Home Telugu Articles ఆరెస్సెస్‌పై నిందలు ఏల?

ఆరెస్సెస్‌పై నిందలు ఏల?

0
SHARE

నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకాల ఆరెస్సెస్ హస్తం ఉంది. ఆరెస్సెస్ ఎజెండానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశాన్ని పాలించేది భాజపా కాదు ఆరెస్సెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్టు నాయకులు ఇటీవల ప్రకటనలు తెగ గుప్పిస్తున్నారు. భాజపాని ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నా కూడా వారింకా భాజపాని మతతత్వ పార్టీ అని చెప్తూనే ఉన్నారు. అందర్నీ కలుపుకొని అందరి అభివృద్ధి కొరకు రోజుకు దాదాపు 20 గంటలు కష్టించి పనిచేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మీద అనవసరమైన నిందారోపణలు చెయ్యవద్దు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు సెక్యులర్ పేరుతో హిందుత్వాన్ని నాశనం చేసే ప్రయత్నమే చేశారు.

ఒక జాతి తన సంస్కృతిని సంప్రదాయాన్ని రక్షించుకోవటం మతతత్వమెలా అవుతుంది. దేశ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆరెస్సెస్ హిందుత్వాన్ని రక్షించుకోవటానికి కృషి చేస్తోంది. హిందుత్వమే ఆరెస్సెస్ ఎజెండా కావచ్చు కానీ ఏనాడు ఇతర మతస్థులని ద్వేషించమని ‘శాఖ’లలో చెప్పరు. తన మతం గురించి ధర్మం గురించి యువకులకు చెప్తూ వారిని వెయ్యేళ్ళ బానిస మనస్తత్వం నుంచి అరవై ఏళ్ళ బానిస లాంటి మనస్తత్వం నుంచి బయటికి తీసుకొస్తూ స్వదేశం స్వాభిమానం స్వావలంబన వంటి విషయాలు బోధిస్తూ ఏకోన్ముఖంగా తయారుచేసే సంస్థ ఆరెస్సెస్. మీ దేశంలో నిజమైన దేశభక్తి ఉన్న సంస్థ ఏది అని ఇందిరాగాంధీని రష్యాలో అడిగితే ఆమె ఆరెస్సెస్ అని సమాధానమిచ్చిందట. దేశంలో ఎక్కడైనా ఉపద్రవం సంభవించినా, భూకంపాలు, వరదలు వచ్చినా ముందుగా అక్కడికి వచ్చి సహాయం అందించేది స్వయంసేవక్‌లు. దివిసీమ ఉప్పెనలో మోప్లా వరదల్లో, కచ్ భూకంపంలో, నిన్నటి చెన్నై వరదల్లో నిక్కర్లతో ప్రత్యక్షమై ముందుండి సహాయమందించారు. ఉత్తరాఖండ్ వరదల్లో మిలటరీ కంటే ముందే వచ్చిన ఈ నిక్కర్ ధారీలని చూసి మమ్మల్ని రక్షించేవారు వచ్చారని నిర్భయంగా బాధితులు ఉన్నారంటే వారిమీద ప్రజలకి ఎంత నమ్మకముందో గ్రహించవచ్చు. ఆరెస్సెస్‌ని తెగ ఆడిపోసుకునే ఈ పార్టీలు ఇటువంటి సేవా కార్యక్రమాలు మచ్చుకి ఒకటి చూపండి. ఇటువంటి విషయాలు శాఖలలో చెప్పరు. కానీ ఈ దేశ ప్రజలు నావారు వారిని ఆపదలో రక్షించాలని చెప్తారు. కాబట్టి దేశ ప్రజలకి అండగా నిలిచే సంస్థ ఆరెస్సెస్‌ని ఓటు బ్యాంకుల గురించి మాత్రమే ఆలోచించే మీరు విమర్శించడం మానివేస్తేనే ఈ దేశంలో మీ ఉనికి నిలుస్తుంది.

– దుర్భాశకర నారాయణ

(ఆంధ్రభూమి సౌజన్యం తో )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here