Home News దేశంలో మహిళల స్థితిగతులపై నివేదిక విడుదల చేసిన ఆర్.ఎస్.ఎస్ ...

దేశంలో మహిళల స్థితిగతులపై నివేదిక విడుదల చేసిన ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్

0
SHARE

“నేటి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా తమ బాగోగులు తాము చూసుకునే సామర్ధ్యం కలిగిఉన్నారు. కనుక మహిళాభివృద్ధి గురించి తమకు ఎక్కువ తెలుసని పురుషులు అనుకోనవసరం లేదు’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్ లో `మహిళల స్థితిగతులు’ నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళాభ్యుదయం ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలన్నారు. ‘దృష్టి’ అనే సంస్థ చేసిన అధ్యయనం చాలా ముఖ్యమైనదని డా. భాగవత్ అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

`దృష్టి స్త్రీ అధ్యయన ప్రబోధన్ కేంద్ర’ గత రెండు దశాబ్దాలుగా సమాజంలో మహిళల స్థితిగతుల గురించి అధ్యయనం చేస్తోంది. దేశంలోని అన్నీ రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అధ్యయనం జరిగింది.  ఇటీవల కాలంలో మహిళల గురించి జరిపిన అధ్యయనంలో ఇది చాలా క్షుణ్ణమైనది. ఇందులో భాగంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన 43255 మంది మహిళలను ఇంటర్వ్యూ చేశారు. 18 ఏళ్ల వయస్సు కలిగిన ఆడపిల్లల స్థితిగతులపైన కూడా అధ్యయనం చేశారు. దీని కోసం 25 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 7675 మంది ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం సేకరించారు.

మహిళల ఆరోగ్యం, విద్యా, ఉపాధి గురించి మాత్రమేకాక 26 ప్రత్యేక అంశాల గురించి కూడా వివరాలు సేకరించారు. “విస్తృతమైన ఈ అధ్యయనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఎంతో ఉపయోగపడుతుంది. మహిళల ఆరోగ్యం, విద్యా, ఉపాధితోపాటు కుటుంబంలో మహిళల పాత్ర, రాజకీయాల్లో మహిళలు, సరిహద్దు ప్రాంతాల్లో మహిళల స్థితిగతులు మొదలైన విషయాల్లో కూడా అధ్యయనం జరిగింది. భారత్ లో మహిళల గురించి విశ్వసనీయమైన, కచ్చితమైన వివరాలు, అంచనాలు ఈ అధ్యయనం వల్ల లభించాయి’ అని దృష్టి సంస్థ కార్యదర్శి అంజలి దేశ్ పాండే అన్నారు.