Home News పర్యావరణం, పరిసరాలను పరిరక్షణ పై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి – మీడియా సమావేశంలో భయ్యాజీ జోషి

పర్యావరణం, పరిసరాలను పరిరక్షణ పై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి – మీడియా సమావేశంలో భయ్యాజీ జోషి

0
SHARE

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలలో అనేక అంశాలతో పాటు సమకాలీన సమస్యల గురించి చర్చించామని సర్‌కార్యవాహ భయ్యాజీ జోషి చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పర్యావరణ పరిరక్షణ గురించి పనిచేయబోతున్నదని చెప్పటంతో పాటు సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల గురించి విలేకరుల ప్రశ్నలకు భయ్యాజీ ఈ సమావేశంలో సమాధానాలిచ్చారు.

పర్యావరణం, పరిసరాలను కాపాడుకుంటూ, వాటిని పరిరక్షించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తుందని అన్నారు. ఇదేకాకుండా ‘సామాజిక సమరసత’ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. చేస్తున్న పని నేడు ఒక స్థాయిని చేరుకుందని, వివిధ రంగాలలో కార్య విస్తరణకు పూనుకోవలసిన సమయం ఆసన్నమైందని సర్ కార్యవాహ అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ నూతనంగా చేపట్టనున్న ఈ కార్యం గురించి వివరంగా మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం, దాన్ని పోషించుకోవడానికి సమాజంతోపాటు కలిసి పనిచేయడానికి నిర్ణయాలు జరిగాయన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెట్టనుంది.

  1. జల పరిరక్షణ
    2. జల నిర్వహణ
    3. మొక్కలు నాటటం.

వీటితోపాటు ప్లాస్టిక్‌ మరియు థర్మోకోల్‌ లాంటి వస్తువులను వాడకానికి స్వస్తి చెప్పటం.

ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు భయ్యాజీ జోషి సమాధానమిస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి తమ ఆలోచన స్పష్టంగా ఉందన్నారు. మందిరం ఎక్కడ నిర్మించాలని అనుకున్నారో అక్కడే నిర్మించాలి. ఆలయ నిర్మాణం జరిగేవరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణం సజావుగా కొనసాగటానికి ప్రభుత్వం, కోర్టులు మధ్యవర్తులను నియమిస్తే దానికి అభ్యంతరమేమీ ఉండదన్నారు. రామమందిర నిర్మాణ క్రమంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు కోర్టులు అవసరమైన చర్యలు తీసుకోవాలని అభిలషిస్తున్నామన్నారు. మధ్యవర్తిత్వం వహించే వారు హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూడా ఆలయ నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఈ విషయంలో వారి నిబద్ధతపై తమకు ఎలాంటి సందేహం లేదని తెలిపారు.

పుల్వామా ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలపై జరిపిన మెరుపు దాడులను, భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని జోషి అన్నారు. భయం లేని జాతి మాత్రమే ఉగ్రవాదులకు అర్థమయ్యే భాషలో బుద్ధి చెప్పగలుగుతుంది అన్నారు.

370 ఆర్టికల్‌పై ప్రశ్నలకు సమాధానిమిస్తూ.. సెక్షన్‌ 35ఎ ఇంకా కోర్టు విచారణలో ఉన్నందున 370 గురించి ఏమి చెప్పలేమని అన్నారు. 35ఎ విషయమై కోర్టు తీర్పు వెలువడిన తరువాతే 370 గురించి చర్చలు జరిగే అవకాశముంటుందని అన్నారు.

ఎన్నికలలో ఆర్ ఎస్ ఎస్ పాత్ర ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘మా పాత్ర స్పష్టం. మేము నూటికి నూరుశాతం ఓటింగ్‌ జరిగేలా ప్రయత్నిస్తాము. ప్రస్తుత సమాజం ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన చేస్తున్నది. ఈ దేశం బాగుపడడానికి ఎవరు కృషి చేస్తున్నారో ప్రజలకు తెలుసు’అని అన్నారు.

ఈ మధ్య హిందువుల సంప్రదాయాలైన జల్లికట్టు, దీపావళి పటాసులు, శబరిమల వంటివాటిపై కోర్టు తీర్పులు గురించి అడిగిన ప్రశ్నలకు సర్ కార్యవాహ జవాబిస్తూ ‘ఇలాంటి విషయాల్లో చట్టాన్ని అనుసరిస్తూనే ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలను కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి విషయాలలో మన విలువలు, మన సంస్కృతిని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

జలియన్‌వాలాబాగ్‌ బలిదాన ఘటనకు వందేళ్లు
– భయ్యాజీ జోషి
13 ఏప్రిల్‌ 1919 సంవత్సరంలో వైశాఖి రోజున జలియన్‌ వాలాబాగ్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వం జరిపిన దారుణ మారణకాండ నిందించదగినది, హేయమైనది. అదొక పిరికిపంద చర్య. ఈ చర్య భారతీయులందరిని కోపోద్రిక్తులను చేసింది. అప్పటి నుండే బ్రిటిష్‌ ప్రభుత్వ పునాదులు కదలడం ప్రారంభమైంది.

