Home Rashtriya Swayamsevak Sangh మాతృభూమి సేవలో ఆర్‌ఎస్‌ఎస్

మాతృభూమి సేవలో ఆర్‌ఎస్‌ఎస్

0
SHARE

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశంలో తరుచుగా వినిపిస్తూ పెద్దగా పరిచయం చేయనక్కరలేని సామాజిక సేవా సంస్థ. తెల్లని చొక్కా, ఖాకీ ప్యాంటు, నెత్తిన టోపి, చేతిలో లాఠీతో ఒక ప్రత్యేకమైన ఆహార్యాన్ని, క్రమశిక్షణ గల దేశభక్తులను తయారుచేసే ఒక పెద్ద కర్మాగారం ఈ సంస్థ.

దేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న కాలంలో 1925లో డాక్టర్జీగా పిలువబడే కేశవ బలరామ్ హెడ్గేవార్ గారిచే స్థాపించబడిన ఈ సంస్థ పురుడుబోసుకున్న అనతి కాలంలోనే ఎంతో మంది సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేసి అటు సమాజంలో సామాజిక రుగ్మతలను నిర్మూలించి, అసమానతలను తొలగించే ప్రయత్నం చేస్తూనే మరోవైపు స్వాతంత్య్రోద్యమ సంగ్రామంలో స్వయం సేవకులను ముందు వరుసలో నిలబడేలా చేయగలిగింది.

సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన డాక్టర్జీ తన వైద్య విద్యను పూర్తి చేసుకున్నాక తన స్వగ్రామం నాగ్‌పూర్‌లోని సుక్రావరి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉచితంగా వైద్య సేవా కార్యక్రమాలను నిర్వహించేవారు. తను చేసే నిస్వార్థ సేవాతత్పరతకు ప్రతిఫలంగా ఎంతో మంది యువకులు దేశ సేవలో పాలుపంచుకునేందుకు డాక్టర్జీ మార్గంలో నడిచేవారు. దేశంలోని ఏ మూలైనా ఏదైనా ఒక ప్రమాదమో, విపత్తో సంభవిస్తే క్షతగాత్రులకు, బాధితులకు తమ చేయూతనందించడానికి సర్వదా సిద్ధంగా ఉండే ఈ సంస్థ ఎప్పుడూ ఎవరో ఒకరి చేత వివాదాలను, ఆరోపణలను, ప్రశంసలను పొందుతూనే ఉంది. కానీ తమ మాతృదేశానికి సేవ చేయడమనే లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ విడనాడలేదు. 2014లో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రత్యర్థుల దాడి మరీ ఎక్కువైంది.

ఒకరు ఇది హిందూ అతివాద సంస్థ అంటే, మరొకరు దీన్ని దేశాన్ని విభజించేదిగా అభివర్ణిస్తుంటారు. కొందరు దీన్ని కుల ఆధిపత్య సంస్థ అంటే మరికొందరు దీన్ని మతాల మధ్యన చిచ్చుపెట్టే ఛాందసవాద సంస్థగా పేర్కొంటుంటారు. కానీ దాని గతాన్ని, గమనాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లుతై ఇది అసంబద్ధమైన వాదనేనని అర్థమవుతుంది. ఈ సంస్థ చేసే సేవా కార్యక్రమాలకు ఒక వైపు ప్రజలు ఆకర్షితులవుతుంటే మరోవైపు అసత్యపు ఆరోపణలతో నిషేధాన్ని ఎదుర్కోక తప్పలేదు. మొదట్లో 1940లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దీని ఐడెంటిటీని దెబ్బతీయడానికి స్వయంసేవకుల గణవేష్ (యూనిఫామ్), పథ సంచలన్ (రూట్‌మార్చ్)ని నిషేధించింది.

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారి తూటాలకు మహారాష్ట్రలోని కొందరు స్వయం సేవకులను కోల్పోయిన ఈ సంస్థ 1948లో గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమనే అసత్య ఆరోపణల మీద స్వాతంత్య్ర భారతంలో మొదటిసారి నిషేధించబడి, 17000 మంది స్వయం సేవకులు అరెస్ట్ చేయబడ్డారు. అనంతరం నిజానిజాలను తెలుసుకున్న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం సంవత్సరం తిరగ్గానే 1949 జూలై 12 నాడు నిషేధాన్ని ఎత్తివేసింది. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలో రెండవసారి నిషేధించబడింది. ఆ తర్వాత 1977లో ఎమర్జెన్సీ ముగిసిన మరుసటి రోజు మార్చి 22 నాడు నిషేధం ఎత్తివేయబడింది.

