Home Telugu Articles స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర

0
SHARE

– రామ మూర్తి ప్రభల

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర గురించి తరుచు చర్చ జరుగుతుంటుంది. స్వతంత్ర సమరంలో ప్రత్యక్ష పాలుపంచుకోకపోయినా దేశకార్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్రను మాత్రం ఎవరు కాదనలేరు.

1885లో కాంగ్రెస్‌ స్థాపన జరిగింది. అంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. 1925లో ప్రారంభంకావడానికి బాగా ముందే కాంగ్రెస్‌ బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమపు నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. ఇ.వి. రామస్వామి జస్టిస్‌ పార్టీ, అంబేడ్కర్‌ ఐఎల్పీ, ముస్లిం లీగ్‌, కమ్యూనిస్ట్‌లు మొదలైనవారు కాంగ్రెస్‌తో అనేక విషయాలలో విభేదించినా ఉద్యమ నాయకత్వం కాంగ్రెస్‌కే వదిలిపెట్టారు. బ్రిటిష్‌ వారితో నేరుగా తలపడితే తమ ఉద్యమం బలహీన పడుతుందనే భయం వీరిలో ఉండడం దీనికి కారణం కావచ్చును. అప్పటికే అనేక పార్టీలు, వాటిలో అంతర్గత కుమ్ములాటలు, విభేదాలను చూసిన డా. హెడ్గేవార్‌ మరో రాజకీయ పార్టీని ప్రారంభించా లనుకోలేదు. హిందూ సంఘటన లక్ష్యంగా ఆయన ఆర్‌.ఎస్‌.ఎస్‌ను ప్రారంభించారు. హిందూ సంఘటన వల్ల సాంస్కృతిక / భౌగోళిక ఐక్యత, స్వాతంత్య్రం మొదలైనవి సాధ్యపడతాయని ఆయన విశ్వసించారు.

హిందువుల ప్రయోజనాల కోసం పనిచేసే, పోరాడే (1921లో మోప్లా తిరుగుబాటు సందర్భంగా అనేకమంది హిందువులు ప్రాణాలు కోల్పోవడం ఈ ఆలోచనకు దారితీసింది) సమూహం లేదా సంస్థ ఒకటి ఉండాలని డా. హెడ్గేవార్‌ భావించారు. కాంగ్రెస్‌ పై పెట్టుకున్న ఆశలు వమ్ము అయ్యాయి. బ్రిటిష్‌ వారి ‘విభజించి పాలించు’ వలలో కాంగ్రెస్‌ కూడా పడిపోయిందని అర్ధమైంది. కాంగ్రెస్‌ సాగిస్తున్న మైనారిటీ సంతుష్టీకరణ చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఆయన చేసిన హెచ్చరిక ఎంత సరైనదో ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. సంతుష్టీకరణను వ్యతిరేకించిన డా. హెడ్గేవార్‌ ముస్లిం వ్యతిరేకి మాత్రం కాదు. నిజానికి ముస్లిములు జాతీయ జీవన స్రవంతిలో కలిసి బ్రిటిష్‌ వారిని వెళ్లగొట్టేందుకు హిందువులతో కలిసి పనిచేయాలని ఆయన కోరుకున్నారు.

డా.హెడ్గేవార్‌ స్వయంగా కాంగ్రెస్‌ కార్యకర్త. లోకమాన్య తిలక్‌ వంటి శ్రేష్ట నాయకులతో కలిసి చాలాకాలం పనిచేశారు. విప్లవ కార్యకలాపాలలో పాల్గొని 1921లో ఏడాది పాటు జైలు శిక్ష అనుభ వించారు కూడా. ఆ సందర్భంగా సాగిన కోర్టు విచారణలో భారత స్వాతంత్య్ర పోరాటాన్ని గురించి గట్టిగా వాదించడమే కాక తన చర్యలను సమర్ధించు కున్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. 1931లో జరిగిన అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయన రెండవసారి జైలుకు వెళ్లారు. అలాగే ఉప్పు సత్యాగ్రహంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. కనుక ఆర్‌.ఎస్‌.ఎస్‌ దేశ స్వాతంత్య్రోద్యమంలో అసలు పాల్గొనలేదన్నది సత్యదూరమైన వాదన.

నిజానికి డా. హెడ్గేవార్‌ స్వయంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే ఎప్పుడు స్వయం సేవకులు ఉద్యమంలో పాల్గొనకుండా అడ్డుకోలేదు. అందువల్ల సగానికి పైగా స్వయంసేవకులు స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కానీ సంఘ ప్రచారానికి దూరంగా ఉండడం వల్ల ఈ విషయం ఎక్కువగా ఎవరికి తెలియలేదు.

