Home News భవ్యంగా ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్

భవ్యంగా ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్

0
SHARE

“భారత్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించి విశ్వగురువుగా అవతరించడం ప్రపంచానికి కూడా అవసరం. ఈ పరమవైభవ స్థితిని సాధించే లక్ష్యంతోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తోంది. నేడు ఉన్న సూపర్ పవర్ హోదాకు, విశ్వగురు భావనకు ఎంతో తేడా ఉంది. సూపర్ పవర్ స్థానంలో ఉన్న దేశాలు పాల్పడే వివక్ష, శోషణలకు విశ్వగురు భావనలో చోటులేదు’’ అని దక్షిణ మధ్య క్షేత్ర సహ ప్రచారక్ శ్రీరామ్ భరత్ కుమార్ అన్నారు. ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్ (ముగింపు) కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. భాగ్యనగర్ నుండి ఘట్ కేసర్ వెళ్ళే మార్గంలో అన్నోజీగూడా వద్ద ఉన్న శ్రీ విద్యావిహార ఉన్నత పాఠశాలలో 20 రోజులపాటు ప్రథమవర్ష శిక్షావర్గ జరిగింది.

దేశవ్యాప్తంగా 1లక్ష స్థలాల్లో ప్రతిరోజూ 20 లక్షలకు పైగా స్వయంసేవకులు నిత్యశాఖా కార్యక్రమాల్లో పాల్గొంటారని, ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జరిగే శిక్షవర్గాలలో లక్షల మంది శిక్షణ పొందుతుంటారని భరత్ కుమార్ అన్నారు. వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి దేశం కోసం పనిచేసే తత్వాన్ని శాఖల ద్వారా అలవరచుకుంటారని, వ్యవస్థలో మార్పు వ్యక్తులలో మార్పు ద్వారానే వస్తుందని ఆయన అన్నారు. సమాజాన్ని సంఘటిత పరిస్తే ఆ సమాజమే తన సమస్యలను తీర్చుకోగలుగుతుందని డాక్టర్జీ అన్నారని గుర్తుచేశారు. దేశంలో సకారాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కొందరు పనిచేస్తుంటే విచ్ఛిన్నకర శక్తులు సమస్యలు సృష్టిస్తున్నాయి. సాక్షాత్తు అంబేడ్కర్ నిరాకరించిన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లను డిమాండ్ చేస్తూ వాటిని సాధించడం కోసం ఆయన పేరునే ఉపయోగిస్తున్నారు. అలాగే వనవాసులను మతం మారుస్తున్నారు. మతం మారితే దేశం పట్ల నిష్ట కూడా మారిపోతుందని భరత్ కుమార్ అన్నారు. అమెరికాలో తీవ్రవాద దాడులతో సమానమని భావించిన భ్రూణ హత్యలు, స్వలింగ వివాహాలకు సంబంధించిన చట్టాలను మన దేశంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆ విధంగా వివిధ రుగ్మతలను సమాజంలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారని, ఈ ధోరణిని ప్రజానీకం ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

గత కొన్ని సంవత్సరంలో దేశంలో కొన్ని సకారాత్మక, అద్భుత కార్యక్రమాలు జరిగాయని భరత్ కుమార్ అన్నారు. స్వాతంత్ర్య అమృతోత్సవాలు, తెలంగాణాలో నిజాం విముక్తి ఉత్సవాలు, ఆగస్టు 15న అన్ని ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయడం, ఆయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా నిధి సేకరణ వాటిలో కొన్ని. 40రోజుల్లో జరిగిన నిధి సేకరణ కార్యక్రమంలో 12 కోట్ల మంది 3వేల కోట్ల నిధిని సమర్పించడం ఒక రికార్డ్ అని అన్నారు. రామ మందిర నిర్మాణం జరుగుతుందికాని, నిజానికి ప్రతి హిందువు తన గుండెలోనే రాముడికి గుడి కట్టుకోవాలని, ఆ విధంగా శ్రీరాముడు చూపిన ఆదర్శాలను ఆచరించాలని పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ పిలుపునిచ్చారని ఆయన గుర్తుచేశారు.

అంతకుముందు సమారోప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ. కె. సాంబి రెడ్డి మాట్లాడుతూ బలమే జీవనమని, జనం కోసం జీవించాలన్న డా. అంబేడ్కర్ మాటలను గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలని ఉద్బోధించారు.

శిక్షావర్గ కార్యవాహగా వ్యవహరించిన గుర్రం సంజీవ రెడ్డి వర్గ నివేదికను సమర్పించారు. ఈ సంవత్సరం 34 జిల్లాల నుండి 596 మంది శిక్షావర్గాలో శిక్షణ పొందారని, 15 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు కలిగినవారు ఇందులో పాలోన్నారని తెలిపారు. 20 రోజులపాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో శ్రమ దానం, సేవా విభాగం, సంపర్క, ప్రచార విభాగాల శిక్షణ కూడా జరిగిందని వెల్లడించారు.

సమారోప్ కార్యక్రమంలో వర్గ సర్వాధికారి శ్రీ చల్లా వివేకానంద రెడ్డితో పాటు తెలంగాణా ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి, ప్రాంత అధికారులు కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, పురప్రముఖులు కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేశారు.  40 నిముషాలపాటు శిక్షార్ధులు చేసిన శారీరిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.