Home Interviews స్వయంసేవకులే సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు, సంఘం ప్రేరణ మాత్రమే ఇస్తుంది

స్వయంసేవకులే సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు, సంఘం ప్రేరణ మాత్రమే ఇస్తుంది

0
SHARE

ఆర్‌.ఎస్‌.ఎస్‌. పూర్వ అఖిల భారత సేవా ప్రముఖ్‌ సుహాస్‌రావ్‌ హీరేమఠ్‌ తో ముఖాముఖి

సంఘ స్వయంసేవకులు విభిన్న సంస్థలను ఏర్పాటు చేసి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో విశ్వహిందూ పరిషత్‌, విద్యాభారతి, వనవాసీ కళ్యాణాశ్రమం, భారత్‌ వికాస్‌ పరిషత్‌, దీనదయాళ్‌ పరిశోధనా కేంద్రం, ఆరోగ్యభారతి వంటి సంస్థలున్నాయి. ఇవన్నీ విభిన్న సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాలలో వివిధ సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రారంభించిన తరువాత సేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ప్రారంభమైంది. సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా ఒక సంస్థ ఉండాలనే నిర్ణయం 1990లో డా||హెడ్గేవార్‌ జన్మశతాబ్ది ఉత్సవాలలో జరిగింది. అలా రూపుదిద్దుకున్న సంస్థే ‘సేవాభారతి’. నేడది ‘మానవ సేవ’లో అత్యుత్తమంగా నిలిచింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సేవాభారతి ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి, సంఘ పూర్వ అఖిల భారతీయ సేవా ప్రముఖ్‌ సుహాస్‌రావ్‌ హీరేమఠ్‌ వివేక్‌ పత్రిక విలేఖరి అమోల్‌ ఫెడ్నేకర్‌తో సుదీర్ఘంగా ముచ్చటించారు. ఆ సంభాషణలలోని ముఖ్యాంశాలు జాగృతి పాఠకుల కోసం..

ప్రశ్న : సేవ గురించి మీ ఆలోచనలను వివరించండి.

సమాధానం : భారతదేశంలో ‘సేవ’ను ఒక శ్రేష్ఠమైన గుణంగా భావించారు. మన పూర్వీకులు దీనిని వ్యక్తి, వ్యక్తికి సుఖదుఃఖాలతో జోడించారు. దేశంలో ఉన్న దుఃఖ, పీడిత, శోషిత, దరిద్రులు అందరినీ ప్రగతి, వికాసం వైపు తీసుకెళ్ళేదే సేవ. వీళ్ళందరినీ మిగతా వారితో సమానంగా ఎదిగేలా చేయడమే సేవ. మన పూర్వులు మన ముందుంచిన శ్రేష్ఠమైన ఆలోచనను మీకు గుర్తు చేస్తాను.

సర్వేభవన్తు సుఖినః సర్వేసన్తు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యన్తు, మాకశ్చిద్‌ దుఃఖభాగ్‌భవేత్‌

దీనిని సాకారం చేయగలిగిన మార్గమే సేవా మార్గం.

ప్రశ్న : సేవాకార్యక్రమాలతో భారతీయ తత్త్వజ్ఞాన సారాంశం సాకారమవుతుంది. దీని వెనక ఉన్న అసలు కారణమేమిటి ?

స : అందరూ సుఖంగా ఉండాలని మనం వేదకాలం నుండి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనను అమల్లోకి తీసుకురావడానికి, ఒక సామాన్యుడు మరొకరిని సుఖంగా జీవించేలా చేసే ప్రతి పనిని ‘సేవ’ అనవచ్చు. మనం ఆనందంగా ఉండటానికి శ్రేష్ఠమైన మార్గం ఇతరులను ఆనందంగా ఉంచటమే అనే భావన మనందరిలో ఉంది. ఈ మార్గంలో అందరూ నడిస్తే అందరూ సుఖంగా ఉంటారు. అంటే సమాజమంతా సుఖంగా ఉన్నప్పుడు నేను కూడా సుఖంగా ఉంటాను. సంఘం ఆలోచన కూడా ఇదే.

ప్రశ్న : రాష్ట్ర (దేశ) కార్యం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పనిచేస్తోంది. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సంఘం ఎందుకు అనుకుంది ?

