Home Telugu Articles ఆర్ ఎస్ ఎస్ ముస్లిం లకు వ్యతిరేకం కాదు – జాఫర్ ఇర్షాద్

ఆర్ ఎస్ ఎస్ ముస్లిం లకు వ్యతిరేకం కాదు – జాఫర్ ఇర్షాద్

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్  శ్రీ మోహన్ భాగవత్ ప్రసంగంలో ఉద్ఘాటించిన “ఏ రోజునైతే ముస్లిములుకానీ, మరెవరుకానీ అవసరం లేదని అంటామో ఆ రోజు హిందూత్వం కూడా ఉండదు”   అన్న మాటలు ప్రస్తుత పరిస్థితులలో ఎంతో విలువైనవి, ప్రత్యేకమైనవి. ఈ మాటల అంతరార్ధం  దేశంలోని ముస్లింలు అర్థం చేసికొన్నట్లయితే, మతం పేరిట రాజకీయం చేసే అన్ని ప్రతిపక్ష  పార్టీల దుకాణాలు మూసుకుంటాయి. విలాసాల్లో మునిగితేలుతూ సంఘ్ పేరు చెప్పి సాధారణ ముస్లిములను భయపెట్టే నేతల ఆట కడుతుంది.

అసలు సంఘ్ అంటే ఏమిటి అన్నది ఈ దేశంలో సాధారణ ముస్లిములకు తెలియదు. సెక్యులరిస్టులమని  చెప్పుకొనే నేతలు బీదలు, నిరక్షరాస్యులైన ముస్లింల మనసులో ఎంత భయం నింపేసారంటే సంఘ్ తమను బద్ధశత్రువు గా భావిస్తూ, పూర్తిగా అంతమొందించడానికి లేదా దేశం నుండి వెళ్ళగొట్టడానికి చూస్తున్నదని అనుకోసాగారు. మీడియాలో సంఘ్ కు ఎంతో బలముందని, కావాలనుకున్న వార్తను ప్రచారం చేసుకోగలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ  ముస్లిం నేతలు మాత్రం తమ బలమైన మీడియా సంబంధాల ద్వారా  గత 71 సంవత్సరాలుగా ముస్లింల  మనసులో సంఘ్ వ్యతిరేక భావాలని నింపుతూనే ఉన్నారు. విద్యావంతులైన ముస్లింలు కూడా ఈ చక్రవ్యూహం లో చిక్కుకొని నిజంగా సంఘ్ ముస్లింల శతృవా, నిజంగా ముస్లిములను దేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తున్నదా అని ఆలోచన చెయ్యడానికి కూడా  ప్రయత్నించడం లేదని ఒక పాత్రికేయుడుగా నేను చెప్పగలను.

నిన్న సర్ సంఘ్ చాలక్ తమ ఉపన్యాసంలో “ఏ రోజైతే ముస్లింలు అవసరం లేదంటే ఆ రోజు హిందూత్వం కూడా ఉండదు” అన్నారు. ఈ వ్యాక్యాలతో ముస్లిముల మెదడులో అల్లుకున్న సాలెగూళ్ళు పటాపంచలవుతాయని ఆశిద్దాము. కానీ ఎన్నో రోజులుగా ముసల్మానుల మనసులో నిండిన సంఘ్ వ్యతిరేక భావాలు తొలగడానికి చాల రోజులు పట్టవచ్చు. ముస్లిముల అనుమానాలు దూరం చేయడానికి సంఘ్ ప్రయత్నం చేయలేదు. నిన్న సంఘ్ ప్రముఖ్ మొదటిసారిగా వెల్లడించిన భావనను స్వాగతించాలి. కానీ దీనితో అంత ప్రయోజనము ఉండదు, ఎందుకంటే, అధికమవుతున్న ముస్లిముల బలాన్ని చూసి సంఘ్ భయపడుతున్నదని, సంఘ్ సమర్ధిస్తున్న భారతీయ జనతా పార్టీకి ముస్లిముల ఓట్లు కావాలని,  అందుకనే ఇలా మాట్లాడుతున్నారని సెక్యులర్ నేతలు ప్రచారం చేస్తారు.

సంఘ్ గాని, భాజపా గాని తమ గురించి ప్రచారంలో ఉన్న ముస్లిం వ్యతిరేక భావనలను దూరం చెయ్యడానికి గట్టి ప్రయత్నం చెయ్యలేదని ఒక పాత్రికేయుడిగా నా అభిప్రాయం. సంఘ్ ద్వారా ప్రారంభమయిన ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’  కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. అక్కడ నేను కలుసుకున్న ముస్లిములకు సమాజంలో చెప్పుకోతగిన స్థాయి కానీ, వారి మాట ఎవరయినా వింటారని కానీ నాకు అనిపించలేదు. ఎందుకంటే టోపీ పెట్టుకున్న ఒక గుప్పెడు గడ్డపు వాళ్ళు ముస్లిం సమాజానికి ప్రతినిధిలు కాజాలరు.

