Home Uncategorized సంఘం మరెంతో దూరం పయనించవలసి ఉంది – ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి (రెండవ...

సంఘం మరెంతో దూరం పయనించవలసి ఉంది – ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి (రెండవ భాగం)

0
SHARE

ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రారంభమై 90 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సంఘ ప్రస్థానంపై సర్‌కార్యవాహ భయ్యాజీ జోషితో ఆర్గనైజర్‌ వార పత్రిక జరిపిన ముఖాముఖి.

ప్రశ్న : 2005 తర్వాత శాఖా కేంద్రిత కార్యాన్ని బలోపేతం చేయడానికి, సమాజంలోని వివిధ వర్గాలవారికి చేరువ కావడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. దీనికి కారణం శాఖల సంఖ్య క్షీణిస్తుండటమా లేక మరేదైనా కారణమా?

సమాధానం : అవేవీ కారణం కాదు. సంఘ కార్యం వికసించే తత్వం గలది. ఇలాంటి కార్యంలో మరీ దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకోవడం కుదిరేపని కాదు. సంఘం ముందుగా ఎలాంటి ప్రణాళిక పెట్టుకొని బయలుదేరలేదు. ఆయా సమయాల ఆవశ్యకత ప్రకారం మేము పనిచేస్తుంటాం. ఇక ముందు కూడా అలాగే పనిచేస్తాం. మొత్తం సమాజాన్ని వెంట తీసుకుపోవాలనుకుంటే వివిధ వర్గాలకు చెందిన సామాజిక, ధార్మిక నేతలు కూడా ఉన్నారు కదా! అన్ని కులాలు, సంఘాలు, మఠాలు, మతాలు, సంప్రదాయాలు ఇవన్నీ ఏదో ఒక విధంగా హిందూ సమాజంతో అనుబంధం కలిగినవే. కనుక సమాజాన్ని ప్రభావితం చేస్తున్న అన్ని శక్తులతో వివిధ మార్గాల ద్వారా అనుబంధం ఏర్పరచుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. సంఘశాఖ అనేది వ్యక్తి నిర్మాణం చేసే కార్యం. అందులో కార్యకర్తలు తయారవుతుంటారు. ఈ క్రియలో మొత్తం సమాజం పాల్గొనలేకపోవచ్చు. ప్రక్రియ అనే పదాన్ని నేను ఉద్దేశపూర్వకంగానే వాడుతున్నాను. కనుకనే చాలామంది సంఘం తన వ్యూహాన్ని మార్చుకున్నదని భావిస్తుంటారు. మా మౌలికమైన కార్యం, ఆలోచన ఎప్పటిలాగానే ఉన్నాయి.

ప్రశ్న : ప్రచారక్‌ వ్యవస్థ సంఘం ప్రారంభించిన ఒక విశిష్ట వ్యవస్థ. సంఘ వ్యవస్థకు ఇది మూలాధారం కూడాను. మారుతున్న పరిస్థితులలో ఈ మూలాధారం భవిష్యత్తులోనూ ఇదేవిధంగా ఉంటుందని భావిస్తున్నారా ?