ప్రారంభమైననాటి నుండి ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరుకుంటే కాంగ్రెస్‌ 44 ఏళ్ల తరువాత, అంటే 1944లో పూర్ణ స్వరాజ్య నినాదం చేసింది. (1920 నాగపూర్‌ కాంగ్రెస్‌ సమావేశాలలోనే డా.హెడ్గేవార్‌ సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ తీర్మానం ఆమోదించాలని ప్రతిపాదించారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం 10 ఏళ్ల తరువాత 1929లోగానీ ఆ పని చేయలేక పోయింది) 1929 లా¬ర్‌ సమావేశాలలో కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించి నప్పుడు స్వయంసేవకులంతా ఆ తీర్మానానికి మద్దతుగా ప్రతి శాఖలో కార్యక్రమం నిర్వహించా లని డా. హెడ్గేవార్‌ పిలుపునిచ్చారు. దానికి అను గుణంగానే 26 జనవరి, 1930న శాఖలన్నిటిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

తమ పాలనపట్ల ఆర్‌.ఎస్‌.ఎస్‌కు ఉన్న వ్యతిరేకతను బ్రిటిష్‌ పాలకులు గుర్తించారు. తమ కార్యకర్తలను వివిధ ప్రభుత్వ విభాగాల (సైన్యం, పోస్టల్‌, రైల్వే మొదలైనవి)లోకి పంపిన ఆర్‌.ఎస్‌.ఎస్‌ వాటిని తగిన సమయంలో పూర్తిగా తన చేతిలోకి తీసుకునే ప్రమాదం ఉందంటూ బ్రిటిష్‌ ప్రభుత్వం 1940లో ఏకంగా ఒక ప్రకటన చేసింది.

దేశ విభజన తరువాత ప్రజలకు సహాయ పడటంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ అద్వితీయమైన పాత్ర పోషించింది. విభజన సమయంలో కూడా పశ్చిమ పంజాబ్‌ నుండి హిందూ శరణార్ధులను సురక్షితంగా తరలించడంలో ముందు ఉంది. పాకిస్తాన్‌ నుండి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న వారికి ప్రాణాలకు తెగించి స్వయంసేవకులు రక్షణ కల్పించారు. ఆ తరువాత దాద్రా, నాగర్‌ హవేలి, గోవా వంటివి స్వతంత్ర భారతంలో విలీనం కావడంలో స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. హైదరబాద్‌ విమోచనోద్యమంలో వారి పాత్ర ప్రశంసనీయం.

మన దేశంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ మరియు కమ్యూనిస్టు పార్టీలు ఒకే సారి (1925లో) ప్రారంభ మయ్యాయి. కానీ ఆర్‌.ఎస్‌.ఎస్‌ దేశ స్వతంత్రం కోసం హిందూ సమాజాన్ని సమాయత్తం చేయడానికి ప్రయత్నిస్తే, కమ్యూనిస్టులు మాత్రం బ్రిటిష్‌ వారికి మద్దతుగా, నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ వంటి నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడారు. రెండవ ప్రపంచ యుద్దంలో రష్యా సంకీర్ణ సేనల పక్షంలో చేరనంత వరకు కమ్యూనిస్టులు బ్రిటన్‌, అమెరికా లను విమర్శించారు, వ్యతిరేకించారు. కానీ ఎప్పుడైతే స్టాలిన్‌ సంకీర్ణ సేనల పక్షం చేరాలని నిర్ణయించు కున్నాడో ఇక్కడ కమ్యూనిస్టులు ప్లేటు ఫిరాయిం చారు. అప్పటివరకూ అమెరికా, బ్రిటన్‌లను ‘సామ్రాజ్యవాద శక్తులు’ అని తిట్టిపోసిన వాళ్లే ఆ తరువాత ఆ దేశాలను పొగడటం ప్రారంభించారు. దేశ విభజన విషయంలో కూడా కమ్యూ నిస్టులు ముస్లిం లీగ్‌ను సమర్ధించారు, మద్దతునిచ్చారు.

కొస మెరుపు 

1. కఠినమైన కారాగార శిక్ష అనుభవించిన స్వతంత్ర వీర సావర్కర్‌ తన 17 ఏటనే (1900లో) సంపూర్ణ స్వతంత్ర నినాదాన్ని ఇచ్చారు. కానీ కాంగ్రెస్‌ వారు, కమ్యూనిస్టులు ఆయనను హిందుత్వవాదిగా ముద్ర వేసి దుష్ప్రచారం చేశారు.

2. 1929 వరకు రాజ్య హోదాతో సంతోష పడిన తమ నాయకులు అనేకమంది (1880, 90 దశకాల్లో) బ్రిటిష్‌ పాలనను సమర్ధిస్తూ వచ్చారన్నది కాంగ్రెస్‌ వారు మరచి పోకూడదు.

లోకహితం సౌజన్యం తో…