స : ‘స్వయంసేవక్‌’ శబ్దంలోనే ‘సేవ’ ఉంది. అందుకే ప్రతి స్వయంసేవక్‌ సమాజ సేవ చేయాలనుకోవడం సహజం. సేవ చేయడం తన కర్తవ్యంగా భావిస్తాడు. సంఘం ప్రారంభమైన నాటి నుండి స్వయంసేవకులు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనడం ప్రారంభమైంది. ఎందుకంటే స్వయంసేవక్‌ ‘ఈ సమాజం నాది, దీని సుఖ, దుఃఖాలు, ఎదురయ్యే కష్టాలు నావి, ఇరుగుపొరుగు వారి ఇబ్బందులు నావి’ అని భావిస్తాడు. సమాజాన్ని ఆనందంగా ఉంచడం తన కర్తవ్యంగా భావిస్తాడు. ఈ కారణం వల్లనే ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి స్వయంసేవక్‌ సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆపన్నులకు సేవలు అందించడానికి అక్కడికి ముందుగా చేరుకుంటాడు. ఒక్కొక్కసారి ఒక్కడే వెళ్ళిపోతాడు. అవసరమున్న చోటికి స్వయంసేవకులు సామూహికంగా బయలు దేరుతారు. వివిధ సంస్థలుగా ఏర్పడి కూడా సేవాకార్యక్రమాలు కొనసాగిస్తారు. సంఘ చరిత్రను పరిశీలిస్తే 1925 సంవత్సరం నుండే సంఘ స్వయంసేవకుల సేవాకార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. 1990లో డాక్టర్జీ జన్మశతాబ్ది ఉత్సవాల సందర్భంగా సేవా రంగానికి ప్రత్యేక సంస్థే ఏర్పాటైంది.

ప్రశ్న : భారత్‌ ఒక విశాలమైన దేశం. ఇంతటి విశాలమైన దేశంలో సేవ ఎవరికి అవసరమనేది మీరు ఎలా గుర్తిస్తారు ?

స : ప్రభుత్వ గణాంకాల ఆధారంగా మన దేశంలో సుమారు 30 నుండి 35% ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. వీరికి కనీస అవసరాలు కూడా పూర్తిగా లేవు. కనీస అవసరాలు.. అంటే తిండి, గుడ్డ, గూడుకు కూడా నోచుకోకపోతే ఆ సమాజం ఆనందంగా ఉందని ఎలా చెప్పగలం? సంపూర్ణ సమాజాన్ని బలోపేతం చేయడం కోసం పీడిత, తాడిత, దరిద్రులను బలోపేతం చేయవలసిందే. వీరందరినీ ‘సేవా’ మార్గంలోనే, సేవ ద్వారానే బలోపేతం చేయగలం.

ప్రశ్న : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ద్వారా వనవాసీ క్షేత్రంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా! వాటి గురించి వివరించండి.

స : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్వయంగా సేవా కార్యక్రమాలు చేయదు. సంఘలో తయారయిన స్వయంసేవకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దేశంలో మూడు విభాగాలలో సేవా కార్యక్రమాలు అవసరమని మేము గుర్తించాం. మొదటిది నగరాలలోని మురికివాడలు. ఈ మురికి వాడలలో బీదవారు, వెనకబడినవారు జీవిస్తూంటారు. ఇక రెండవది నగరాలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు. ఇక మూడవది అడవులలో నివసించే వారు. ప్రభుత్వ భాషలో చెప్పాలంటే వనవాసులు. నేడు ఈ వనవాసీల జన సంఖ్య దేశంలో 10 కోట్లు ఉంది. ఇప్పటికీ వీరెంతో వెనుకబడి ఉన్నారు. వీరు నివసించే ప్రాంతంలో కనీస అభివృద్ది కూడా లేదు. సంఘ స్వయంసేవకులు ఈ మూడు వర్గాల కోసం వీరు నివసించే ప్రాంతాలలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వివిధ పేర్లతో ఈ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి.

ప్రశ్న : వనవాసీ క్షేత్రంలో నడుస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించండి.

స : వనవాసీ క్షేత్రాలలో ముఖ్యమైన సమస్య పిల్లల చదువులు. ఆయా గ్రామాలలో పాఠశాలలు ఉండవు. తల్లిదండ్రులు కూడా నిరక్షరాస్యులవడం వలన పిల్లలకు చదువు చెప్పించాలనే ఆలోచన వారికి రాదు. ఇటువంటి పిల్లల చదువుల కోసం దేశవ్యాప్తంగా అనేక ఆవాస పాఠశాలలు ప్రారంభ మయ్యాయి. మరో సమస్య వనవాసుల ‘ఆరోగ్యం.’ వారు ఆరోగ్యంగా ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేయటం. అంతేగాకుండా స్థానిక యువకులకు నగరంలో శిక్షణ ఇప్పించి గ్రామాల్లో ఆరోగ్య మిత్రులుగా తీర్చిదిద్దటం. వీరంతా ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తారు. వనవాసీ కళ్యాణ ఆశ్రమం ద్వారా దేశంలో మొత్తం 18 వేలకు పైగా సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మిగతా కొన్ని సంస్థలు కూడా వనవాసుల కళ్యాణానికి కృషి చేస్తున్నాయి. వాటి సంఖ్య సుమారు 10 వేల వరకు ఉంటుంది.

