Home Telugu Articles సాకారమౌతున్న డా. అంబేద్కర్‌ కలలు

సాకారమౌతున్న డా. అంబేద్కర్‌ కలలు

0
SHARE

డా. అంబేడ్కర్‌ ఆశించిన సామాజిక సమరసత (అన్ని కులాలు సమానమే అనే భావం)ను సమాజంలో సాధించడం కోసం దేశ్యాప్తంగా వేలాది కార్యకర్తలు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంస్థపరంగా అనేక కొత్త ప్రయోగాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డా|| అంబేడ్కర్‌ ఆశించిన ‘ఒకే ఆత్మ గల సమాజం’ (ఏకాత్మ సమాజం) కలను అమలు చేయడం కోసం అనేకమంది ప్రయత్నాలు చేస్తూ డా. అంబేడ్కర్‌కు నిజమైన నివాళిని సమర్పిస్తున్నారు.

            **************************

భావ ప్రకటనా స్వేచ్ఛ, కొత్త కొత్త మంచి ఆలోచనలను ఎక్కడి నుండైనా స్వీకరించే స్వభావం, కాలగమనంలో వస్తున్న లోపాలను తొలగించుకుంటూ, సంస్కరణ ప్రయత్నాలకు అవకాశం ఇవ్వడం హిందూ సమాజపు విశిష్టత. సంస్కర్తలను కొద్దిమంది ఛాందసులు ప్రారంభంలో వ్యతిరేకించినా తర్వాత సమాజం, సామాన్యులు, మేధావులు సంస్కర్తల ఆలోచనలను స్వీకరించారు. సంస్కర్తలను ‘సిలువ’ వేసే చరిత్ర భారతదేశంలో లేదు.

విద్యార్జన పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చి, బరోడా సంస్థానం నుండి వైదొలిగిన తర్వాత డా|| భీమరావ్‌ అంబేడ్కర్‌ హిందూ సమాజంలో కుల అసమానతలు, అంటరానితనం నిర్మూలనకు మహద్‌ చెరువు పోరాటం, కాలారాం మందిర ప్రవేశపు సత్యాగ్రహం మూక్‌నాయక్‌ వంటి పత్రికల ద్వారా ప్రబోధం చేశారు. కాని ఆశించిన సహకారం హిందూ సమాజం నుంచి రాలేదు. కోపం, ఆగ్రహంతో 1935లో డా||అంబేడ్కర్‌ ‘నేను హిందువుగా పుట్టాను కాని హిందువుగా చావను, సామాజిక సమత గల ధర్మాన్ని స్వీకరిస్తాను’ అని ప్రకటించారు.

4 సంవత్సరాల తర్వాత ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తల కోరిక మేరకు హిందూ సమాజ సంఘటన చేస్తున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. శిక్షణ శిబిరాన్ని (కార్యకర్తల 40 రోజుల శిక్షావర్గ) 21 ఏప్రిల్‌ 1939 న పునాలో సందర్శించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంస్థాపకులు డా||హెడ్గేవార్‌తో సంభాషించారు. 1939 పూనా శిబిరంలో పాల్గొన్న 428 మంది కార్యకర్తలలో 100కు పైగా అస్పృశ్యులుగా పిలువబడుతున్న వారుండడం, అందరూ కులం మరిచి కలసిమెలసి వ్యవహరించడం డా|| అంబేడ్కర్‌కు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగచేసింది. ఆ రోజు సంఘ కార్యకర్తల కోరిక మేరకు ‘అస్పృశ్య వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు- హిందూ సమాజం బాధ్యత’ అన్న అంశంపై డా||అంబేడ్కర్‌ ప్రసంగించారు.

మరొకసారి ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంక్రాంతి ఉత్సవానికి డా||అంబేడ్కర్‌ హాజరయ్యారు. సామాజిక సమత నిర్మాణం, అస్పృశ్యతా నిర్మూలనకు సంఘం చేస్తున్న హడావుడి లేని ప్రయత్నాల పట్ల డా||అంబేడ్కర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 1956లో బౌద్ధ ధర్మాన్ని తీసుకునే సమయంలో డా||అంబేడ్కర్‌ను ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు మోరోపంత్‌ పింగళే, దత్తోపంత్‌ ఠేంగ్డే లు కలిసారు. వారితో తాను బౌద్ధధర్మం తీసుకునే విషయాన్ని వివరిస్తూ అంబేడ్కర్‌ ‘సంఘం చేస్తున్న పని నాకు తెలుసు, దేశంలో జనాభా పెరుగుతున్న వేగంతో పోలిస్తే సంఘం పెరుగుదల వేగం తక్కువగా ఉంది. నేను పెద్దవాణ్ణి అయ్యాను. ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్న దళిత అనుచరులకు నేనుండగానే సరియైన మార్గాన్ని చూపాలి. అందుకే బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను’ అని వివరించారు.

