Home News ఆర్.ఎస్.ఎస్ విజయ సంకల్ప శిబిరం డిసెంబర్ 24 నుండి ప్రారంభం

ఆర్.ఎస్.ఎస్ విజయ సంకల్ప శిబిరం డిసెంబర్ 24 నుండి ప్రారంభం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత  విజయ సంకల్ప శిబిరం డిసెంబర్ 24 నుండి 26 వరకు భారత్ ఇంజినీరింగ్ కాలేజ్ లో జరుగనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ శిబిరంలో శాఖ ముఖ్య శిక్షకులు ఆపై స్థాయి భాధ్యత కలవారు పాల్గొననున్నారు. 14 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు అన్ని వయస్సులవారు 3 రోజుల పాటు కలసి మెలసి ఆటపాటలతో పాల్గొంటారు.

1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 2024 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనున్నది. ఈ సందర్భంగా మరింత వేగంగా కార్య విస్తరణ చేయాలని సంఘం సంకల్పించింది. తెలంగాణ ప్రాంతంలో ఏడు దశాబ్దాలుగా విస్తరించిన సంఘ కార్యం గత ఏడాది కాలంలో మరింత వేగంగా పెరిగింది. 2018 నాటికి మొత్తం శాఖల సంఖ్య 2106. 2019 నాటికి ఈ సంఖ్య 3494కు చేరింది. 2018 నాటికి 826 మండలాలలో ఉన్న సంఘ కార్యం 2019 కి 69% పెరిగి 1113 మండలాలకు చేరింది.  ఇక నగరాలలో 2018 నాటికి మొత్తం 1437 బస్తీలలో 47% ఉన్న శాఖలు 2019 నాటికి 69.5% పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 2018 నాటికి 547 శాఖలు ఉంటే 2019 నాటికి 800  పెరిగాయి. ఇవి కాక 1065 సేవా కార్య క్రమాలు,1183  శాఖా స్థాయి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆర్ధిక స్థితిగతులు, సామాజిక హోదా తారతమ్యాలు ఏవీ లేకుండా  సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి బాధ్యతలు కలిగినవారి వరకు అందరూ పాల్గొంటున్న దివ్యమైన శిబిరం ఈ విజయ సంకల్ప శిబిరం.

ఈ భవ్యమైన శిబిరం సజావుగా నిర్వహించడానికి  దాదాపు 8500 కార్యకర్తలు, వారికి సహకారం అందించేందుకు మరో వెయ్యి మంది, వీరికి మార్గదర్శనం చేసే  250 మంది పెద్దలు అహర్నిశలు పనిచేస్తున్నారు.

తెలంగాణా సంస్కృతి సర్వత్ర వెల్లివిరిసేలా 110 ఎకరాల ప్రాంగణాన్ని  జోగులాంబ నగరం, యాదాద్రి నగరం, భద్రాద్రి నగరం, సమ్మక్క సారాలమ్మ నగరం, భాగ్యలక్ష్మి నగరం అని 5 నగరాలుగా తీర్చిదిద్దారు.

ప్రతినగరంలో ఆయా ప్రాంతాలనుంచి వచ్చే 1500 నుంచి 2500మంది స్వయంసేవకుల బసతోపాటుగా భోజన, సభా ప్రాంగణాలు ఉంటాయి. అన్ని నగరాలకు కలిపి సామూహిక కార్యక్రమాలు నిర్వహించడానికి మరో పెద్ద ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఆటలు, పథసంచలన అభ్యాసం, శారీరిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పెద్ద స్థలం ముస్తాబైంది.

నేడు దేశంలో ప్రముఖమైన, కీలకమైన రంగాల్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనేకమంది  ఇలాంటి శిబిరాలు, కార్యక్రమాల్లో పాల్గొంటూ మట్టిలో, ఆటపాటలతో తయారైన వారేనని సంఘ పెద్దలు అనేకమంది చెపుతూఉంటారు.

RSS అంటే ఇలా ఉంటుందా, ఈ రోజుల్లో కూడా ఇంతటి అనుశాసనం, క్రమశిక్షణ (discipline), దేశభక్తి కలిగిన వ్యక్తులు ఆర్ ఎస్ ఎస్ లో ఇలా తయారవుతారా అని ఈ శిబిరం చూసే సాధారణ పౌరులు కూడా ఆశ్చర్యపోతారు.

25వ తేదీ సా.గం.5.00 ల.కు సరూర్ నగర్ ఆడిటోరియంలో జరిగే సార్వజనిక ఉత్సవానికి అందరూ ఆహ్వానితులే.

పరమ పూజనీయ సర్ సంఘచాలక్, శ్రీ మోహన్ భాగవత్  ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.