అదే సంవత్సరం పాట్నాలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శాఖా వార్షికోత్సవంలో పాల్గొన్న జయప్రకాశ్ నారాయణ, సర్వోదయ నాయకుడు ప్రభాకర్ రావు మాట్లాడుతూ బిహార్‌లో సంభవించిన కరవు సహాయక చర్యల్లో, దివిసీమ ఉప్పెన బాధితుల సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న స్వయం సేవకుల సేవలను గుర్తుచేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్‌లెస్ సర్వీస్ అంటూ కొనియాడారు. 1992లో జరిగిన రామ జన్మభూమి ఉద్యమం అనంతరం మూడోసారి విధించబడిన నిషేధం తర్వాత 1993లో ఎత్తివేయబడింది.  వివిధ రకాల కారణాలతో మూడుసార్లు నిషేధించబడింది. నిషేధించబడిన ప్రతీసారీ తన శక్తిని మరింత పెంచుకొని ద్విగుణీకృతమౌతూ మాతృభూమి సేవలో తన నిబద్ధతను చాటుతూనే వుంది. ఏ ప్రభుత్వాలు, నేతలైతే ఆర్‌ఎస్‌ఎస్ మీద నిషేధం విధించారో తర్వాతి కాలంలో వారే దాని కార్యదక్షతను తెలుసుకొని పొగడ్తల వర్షం కురిపించారు.

1928లో కలకత్తాలో డాక్టర్జీని కలిసిన సుభాష్ చంద్రబోస్ ఆర్‌ఎస్‌ఎస్ క్రమశిక్షణను, అంకితభావాన్ని చూసి ఇలాంటి కార్యకర్తలుంటే స్వాతంత్య్రం పొందడానికి ఎంతో సమయం పట్టదన్నారు. 1934లో ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని తొలిసారి సందర్శించిన మహాత్మా గాంధీ స్వాతంత్య్రానంతరం 1947లో ఢిల్లీలోని భంగీ కాలనీలో ఒక సమావేశంలో ప్రసంగిస్తూ “కొన్ని సంవత్సరాల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని చూసిన నేను అక్కడి స్వయంసేవకులు క్రమశిక్షణ, దేశభక్తి, నిరాడంబరతను చూసి ముగ్దుడినయ్యాను” అని పేర్కొన్నారు.  37, 39 సంవత్సరాల్లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాల్లో పాల్గొన్న డా.బి.ఆర్. అంబేద్కర్ 1949లో పూణెలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశంలో మాట్లాడుతూ “ఇక్కడి స్వయంసేవకులు ఒకరి కులం మరొకరు తెలుసుకోకుండానే సోదరభావంతో కలివిడిగా తిరుగుతూ ఉండడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

నేడు సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలు రూపుమాపబడి, సామాజిక పరివర్తన రావాలంటే ఆర్‌ఎస్‌ఎస్ లాంటి విప్లవాత్మక సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. అందుకు ఆర్‌ఎస్‌ఎస్ మరింత బలపడవలసిన అవసరమున్నది” అని అభిలషించారు.    దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భాలలో స్వయంగా కాంగ్రెస్ నేతలే ఆర్‌ఎస్‌ఎస్ జోక్యాన్ని కోరుకున్నారు. దేశ విభజనానంతరం స్వతంత్ర దేశంగా ఉంటానని ప్రకటించుకున్న కాశ్మీర్ మహారాజు రాజా హరిసింగ్‌తో మాట్లాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ఒప్పించడానికి శ్రీ గురూజీని అప్పటి నెహ్రూ, సర్దార్ పటేల్‌లు ప్రత్యేక విమానంలో కాశ్మీర్‌కు పంపించారు. రాజా హరిసింగ్‌ను ఒప్పించి భారత్‌లో కాశ్మీర్‌ను విలీనం చేయడంలో గురూజీ పోషించిన పాత్రను వారు కొనియాడారు.