స : సంఘం తొలి దశ గురించి ఇంతకుముందే చెప్పాను. మొదటి 20-25 సంవత్సరాలలో సంఘ కార్య విస్తరణే ప్రధానంగా ఉండేది. సంఘం కోసం తమ ఇళ్ళను వదిలి వచ్చిన ప్రచారకులు అన్ని విధాలుగా ఈ కార్యానికి మూలస్తంభాలే. అయితే సంఘ కార్యానికి ప్రచారకులనే మూలాధారంగా సంఘం ఎన్నడూ పరిగణించదు. గృహస్థ కార్యకర్తలను మా కార్యానికి మూలస్తంభాలుగా చేయడానికే మా ప్రయత్నమంతా. ఈనాడు వేలాది కుటుంబాలు ఈ కార్యాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. గృహస్థ కార్యకర్తలతో పోలిస్తే ప్రచారకుల సంఖ్య చాలా తక్కువ. చర్చలు, సంబంధాలు, కమ్యూనికేషన్‌ నిర్వహించడానికే ప్రచారక్‌ పాత్ర పరిమితం. క్రొత్తవారిని శాఖకు వచ్చేలా చూడటం మాత్రమేగాక అందరినీ కలుపుకొని వారితోపాటు తాను నడిచేవాడే ప్రచారక్‌. ఈ పాత్ర ముగిసేది కాదు. ఇదొక అద్భుతమైన వ్యవస్థ. ప్రచారక్‌ ఉండాలి గానీ ఉన్నట్లు కనిపించకూడదని మేము చెబుతుంటాం. విద్యుచ్ఛక్తి తీగల ద్వారా ప్రసారమవుతుందని మనకు తెలుసు. కానీ కనిపించదు గదా. అంతర్గతంగా ప్రసరించే అలాంటి శక్తియే ప్రచారక్‌.

ప్రశ్న : గత 90 సంవత్సరాల కాలంలో వెనుకబడిన వర్గాలు, మైనారిటీల విషయంలో సంఘ ఆలోచన ఏమిటి? ఇందులో కాలక్రమంలో మార్పులేమైనా వచ్చాయా?

స : ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రెండు పదాలను మేము అంగీకరించం. మన సమాజంలో ఏ వర్గాన్నీ వెనుకబడినదిగా మేము భావించం. కొన్ని వర్గాలు బలహీనమైనవే. అలాంటివారికి బలాన్నిచ్చి శక్తివంతులుగా చేయాలి. వారి కనీసావసరాలు తీర్చాలి. వారు గౌరవంగా జీవించగలగాలి. ఈ ఆలోచనతో మొదటి నుంచీ సంఘం వెనుకబడ్డారని చెప్పబడుతున్నవారిని మనవారిగా భావిస్తూ వారితో కలసి పనిచేస్తూ వారి స్వీయ సామర్థ్యాలతోనే వారి జీవితాన్ని మెరుగైనదిగా చేయడానికి కృషిచేస్తూ వచ్చింది.

అలాగే ‘మైనారిటీ’ అనే పదాన్ని కూడా మేము ఒప్పుకోం. మెజారిటీ – మైనారిటీ అనే విభజన రాజకీయవాదులు సృష్టించినది. సమాజంలో చీలికలు తేవడానికి చేస్తున్న మరో కుట్రగా దీనిని చూడాలి. ”భారత ప్రజలమైన మేము” అని రాజ్యాంగం చెబుతున్నది. అలాంటపుడు ఎవరో మైనారిటీ అయ్యే ప్రశ్న ఎక్కడిది? ఈ దేశాన్ని తమ దేశంగా భావించే వారెవరైనా, రాజ్యాంగాన్ని విశ్వసించేవారెవరైనా ఈ దేశంలో భాగమే.

ప్రశ్న : ప్రపంచీకరణ శకంలో భౌగోళిక, పౌరసత్వ హద్దులు చెరిగిపోతుండగా, సంఘం ఇచ్చే హిందుత్వ పిలుపు ఏ మాత్రం సందర్భోచితం?

