Home News సంఘ కార్యం సర్వవ్యాపి, సర్వ స్పర్శి – తృతీయవర్ష సమారోప్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రణబ్ ముఖర్జీ

సంఘ కార్యం సర్వవ్యాపి, సర్వ స్పర్శి – తృతీయవర్ష సమారోప్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రణబ్ ముఖర్జీ

0
SHARE

మాజీ రాష్ట్రపతి శ్రీ. ప్రణబ్ ముఖర్జీ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల్లో బాగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆహ్వానం మేరకు ఆయన జూన్ 7న నాగపూర్ లోని  సంఘ కార్యాలయాన్ని సందర్శించనున్నారనే వార్త. ఆయన అక్కడ తృతీయ వర్ష శిక్షవర్గ సమారోప్ (ముగింపు కార్యక్రమం)లో ముఖ్య అతిధిగా పాల్గొని స్వయంసేవకులను ఉద్దేశించి మాట్లాడతారు. సమారోప్ లో సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ప్రధాన వక్త. ప్రతి సంవత్సరం నాగపూర్ లో 25 రోజులపాటు తృతీయవర్ష సంఘ శిక్షవర్గ జరుగుతుంది. సంఘ కార్యంలో ప్రశిక్షణ పొందడానికి దేశం మొత్తం నుండి కార్యకర్తలు ఈ వర్గలో పాల్గొంటారు. ఈసారి 14 మే లో ప్రారంభమయిన వర్గ జూన్ 7న పూర్తవుతుంది. వర్గలో దేశం మొత్తం నుండి 709మంది స్వయంసేవకులు శిక్షణ పొందుతున్నారు.

సంఘ కార్యాన్ని గురించి తెలిసిన వారికి ఇలా ప్రముఖ వ్యక్తులు కార్యక్రమాలకు రావడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించదు, విడ్డూరంగా అనిపించదు. ఎందుకంటే వివిధ కార్యక్రమాల సందర్భంగా సమాజంలో ప్రముఖులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించడం సంఘలో పరిపాటే. ఈసారి ముఖ్య అతిధిగా పాల్గొనవలసిందిగా డా.ప్రణబ్ ముఖర్జీని కోరినప్పుడు ఆయన పెద్దమనసుతో అందుకు అంగీకరించారు.

1934 లో స్వయంగా గాంధీజీ వార్ధాలో జరిగిన సంఘ శిబిరానికి వచ్చారు. ఆ తరువాతి రోజు సంఘ స్థాపకులు డా. హెడ్గేవార్ గాంధీజీ ఆశ్రమానికి వెళ్ళి సంఘ కార్యాన్ని గురించి పూర్తిగా వివరించారు.  ఈ సంఘటనను 1947 సెప్టెంబర్ 16న డిల్లీ లో సంఘ స్వయంసేవకులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు గాంధీజీ గుర్తుచేసుకున్నారు. సంఘ స్వయంసేవకులు చూపే క్రమశిక్షణ, నిరాడంబరత, సమరసతా భావం గురించి గాంధీజీ తన ప్రసంగంలో ప్రశంసించారు. ఆయన ఇలా అన్నారు – “చాలా సంవత్సరాల క్రితం నేను వార్ధాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిబిరానికి వెళ్ళాను. అప్పుడు సంఘ స్థాపకులు శ్రీ. హెడ్గేవార్ జీవించి ఉన్నారు. శ్రీ జమన్ లాల్ బజాజ్ నన్ను ఆ శిబిరానికి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న స్వయంసేవకుల్లో ఎంతో క్రమశిక్షణ, నిరాడంబరత, అంతరానితనాన్ని ఏమాత్రం పాటించకపోవడం వంటివి చూసి నేను ప్రభావితుడినయ్యాను.’’ ఆయన ఇంకా ఇలా అన్నారు – “సంఘం ఒక సుసంఘటిత, అనుశాసనబద్ద సంస్థ’’. (ఈ విషయం `గాంధీజీ సంపూర్ణ సాహిత్యం’ 89అధ్యాయం, 215-217 పేజీల్లో ఉంది.)