1962లో చైనాతో భారత్‌కు జరిగిన యుద్ధ సమయంలో స్వయం సేవకులు భారత సైనికులకిచ్చిన చేయూతను, వారి జాతీయవాద స్ఫూర్తిని కొనియాడిన అప్పటి ప్రధాని నెహ్రూ 1963లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ను పాల్గొనవలసిందిగా ఆహ్వానించడంతో 3,000 మంది స్వయం సేవకులు ఆ పరేడ్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా 1965లో భారత్ మీద పాకిస్థాన్ యుద్ధానికి తలపడినపుడు యుద్ధవ్యూహాలకై జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గురూజీని పాల్గొనవలసిందిగా ఆహ్వానించిన నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి దేశ సైన్యానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు.  కాంగ్రెస్ నేతలు వరుసపెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ను, అది చేసే సేవా కార్యక్రమాలను కొనియాడగా దాదాపు అదే సంవత్సరంలో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లో తమ ఉనికిని కోల్పోతున్న తరుణంలో బలహీనుడు బలపడాలంటే బలవంతుడితో తలపడాలి అన్న చందంగా దేశంలో జరిగే ప్రతి చిన్నా చితక సంఘటనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో ముడిపెట్టడం పరిపాటిగా మారింది.

ఎమర్జెన్సీ తరువాత 1977లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ఉప రాష్ట్రపతి బి.డి. పాటిల్, రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యాభారతి వారి శిశు సంగమం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇది మరిచిపోయిన నేటి విపక్ష నేతలు.. మొన్న జూన్ 7వ తేదీనాడు నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమ్మతించిన మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌తో 50 సంవత్సరాల అనుబంధం కలిగిన ప్రణబ్ ముఖర్జీని ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వారి అభిప్రాయాలను తిరస్కరించిన ప్రణబ్ ముఖర్జీ “భారతమాత అందించిన గొప్ప పుత్రుడికి నివాళులర్పించేందుకు ఇక్కడికి వచ్చాను” అని ఆ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలోని సందర్శకుల పుస్తకంలో రాశారు.

ఆ తర్వాత జరిగిన సమావేశ సభలో ప్రసంగించిన ప్రణబ్ “భారత్‌లోని వివిధ కులాలు, మతాలలో భిన్నత్వం ఉన్నప్పటికీ దేశం పట్ల అందరికీ, అన్నింటికీ ఒకే రకమైన జాతీయ దృక్పథం ఉండాలి. అంతర్లీనంగా మనది ఒకే నాగరికత, ఒకే చరిత్ర. మన దేశాన్ని సందర్శించిన మొగస్తనీస్, పాహియాన్, హుయన్‌త్సాంగ్ లాంటి యాత్రికులు మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ దేశ అభ్యున్నతి కోసం అందరం పాటుపడదాం” అని చెప్పారు. తద్వారా ఆర్‌ఎస్‌ఎస్ ప్రవచించే సంస్కృతి, సాంప్రదాయక విలువల్ని, జాతీయవాదాన్ని పరోక్షంగా సమర్థించారు. ప్రణబ్ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్ వార్షికోత్సవంలో పాల్గొననున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి నానా రభస సృష్టించి వెళ్లొద్దంటూ కొందరు, వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌కి హితబోధ చేయాలని మరికొందరు గగ్గోలు పెట్టినా చివరికి ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం ఏకాత్మ మానవవాదాన్ని చెప్పకనే చెప్పడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.

గతాన్ని చూడనివారు వర్తమానంలో ప్రణబ్ ముఖర్జీ  ప్రసంగం తరువాతనైనా ఆర్‌ఎస్‌ఎస్ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకొని వారు దుష్ప్రచారాలను ఆపి దేశ ప్రజలకు ప్రయోజనకరంగా ఆలోచనలు సాగించడం శ్రేయస్కరం. సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు సమాజంలో అన్ని వర్గాలకు చేయూతనందించేందుకు సర్వస్పర్శి అనే నినాదంతో పనిచేస్తూ గుప్పెడు మందితో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ నేడు దేశంలోని ప్రతి మూలకు విస్తరించి, కోట్ల మంది హృదయంలో చోటు సంపాదించడం, ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ పెనుతుఫానులో దీపస్తంభంలా ఉంటూ, దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయడమనే తన నిబద్ధతను నేటికీ కొనసాగించడం చూస్తుంటే నిజంగా నేటి తరానికి ఇది ఆదర్శప్రాయం, అనుసరణీయమే.

 సోలంకి శ్రీనివాస్

(విజయక్రాంతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here