స : హిందుత్వ అనేది భౌగోళిక భావన కాదు. ఇదొక సాంస్కృతిక భావన. ఏ ఆరాధనా విధానాన్ని అనుసరించేవాడైనా తనను ఒక హిందువుగా భావించుకోవచ్చు. హిందుత్వ అనేది ఒక జీవనశైలి. ఒక జీవన విధానం. ఈ జీవనశైలి విశ్వసించేవారెవరైనా హిందువే. ప్రపంచీకరణను దాని యథార్థభావనలో అనుసరించదలుచుకునే వారెవరైనా ఈ పదాన్ని అంగీరించాలి. హిందువు ఎన్నడూ పాక్షిక దృష్టికలవాడు కాదు. మానవీయ అనుభూతులు, ఉద్వేగాల స్వరసమ్మేళనాన్నంతటినీ ఈ జీవన విధానం కేంద్ర స్థానంలో నిలుపుతుంది. ఈ హిందూ జీవన విధానం ఎలాంటి కర్మకాండలకుగాని లోబడి వుండేది కాదు గనుక రేపు దీనిని అమెరికాకో, పాకిస్తాన్‌కో వర్తింపజేసినా చేయవచ్చు. ఇవి మౌలికంగా నైతిక సూత్రాలు. ఇవి విశ్వజనీనమైనవి. ఇవి ఒక్కొక్కరికి వేరుగా ఉంటాయా? హిందూ ఆలోచనలో స్వాధారత (self dependent) అనే పదం లేదు. ఎల్లప్పుడూ పరస్పరాధారత (Inter-dependence) భావనే ఉన్నది. ఏ వర్గమైనా తన అవసరాలనన్నిటి తానే తీర్చుకోవటం కష్టం. కనుక ఇతరుల నుంచి సహకారం అనివార్యం. ప్రపంచీకరణకు స్వచ్ఛమైన అర్థం ఇదే. అయితే అది ఎంతైనా స్వాగతించదగినదే. కాని ప్రపంచీకరణ పేరుతో సామ్రాజ్యవాద భావనలను నెలకొల్పాలని ఎవరైనా ప్రయత్నించడమో, కేంద్రీకృత వ్యవస్థలను సృష్టించడానికై వికేంద్రీకృత నమూనాలను ధ్వంసం చేయజూడటమో జరిగితే మాత్రం మేము దానిని వ్యతిరేకిస్తాం.

ప్రశ్న : సంఘ స్ఫూర్తితో మొదలైన సంస్థలు కూడా దినదిన ప్రవర్థమానంగా వికసిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో భావ ప్రసార (కమ్యూనికేషన్‌), సమన్వయ సమస్యలను సంఘం ఎలా నిభాయిస్తున్నది?

స : మీరు చెబుతున్న ఈ సంస్థలన్నీ ఒకే లక్ష్యం, ఒకే ఆలోచన మీద ఆధారపడి వున్నాయి. లక్ష్యం విషయంలో ప్రశ్నలెన్నడూ తలయెత్తలేదు. అయితే ఒక్కో రంగపు పద్ధతులు, ప్రాముఖ్యతలు వేరువేరుగా ఉన్నందున లక్ష్యానికి చేరే విషయంలో కొంత సమన్వయం కావలసి ఉన్న మాట నిజమే. సమన్వయమంటే అన్ని దిశల నుంచి ఒకే దిశగా నడవటం. సమాజపు బాహ్యపరిధి (కైవారం) నుంచి బయలుదేరితే కేంద్రానికి చేరుకుంటాం. కేంద్రం ఒక్కటే గనుక అందరూ ఒకే చోటికి చేరుతారు. ‘పరం వైభవం నేతుం ఏతత్‌ స్వరాష్ట్రం’ అనేదే ఆ కేంద్రం కాబట్టి. వ్యక్తులు తమ ఆసక్తులు, అవకాశాలనుబట్టి ఎంచుకుంటారు గనుక ప్రవేశ ద్వారాలు వేరువేరుగా ఉంటాయని నేను ఎపుడూ చెబుతుంటాను. అతడు / ఆమె కేంద్రానికి చేరుకున్నపుడు తాను ఎక్కడికి చేరుకున్నదీ తెలుసుకుంటారు. రైలులో మాదిరిగా ప్రతి ఒక్కరూ తమ ఆర్థికస్తోమతను బట్టి, అవసరాన్ని బట్టి లోనికి వస్తారు. కొందరు మొదటి తరగతి ఎ.సి. పెట్టెలోకి ఎక్కితే మరికొందరు రెండవ తరగతి ఎ.సి.పెట్టెలోకి ఎక్కుతారు. కాదంటే స్లీపర్‌ పెట్టెలోకి, అదీ కుదరకపోతే సాధారణ బోగీలోకి ఎక్కుతారు. కాని రైలు ఒకే దిశలోకి వెళుతున్నది. మీరు ఏ బోగీలోకి ఎక్కినా మిమ్మల్ని అందరినీ ఒకే గమ్యానికి చేరుస్తుంది.