ప్రశ్న : మీరు మాట్లాడుతూ సంఘం స్వయంగా ఏ సేవా కార్యక్రమాలు చేయదు కాని సంఘ స్వయంసేవకులు ఆ కార్యక్రమాలు చేస్తారని అన్నారు. ఈ ఆలోచన వెనక ఉన్న భూమికను స్పష్టం చేయగలరు.

స : సంఘ ప్రారంభానికి ముందు డాక్టర్జీ మనదేశంలో ఇంతటి జనసంఖ్య ఉండికూడా ఏళ్ళతరబడి బానిసలుగా ఎందుకు ఉండిపోయాము ? రోజు రోజుకీ మనుషులు పతనం అవుతున్నారు. మనలో యోగ్యమైన గుణాలు లేనందున ఇలా జరుగుతోంది. అలాంటి విశిష్ట గుణాలను ప్రజలలో నింపడమే సంఘం చేస్తున్న పని. సంఘ స్వయం సేవక్‌లో ఈ భావన నిండి ఉంటుంది. సంఘం ముఖ్య ఉద్దేశ్యం వ్యక్తి నిర్మాణం. అందువలన స్వయంసేవకులందరు సేవా కార్యక్రమాలపై శ్రద్ధ కలిగి ఉన్నారు, వాటిని నిర్వహిస్తున్నారు.

ప్రశ్న : సేవ ముసుగులో కొన్ని స్వచ్ఛంద సంస్థలు మతమార్పిడులకు పాల్పడుతున్నాయి. వనవాసీ క్షేత్రంలో మీకు ఇది ఒక పెద్ద సమస్య. వాటిని నిరోధించటానికి సేవా విభాగం ద్వారా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ?

స : సేవా కార్యక్రమాల ద్వారా వనవాసులను స్వావలంబిగా, స్వాభిమానిగా, కష్టపడేవారిగా మార్చి వారు తమ కాళ్ళపై తాము నిలబడేలా చేస్తున్నాం. అప్పుడు అతడు కూడా మిగతా వారిని తన స్థితికి తీసుకురావడానికి మాతో కలిసి నడుస్తున్నాడు. అతడి మనసులో తన సంస్కృతి, పరంపర, ధర్మాల పట్ల అభిమానం జాగృతమవుతోంది. సంఘకార్య విధానమే దీనికి కారణం. మతమార్పిడులను అడ్డుకోవడానికే సేవా కార్యక్రమాలు చేయడం సంఘ దృష్టికోణం కాదు. కాని ఈ పద్ధతిలో పని చేస్తుండడం వలన మతమార్పిడులకు అడ్డుకట్ట పడుతోంది. ఇది మాకు ఎదురైన అనుభవం.

ప్రశ్న : సరైన చదువు లేనందువలన నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంటోంది. ఉద్యోగాలు కల్పించడానికి సేవా విభాగం ఏమైనా చేస్తోందా?

స : సేవా విభాగం వైపు నుండి కొన్ని సంస్థల మాధ్యమం ద్వారా జీవన భృతిని కల్పించే ప్రకల్పాలు (ప్రాజెక్టులు) నడుస్తున్నాయి. ప్రతి వ్యక్తి స్వావలంబి కావాలని మేము కోరుకొంటున్నాం. అంటే అతడు ఒకరి దగ్గర ఉద్యోగం చేయకుండా తనకు తాను సంపాదించుకునేలా చేయడం. నేటి మహారాష్ట్రలోని ‘సంచార జాతులు’ ఆనాడు ఆంగ్లేయులను ఎదిరించడం వలన ఆంగ్లేయులు వారిని ఊరి బయటకు గెంటేశారు. అప్పటినుండి స్థిర నివాసం లేక ఆ కుటుంబాలు సంచారం చేస్తూనే జీవించేవారు. చదువు లేదు, ఉద్యోగాలు లేవు, ఇతరత్రా సౌకర్యాలూ లేవు. ఫలితంగా వారు చెడు పనులు చేయడానికి అలవాటు పడ్డారు. కాని గత 24 సంవత్సరాల నుండి మేము చేస్తున్న కృషి వలన వారికి చదువు, సంస్కారం అబ్బింది. నేడు వారు ఎలాంటి చెడు పనులు చేయటం లేదు. స్వాభిమానంతో జీవిస్తున్నారు. పార్డీ, కొల్హాటి, గోపాల్‌ సమాజ్‌ ఇవన్నీ సంచార జాతులే.

