Home News ఆది నుంచి జాతీయ పతాకం పట్ల RSSకు గౌరవం: శ్రీ మోహన్ భాగవత్ జీ

ఆది నుంచి జాతీయ పతాకం పట్ల RSSకు గౌరవం: శ్రీ మోహన్ భాగవత్ జీ

0
SHARE

మువ్వన్నెల జెండా ఆవిర్భావం నుండి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్, తిరంగా పట్ల గౌరవంతో ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నది.  – డా. మోహన్ భాగవత్

 “రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్వీయ ఆధారితమైనది. మనం ఏమి ఖర్చు చేయాలనుకున్నా, అది మనకు మనమే ఏర్పాటు చేసుకుంటాము. మన సంస్థను నడిపేందుకు మనం, బయటినుండి ఎవరి దగ్గర, ఒక్కపైసా కూడా తీసుకోము. మన సంస్థకు ఎవరన్నా ఏదన్నా ఇవ్వాలనుకున్నా, మనం దానిని తిరస్కరిస్తాము. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ మన స్వయంసేవకులు సమర్పించే గురుదక్షిణ మీద మాత్రమే పూర్తిగా ఆధారపడింది. మన పవిత్రగురువుగా భావించే భగవాధ్వజానికి మాత్రమే, ప్రతి ఏటా మనం సమర్పణ చేస్తూ ఉంటాము.

భగవాధ్వజమే ఎందుకు గురువుగా ఉండాలి? కారణం మనకు అనాది కాలం నుండి వస్తున్న ఒక సాంప్రదాయం, ఒక పరంపర. ఎప్పుడైనా మన దేశచరిత్ర చెప్పవలసివస్తే, మన కాషాయధ్వజం (అంటే భగవాధ్వజం) ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. మన స్వతంత్ర భారతదేశానికి ఏ ధ్వజం ఉండాలని ఏర్పాటు చేసిన జెండా బృందం (ఫ్లాగ్ కమిటీ), తన నివేదికలో, అందరికీ తెలిసిన, ఆదరణీయ భగవాధ్వజమే జాతీయధ్వజంగా ఉండాలని సిఫారసు చేసింది.

కానీ, తర్వాత కొన్ని మార్పులు జ‌రిగాయి. మువ్వన్నెల జెండా మన జాతీయజెండాగా ప్రకటించారు. మనందరికీ, మన జాతీయజెండా అంటే, చక్కటి గౌరవప్రపత్తులు ఉన్నాయి. అయితే, సంఘశాఖలలో జాతీయజెండా కాకుండా, భగవాధ్వజం ఎందుకు ఎగురవేస్తున్నారు? అనే ప్రశ్న కొందరికి ఉదయిస్తుంది.

RSS ఎప్పుడూ కూడా, మన మువ్వన్నెల జెండా ఆవిర్భావం నుండి, మన తిరంగా గౌరవం పట్ల ఎంతో ఆత్మీయ అనుబంధం కలిగి ఉన్నది. ఇక్కడ ఒక వాస్తవమైన సంఘటనను మీకు తెలియజేస్తాను. మువ్వన్నెల జెండా (తిరంగా) మన జాతీయజెండాగా ఉండాలని నిర్ణయం తీసుకున్న వెంటనే, జెండాపై ఇప్పుడున్న అశోకచక్రానికి బదులుగా, రాట్నం (చరఖా) చిహ్నం వచ్చింది. ఇది మొట్టమొదటిసారి, 1937లో ఫైజ్ పూర్ కాంగ్రెస్ సమావేశాలలో ఎగురవేశారు. అప్పుడు ఏమి జరిగిందంటే – సమావేశాలకి అధ్యక్షత నెహ్రూ వహించాడు. జండా స్తంభం 80 అడుగుల ఎత్తున్నది. జెండా ఎగురవేసేటప్పుడు, అది స్తంభం కొంతఎత్తు వరకూ వెళ్ళి, చిక్కుబడి పోయింది, ఇంకా పైకి వెళ్ళటం లేదు. ఆ 80 అడుగుల స్తంభం పైకి ఎక్కి, ఆ జెండాను సరిచేసి, ఎగురవేసే ధైర్యం అక్కడున్న ఎవరికీ లేకపోయింది.