ఒక పాత్రికేయుడుగా నేను సంఘ్ యొక్క అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాను కానీ నాకు కూడా సంఘ్ గురించి ఎక్కువ తెలియదు. నేను పాల్గొన్న కార్యక్రమాలలో నా గురించి ఎవరికీ అంతగా తెలియదు కానీ ఆ కార్యక్రమాలలో సంఘ యొక్క ఏ నేత కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడము నేను వినలేదు. కొంత మంది, సంఘ్ తమ ముస్లిం వ్యతిరేక కార్యక్రమాలను తలుపులు మూసుకొని నిర్ణయిస్తారని అవి మీడియా ముందుకి తీసుకురారని వాదించవచ్చు. ఈ నిర్ణయాలు ఒక 100 మంది సంఘ్ అధికారులు తీసికోన్నారని అనుకొందాము కానీ  ఆ నిర్ణయాలు వేల, లక్షల సంఖ్యలో ఉన్న స్వయంసేవకులకు తెలుపవలసిఉంటుది ఎందుకంటే అవి అమలులో పెట్టవలసిన వారు వారే.  నేను పది వేల సంఖ్యలో ఉన్న స్వయంసేవకులను సర్ సంఘ్ చాలక్ గారు సంబోధించగా విన్నాను కానీ ఆయన ముసల్మానులకు వ్యతిరేకంగా మాట్లాడడము ఎప్పుడూ వినలేదు.

ముస్లిం నేతలకు నాదొక ప్రశ్న. ముస్లిముల మనసులో ఇంత ద్వేషం నింపడానికి వారు సంఘ్ ముస్లిములకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ రహస్య సభకు హాజరయ్యారు? నీ చెవిని కాకి ఎత్తుకు పోయిందని అంటే అది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోకుండా గుడ్డిగా నమ్మేటట్లుగా ముస్లిం సమాజం తయారయింది.

ముస్లిములలో తమ గురించి ఉన్న దురభిప్రాయాన్ని తొలగించడానికి సంఘ్ ఎలా ప్రయత్నించలేదో, అలాగే భాజపా కూడా కొంత మంది ముస్లిములను ఉత్సవ విగ్రహాలల (షో పీస్) లాగా కలుపుకున్నారుగాని, ముస్లిం సమాజం లో భాజపా కు వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలను దూరం చేయడానికి ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా లేవు.

నేను సంఘ్ తరఫున మాట్లాడంలేదు. కానీ ఒక పాత్రికేయుడుగా సంఘ్ చేసే సమాజ సేవా కార్యక్రమాలు ఎంతో దగ్గిరనుండి చూశాను. అది కూడా హిందూ, ముస్లింలనే తేడా లేకుండా. ఇది ఏ మీడియా హౌస్ చూపించలేదు. ఇలాంటిదే ఒక సంఘటన జూలై 10, 2011 ఆదివారం నాడు నేను కాన్పూర్ లో ఒక సమాచార ఏజెన్సీ లో ముఖ్య విలేఖరిగా ఉండగా జరిగింది. ఆదివారం అయినందువలన నేను విశ్రాంతి తీసుకొంటున్నాను. మధ్యాహ్నం ఒంటి గంట సమయములో మా సంపాదకుని వద్దనుంచి ఫతేపూర్ దగ్గర మాల్వ అనే ఊరిదగ్గర ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగిందని అక్కడికి వెంటనే వెళ్ళమని ఆదేశం వచ్చింది. నాకు కరెంట్ షాక్ కొట్టినంత పనయ్యింది. రైల్వే లో ఉన్న నా మిత్రులని సంప్రదించాను. వారు ఒక పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పారు. నేను వెంటనే బయలుదేరాను. ఒక గంట తర్వాత నేను ప్రమాద స్థలానికి చేరాను. ప్ర్రమాదం జరిగిన ప్రదేశం మాల్వ గ్రామం నుండి 10-12 కి.మీ. దూరం లో ఒక నిర్మానుష్య ప్రదేశం లో ఉన్నది. అక్కడికి చేరడానికి ఒక నాలుగు కి.మీ. పొలాల గుండా పోవాలి. దగ్గరలో మనుష్య సంచారం లేదు. ఘటనస్థలానికి చేరి నేను  డిల్లీ లో ఉన్న మా  సంపాదకులకు, డెస్క్ ఎడిటర్ కు రిపోర్ట్ చేయడం లో నిమగ్నం అయ్యాను. బోగీలనుండి ఒక్కొక్క శవాన్ని బయటకు తీస్తున్నారు, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. చాలా హృదయవిదారకమైన దృశ్యాలు. ఒక పిల్లవాడికి తల్లిదండ్రులు దూరమయితే, ఒకరికి పతి ఇంకొకరికి సోదరుడు దూరమయ్యారు. ఒకరు ఏడుస్తుంటే ఇంకొకరు గాయాల బాధతో ఏడుస్తున్నారు. బోగీలనుండి శవాలను తీసి పక్కనున్న పొలాలలో పడుకోపెడుతున్నారు. అప్పుడు కొంతమంది ఖాఖి నిక్కర్లు వేసుకున్న కొంతమంది శవాలపై తెల్లని బట్టని కప్పడం నేను చూశాను. బోగీ లనుండి శవాలను తీసుకొని రాగానే తెల్లని బట్ట కప్పసాగారు. ఎందుకంటే అవి ఛిద్రమయి భయంకరం గా ఉన్నాయి. తరువాత వాటిని పోస్టుమార్టం కోసం పంపిస్తున్నారు.