నగరాలలోని గుడిసెలలో జీవితం గడుపుతున్న సోదరీమణులకు కుట్టు, అల్లికలలో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇప్పుడు కేంద్రప్రభుత్వం అమలు చేస్తోన్న నైపుణ్య వికాస (స్కిల్‌ ఇండియా ప్రోగ్రామ్‌) పథకాన్ని ఉపయోగించుకొంటూ కొన్ని సంస్థలు వీరికి శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా స్వావలంబన కేంద్రాలు నడుస్తున్నాయి.

ప్రశ్న : ‘నైపుణ్య వికాస పథకం’ ఆధారంగా నడుస్తున్న సేవా కార్యక్రమాలను వివరంగా తెలియజేయండి.

స : మనదేశంలో నైపుణ్యాలను పెంచే ప్రయోగాలు పూర్వం నుండే అమలులో ఉన్నాయి. ఏ వ్యక్తి ఏకసంతాగ్రాహిగా ఉంటాడో అతడు చక్కగా నేర్చుకోగలడు. ఆ వ్యక్తికి నేర్పడం, అందులో అతడిని ప్రావీణ్యుడిని చేయడం, ఆ తర్వాత అతడికి జీవనోపాధి లభించడానికి సహకరించడం వరకు మేం చేస్తాం. ఉదాహరణకు దేశమంతటా కంప్యూటర్‌ కేంద్రాలు నడుపుతున్నాం. కొన్ని చోట్ల ఐటిఐ కోర్సులూ నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం రూపొందించిన పథకాల ద్వారా మహిళలకూ శిక్షణ నిస్తున్నాం.

ప్రశ్న : నైపుణ్య వికాస కార్యక్రమాలను వనవాసీ క్షేత్రాల ప్రజల వద్దకు చేర్చడం, అక్కడ శిక్షణ పొందిన వారిని సమాజంలో అవసరమైన వారి వద్దకు చేర్చడం కోసం మీరేం చేస్తున్నారు ?

స : వనవాసీ మహిళలు రూపొందించిన వస్తువులను మన సంస్థల ద్వారా మార్కెట్‌లోకి తీసుకెళ్తున్నాం. ఈ పని మన కార్యకర్తలే చేస్తారు. ఇక్కడి యువకులు జీవనోపాధికి తమ వ్యవసాయాన్ని విడనాడనవసరం లేదు. నైపుణ్యాలు నేర్చుకోవడం వలన ఆ యువకులలో ఏదైనా చేయాలనే కోరిక బలపడుతోంది. అప్పుడు వారికి అవసరమైన సహాయం అందిస్తున్నాం.

ప్రశ్న : దేశవ్యాప్తంగా ఏ ఏ సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ?

స : సంఘ స్వయంసేవకులు విభిన్న సంస్థలను ఏర్పాటు చేసి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. ఇందులో విశ్వహిందూ పరిషత్‌, విద్యాభారతి, వనవాసీ కళ్యాణాశ్రమం, భారత్‌ వికాస్‌ పరిషత్‌, దీనదయాళ్‌ పరిశోధనా కేంద్రం, ఆరోగ్యభారతి వంటి సంస్థలున్నాయి. ఇవన్నీ విభిన్న సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాలలో వివిధ సంస్థలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్రలో జనకళ్యాణ సమితి, ఉత్తర భారతదేశంలో సేవాభారతి పేరుతో కార్యక్రమాలు నడుస్తున్నాయి. కర్ణాటకలో హిందూ సేవా ప్రతిష్ఠాన్‌, రాష్ట్రోత్థాన్‌ పరిషత్‌ పేరుతో జరుగుతున్నాయి. సుమారు 2 వేల సంస్థలు వేర్వేరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ‘రాష్ట్రీయ సేవా భారతి’ పేరుతో ఒక సంస్థగా రూపుదిద్దుకొన్నాయి. ఇలా అన్ని సంస్థలు కలిపి ఇప్పటికి మొత్తం లక్షా 70 వేల సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ప్రశ్న : ఈ సంస్థలన్నింటిని మీరెలా సమన్వయం చేస్తారు ?