భారతీయులు వ్యతిరేకించిన రౌలట్‌ చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం అన్నివైపుల నుండి నిరసనలను ఎదుర్కొంది. ఆ నిరసనలో పాల్గొన్న అమృత్‌సర్‌లోని గొప్ప నాయకులైన డా||సైపుద్దీన్‌ కిచ్లు, డా.సత్‌పాల్‌లను బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసిందనే వార్త భారతీయులలో ఆగ్రహావేశాలను కలిగించింది. అయితే ఆగ్రహాన్ని అణచడం కోసం అప్పటి బ్రిటిష్‌ అధికారి జనరల్‌ డయ్యర్‌ ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరుపరాదని చాటింపు వేయించాడు. ప్రజలు దీనికి నిరసనగా 13 ఏప్రిల్‌ రోజున జలియన్‌ వాలాబాగ్‌ (బాగ్‌ అంటే తోట) లోపల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

సమావేశాలపై నిషేధం ఉన్నప్పటికీ నాయకుల పిలుపు మేరకు జలియన్‌ వాలాబాగ్‌లో సుమారు 20,000 మందికిపైగా చేరుకున్నారు. జలియన్‌ వాలాబాగ్‌కున్న ఒకే ఒక ప్రవేశ ద్వారాన్ని జనరల్‌ డయ్యర్‌ మూసివేయించాడు. ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే కాల్పులు జరపమని సైనికులకు ఆజ్ఞలు జారీచేశాడు. భయంతో తొక్కిసలాట జరిగింది. పోలీసు కాల్పులలో వందల మంది మరిణించగా వేల మంది గాయపడ్డారు.

ఇంతటి భయానకమైన ఊచకోత భారతీయులలో ఆగ్రహం, ఆవేశాలను రగుల్కొలిపింది. దేశమంతటా బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ప్రతి యువకుడిలో మెదలసాగింది. దీనికి నిరసనగా రవీంద్రనాథ్‌ టాగూర్‌ బ్రిటిష్‌ గవర్నమెంట్‌ తనకు ఇచ్చిన ‘నైట్‌హుడ్‌’ బిరుదును తిరిగి ఇచ్చేశాడు. సర్దార్‌ భగత్‌సింగ్‌ జలియన్‌వాలాబాగ్‌లో దేశభక్తుల రక్తంతో తడిసిన మట్టిని చేతిలో తీసుకుని దేశ స్వతంత్రం కొరకు పోరాడుతానని ప్రతిజ్ఞ చేశాడు. జలియన్‌వాలాబాగ్‌ ఘటన జరిగిన 21 సంవత్సరాల తరువాత 1940 సంవత్సరంలో లెప్టినెంట్‌ గవర్నర్‌ ఓ.డయ్యర్‌ను ఇంగ్లాండులో ఉద్ధామ్‌సింగ్‌ కాల్చి చంపాడు.

దేశభక్తులకు జలియన్‌ వాలాబాగ్‌ ఒక తీర్థస్థలమైంది. స్వతంత్రం కొరకు పోరాడే వారికి స్ఫూర్తి అయింది.

ఈ ఘటన జరిగి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ బలిదాన చరిత్రను నేటి తరానికి అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. దేశంలోని ప్రతి గ్రామానికి ఈ త్యాగచరిత్రను మనం అందించాలి. వీలైనన్ని సభలు, సమావేశాలు నిర్వహించి జలియన్‌ వాలాబాగ్‌ సందేశాన్ని ప్రజలకు అందించాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మేము కోరుతున్నాము.

తుమ్‌నే దియా దేశ్‌కో జీవన్‌
దేశ్‌ తుమే క్యా దేగా?
అప్‌నీ ఆగ్‌ తేజ్‌ రక్‌నే కో
నామ్‌ తుమారా లేగా!
(నీవు నీ జీవితాన్ని దేశానికి ఇచ్చావు
దేశం నీకేమిచ్చింది?
దాని జ్యోతి జ్వలించడానికి
నిన్నెప్పుడూ గుర్తుంచుకుంటుంది.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here