Home News సంఘ కార్యం వేగంగా విస్తరిస్తోంది – శ్రీ‌ కాచం రమేశ్ జీ

సంఘ కార్యం వేగంగా విస్తరిస్తోంది – శ్రీ‌ కాచం రమేశ్ జీ

0
SHARE

‘కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దేశవ్యాప్తంగా, తెలంగాణా ప్రాంతంలో కూడా సంఘ కార్యం వేగంగా విస్తరిస్తున్నది. 2024నాటికి లక్ష గ్రామాలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని తప్పక పూర్తిచేయగలమనే విశ్వాసం కార్యకర్తలందరిలో కనిపిస్తున్నది. శాఖల విస్తరణతోపాటు సామాజిక కార్యక్రమాల సంఖ్య, విస్తరణ కూడా పెంచాలన్నది లక్ష్యం’’ అని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ అన్నారు. ఇటీవల హర్యానాలో మూడురోజులపాటు జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల విశేషాలను ఆయన పాత్రికేయులకు వివరించారు.

పానిపట్ లోని సేవా సాధన, గ్రామవికాస కేంద్ర ఆవరణలో మూడు రోజుల పాటు (12-14మార్చ్) జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలకు మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అధ్యక్షతవహించారని, పరమపూజనీయ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ జీ మార్గదర్శనం చేశారని ఆయన చెప్పారు. సమావేశాల్లో సమర్పించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 42వేల 613 స్థలాల్లో 68వేల 651 శాఖలు నడుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 4వేల 700 స్థలాల్లో అదనంగా 8వేల 534 శాఖలు ప్రారంభమయ్యాయని ఆయన తెలియజేశారు. వారం, నెలకు ఒకసారి జరిగే కార్యక్రమాలతో కలుపుకుంటే 75వేల గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణాలో మొత్తం 1616 ఉపమండలాలలో 1138 చోట్ల శాఖలు ఉన్నాయని, గత సంవత్సరంతో పోలిస్తే శాఖల సంఖ్య 8 శాతం పెరిగిందని ఆయన వెల్లడించారు. అలాగే నగరాలలో 1447 బస్తీలకు 1075 చోట్ల శాఖ కార్యక్రమాలు జరుగుతున్నాయని 9శాతం వృద్ధి సాధించామని అన్నారు.

శాఖల ద్వారా జరిగే సేవాకార్యక్రమాలు కూడా బాగా పెరుగుతున్నాయని కాచం రమేశ్ తెలియజేశారు. 856 స్థలాలో వివిధ సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయని, గత ఏడాది కంటే 208 కార్యక్రమాలు పెరిగాయని అన్నారు. 60శాతం శాఖలు గ్రామం లేదా బస్తికి ఉపయోగపడే ఏదో ఒక కార్యక్రమాన్ని(ఉపక్రమం) నిర్వహిస్తున్నాయి. మొత్తం 1017 సేవబస్తీలలో(మురికివాడలు) 337 స్థలాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపు అయ్యాయి.

గత ఏడాది దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరిగాయని, ప్రస్తుతం తెలంగాణలో నైజాం విముక్త అమృతోత్సవాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. మిగతా దేశాంకంటే తెలంగాణాకు ఒక సంవత్సరం ఆలస్యంగా స్వాతంత్ర్యం వచ్చింది. నైజాం విముక్త అమృతోత్సవ సమితి అధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2022 సెప్టెంబర్ 17న 491మండల కేంద్రాల్లో త్రివర్ణపతాక ఆవిష్కరణ సమావేశాలు జరిగాయి. అందులో 31వేలకు పైగా ప్రజానీకం పాల్గొన్నారు. అలాగే 61జిల్లాల్లో యువసమ్మేళనాలు జరిగాయి. ఇందులో లక్షన్నరకు పైగా విద్యార్ధులు పాల్గొన్నారు. వీరిలో 43వేలమంది విధ్యార్ధినులు ఉండడం విశేషం. జనవరి 1-15 వరకు జరిగిన ప్రచార కార్యక్రమంలో 7వేల గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి 15లక్షల కుటుంబాలకు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను వివరించే కరపత్రం, 16లక్షల స్టిక్కర్లు అందజేశామని ఆయన తెలిపారు.

రాబోయే సంవత్సరంలో జైన మత స్థాపకుడైన మహావీరుడి 2550 వ వర్ధంతి సందర్భంగా విశేష కార్యక్రమాలు, ఆర్యసమాజ్ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి 200 వ జయంతి ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేక వేడుక జరిగి 350 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించాలని అఖిల భారతీయ ప్రతినిది సభ సమావేశాల్లో నిర్ణయించారని ఆయన వెల్లడించారు. రెండేళ్లలో సంఘ శతాబ్ది ఉత్సవాలు వస్తున్నాయని అప్పటికి లక్ష గ్రామాలకు సంఘ కార్యాన్ని విస్తరించాలన్న లక్ష్యాన్ని సులభంగా చేరగలమనే విశ్వాసం కార్యకర్తలందరిలో కనిపిస్తున్నదని అన్నారు.

సమాజాభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించి అక్కడి అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాలిథిన్ రహిత జీవనాన్ని ప్రోత్సహించడం, జలవనరులను వృద్ధి చేయడం, వృక్షాల సంఖ్య పెంచడం వంటి కార్యక్రమాలను ప్రజల సహాయ సహకారాలతో నిర్వహిస్తామని అన్నారు. అలాగే క్షీణిస్తున్న కుటుంబ విలువలను పెంచడం కోసం, ప్రజలలో సమరసత, సద్భావన పెంపొందించడం కోసం కృషి చేస్తామని కూడా కాచం రమేశ్ తెలియజేశారు. ఆ తరువాత విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ కూడా పాల్గొన్నారు.