స : ప్రతి సంస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఎవరి పద్ధతి వారికి ఉంటుంది. ఈ సంస్థలన్నింటిని సమన్వయ పరచడం, మార్గదర్శనం చేయడం, సంఘటితం చేయడం, ప్రశిక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి పనులన్నింటిని రాష్ట్రీయ సేవాభారతి చేస్తుంది. ఆయా సంస్థలు తమ కార్యకర్తలకు శిక్షణ, వివిధ నూతన సేవాకార్యక్రమాల ప్రారంభం, ఆర్థిక వనరుల సమీకరణ విషయాలు చూసుకొంటాయి.

ప్రశ్న : ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవావిభాగం పాత్ర ఏమిటి ?

స : గత 80 సంవత్సరాల నుండి గమ నిస్తున్నాం. దేశంలో ఎప్పుడు ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అక్కడి ప్రజలను ఆదుకోవడానికి అందరికన్న ముందు స్వయం సేవకులే చేరుకుంటారు. అలా చేయమని సంఘం ఆదేశాలు ఇవ్వదు. స్వయంసేవకులు తమంతట తామే రంగంలో దిగుతారు. ఆ తర్వాత అంతా ప్రణాళికాబద్ధంగా జరిగిపోతుంది. భూకంపం, వరదలు, కరువు ఏదైనా కాని.. అక్కడికి స్వయం సేవకులు వెంటనే చేరుకుని సహాయపడతారు.

ఇందుకు నేను మీకు ఎన్నో ఉదాహరణలు చెబుతాను. ఈ మధ్య కేదార్‌నాథ్‌లో వచ్చిన ప్రళయం, గుజరాత్‌లో సంభవించిన భూకంపం, చెన్నైను ముంచేసిన వరదలు, దేశంలో మూడుచోట్ల సునామీ సృష్టించిన బీభత్సం వంటి అన్ని చోట్లకు స్వయంసేవకులు స్వభావ సిద్ధంగానే చేరుకున్నారు. సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో అన్నీ కోల్పోయిన వారికి తిరిగి వారి జీవనం వారు సాగించే వరకు కావలసిన ఏర్పాట్లు చేశారు స్వయంసేవకులు. సహాయం అంటే కేవలం తాత్కాలిక సహాయం కాదు. వైపరీత్యాలకు గురైన వారు తమ కాళ్ళమీద తాము నిలబడే వరకు స్వయంసేవకులు కృషి చేశారు. సునామీ వచ్చినప్పుడు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌లలో ఎక్కువ నష్టం జరిగింది. 1993లో లాతూర్‌లో భూకంపం వచ్చింది. ఆయా ప్రదేశాలలో తాత్కాలిక సహాయంతో పాటు వారికి ఉండడానికి ఇళ్ళు నిర్మించి ఇవ్వడం, చదువుకోవ డానికి పాఠశాల ఏర్పాటు, ఆరోగ్యం కోసం ఆసుపత్రి.. ఇలా ఒక వ్యక్తి, సమాజం నిలదొక్కుకోవ డానికి కావలసిన కనీస సౌకర్యాలను కల్పించారు. వ్యవసాయదారులు తిరిగి వ్యవసాయం కొనసాగించడానికి వారికి అవసరమైన పనిముట్లు, పరికరాలు మొదలైన అన్నిరకాల సాధనాలు సమకూర్చారు. ఈ అన్నిచోట్ల పక్కా గృహాల (భవనం) నిర్మాణం చేసి బాధితులకు అందజేశారు. లాతూర్‌ జిల్లాలోని రెబిచిచోలి గ్రామంలో 125 నూతన గృహాలు నిర్మించి ఇచ్చారు. చాలా చోట్ల వైద్యశాలలు నిర్మించి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. లాతూర్‌లో నేటికీ జనకళ్యాణ సమితి ద్వారా విద్యార్థులకు ఆవాస విద్యాలయం (హాస్టల్‌) నడుస్తోంది.

ప్రశ్న : నేడు సంఘకార్యం ప్రపంచమంతటా విస్తరించింది. విభిన్న దేశాలకు సేవా కార్యక్రమాలు చేరుకున్నాయి. అక్కడ పనిచేసే సంస్థలు ఎలా పని చేస్తున్నాయి ?