ప్రశ్న : భా.జ.పా. రిమోట్‌ కంట్రోల్‌ సంఘం దగ్గరే ఉంది అంటారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. – భా.జ.పా సంబంధాలను మీరెలా నిర్వచిస్తారు?

స : ప్రస్తుత రాజకీయ దృశ్యంలో రాజకీయ పార్టీలన్నీ మూడు రకాలుగా కనిపిస్తున్నాయి. మొదటిరకం ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహించే ప్రాంతీయ పార్టీలు. రాజకీయ అధికారమే ఏకైక లక్ష్యంగా ఉన్నవి రెండోరకం. మూడోరకం ఉన్నాయి. వీటికి సైద్ధాంతిక నిష్ఠ అయితే ఉన్నదిగాని వీటి మౌలిక ఆలోచనా విధానం భారతీయ జీవనానికి, హిందూ ఆలోచనకు విరుద్ధమైనది. వీరంతా సంఘాన్ని, హిందూ ఆలోచనా విధానాన్ని వ్యతిరేకించారు. ఒక స్వయంసేవక్‌ వీటితో ఎలా సంబంధం పెట్టుకోగలడు? సంఘ స్వయంసేవక్‌ తన ఆలోచనకు సన్నిహితంగా ఉండే రాజకీయ శక్తి వెంట వెళతాడనేది స్పష్టమే. ఈనాటి పరిస్థితుల్లో ఆ ఆలోచనకు అనుగుణంగా ఉన్నది భాజపాయే గనుక సహజంగానే స్వయంసేవకులు భాజపాకు అండగా నిలుస్తారు. అయితే భాజపాతోనే ఉండాలన్న పరిమిత నిబంధన ఏదీ స్వయంసేవకుల మీద లేదు. మన సమాజానికి సంబంధించిన అన్ని అంశాల మీద, సమస్యల మీద మా అభిప్రాయాన్ని వెల్లడించడమనేది ఒక బాధ్యతాయుత సంస్థగా మా విధి. ప్రజలు దానిని రిమోట్‌ కంట్రోల్‌ అనుకున్నా లేక మరొకటి అనుకున్నా విస్తృత జాతీయ అంశాలమీద మా అభిప్రాయాలను విస్పష్టంగా వ్యక్తం జేయవలసిందేనని మేము నమ్ముతున్నాం.

ప్రశ్న : వివక్ష, అసమానతల అంశాలపై సమాజంలో ఉద్రిక్తత పెరుగుతున్నది. ఈ సమస్యతో వ్యవహరించడంపై సంఘానికి వున్న ప్రణాళిక ఏమిటి?

స : అసలు సంఘం ఆవిర్భవించింది ఈ సమస్య పరిష్కారం కోసమే. మేము యోజనచేసిన మార్గం సంప్రదాయానికి భిన్నమైనది. విలక్షణమైనది. వివక్ష, విభేదాలు, అసమానతల గురించి చర్చలు చేపట్టడానికి మారుగా మేము ‘మనమంతా హిందువులం’ అని చెప్పాం. హిందూ అనే పదం మాత్రమే ఈ వివక్షలను, అసమానతలను నిర్మూలించగలదు. అయితే విభేదాలను మరింత పెంచడానికై ఈ వివక్షలను, అసమానతలను వాడుకునేందుకు సంకుచిత బుద్ధిగల దుష్టశక్తులు కూడా చురుకుగా పనిచేస్తున్నాయి. ఇది మా ముందున్న సవాలు. సంఘ కార్యం ప్రభావోపేతంగా చొచ్చుకుపోయిన చోటల్లా ఈ అసమానతలు తగ్గుముఖం పట్టాయనేది మా అనుభవం. మనం ఏ కులం లేక ఏ వర్గానికి చెందిన వారమైనా మన మూలాలు హిందూ మూలాలే. మన పేరు, భాష, దేవతలు, ధార్మిక గ్రంథాలు, పుణ్యస్థలాలు, జాతీయ మహాపురుషులు ఇత్యాదులు ఎక్కడ నుంచి వచ్చినా వాటి అసలు మూలం హైందవమే. ఈ విషయాన్ని ఎంతగా గుర్తుంచుకుంటే అంత సులభంగా ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ప్రశ్న : ఒక వంక సంఘం పట్ల జనాదరణ పెరిగిపోతుంటే మరోవంక సంఘం గురించి అయోమయం సృష్టించడానికి మీడియాలోను మేధావుల్లోను ఒక వర్గంలో ఎడతెరపి లేని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సమస్య విషయంలో సంఘం ఏం చేయబోతున్నది?