గాంధీజీ హరిజన యాత్ర

పూనా ఒప్పందం అనంతరం 1934-35లో గాంధీజీ దేశవ్యాప్తంగా ‘హరిజనయాత్ర’ను నిర్వర్తించారు. ఆనాటికి కాంగ్రెసు దేశవ్యాప్తంగా విస్తరించిన బలమైన సంస్థ. గాంధీజీ ‘హరిజనయాత్ర’ ప్రేరణతో అనేక చోట్ల అనేకమంది కార్యకర్తలు, నాయకులు అస్పృశ్యతా నిర్మూలనకు కార్యక్రమాలు చేపట్టారు. ఆ సందర్భంగా 18 రోజులు గాంధీజీ ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ యాత్ర ప్రభావాన్ని ఎక్కువమంది సరిగ్గా గుర్తించలేదు. 1935-48 వరకు అనేకమంది ఒక ప్రక్క స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటూనే అస్పృశ్యతా నిర్మూలనకు అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టారు.

రాజ్యంగబద్ధంగా

డ్రాఫ్టు కమిటీ చైర్మన్‌గా డా||అంబేడ్కర్‌ భారత రాజ్యాంగంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సామాజిక సమరసతకు అనుగుణంగా అనేక ప్రతిపాదనలను చేశారు. ఈ ప్రతిపాదనలను ఎక్కువ చర్చ, వాద, వివాదాలు లేకుండానే భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. ‘సామాజిక సమరసత’ను రాజ్యాంగబద్ధం చేసిన ఘనత డా|| అంబేడ్కర్‌దే.

1947 స్వాతంత్య్రం అనంతరం సమాజ సంస్కరణ ఉద్యమాల ప్రయత్నాలు ఆగిపోయాయి. అన్ని పనులూ ఎన్నికైన ప్రభుత్వాలే చేస్తాయని తమ తమ ప్రయత్నాలను ఎక్కువమంది మానుకున్నారు.

ధర్మాచార్యుల ఆదేశం

స్వాతంత్య్రనంతరం, ఆర్‌.ఎస్‌.ఎస్‌. విస్తరిస్తున్న కొద్దీ, సమాజ పరివర్తన లక్ష్యంగా సంఘం వివిధ సంస్థల నిర్మాణాన్ని చేపట్టింది. కుల అసమానతలు, అంటరానితనం వంటి దుర్గుణాల పట్ల హిందూ సమాజంలో ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడం కోసం 17-18 డిసెంబర్‌ 1967లో కర్ణాటకలోని ఉడిపిలో దేశవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యులు ఒకే వేదికపైకి వచ్చి ‘హిందవః సోదరా సర్వే – నహిందుః పతితో భవేత్‌ – మమ మంత్ర సమానతా’ అనే నూతన స్మృతిని ప్రకటించారు. ఈ పని వెనుక ఆర్‌.ఎస్‌.ఎస్‌. ద్వితీయ సర్‌సంఘచాలక్‌ శ్రీ గురూజీ కృషి ఎంతో ఉంది. ఆనాటి నుండి పూజ్య పెజావరు స్వామి వంటి ఎంతో మంది ధర్మాచార్యులు హిందూ సమాజాన్ని సామాజిక సమరసత వైపు నడిపించడం కోసం పనిచేస్తున్నారు.

సామాజిక సమరసతా వేదిక

సంఘ శాఖ, వర్గ, సంఘ కార్య పద్ధతి ద్వారా సంఘంలో నిర్మాణమైన సామాజిక సమరసతను హిందూ సమాజంలో కూడా నిర్మించడం లక్ష్యంగా ఏప్రిల్‌ 14, ఉగాది పర్వదినాన పునాలో దత్తోపంత్‌ ఠేంగ్డీ చే ‘సామాజిక సమరసతా వేదిక’ ప్రారంభమైంది. సమాజంలో సామాజిక సమరసతను నింపడానికి స్వయంసేవకులు వ్యక్తిగత స్థాయిలో, కుటుంబంలో, సమాజంలో, ధార్మికంగా, సాహిత్యపరంగా వివిధ దిశలలో అనేక ప్రయత్నాలను ప్రయోగాలను చేస్తున్నారు. గతంలో సామాజిక సంస్కర్తల కార్యకలాపాలు పట్టణాలకు, జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయి. నేడు సుమారు దేశవ్యాప్తంగా యంత్రాంగం ఉంది. సమరసతా నిర్మాణానికై దేశవ్యాప్తంగా పని (సంస్థాగత నిర్మాణం) జరుగుతుంది. సామాజిక సమరసత అనేది ఉపన్యాసాలతో అమలయ్యే అంశం కాదు. స్వయంగా ఆచరించి, పనిచేసే వ్యక్తుల వల్లే అది సాధ్యమవుతుంది.