స : విదేశాలలో హిందూ స్వయంసేవక్‌ సంఘ్‌ పేరున సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ సంస్థలన్నీ అక్కడి రాజ్యాంగాన్ని అనుసరించి గుర్తింపు (రిజిస్ట్రేషన్‌) పొంది నడుపుతున్నవి. నైరోబీలో ఆఫ్రికన్లు అధిక సంఖ్యలో ఉన్నారు. నేటికీ వారు వెనకబడే ఉన్నారు. ఆ ప్రాంతంలోని గ్రామీణ క్షేత్రాలలోని పాఠశాలలో విద్యార్థులకు భోజనం అందించే పని ఈ సంస్థలు చేస్తున్నాయి. అక్కడ 20 వేల మంది విద్యార్థులకు వీరు భోజనం అందించే ఏర్పాట్లు చేశారు. పాఠశాలలో భోజనం పెడ్తున్న కారణంగా విద్యార్థులు బడికి వస్తున్నారు. కేవలం బడికి రావడమే కాదు ఇప్పుడు చదువుపట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. మన పొరుగు దేశమైన నేపాల్‌లో కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు, వైద్యాలయాలు, విద్యార్థులకు ఆవాసాలు (హాస్టల్‌), ఉద్యోగం కొరకు పరీక్షలు రాసే వారికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేపాల్‌లో భూకంపం సంభవించిన తర్వాత సేవా కార్యక్రమాలు మరింతగా పెరిగాయి.

ప్రశ్న : సేవా కార్యక్రమాలు నిర్వహణలో మీరు ఎదుర్కొనే కష్టాలేమిటి ?

స : ముఖ్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహణకు సరైన కార్యకర్తలు లభ్యం కారు. సమర్పణ భావం కలిగిన కార్యకర్తల లభిస్తే చాలా మంచిది. ఇందుకోసం మేము చాలా ప్రయాసపడవలసి వస్తుంది. సంఘ స్వయంసేవకులలో సంస్కారం కారణంగా సేవ చేయాలనే గుణం వికసిస్తుంది. బయట సమాజంలో కూడా సేవాభావమున్న వ్యక్తులు అనేకులుంటారు. అటువంటి వారిని కలిసి మాట్లాడి వారి ద్వారా సేవాకార్యక్రమాలకు కావలసిన కార్యకర్తలను గుర్తిస్తాం. ఇది మాకు పెద్ద పరిక్షే. ఇక ఆర్థిక వనరులు సమాజం సహకారంతో లభిస్తుంటాయి.

పశ్న : ఇన్ని కార్యక్రమాలకు కావలసిన ఆర్థిక వనరులను మీరు ఎలా సమన్వయం చేస్తున్నారు?

స : సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ సొమ్ము ఉపయోగించరాదని సంఘం భావించింది. ఎలాంటి సేవా కార్యక్రమానికైనా ప్రభుత్వం నుండి నిరంతరం డబ్బు తీసుకోవద్దు. ప్రభుత్వం నుండి భవన నిర్మాణానికి లేదా ప్రారంభానికి విరాళం తీసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన ధన సహాయాన్ని సమాజం నుండే సేకరించాలి. ఎవరైనా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే సమాజం ధన సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. డబ్బులేని కారణంగా మేం ప్రారంభించిన ఏ సేవా కార్యక్రమం కూడా ఆగిపోలేదు. ఇది మా అనుభవం.

పశ్న : మీరు నిర్వహిస్తున్న సేవా ప్రకల్పాలకు ‘ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం తీసుకోం’ అని అన్నారు. ఈ ప్రేరణ ఎక్కడి నుండి లభించింది ?

స : మనదేశంలో ఎలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహించినా రాజు నుండి ఆర్థిక సహాయం తీసుకునేవారు కాదు. స్వయంగా సమాజమే ఆ ఖర్చులు భరించేది. ఇప్పుడు మేము కూడా మన పూర్వజుల నుండే ఈ ప్రేరణ పొందాం. పాత రోజుల్లో గ్రామాలలో గ్రామస్తులంతా కలిసి గ్రామాభివృద్ధికి పాటుపడేవారు. అంతేకాక గ్రామం లోని ప్రజలు ఎవరూ ఆకలితో పస్తులుండకుండా చూసేవారు, తాడిత, పీడిత జనాలను ఆదుకునేవారు. స్వాలంబన కలిగిన సమాజమే స్వాభిమానం కలిగి ఉంటుంది. ఎవరు స్వాభిమానం కలిగి ఉంటారో వారే ప్రగతి సాధిస్తారు. ప్రతి వ్యక్తిలో స్వాభిమానాన్ని జాగృతం చేయడానికే సంఘం కృషి చేస్తోంది.

పశ్న : ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరినీ కలుపుకుపోవడంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా?