స : దీనిపై మేమేమీ తలలు పట్టుకోవటం లేదు. సంఘం అర్భకంగా ఉన్నప్పటి నుంచే ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. అయినా సంఘం పెరిగింది. ఈ సంశయాలను పారద్రోలటానికి మేము తప్పనిసరిగా ప్రయత్నిస్తాం. అపోహలు సృష్టించే ఈ వ్యూహం కారణంగా మీడియాలో ఒక వర్గం త్వరితగతిన తన విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నది. సామాన్య ప్రజానీకానికి కూడా ఇదొక సమస్యగా ఉంది. నాగరిక, ప్రజాస్వామిక జీవనాన్ని విశ్వసించే ఏ సమాజానికైనా ఇదొక పెద్ద ముప్పు. అంతిమంగా ఈ ఆకతాయి శక్తులకు ప్రజల నుంచి వచ్చే ఒత్తిడే బుద్ధి చెబుతుంది. మీడియా విశ్వసనీయతను పునరుద్ధరించడమనేది మీడియారంగంలో పనిచేస్తున్న స్వయంసేవకులు స్వీకరించవలసిన బాధ్యత.

ప్రశ్న : ఈ 90 సంవత్సరాల ప్రస్థానం విషయంలో సంఘం ఎంతవరకు సంతృప్తి చెందింది? వేగం, సమగ్ర దృశ్యం రీత్యా సంస్థ భవిష్యత్తు గురించి మీ అంచనా ఏమిటి?

స : మేము సంతృప్తి చెందలేదు. అయితే అసంతుష్టి కూడా చెందలేదని ఖచ్చితంగా చెప్పగలం. సమాజం యొక్క, కాలం యొక్క డిమాండుకు తగినట్లు పని చేయలేకపోయాం. అయితే ప్రతికూల పరిస్థితుల్లో మేము కార్యాన్ని ప్రారంభించిన విధానాన్నిబట్టి చూస్తే చాలా సాధించిన మాట వాస్తవం. అందువల్ల మాకు అసంతుష్టి లేదు. అయితే మరెంతో దూరం పయనించవలసి ఉంది. బృహత్తర లక్ష్యం సాధించవలసి ఉంది. ఉన్నత లక్ష్యం దిశగా మంచివేగాన్ని పుంజుకున్నామని గత 6-7 సంవత్సరాల నా అనుభవం ఆధారంగా మీకు విశ్వసనీయంగా చెప్పగలను. సంఘాన్ని మాత్రమేగాక, సంఘ ఆలోచనా విధానాన్ని సైతం సమాజం విస్తృతంగా ఆమోదించింది. ఈ దృక్పథానికి భారతదేశం వెలుపల కూడా ఆమోదం లభిస్తున్నది. అంచనాల మేరకు సంస్థాగత శక్తి పెరగనందుకు అసంతృప్తి ఉంది మాకు. అంచనాలు అందుకోవడానికి నిరంతరం పనిచేస్తున్నాం. సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అయితే వాస్తవిక కార్యానికై మా శక్తియుక్తులను యోజనాబద్ధంగా వినియోగిస్తేనే దీని ఉపయోగం ఉంటుంది.