ఆ పరిస్థితిలో, ఒక నవయువకుడు అకస్మాత్తుగా గుంపులోనుండి ముందుకొచ్చాడు. అతడు పరుగెత్తి, ఆ స్తంభం చాలా సాహసంతో ఎక్కి, ఆ జెండా చిక్కుముడులు సరిచేసి, మన జాతీయ జెండా 80 అడుగుల ఎత్తులో సరిగ్గా ఎగిరేటట్లు చేసి, విజయంతో దిగి వచ్చాడు. నెహ్రూ మహాశయుడు కూడా అతని వీపు తట్టి, అభినందించి, అతనిని ఆ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ సమావేశాలలో సన్మానించేందుకు రమ్మని ఆహ్వానించాడు. ఇంతలో, కొందరు కాంగ్రెస్ నాయకులు ఆయన వద్దకు వెళ్ళి, ‘ఇతడు శాఖకు వెళుతూ ఉంటాడు, కాబట్టి ఈ యువకుడిని ఆహ్వానించకూడదు’ అని చెప్పారు. ఆ ధీరుడైన యువకుడే, శ్రీ కిషన్ సింగ్ రాజపుట్, మహారాష్ట్ర లోని జల్ గావ్ నివాసి అయిన ఒక స్వయంసేవక్. ఆయన ఈ మధ్యనే 5-6 ఏళ్ల క్రితం స్వర్గస్తులయ్యారు. కానీ, ఎప్పుడైతే ఈ విషయం డా. హెడ్గేవార్ గారికి తెలిసిందో, ఆయన చాలా ఆనందంతో, వెంటనే ప్రయాణం చేసి, ఆ సాహస యువకుడైన శ్రీ కిషన్ సింగ్ గారిని కలిసి, ఒక వెండి పాత్ర (స్పొర్ట్స్ కప్ వంటిది) బహుమతిగా ఇచ్చి, అభినందించారు. కాబట్టి, అప్పుడు విజయవంతంగా ఎగురవేసిన జాతీయ జెండా, ఇప్పటికీ స్వయంసేవకుల చేత గౌరవ, ప్రపత్తులు పొందుతూనే ఉన్నది.

19, డిసెంబర్ 1929న లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో, మొదటిసారిగా భారతదేశానికి సంపూర్ణస్వరాజ్యం తీర్మానం ఆమోదించబడింది. వెంటనే, 1930లో డా. హెడ్గేవార్ గారు అన్నిశాఖలకూ – ఈ విషయంపై కాంగ్రెస్ ను అభినందిస్తూ తీర్మానం ఆమోదించి, కాంగ్రెస్ కమిటీకి పంపాలని – ఒక సూచనాపత్రం పంపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించటం, దేశం పరమవైభవ స్థితికి చేరుకోవటం, ఇదే డా. హెడ్గేవార్ గారి జీవితధ్యేయం. ఇంకా సంఘంలో ఏమి మిగులుతుంది? అందుకే, స్వయంసేవకులు భారతదేశ స్వాతంత్ర్యసాధన చిహ్నాలు అన్నింటికీ పూర్తి భక్తి, గౌరవభావాలతో అంకితమౌతూనే ఉన్నారు. సంఘం గురించి మాట్లాడేందుకు ఇంకేమీ లేదు. “

{న్యూఢిల్లీలోని  విజ్ఞాన్ భవన్ లో 2018 సెప్టెంబర్ 17 నుండి 19తేదీల‌లో “Bhavishya Ka Bharat” (భారతదేశ భవితవ్యం) అనే అంశంపై ఏర్పాటు చేసిన స‌మావేశంలో , ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గారు జాతీయ ప్రాముఖ్యత ఉన్న రకరకాల సమకాలీన సమస్యలపై, ఆర్‌.ఎస్‌.ఎస్ ఆలోచనా విధానాన్ని వివరించారు. అదే స‌మావేశంలో మువ్వన్నెల జెండా, కాషాయ ధ్వజం పైన సంఘ ఆలోచనావిధానం” అనే అంశంపై చారిత్రక వాస్తవాలు వివరించారు}

Source: VSK BHARATH

అనువాదం: సత్యనారాయణమూర్తి