కొన్ని ప్రయత్నాలు

డా||అంబేద్కర్‌ కలలు కన్న ‘సమాజంలో సమరసత’ను నిర్మాణం చేయడానికి సామాజిక సమరసతా వేదికతో పాటు అనేక ఇతర సంస్థలు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి.

అన్ని కులాల వారికి పూజారి శిక్షణ

భగవంతుని భక్తునికి సంధానకర్త పూజారి. దైవభక్తికి, దేశసేవకు ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తులు ఏ కులం వారైనా పూజారులుగా ఉండవచ్చును.

– 1983 నుండి తమిళనాడు, కేరళలలో వివిధ కులాల్లో ఉత్సాహం గల వారికి పుజారి శిక్షణను ఇస్తోంది విశ్వహిందూ పరిషత్‌. గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ దేవతల పుజారులుగా ఉండేవారందరు ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి. వర్గాలకు చెందినవారే. తెలంగాణలో ధర్మజాగరణ విభాగం వారు గత 15 సంవత్సరాలుగా గ్రామీణులకు పూజారి శిక్షణను ఇస్తున్నారు. ఈ శిక్షణలో అనేకమంది పాల్గొన్నారు.

– ఆంధ్రప్రదేశ్‌ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ‘శ్వేత’ సంస్థ సహకారంతో సామాజిక సమరసతా వేదిక ఆరువేల మంది ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి. మత్స్యకారులకు పూజారులుగా తర్ఫీదునిచ్చింది. వీరు ఆయా కులాల్లోనే కాక ఇతర కులాల్లో కూడా పౌరోహిత్యాన్ని నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో నర్సరావుపేటలో ఒక కార్యకర్త తన నూతన గృహ ప్రవేశాన్ని ఇలా తర్ఫీదు పొందిన హరిజన పూజారుల చేతనే చేయించారు. ఆ పూజారుల పౌరోహిత్యం చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన బంధువులు, మిత్రులు ఎంతో సంతోషించారు. అందరూ ఈ చర్యను స్వాగతించారు.

ఇలా అన్ని కులాల వారికి పురోహితులుగా తర్ఫీదునిచ్చే కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది.

– హిందూ ధర్మప్రచారం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న సమరసతా సేవా ఫౌండేషన్‌ తి.తి.దే. ఆర్థిక సహకారంతో మొదట విడతగా 500 నూతన దేవాలయాల నిర్మాణాన్ని ఎస్‌.సి., ఎస్‌.టి. మత్స్యకార గ్రామాలలో ప్రారంభించింది. ఈ దేవాలయాల్లో ఆ కాలనీకి చెందిన వారే పూజారులుగా ఉండాలని నిర్ణయించి, శిక్షణను ప్రారంభించింది.

– పూర్వాశ్రమంలో ఏ కులానికి చెందినా ధర్మాచార్యులందరూ సమానమే. సమాజం అందరు ధర్మాచార్యులను సమానంగా గౌరవిస్తుందనే నమ్మకాన్ని బలోపేతం చేసే దిశలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు మైసురూలో కార్యక్రమాన్ని చేపట్టారు.

– మహారాష్ట్ర పండరిపూర్‌ దేవాలయంలో ప్రధాన పుజారిగా ఒక బ్రాహ్మణేతర కులానికి చెందిన మహిళ ఎంపిక కావటం చిన్న విషయం కాదు.

కులాల మధ్య వైషమ్యాలు ఏర్పడితే..

– మహారాష్ట్రలో మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును డా||అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలన్న ప్రతిపాదన 1978లో వచ్చింది. పేరు మార్చాలి, మార్చరాదన్న పేరుతో మహారాష్ట్ర ప్రజానీకం రెండు భాగాలుగా చీలి, వివాదం ఉద్రిక్తత పెరిగిన సందర్భంలో వివిధ గ్రామాల్లో వివిధ వర్గాల ప్రజల మధ్య సమావేశాలను నిర్వహించి, ఏకాభిప్రాయంతో డా||అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంగా పేరు మార్చడంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌., ఎ.బి.వి.పి., సమరసతా వేదిక చేసిన కృషి చారిత్రాత్మకమైనది.

– తాజాగా హర్యానాలో జాట్‌లకు రిజర్వేషన్లను కల్పించాలనీ, మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లను కల్పించాలని ఉద్యమాలు ప్రారంభమై, వివిధ కులాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్న సమయంలో వివిధ కులాల ప్రముఖులతో కార్యక్రమాలను నిర్వహించి, వివిధ కులాల ప్రముఖులతో ధర్మాచార్యుల సద్భావన సమావేశం, సద్భావన యజ్ఞం నిర్వహించడం ద్వారా కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమం అనుసరణీయం.