స : నేను పది సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాల దృష్ట్యా దేశమంతటా పర్యటించాను. అన్ని ప్రాంతాల స్వయంసేవకులను కలుపుకు పోయాం కాబట్టే నేడు దేశంలో 1,70,700 సేవా కార్యక్రమలు విజయవంతంగా నడుస్తున్నాయి. వీటికి తోడుగా సమాజం ద్వారా మరో పది లక్షలకు పైగా సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. వీటన్నింటి మధ్య సమన్వయం అవసరమే. ప్రతి జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారంతా సంవత్సరంలో ఒకసారి కలుసుకుంటారు. తమ క్షేత్రాలలో తమకెదురైన మంచి, చెడు అనుభవాలను ఇతర కార్యర్తలతో పంచుకుంటారు. ఎదుటివారి అనుభవాల నుండి తన కార్యంలో ఇబ్బందులు ఎలా అధిగమించాలో తెలుసుకుంటారు. అంతేగాకుండా అందరూ కలిసి సేవా మార్గంలో మరేదైనా సాదిద్ధామా అనే ఆలోచన చేస్తారు. ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో ఐదేళ్ళకొకసారి ‘సేవాసంగమం’ పేరుతో అందరూ కలుస్తారు. దీనితో కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అఖిల భారత స్థాయిలో ప్రథమంగా ‘సేవాసంగమం’ బెంగళూరులో జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగింది.

ప్రశ్న : నేడు సమాజ అవసరాలు మారుతున్నాయి. మీరు నిర్వహించే సేవాకార్యక్రమాలలో కూడా తదనుగుణంగా మార్పులు చేస్తున్నారా ?

స : ప్రపంచ నియమం ‘మార్పు’. మేం కూడా మా కార్యక్రమాలలో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాం. సేవా కార్యక్రమాలు మార్చినంత మాత్రాన సమాజంలో పరివర్తన రాదు. సమాజంలో పరివర్తన వచ్చినప్పుడు సేవా కార్యక్రమాలలో మార్పు చోటు చేసుకొంటుంది. వ్యక్తిలో ఉన్న దోషాలలో, వికృతులలో పరివర్తన తీసుకురావలసిన అవసరముంది. మేము ముఖ్యంగా దీనికోసమే పని చేస్తున్నాం. మాకొచ్చిన అనుభవాల ద్వారా సమాజానికి అవసరమైన కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తాం.

ప్రశ్న : భవిష్యత్తులో సేవా కార్యక్రమాల విస్తరణ గురించి మీ యోజన ఏంటి ?

స : మా అంచనా ప్రకారం రానున్న పదేళ్ళలో మేం చేసే సేవా కార్యక్రమాలు అవసరమైన అందరికీ అందాలి. అందరినీ స్పర్శించాలి. అంటే నగరాలలో ఒక గుడిసె ఉన్నా అక్కడ సేవాకార్యక్రమం జరుగుతుండాలి. రాబోయే పదేళ్ళలో నగర స్థాయిలో అన్ని సేవాబస్తీ (కనీసం కూటికి, గుడ్డకు కూడా నోచుకోని నిరుపేదలు నివసించే వాడలు) లకు వెళ్ళి అక్కడ అవసరాలకు అనుగుణంగా సేవాకార్యక్రమాల యోజన చేస్తాం. అన్ని గ్రామాలలో, అన్ని వనవాసీ క్షేత్రాలలో ప్రజలందరికీ చేరేలా మా కార్యాన్ని వ్యాపింపచేస్తాం.

ప్రశ్న : సేవా కార్యం ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ సమాజంతో మీ అనుభవం ఎలా ఉంది ?