నేను అక్కడ నుండి కదిలి రైలు ప్రమాదం లో గాయపడిన వారి కుటుంబ సభ్యులు, ప్రయాణీకులు ఉన్న ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ పరిస్థితి దుఖఃభరితంగా  ఉంది అందరూ ఆకలి దప్పికలతో ఉన్నారు. కొందరు గాయపడిన తమ కుటుంబీకుల క్షేమానికై ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు కొందరు అక్కడ ఉన్న ప్రయాణికులకు, కుటుంబ సభ్యులకు టీ, బిస్కట్లు, మంచి నీరు ఇవ్వడము చూశాను. అక్కడ నేను కాక ఇంకా రెండు డజన్ల పత్రకారులు రిపోర్టింగ్ లో నిమగ్నమయి ఉన్నారు. అప్పుడు ఒక ప్లాస్టిక్ కప్పులో టీ రెండు బిస్కట్లు నా వైపు వచ్చాయి. సుమారు నాలుగు గంటలు ఎడ తెరిపి లేకుండా రిపోర్టింగ్ చేయ్యడములో మునిగి ఉన్న మాకు అ టీ ఒక ఐదు నక్షత్రాల హోటల్ లో ఇచ్చే టీ లాగా అనిపించింది.

పాత్రికేయుడిగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇంతమందికి ఉచితంగా టీ, మంచినీళ్ళు, బిస్కట్లు పంచుతున్న వాళ్ళు ఎవరు? ప్రభుత్వం తరఫు సిబ్బందా? అక్కడ ఉన్న ఒకరిని నేను ఆపి “మీరు ఎవరు, ఎందుకు ఇవన్ని పంచుతున్నారు”, అని అడిగాను. ఆయన ఒక చిరునవ్వు నవ్వి మీకు ఇంకా టీ కావాలంటే అక్కడ ఉన్న రావిచెట్టు వద్దకు రండి అన్నారు. నేను కుతూహలం చంపుకోలేక ఆయన వెనుకనే రావిచెట్టు వద్దకు వెళ్ళాను. ఆక్కడ కొందరు మహిళలు కూరలు కోస్తున్నారు, పిండి కలుపుతున్నారు. ఒక పొయ్యి మీద గిన్నెలో టీ మరుగుతున్నది. వేల కొద్ది బిస్కట్ పాకెట్లు ఉన్నాయి. పెద్ద ప్లాస్టిక్ డ్రం లో మంచినీళ్ళు ఉన్నాయి. వాటిని చిన్న చిన్న పాలిథిన్ సంచులలో నింపుతున్నారు. కుర్తా పైజమా ధరించిన ఒక పెద్దాయన మహిళలను పురుషులను త్వరగా పని చేయమని పురమాయిస్తున్నారు. నేను ఆయన వద్దకు వెళ్లి ఆయన పేరు అడిగాను. ఆయన నవ్వారు కానీ ఏమి చెప్పలేదు. నేను “జాఫర్, ఒక పాత్రికేయుడిని” అని నా పరిచయం చేసుకొన్నాను. “మీరు ఏ సంఘటనకి చెందిన వారు మీరు చెసే నిస్వార్ధ సేవ గురించి రిపోర్ట్ చేస్తాను” అని అన్నాను. రిపోర్ట్ మాట వినగానే ఆయన అక్కడినుండి వెళ్ళిపోయారు. ప్రయాణికులను గాని గాయపడినవారిని గాని వారి పేరు, మతం అడుగకుండానే టీ మంచినీళ్ళు  పంచడములో మునిగిపోయారు.