ప్రశ్న : కార్యం పెరుగుతున్నది, అయినా ఇప్పటికీ నాగపూర్‌ నుంచే ఆదేశాలు వస్తున్నాయంటారు?

స : నాగపూర్‌ చెబుతున్నదని అంటున్నారంటే సామాన్యంగా దాని భావం సంఘం చెబుతున్నదనే. ఈ మాటలు సమానార్థకాలైనాయి. ‘ఆదేశం’ అనే బదులు ‘సలహా’ అంటే సముచితంగా ఉంటుందని నా భావన. బాలాసాహెబ్‌ దేవరస్‌ సర్‌సంఘచాలక్‌ బాధ్యత స్వీకరించిన వెంటనే ఢిల్లీలో పత్రికా సమావేశంలో ప్రసంగిస్తుండగా ఒక పాత్రియుడు ”సంఘంలో మహారాష్ట్ర ఆధిపత్యం కనిపిస్తోంది” అని అడిగితే బాలాసాహెబ్‌ తక్షణమే ”మీ సమాచారం తప్పు. సంఘంలోని జాతీయస్థాయి అధికారగణంలో 50శాతం మంది నాగపూర్‌ నుంచే వచ్చారు గనుక సంఘంలో నాగపూర్‌ ఆధిపత్యం ఉంది తప్ప, మహారాష్ట్రది కాదు” అని నవ్వుతూ జవాబిచ్చారు. పాత్రికేయుడు దిగ్భ్రాంతి చెందాడు. తర్వాత బాలాసాహెబ్‌ ఇలా అన్నారు -”ఇంతటి బృహత్తర సంస్థను ఒక్కచోటు నుంచే నియంత్రణ చేయగలమా, మీరే చెప్పండి. భారతదేశమంతటా కార్యకర్తలున్నారు. మేమంతా కలసికట్టుగా పనిచేస్తున్నాం”.

ప్రశ్న : ఇంతటి సుదీర్ఘ పయనంలో కొందరు తాము నిర్లక్ష్యానికి గురియైనామని భావిస్తుండి ఉంటారు. కొందరు అసంతృప్తి చెంది ఉంటారు. వారి విషయంలో ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

స : ఇలాంటివి సహజమే. ప్రతి ఒక్కరి స్వభావంలో పరిమితి ఉంటుంది. తరాల మధ్య అంతరం (జనరేషన్‌ గ్యాప్‌) మరో సమస్య. ఇందులో తప్పేమీ లేదు. చాలా సందర్భాలలో వ్యక్తే ప్రధాన కార్యం నుంచి తనకుతాను తెగత్రెంపులు చేసుకుంటాడు. ఆపైన సహజమైన అనుబంధం పోగొట్టుకుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది పాతవారిని కలుసుకోవడానికి నేను వెళ్ళినపుడు ‘చూడండి, ప్రస్తుత జిల్లాప్రచారక్‌ ఎవరో కూడా నాకు తెలీదు’ అని వారు ఫిర్యాదు చేస్తుంటారు. నేను సాధారణంగా ఇలా జవాబిస్తుంటాను -స్థానిక ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యాలయానికి వెళ్లి ఆయన గురించి మీరు విచారించారా? నేను జిల్లా ప్రచారక్‌గా ఉన్న రోజుల్లో మీరు చురుగ్గా పనిచేస్తుండేవారు. కనుక మీ ఊరికి వచ్చాను. ప్రస్తుత జిల్లా ప్రచారక్‌ మీ వద్దకు రారు గాని తన పరిచయస్తున్న చాలా ఊళ్ళకు వెళుతుంటారు” అని. ఈ విషయాన్ని ఇతరులు అర్థం చేసుకున్న చోట సమస్యలు తక్కువగా ఉన్నాయి. అయినా ఇదో చిన్న సమస్య మాత్రమేనని అనిపిస్తుంటుంది నాకు.

– ఆర్గనైజర్‌ సౌజన్యంతో

అనువాదము : కె.ఎస్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here