Home News ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను ప్రత్యక్షంగా చూడవలసిందే : ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను ప్రత్యక్షంగా చూడవలసిందే : ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్థాపించి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భములో ఒక వ్యాసం వ్రాయాలని కూర్చున్నాను.

ఆ సమయంలో నాతో ఒకసారి మౌలా అలీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ‘ప్రజలు తాము అర్థం చేసుకోని విషయాలను సంకోచం లేకుండా వ్యతిరేకిస్తారు’ అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విషయంలో జరుగుతున్నది కూడా అదే. సంఘాన్ని ప్రత్యక్షంగా చూడని వారు దాని పట్ల వ్యతిరేకంగానే మాట్లాడుతారు.

1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో నేను 18 మాసాలు కారాగార శిక్ష అనుభవించాను. ఆ సమయంలోనే అదే కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న సంఘ స్వయంసేవకులతో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. కలిసి ఉండటం, కలిసి భోజనాలు చేయడం, ప్రతిరోజూ రకరకాల సమస్యల గురించి చర్చలు జరపడం వలన మాలో మాకు సాన్నిహిత్యం ఏర్పడింది. నేను మొదటి ఆరు నెలలు అలీఘర్‌ జైలులోను, ఆ తరువాత 12 నెలలు లక్నో జైలులోను గడిపాను. సామాన్యంగా మన ఇరుగున నివసిస్తున్న వ్యక్తి గురించి గాని ఒక వ్యక్తితో లేదా ఎక్కువ సమయం కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి గురించి గాని లేదా మనతో ఆర్థిక లావాదేవీలు జరిపే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, శీలాన్ని గురించి గాని మనమొక నిర్ణయానికి రావచ్చు. ఈ నియమం జైలు జీవితం గడిపిన వారికి గూడా వర్తిస్తుంది.

మొదట్లో సంఘం విషయంలో నేను కూడా సంఘవిమర్శకుల అభిప్రాయాలతో ఏకీభవించేవాడిని. అయితే ఎమర్జెన్సీ కాలంలో నిర్బంధంలో వారితో కలిసి ఒకే గదిలో ఉండటానికి నేను భయపడలేదు. జైలు నియమాల ప్రకారం వారితో కలిసి ఉండవలసి వచ్చింది. వారం వారం సంఘ కార్యకర్తలు నిర్వహించే సమావేశాలలో పాల్గొనేవాడిని. ముఖ్యంగా మేధావుల సమావేశం జరిగిన ప్రతిసారి వక్తలు విభిన్న విషయాల గురించి తమ తమ అభిప్రాయాలను మా ముందుంచేవారు. ఇటువంటి సమావేశాలలో స్వయంసేవకులు కానివారు కూడా వచ్చి మాట్లాడేవారు. ఈ సమావేశాలలో నేను కూడా వక్తగా పాల్గొని వారు చెప్పిన విషయం గురించి మాట్లాడేవాడిని. 18 నెలల కాలంలో చాలా సార్లు అలా మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఇలాంటి సమావేశాల వలన మాకు సమయం గడవడమే కాకుండా మాకు పలు విషయాలపై మేధోమధనం జరిగేది.

అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు నేను విదార్థి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసాను. విశ్వ విద్యాలయంలో నిర్వహించిన వివిధ ఉపన్యాస పోటీలలో నేను బంగారు పతకాలను సాధించాను. ఈ నేపథ్యంలో నేను పలు విషయాలపై సంఘ స్వయంసేకులను ప్రశ్నించేవాడిని. నేను ఇబ్బంది కలిగించే ప్రశ్నలు వేసినా వారు నాకు సౌమ్యంగా, విడమరిచి సమాధానాలు చెప్పేవారు. మేధోపరంగా మా మధ్య వాడి వేడి చర్చలు జరిగినా మా వ్యక్తిగత సంబంధాలలోని తియ్యదనం తరిగిపోలేదు. అలీఘర్‌ జైలులో ఉన్నపుడు అందులోని స్వయంసేవకుల ఇళ్ళనుండి జైలుకు భోజనాలు వచ్చేవి. నేను కూడా ఆ భోజనాన్ని వారితో కలిసి భోంచేసేవాడిని.

సంఘ స్వయంసేవకులతో జైలులో ఏర్పడిన పరిచయాలు జైలు నుంచి విడుదల అయ్యాక మరింత ధృఢమయ్యాయి. అలా అని వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకే విధంగా లేవు. మా ఇరువురి భావ వ్యక్తీకరణలో, వాడే భాషలో, పలికే పదాలలో తేడా ఉండవచ్చు కాని మూలరూపంలో ఉన్న భావం ఒక్కటేనని నా కర్థమయ్యింది. సృష్టిలోని ప్రతిదానిలో దైవత్వం ఉందని సనాతన ధర్మం, వేదాలు చెబుతున్నాయి. మా మతపరమైన విషయం అంటూ ఈ సమాజంలోని కొందరి అభివృద్ధి కొరకే కృషి చేయడం ఒక సంస్థకు సబబేనా అని నాకు అనిపించింది.

1980 సంవత్సరం తర్వాత నాకు చాలా మంది సంఘ అధికారులతో సమయం గడిపే అవకాశం లభించింది. రజ్జూభయ్యా, కె.సుదర్శన్‌, మోహన్‌  భాగవత్‌ల ఉపన్యాసాలు విన్నాను. సంఘం ద్వారా స్ఫూర్తి పొంది వివిధ రంగాలలో సమాజసేవకు అంకితమైన ఎన్నో సంస్థలను నేను వెళ్ళి చూసాను. కొన్ని సంస్థలలో జరిగిన కార్యక్రమాలలో వక్తగా కూడా పాల్గొన్నాను. సంఘం ప్రతి ఏటా నాగపూర్‌లో నిర్వహించే తృతీయవర్ష సంఘశిక్షా వర్గలో స్వయంసేవకులను ఉద్దేశించి మాట్లాడటానికి వక్తగా వెళ్ళాను.

ఇన్ని అనుభవాల తరువాత నేను చేప్పేదేమంటే సంఘం ఉపయోగిస్తున్న హిందు, హిందుత్వ అనే పదాలు భారతీయుల జీవన విధానాన్ని తెలియజేస్తాయి. పరోక్షంగా వారు భారతీయత గురించి మాట్లాడినట్లవుతుంది. ఇదే సందర్భంలో నేను భారతీయత అనే పదం వాడుతున్నాను.

నాకు శ్రీ గురూజీని కలిసే అవకాశం రాలేదు. కాని ఆర్గనైజర్‌ వారపత్రికలో ఆయన ఇంటర్వ్యూ చదివి నేను ఆశ్చర్యపోయాను. శ్రీ గురూజీ యూనిఫాం సివిల్‌ కోడ్‌ గురించి వ్రాసిన విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. సంఘం భిన్నత్వంలో ఏకత్వానికే పెద్ద పీట వేస్తోంది. ఈ దేశంలో వికసించిన సభ్యత. సంఘంపై దురభిప్రాయాలు సమసిపోవడానికి ఇది చాలనుకుంటాను.

– ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

(జాగృతి సౌజన్యం తో)

For regular updates download Samachara Bharati app http://www.swalp.in/SBApp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here