా గుర్తించ డంతో పాటుగా… శారదాదేవిని, మాతృమూర్తిగా భావించేవారు. 1886లో రామకృష్ణ పరమహంస మరణించడంతో ఆయన శిష్యులు శోకసంద్రంలో కూరుకుపోయిన ఉన్నవేళ వారికి శారదామాత తగిన ధైర్యాన్ని అందించారు.

 సోదరినివేదిత, సోదరి దేవమాత వంటివారు ఆమెలోని ఆధ్యాత్మిక సంపదకు, హైందవ స్త్రీ తత్వానికి ఎంతగానో అబ్బురపడేవారు.

రామకృష్ణ పరమహంస చనిపోయిన 34 సంవత్సరాల వరకూ శారదాదేవి తన శిష్యులను కాచుకున్నారు. 1920, జులై 20న ఆమె కైవల్యాన్ని సాధించారు. శారదాదేవి మరణించే కొద్ది రోజుల ముందుగా ఆమె చెప్పిన మాటలు, ఆమె పరిణతిని సూచిస్తాయి. ‘మీకు మనశ్శాంతి కావాలంటే, ఇతరులలో లోపాలను వెతకడం మానండి. బదులుగా మీ లోపాలేమిటో గుర్తించండి. ఈ ప్రపంచమే మీది అన్నంతగా సొంతం చేసుకోండి. అప్పుడు ఈ ప్రపంచంలో అంతా మీవారే అని గుర్తిస్తారు’ – ఇంతకంటే అమూల్యమైన సలహాను ఏ మాతృమూర్తి మాత్రం ఇవ్వగలదు!

This article was first published in 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here