Home News దాద్రానగర్ హవేలీ విముక్తి పోరాటంలో ఆర్.ఎస్ ఎస్ పాత్ర

దాద్రానగర్ హవేలీ విముక్తి పోరాటంలో ఆర్.ఎస్ ఎస్ పాత్ర

0
SHARE

–ఆకారపు కేశవరాజు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుల చేత దాద్రా నగర్ హవేలీ పోర్చుగల్ చేతిలోనుండి విముక్తి గావించబడి భారత యూనియన్ లో విలీనమయిపోయింది.

సరిగ్గా 1954 వ సంవత్సరం ఆగస్టు రెండో తేదీన అక్కడ సగర్వంగా మూడు రంగుల ఝండా ఎగిరింది.

భారత స్వాతంత్ర్య సమరం కొనసాగుతుండగా.. దేశ విభజన చేసి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం ప్రకటించి ఆంగ్లేయులు పలాయనం చిత్తగించారు.

నెహ్రూ నాయకత్వంలోని భారత యూనియన్ లో కలవడానికి సంశయిస్తున్న కాశ్మీర్ సంస్థానం మహారాజా హరిసింగ్, భారత యూనియన్ లో కలపడానికి మొండికేసిన హైదరాబాద్ స్టేట్ వంటి సంస్థానాలతో సహా మొత్తం సంస్థానాలన్నింటిని ఒకటిన్నర సంవత్సరాలలో.., నయానా భయానా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విజయవంతంగా భారత్ లో కలిపి వేశారు.

ఇవి మాత్రమే కాక గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు మధ్యన ఉన్న గోవా, డయ్యు డామన్ ప్రాంతాలు పోర్చుగల్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. స్వాతంత్ర్యానంతరం అప్పటి ప్రధాని నెహ్రూ ఎటువంటి చొరవ చూపించని కారణంగా 1954 వరకు అక్కడి ప్రజలు బానిసలుగానే కొనసాగుతున్నారు.

ఆంగ్లేయులకు ముందు వెనుకగా వచ్చిన డచ్చ్, ఫ్రెంచ్, పోర్చుగల్ దురాక్రమణ దారులైన వలసవాదులు మనదేశంలో ఆక్రమించిన ప్రాంతాలను, భవనాలను వదిలి పోలేదు.

మరోవైపు ఫ్రాన్స్ చేతిలో ఉన్న పాండిచ్చేరి, కారికల్, చంద్ర నగర్ భారత్ వశం అయ్యాయి. కానీ పోర్చుగల్ చేతిలో ఉన్న భూభాగం మాత్రం అలాగే ఉండిపోయింది, బానిసత్వం లోనే మగ్గుతున్న అక్కడి ప్రజలను స్వాతంత్ర్యగా జీవించడం కోసం చేసిన సఫల పోరాటం గురించి, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వీరుల గురించి తెలుసుకుందాము. జోహార్లర్పిద్దాం.

పోర్చుగల్ చేతిలో ఉన్న ఆ ప్రాంతమే దాద్రా, నగర్ హవేలీ….
దాద్రా, నగర్ హవేలీ 487 కి.మీ. విస్తీర్ణంలో రెండు తాలూకాలుగా ఉన్న ప్రాంతము. “దాద్రా” మరో రెండు గ్రామాలను కలిగి ఉన్న పట్టణం. తాలూకా ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. “సిల్వాస్సా” నగర్ హవేలి తాలూకా ప్రధాన పట్టణం, సిల్వాస్సా తో పాటు 68 ఇతర గ్రామాలను కూడా కలిగి ఉంది.

అక్కడి ప్రజల అవమానకరమైన స్థితిని చూసి చలించిపోయిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం సేవకులు అప్పటి పూనా సంఘ ప్రచారకులయిన “శ్రీ రాజాభావు వాకంకర్ ” నేతృత్వాన పెద్ద ప్రయత్నం ప్రారంభమైంది. సంఘములో ముఖ్యులైన పెద్దలతో చర్చించి అనుమతి పొందిన పిమ్మట అవసరమైన ఏర్పాట్లను చేసుకోవడం ప్రారంభించారు.

గుజరాతి మరాఠీ వంటి 14 భాషల్లో నిష్ణాతులైన శ్రీ విశ్వనాధ్ నర్వాణే గారు మొత్తం సమయం సిల్వాస్సా లో ఉండి వ్యూహరచన చేశారు.

అక్కడి పాలకులను ఎదుర్కోవాలంటే ఆయుధాలవసరం కనుక ఆయుధాలు సంపాదించ వలసిందే, దాని కొరకై కావలసిన ధనాన్ని సమకూర్చే బాధ్యత ప్రసిద్ధ మరాఠీ గాయకుడు, సంగీత కారుడైన సుధీర్ ఫడ్కే గారికి అప్పగించబడింది.

1948వ సంవత్సరంలో గాంధీ హత్య జరిగిన దరిమిలా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పై అసత్య ఆరోపణలు మోపి నిషేదం విధించిన కారణంగా దాద్రా నగర్ హవేలి విముక్తి పోరాటం ఆలస్యం అవుతున్నది…, మరోవైపు సంఘంపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రజలు ప్రత్యక్షంగా ఆర్థికంగా సహకరించే పరిస్థితి కనిపించనందున సుధీర్ ఫడ్కే మొదలైన వారు సుప్రసిద్ధ గాయని శ్రీమతి లతామంగేష్కర్ వంటి వారితో కలిసి సంగీత కచేరీలు చేసి ధనాన్ని సేకరించారు.