1930 నుంచే సమాజంలో పేరుప్రతిష్టలు కలిగిన వ్యక్తులను కార్యక్రమాలకు పిలిచే పద్దతి సంఘలో పాటిస్తూ వస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ. జాకీర్ హుస్సేన్, బాబు జయప్రకాశ్ నారాయణ వంటి ప్రముఖులు సంఘ కార్యక్రమాలకు వచ్చి సంఘాన్ని ప్రశంసించారు. 1959లో జనరల్ కరియప్ప మంగళూర్ లో ఒక శాఖ కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఆయన “సంఘ కార్యం నా మనసుకు చాలా దగ్గరైనది, ఇష్టమైనది. ఎవరైనా ముస్లిం ఇస్లాంను ప్రశంసించగలిగినప్పుడు సంఘం హిందుత్వం పట్ల అభిమానాన్ని చూపడంలో తప్పు ఎలా అవుతుంది? ప్రియ యువ మిత్రులారా, మీరు ఈ దుష్ప్రచారానికి చింతించకుండా మీ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. డా. హెడ్గేవార్ నిస్వార్ధమైన కార్యమనే పవిత్ర ఆదర్శాన్ని మీ ముందు ఉంచారు. ఆ ఆదర్శ మార్గంలోనే ముందుకు పయనించండి. భారతదేశానికి నేడు మీవంటి సేవాభావం కలిగిన కార్యకర్తల అవసరం ఎంతో ఉంది’’.

1962 చైనా యుద్ధ సమయంలో స్వయంసేవకులు నిర్వహించిన సేవాకార్యక్రమాలను చూసి ఎంతో ప్రభావితులైన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆ సంవత్సరం జరిగే గణతంత్ర వేడుకల పరేడ్ లో పాల్గొనవలసిందిగా సంఘ స్వయంసేవకులను ఆహ్వానించారు. ఆ ప్రకారమే 3 వేలమంది స్వయంసేవకులు పూర్తి గణవేష్ (యూనిఫాం)లో గణతంత్ర పరేడ్ లో పాల్గొన్నారు. `దేశమే సర్వస్వం’ అనే సంఘ స్వయంసేవకుల స్వభావాన్ని గుర్తించిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1965 భారత – పాకిస్తాన్ యుద్ద సమయంలో అఖిలపక్ష సమావేశానికి అప్పటి సర్ సంఘచాలక్ శ్రీ గురుజీని ఆహ్వానించారు. గురూజీ ఆ సమావేశంలో పాల్గొన్నారు కూడా.

1963లో స్వామి వివేకానంద శతజయంతి సందర్భంగా కన్యాకుమారిలో `వివేకానంద శిలా స్మారకం’ నిర్మాణ కార్యంలో కూడా సంఘానికి అన్ని రాజకీయ పక్షాల సహకారం, మద్దతు లభించాయి. స్మారక నిర్మాణానికి మద్దతుగా 300 మంది వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యుల సంతకాలను శ్రీ. ఏక్ నాథ్ రానడే సేకరించగలిగారు.

1977 (ఉమ్మడి)ఆంధ్రప్రదేశ్ లో భయంకర తుఫాను వచ్చినప్పుడు సంఘ స్వయంసేవకులు నిర్వహించిన సహాయ, పునరావాస కార్యక్రమాలను చూసి ఎంతో ప్రభావితులైన సర్వోదయ నాయకులు శ్రీ. ప్రభాకర్ రావ్ సంఘానికి `ఆర్ ఎస్ ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ (నిస్వార్ధ సేవకు సర్వదా సన్నద్ధం)’ అంటూ నూతన నామకరణం చేశారు.

సంఘం భేదభావాలు లేని, సమరసాతాపూర్వక సమాజాన్ని నిర్మాణం చేయడం కోసమే 92 ఏళ్లుగా పనిచేస్తోంది. ఆ పనిలో సంఘానికి విజయం కూడా లభిస్తోంది. సంఘ సిద్ధాంతం, కార్యపద్దతిని అంగీకరించేవారు ఎవరైనా సంఘ కార్యక్రమాలకు వస్తుంటారు, ఈ కార్యంలో భాగస్వాములు అవుతారు.

  • హిందీ మూలం -శ్రీ నరేంద్ర కుమార్
  • అనువాదం : శ్రీ కేశవ నాథ్