సద్భావన సమావేశాలు

వ్యాసుడు, వాల్మీకి, సంత్‌ రవిదాసు, మహావీరుడు, బుద్ధుడు, డా||అంబేడ్కర్‌, మహాత్మా జ్యోతిబా ఫులే, బసవేశ్వరుడు, గురునానక్‌, గురుగోవిందసింగ్‌ వంటి జాతీయ నాయకులను, సమరసతా మహాపురుషులను ఎవరికి వారు తమ కుల, ప్రాంతపు నాయకులుగా ముద్రవేసి, వారిని వేరుచేసి ఉత్సవాలు చేసుకుంటున్న సమయంలో అన్ని కులాల, సంస్థల నాయకులందరూ ఆ మహాపురుషుల జయంతి ఉత్సవాలను సమష్టిగా నిర్వహించుకునే కొత్త సంప్రదాయాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రారంభించింది.

వాల్మీకి మహర్షి చిత్రపటాలను రామమందిరంలో పెట్టడం, గురుగోవింద్‌ సింగ్‌ 350వ జయంతి ఉత్సవాలను హిందూ దేవాలయాల్లో నిర్వహించడం వంటి కార్యక్రమాలు జాతీయ సమైక్యతకు, సమరసతకు దారి చూపుతున్నాయని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశేషించి మధ్యప్రదేశ్‌, పంజాబ్‌లో ఈ ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

మనం కుల నాయకులం కాదు, హిందూ సమాజ సమష్టి నాయకులం; మనమందరం హిందువులం అనే భావాలు వారందరిలో బలంగా ఏర్పడటం గమనార్హం.

– ఢిల్లీలో పెద్ద ఎత్తున రామదూత ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో వేదికపై వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు సమర్పించడం, వాల్మీకి కులస్థుల పెద్దలను వేదికపై సన్మానించడం ఎంతో గొప్ప పరిణామం. (ఉత్తరాదిలో వాల్మీకులు ఎస్‌.సి.వర్గానికి చెందినవారు. సఫాయి కర్మాచారి వృత్తిలో ఉంటారు).

కుటుంబపరంగా..

సమాజంలో సమరసతను సాధించడానికి సంస్థలు మాత్రమే కాదు, వ్యక్తులు కూడా ప్రయత్నం చేయవచ్చు. తమ కుటుంబాల ఆధారంగా ఈ పనిని మరింత సమర్థవంతంగా సాధించవచ్చు. అటువంటి ఉదాహరణలు కూడా మన ముందున్నాయి.

– సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్త ఒకరు తన తండ్రి ఆబ్దికం సందర్భంగా ఇంటికి ఒక దళిత జంటను పిలిచి, భోజనం పెట్టి, నూతన వస్త్రాలు ఇచ్చి, నూతన ఆచారానికి ఒరవడి దిద్దారు.

– హైద్రాబాద్‌లో ఒక ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్త, తన భార్య నోములు నోచుకుంటున్న సందర్భంగా తమ కులస్థుల ముత్తైదువులనేకాక అన్ని కులాల మహిళలను పిలిచి భార్యచేత ‘వాయినం’ ఇప్పించి మహిళల చేత నూతన ఆచారాన్ని ప్రారంభింప చేశారు.

– కృష్ణాజిల్లాలో ఒక సంఘ కార్యకర్త తమ కుమార్తె వివాహ సందర్భంగా గ్రామంలోని అందరు కులస్థులను భోజనానికి పిలిచి, చివరిగా దళితులతో కలసి తను, తన భార్య, నూతన (కుమార్తె, అల్లుడు) దంపతులు కలసి భోజనం చేశారు.

సమరసతా కథ

రామాయణ, భారత, భాగవతాలే కాదు. సమాజం ఆలోచనలో మార్పు తేవడం కోసం ప్రాచీన సాహిత్యంలోని సమరసతా కథలను, ప్రసిద్ధ కథాకారులతో చెప్పించే ‘సమరసతా కథా కార్యక్రమం’ గత డిసెంబర్‌లో ఆగ్రాలో నిర్వహించారు.

డా|| అంబేడ్కర్‌ ఆశించిన సామాజిక సమరసతను, సమాజంలో సాధించడం కోసం దేశ్యాప్తంగా వేలాది కార్యకర్తలు వ్యక్తిగత స్థాయిలో, కుటుంబ పరంగా, సంస్థ పరంగా అనేక కొత్త ప్రయోగాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డా|| అంబేడ్కర్‌ ఆశించిన ‘ఏకాత్మ సమాజం’ కలను అమలు చేయడం కోసం అనేకమంది ప్రయత్నాలు చేస్తూ డా||అంబేడ్కర్‌కు నిజమైన నివాళిని సమర్పిస్తున్నారు.

– కె.శ్యాంప్రసాద్‌, ‘సామాజిక సమరసత’ అఖిల భారత సంయోజక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here