అన్ని రకాల అవసరాలను సమకూర్చుకున్న తర్వాత అప్పటి పరమపూజ్య సర్ సంఘచాలకులు శ్రీ గురూజీ తో మాట్లాడి పూర్తి వ్యూహరచన వారి ముందుంచగా వారు సమ్మతించి ఆశీర్వదించారు.

విముక్తి కొరకు పెద్ద ఎత్తున తరలి వెళ్లే ఈ ప్రయత్నానికి “ముక్తి వాహిని” అని పేరు పెట్టారు. జూలై 31వ తేదీ కురుస్తున్న వర్షం తుఫానుగా మారింది, బయలుదేరి వెళ్ళవలసిన వారు కూడా తుఫాన్ సృష్టించే వారి లాగానే బయలుదేరారు… అందరూ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. జట్లు జట్లుగా బయలుదేరారు. భయంకరమైన ఎడతెరిపి లేని వాన ఒక వైపు కురుస్తుండగా రాత్రి వరకు ముంబై మీదుగా సిల్వాస్సా చేరుకున్నారు. ముందే అనుకున్న విధంగా,అనుకున్న సమయానికి “ముక్తి వాహిని” సభ్యులందరూ అక్కడి పోలీసు స్టేషను, న్యాయాలయము, జైలు మొదలైన ప్రదేశాల్లోకి చేరుకుని విముక్తి గావించారు, మహారాష్ట్ర నుండి వెళ్ళిన స్వయంసేవక్ లకు స్థానికులు కూడా కొందరు తోడయ్యారు ఈ జన ప్రవాహాన్ని., వారి చేతులలోని ఆయుధాలను చూసి పోర్చుగల్ సైనికులు భయపడిపోయారు ఆయుధాలను క్రింద పారవేసి చేతులెత్తి నిలబడ్డారు .

పోర్చుగల్ శాసనంలో కొనసాగుతున్న దాద్రా, నగర్ హవేలీ లోని ముఖ్య భవనాలు విముక్తి వాహిని హస్తగతం అయ్యాయి వాటిపై తిరంగా ఝండాలు ఎగురవేసారు.

కానీ అక్కడి పాలకుడైన ” ఫిందాల్గో ” అతని వెంట ఉన్నవారు కొందరు లొంగిపోవడానికి సిద్ధంగా లేకపోతే.., చిన్న సంఘర్షణ తోనే వారిని లొంగ తీసుకోవడం జరిగింది.

ఫిందాల్గో మరియు అతని భార్యను బందీలుగా ప్రకటించి వారి ప్రార్థన మేరకు సురక్షితంగా వారు కోరుకున్న ప్రాంతాలకు చేరవేయడం కూడా జరిగింది.

ఇలా ఆ రోజు రాత్రంతా అక్కడి ప్రతి గ్రామానికి స్వయం సేవకులు వెళ్లి ఆ ప్రాంతాలు విముక్తం అయినట్లుగా ప్రకటించి తిరంగా ఝండా ఎగరవేశారు మరుసటి రోజు సూర్యోదయం సమయానికి మొత్తం దాద్రా నగర్ హవేలీ ప్రాంతాలలోని భవనాలపై మూడు రంగుల ఝండా సగర్వంగా రెపరెపలాడుతూ కనిపించింది.

116 మంది పరాక్రమవంతులైన స్వయం సేవకులు (అసలు స్వయంసేవక్ అంటేనే పరాక్రమవంతుడని అర్థంకదా..) ఒక రాత్రి సమయంలోనే దాద్రా నగర్ హవేలీ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టారు.

ఇందులో భాగస్వాములైన శ్రీ బాబురావు బిడేజి, వినాయకరావు ఆప్టే జీ, బాబాసాహెబ్ పురందరే జీ, డాక్టర్ శ్రీధర్ గుప్తా జీ, బిందు మాధవ్ జోషి, మేజర్ ప్రభాకర్ కులకర్ణి, శ్రీకృష్ణ బిడే, నానా కజ్రేకర్, త్రయంబక్ బట్ , విష్ణు భోస్లే , శ్రీమతి లలితా ఫడకే, శ్రీమతి హేమావతి నాటికర్ మొదలైనవారు ముఖ్య భూమికను పోషించారు.

సముద్రపు ఒడ్డున ఉండి శివాజీ కాలంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ పోర్చుగల్ చేతిలోనుండి విముక్తి గావించబడి భారత యూనియన్ లో విలీనమయిపోయింది.

|| భారత ప్రభుత్వం చేత ఆగస్టు 11వ తేదీన ప్రకటించబడింది. ||

ఈ రకంగా విముక్తి పొందిన ఆ ప్రదేశాలను, విముక్తి పోరాటంలో పాల్గొన్న ఆ మహనీయులను సంస్మరించుకుంటూ.

–పాట్నా క్షేత్ర సంఘటనా మంత్రి, విశ్వహిందూ పరిషత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here