నేను ట్రైన్ నుండి తీస్తున్న శవాల లెక్కలు సహాయ కార్యక్రమాలు చేస్తున్న అధికారులతో మాట్లాడడం లో రిపోర్ట్ పంపించడం లో మునిగిపోయాను. రాత్రి దాదాపు 12 గంటలు అయింది. శవాల్ని ఇంకా తీస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా మధ్యాహ్నం చూసిన పెద్దాయన వచ్చి ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చారు. “భాయి సాహబ్  ఇదేంటి?” అని అడిగాను. ఆయన “ఏమి లేదు నాలుగు రొట్టెలు, కొంచం కూర ఉంది. మీరు మధ్యాహ్నం నుండి రిపోర్ట్లు వ్రాస్తూనే ఉన్నారు. కొంచెం తినండి. మీకు ఆకలి వేస్తూ వుంటుంది.” అన్నారు. నాకు నిజంగానే చాల ఆకలిగా ఉంది. కానీ “భాయి, నేను తింటాను కానీ మీరు మొదట మీ పరిచయం చెప్పండి.” అన్నాను. “మీరు ఇది ప్రచురించను అని మాట ఇవ్వండి.” అన్నారు. నేను సరే అన్నాను. అప్పుడు ఆయన తాము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందినవారమని, ఒకరికొకరు సహకరించుకొని బాధితులకు అన్న పానీయాలు అందిస్తున్నామని చెప్పారు.

నాలోని పాత్రికేయుడు మేల్కొన్నాడు. “దీనిపై ఎంతో మంచి వార్త ప్రచురించవచ్చు. మీరు మీ పేరు చెప్పండి” అన్నాను . ఆయన తన పేరు చెప్పడానికి నిరాకరించి, “మీరు మొదట ఈ విషయం ప్రచురించనని మాట ఇచ్చారు” అని గుర్తు చేశారు. “రోజంతా టీ పెడుతూ వంటలు చేస్తున్న ఈ మహిళలు ఎవరు?” అని నేను అడిగాను. “మా ఇళ్లలోని మహిళలే” అని ఆయన చెప్పారు. “శవాల మీద కప్పుతున్న తెల్ల బట్టలు ఎక్కడినుండి తెస్తున్నారు?” అని నేను అడిగాను. “మాలో కొందరికి వస్త్ర వ్యాపారము ఉన్నది. వారు ఈ బట్టల్ని ఉచితంగా ఇస్తున్నారు. ఖాద్య పదార్ధాల వ్యాపారి పిండి ని ఉచితంగా ఇచ్చారు. ఎవరికి వీలైన వస్తువులు వారు ఉచితంగా ఇస్తున్నారు” అని చెప్పారు. “సంఘ్ హిందువుల సంఘటన కదా ఇంత మందిలో మీరు ఎలా పని చేస్తున్నారు?” అని అడిగాను. “భాయి సాహబ్, రైలు ప్రమాదమునకు గురి అయినా వారందరికీ ఒకే విధంగా సేవలు అందిస్తున్నాము. మేము వారి పేర్లు అడగము.” అన్నారు. “మా సంఘటన ఉద్దేశ్యం బాధితులకు సేవనందిచడమే కానీ వారి  పేరు, మతం అడగడము కాదు” అన్నారు. “మీరు ప్రతి శవం మీద తెల్ల బట్ట కప్పుతున్నారు” అన్నాను. దీనికి ఆయన సమాధానం “ట్రైన్ నుండి తీసిన ఏ శవం పైన అయినా తెల్లని బట్ట కప్పుతాం. మాకు వారి పేరుతో కానీ, మతం తో కానీ సంబంధం కానీ, అవసరం కానీ లేదు.

ఈ మాటలు అని ఆ పూజనీయుడు నేను ఈ వార్త ప్రచురించననే వాగ్దానము తో   తన పేరు  చెప్పకుండానే పరిచయం చేసుకోకుండా అక్కడినుండి వెళ్ళిపోయారు. ఘటనాస్థలం లో నేను దాదాపు 36 గంటలు ఉన్నాను. అంత సేపు వాళ్ళు బాధితులకు, పత్రకారులకు, అక్కడ డ్యూటీ లో ఉన్న అధికారులకు సేవలు అందిస్తూనే ఉన్నారు. తరువాత నేను అన్ని వార్తాపత్రికలు చూశాను. ఒక్క దాంట్లో కూడా ఈ నిస్వార్ధ సేవలందించిన వీరి గురించి ఒక్క వాక్యం కూడా లేదు.

  • జాఫర్ ఇర్షాద్,  సీనియర్ పాత్రికేయుడు, లక్నో
  • అనువాదం: సరోజినీ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here