Home News సంఘ్ కుటుంబ ప్రబోధన్, గ్రామ వికాస్ కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది – సురేశ్ భయ్యాజీ జోషి

సంఘ్ కుటుంబ ప్రబోధన్, గ్రామ వికాస్ కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది – సురేశ్ భయ్యాజీ జోషి

0
SHARE
Suresh ( Bhaiyyaji) Joshi ( File Photo)

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలలో రెండింట మూడువంతులు గ్రామాల్లో, మిగతా ఒక వంతు నగరాలలో నడుస్తున్నాయి. ఎందుకంటే భారత్ లో 60 శాతం జనాభా గ్రామాలలోనే ఉంటారు. ప్రస్తుతం గ్రామాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. అందుకనే అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలలో శాఖల ద్వారా గ్రామ వికాసానికి మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామాల్లో సమరసతకు సంబంధించి సమస్య ఉంది. సమాచార వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన తరువాత కూడా గ్రామాలకు సరైన సమాచారం చేరడం లేదు. గ్రామాల్లో సరైన సమాచారం, సక్రమమైన దృష్టి కోణం కలిగించడం చాలా అవసరం అని సర్ కార్యవాహ్ శ్రీ. సురేశ్ భయ్యాజీ జోషి అన్నారు. కార్యకారిణి మండలి మూడు రోజుల  (అక్టోబర్ 12, 13, 14) సమావేశాలు పూర్తయిన సందర్భంగా సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఆయన పత్రికల వారికి వివరించారు. అక్టోబర్ 14 నాడు జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ డా. మన్మోహన్ వైద్య కూడా పాల్గొన్నారు.

కార్యకారిణి మండలి సమావేశాలలో గ్రామ వికాసం, కుటుంబ ప్రబోధన్ లకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించారని సర్ కార్యవాహ్ సురేశ్ జి తెలియజేశారు. కొంత కాలంగా గ్రామాలు, రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. రైతులలో స్వావలంబన పెంపొందించే విధంగా కార్యక్రమాలు ఉండాలని సంఘ్ భావిస్తోంది. రైతుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి తగిన ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించాలి. సమావేశాలలో వ్యవసాయాన్ని గురించి కూడా చర్చ జరిగింది. రైతులు తిరిగి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల వైపు మళ్ళెట్లుగా సంఘ్ ప్రోత్సహిస్తుంది. ఇందుకు తగిన కార్య ప్రణాళికలను రూపొందిస్తుంది. రైతులకు తమ పంటకు తగిన గిట్టుబాటు ధర లభించేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్యకారిణి మండలి కోరింది. గ్రామ వికాసం కోసం 30-35 సంవత్సరాల వయస్సు ఉన్న వారిని సంఘ కార్యంలో విశేషంగా జోడించడం జరుగుతుందని శ్రీ భయ్యాజీ అన్నారు.

కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూడా సంఘ కుటుంబ ప్రబోధన్ కార్యాన్ని చేపట్టిందని శ్రీ భయ్యాజీ జోషి అన్నారు. వ్యక్తినిర్మాణంలో కుటుంబపు పాత్ర చాలా ఉంటుంది. జీవన దృక్పధం, సంస్కారాలు కుటుంబం నుండే లభించాలి. సమాజ పరివర్తనకు కుటుంబం కేంద్ర బిందువు కావాలి. అందుకోసమే స్వయంసేవకులు ఈ కార్యాన్ని చేపట్టారు. సంఘ కార్యం దాదాపు 20 లక్షల కుటుంబాలను స్పృశించడం జరిగింది. కోటి 25 లక్షల మంది సంఘ కార్యంతో జోడింపబడ్డారు. సమాజంలో సకారాత్మక మార్పు తెచ్చేందుకు కుటుంబ ప్రబోధన్ కార్యం చాలా అవసరం. ఇప్పుడు కార్యకారిణి మండలి సమావేశాలలో ఏ విషయాలపై చర్చ జరిగిందో వాటిపై మార్చ్ లో జరిగే ప్రతినిధి సభ సమావేశాలలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని శ్రీ భయ్యాజీ జోషి తెలియజేశారు.

ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ రోహింగ్య సమస్య తీవ్రమైనదని ఆయన సమాధానం ఇచ్చారు. వారిని మయన్మార్ ఎందుకు బహిష్కరించిందనే విషయాన్ని పరిశీలించాలని ఆయన అన్నారు. అలాగే మయన్మార్ కు చుట్టుపక్కల ఇంకా అనేక దేశాలు ఉన్నాయని, రోహింగ్యాలు అక్కడికి కాకుండా మన దేశంలోకే ఎందుకు ప్రవేశిస్తున్నారు ? ఇంతకు ముందు దేశంలో ప్రవేశించిన రోహింగ్యాలు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఎక్కువగా జమ్ము కాశ్మీర్, హైదారాబాద్ లలో స్థిరపడ్డారు ఇప్పటివరకు ఇక్కడ స్థిరపడిన వారి తీరు చూస్తే వాళ్ళు శరణార్ధులుగా కనిపించలేదని ఆయన అన్నారు. శరణార్ధుల విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి, అలాగే వారికి ఎంతకాలం, ఎక్కడ ఆశ్రయం కల్పించాలన్నది కూడా నిర్ణయించాలి. కాల పరిమితి తరువాత వారిని వారి వారి దేశాలకు పంపివేయాలి. భారతదేశం ఎల్లప్పుడు శరణార్ధులను అక్కున చేర్చుకుందని ఆయన అన్నారు. అయితే ఆశ్రయం కల్పించే ముందు శరణార్ధుల గత చరిత్రను కూడా పరిశీలించాలని ఆయన అన్నారు. మానవతా విలువలకు కూడా ఒక పరిమితి, హద్దు ఉంటుంది. రోహింగ్య ముస్లిముల తరఫున మాట్లాడుతున్నవారంతా మొదట వారి గత చరిత్రను, నేపద్యాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు.

రామ మందిర నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన శ్రీ భయ్యాజీ జోషి, ముందు అనేక సమస్యలు పరిష్కారం కావాల్సిఉందని, దాని తరువాత మందిర నిర్మాణం జరగాలని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. కరసేవ పురంలో మందిర నిర్మాణానానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, ఒకసారి సమస్యలు తీరిపోతే మందిర నిర్మాణం ప్రారంభ మవుతుందని అన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఏ లక్ష్య సాధనకై ఈ విధానాన్ని రూపొందించారో ఆ లక్ష్యం నెరవేరే వరకు రిజర్వేషన్లు కొనసాగాలని అన్నారు. రిజర్వేషన్లు పొందే వర్గాలే తమకు ఎంతకాలం వరకు ఈ అవసరం ఉన్నదో నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here