స : మాకు చాలా మంచి అనుభవం ఉంది. ఎక్కడ బాధ ఉంటుందో అక్కడ ‘సంవేదన’ (బాధను తీర్చాలనే ఆవేదన) కూడ ఉంటుంది. మేం కూడా సమాజాన్ని రెండు వర్గాలుగా అంటే ఒక వర్గం జీవితాంతం సేవ చేస్తూనే ఉండటం, మరో వర్గం సేవలు పొందుతూనే ఉండటంలా తయారు చేయదలుచుకోలేదు. నేడు సేవలు పొందినవారు నెమ్మదిగా సేవ చేసేవారిగా ఎదగాలి. వనవాసీ కళ్యాణాశ్రమంలో చదువుకున్న విద్యార్థులు ఎదిగి, ఇప్పుడు సమాజ కార్యం చేయడానికి పూర్తి సమయమిచ్చి పని చేస్తున్నారు. మరికొందరు ఉపాధ్యాయులుగా, డాక్టర్లుగా తమ తమ క్షేత్రాలలో సేవలు అందిస్తున్నారు. కర్ణాటకలో అనాథ పిల్లల కోసం ‘అబల ఆశ్రమం’ నడుస్తోంది. ఇందులో చదువుకుని ఎదిగిన అమ్మాయిలు కనీసం రెండు మూడు సంవత్సరాలు ‘సేవావ్రతి’గా సేవలు అందిస్తున్నారు. కొందరు గ్రామీణ క్షేత్రాలకు వెళ్ళి సేవలందిస్తున్నారు. ఇవన్నీ చేస్తూ వారు తమ కుటుంబ జీవనమూ కొనసాగిస్తున్నారు. మా అనుభవం ఏమి చెబుతుందంటే మా నుండి సేవ పొందిన వ్యక్తి తన హృదయంలో తాను కూడ మరొకరికి సేవ చేయాలని తపన పడుతున్నాడు.

ప్రశ్న : సేవా విభాగం ద్వారా పురస్కారాల వితరణ జరుగుతోందా ?

స : సంఘ సేవావిభాగం ఎలాంటి పురస్కారాలు ఇవ్వదు. కాని సేవాభావం కలిగిన కొన్ని ఇతర సంస్థలు వీటిని అందిస్తున్నాయి. ఉదాహరణకు కేశవసృష్టి ద్వారా ‘యువ పురస్కార్‌’, జన కళ్యాణ సమితి ద్వారా ‘శ్రీ గురూజీ పురస్కార్‌’, ఉత్తరప్రదేశ్‌లో ‘భాలాసాహెబ్‌ దేవరస్‌ పురస్కార్‌’ మొదలైనవి.

ప్రశ్న : ఆధ్యాత్మిక క్షేత్రంలో చాలా మంది బాబాల ద్వారా ‘సేవకార్యక్రమాల’ దురుపయోగం జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?

స : ఇటువంటివి ఎక్కడో మాత్రమే జరుగు తున్నాయి. కాని దేశంలో చాలామంది సంత్‌లు, ధర్మాచార్యులు, ధార్మిక సంస్థలు సేవా కార్యాలు నిర్వహిస్తున్నాయి. సత్యసాయిబాబా ట్రస్ట్‌ కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలోని సుమారు 700 గ్రామాలకు తాగునీటిని అందిస్తోంది. రహదారులు నిర్మించింది. విద్యాలయాలు, వైద్య సేవలు కూడా అందిస్తోంది. మతా అమృతానందమయి ద్వారా దేశమంతటా వేల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామి నారాయణ్‌ మందిరం ద్వారా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. బియ్యంలో రాళ్ళు ఉన్నట్టుగా అక్కడక్కడ కొందరు సేవాకార్యక్ర మాలను దురుపయోగం చేస్తూండవచ్చు. ఆధ్యాత్మిక గురువులందరినీ ఒకే గాటున కట్టడం సబబు కాదు.

ప్రశ్న : సమాజంలో సేవ చేయాలనే ఆలోచన కలగడానికి మీరిచ్చే సందేశం ?

స : ఎవరైతే భగవంతుడి కృపవలన, తమ పరిశ్రమ వలన జీవితంలో మంచి స్థాయిలో ఉన్నారో అలాంటి వారు సేవాకార్యక్రమాలలో పాల్గొనడానికి ముందుకు రావాలి. ప్రతి వ్యక్తిలో దీనులపట్ల సంవేదన కలగాలి. ఈ సంవేదనే సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇలాంటి వారు తమకు సమీపంలో ఉన్న పేద బస్తీలకు వెళ్ళి అక్కడ ఉన్న వారిని ఆదుకునే పని ప్రారంభించాలి. వివిధ సంస్థల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూడాలి. దానివల్ల అతడిలో సేవ చేయాలనే భావన బలం పుంజుకుంటుంది. సేవా కార్యం అంటే కేవలం డబ్బివ్వడమే కాదు, తన విలువైన సమయం కేటాయించడం కూడా సేవే. దీన దుఃఖితులకు సేవ చేయగలిగాననే భావనే సమాజాన్ని సంఘటితం చేస్తుంది. దేశం మొత్తం మీద లక్షలాది కార్యకర్తలు సేవా కార్యంలో నిమగ్నమై ఉన్నారు. ఇందులో మరింతమంది పాల్గొనాలని మా భావన.

(జాగృతి సౌజన్యం తో)